Turtles
-
Dr Supraja Dharini: తాబేలు గెలవాలి
కుందేలు, తాబేలు కథలో తాబేలు మెల్లగా అయినా సరే రేస్ పూర్తి చేసి గెలుస్తుంది. కాని గెలవాలంటే తాబేళ్లు ఉండాలి కదా. కాలుష్యం వల్ల, వలలకు చిక్కుకుని, గుడ్లు పెట్టే ఏకాంతం కోల్పోయి.. సముద్ర తాబేళ్లు ప్రమాదంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో తాబేళ్ల సంరక్షణ కోసం పని చేస్తున్న డాక్టర్ సుప్రజ ధారిణి కృషి. ‘సముద్ర తీరానికి వెళ్లి చూస్తే అంతా ప్రశాంతం గా అనిపిస్తుంది. నీలి ఉపరితలం, ఒడ్డుకు వచ్చి వెళ్లే కెరటాలు... ఎంత బాగుందో కదా అని మనసు ఆహ్లాదపడుతుంది. కాని సముద్ర గర్భంలో ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. మనిషి చర్యల వల్ల సముద్రం లోపల ఎంత ధ్వంసమవుతోందో తెలుసుకోవాలి. జలధి పర్యావరణాన్ని కాపాడుకోవాలి’ అంటుంది డాక్టర్ సుప్రజ ధారిణి. చెన్నైలో స్థిరపడ్డ ఈ తెలుగు పర్యావరణ కార్యకర్త ఇప్పడు సముద్ర తాబేళ్లకి రక్షకురాలిగా మారింది. లక్షలాది తాబేళ్లు మృత్యవాత పడకుండా తిరిగి సముద్రానికి చేరేలా చూడగలిగింది. చెన్నై తీరం, ఆంధ్రా తీరం, ఒడిశా తీరంలో ఆమె తయారు చేసిన దళాలు గస్తీ తిరుగుతూ తాబేళ్లను కాపాడుతున్నాయి. అంతులేని విధ్వంసం ‘సముద్ర ఆరోగ్యం బాగుంటే మత్స్యకారుల జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే సముద్రమే వారి జీవనాధారం కాబట్టి. సముద్ర ఆరోగ్యం, అందులోని పర్యావరణం ఎలా ఉందో తెలియాలంటే తాబేళ్ల ఉనికి, వాటి జనాభా ఒక కొండ గుర్తు. ఎందుకంటే సముద్రగర్భంలో ఉండి నేల మీదకు వచ్చే ఏకైక జలచరం అదే. తాబేళ్లలో ఒక ముఖ్యలక్షణం ఏమిటంటే అవి గుడ్డు పగిలి ఏ నేల మీద ప్రాణం పోసుకున్నాయో ఆ నేలను గుర్తు పెట్టుకుని పెరిగి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే నేలకు వస్తాయి. అంటే పుట్టింటికి వచ్చినట్టే. కాని అవి మనుషుల మీద నమ్మకంతో పెట్టిన గుడ్లను మత్స్యకారులు నిర్లక్ష్యం చేయడం నేను చూశాను. ఇక కుక్కలు దాడి చేసి గుడ్లు తవ్వుకుని తినేస్తాయి. కొన్ని పిల్లలు బయటకు తీసి ఆడుకుంటారు. వాటి వల్ల తాబేళ్ల సంఖ్య తగ్గి సముద్ర జీవ సమతుల్యత దెబ్బ తింటుంది. అందుకని మొదట మేము మత్స్యకారులను చైతన్యవంతం చేశాం. తాబేళ్లను కాపాడితే సముద్రం బాగుంటుంది.... సముద్రం బాగుంటే మీ జీవితాలు బాగుంటాయి అని చెప్పాం. వారిప్పుడు కార్యకర్తలుగా మారి తాబేళ్లను కాపాడుతున్నారు’ అని తెలిపింది సుప్రజ ధారిణి. మచిలీపట్నం సొంతూరు సుప్రజది మచిలీపట్నం. ముప్పై ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం చెన్నై తరలి వెళ్లింది. ఫిలాసఫీలో పిహెచ్డి చేసిన సుప్రజ చెన్నైలోనే ఒక ఆర్ట్ స్టుడియో స్థాపించుకుంది. అయితే 25 ఏళ్ల క్రితం ఆమె చెన్నైలోని నీలాంకరై బీచ్‌కు మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు అక్కడ తాబేలు చచ్చిపడి ఉంది. దాపునే పిల్లలు తాబేలు గుడ్లు ఇసుక నుంచి బయటకు లాగి ఆడుకుంటూ ఉన్నారు. మత్స్యకారులు చూసినా వారించడం లేదు. ఇదంతా చూసి బాధపడింది సుప్రజ. తాబేళ్లు వొడ్డుకొచ్చి పడి చనిపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించింది. ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు చేపల వలల వల్ల గాయపడి చనిపోతున్నాయని, వాటి గుడ్ల సంరక్షణ సరిగ్గా జరగక సంతతి తరిగిపోతున్నదని తెలుసుకుంది. మొదట మత్స్యకారుల్లో చైతన్యం తెచ్చి తర్వాత సమాజంలో మార్పు తేవాలని నిశ్చయించుకుంది. అలా 2002లో ఆమె తాబేళ్ల సంరక్షణ, సముద్ర పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా ‘ట్రీ ఫౌండేషన్’ అనే సంస్థను ప్రారంభించింది. 33 లక్షల తాబేలు పిల్లల రక్షణ తమిళనాడులోని కంచి నుంచి ఒరిస్సాలోని గంజాం వరకు తీర ప్రాంతంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర తీర ప్రాంత సంరక్షణ, తాబేళ్ల గుడ్ల పరిరక్షణ, గాయపడిన తాబేళ్లకు చికిత్స చేసి మళ్లీ సముద్రంలో ఒదిలిపెట్టడం, గుడ్లకు గస్తీ కాయడం వంటి చర్యల కోసం గార్డ్లను ఏర్పాటు చేసింది సుప్రజ. ఇందుకు అవసరమైన గుర్తింపు కార్డులను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇప్పించగలిగింది. కొందరికి గౌరవ భత్యాలు కూడా అందుతున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే సీజన్లో వాటిని ఒకచోట చేర్చి వెదురు దడి కట్టి కాపాడటం వల్ల ఈ ఇరవై ఏళ్లలో దాదాపు 33 లక్షల గుడ్లు పొదగబడి తాబేళ్లు పిల్లలుగా సముద్రంలో చేరాయంటే అది సుప్రజ, ఆమె సేన ప్రయత్నం వల్లే. ‘సముద్రానికి నేలకూ ఉన్న అనుబంధం విడదీయరానిది. నేల మీద నివసించేవాళ్లమే సముద్రాన్ని కాపాడుకోవాలి’ అంటోంది సుప్రజ. -
‘ఆలివ్‌రిడ్లే’కు ప్రత్యేక రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్ల ఫ్యాన్ రెక్కలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకనుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్లకు లైసెన్స్‌లు తప్పనిసరి చేసింది. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ఫ్యాన్ల రెక్కలు ఆలివ్‌రిడ్లే తాబేళ్లకు తగలకుండా ప్రత్యేక పరికరాలను అమర్చాలని నిర్ణయించింది. కొత్త మరబోట్లకు అనుమతిచ్చే సమయంలోనే ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణకు ప్రత్యేక షరతులు విధించనుంది. ఈ తాబేళ్లకు ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం–1972 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. తాజా నిర్ణయాలపై సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఎక్కువగానే.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వాటిలో జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐదు రకాల జాతులు ఉండగా, మన దేశంలో రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశా తీరప్రాంతంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకు అటవీశాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి సముద్రంలోకి వదులుతుంది. ఈ సంవత్సరం కూడా 46,840 గుడ్లను సముద్రంలోకి వదిలింది. 2009 నుంచి ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.18లక్షల ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలింది. -
గంగలో వేలకొద్దీ తాబేళ్లను ఎందుకు విడిచిపెడుతున్నారంటే..
గంగానదిలోని నీటి నాణ్యత గతంలో కన్నా ఎంతో మెరుగుపడింది. నమామి గంగే కార్యక్రమ భాగస్వాములు తెలిపిన వివరాల ప్రకారం గంగానది ప్రక్షాళనలో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గంగానదిలోని వ్యర్థ పదార్థాలను అవి తింటూ, నీటిని పరిశుభ్రపరుస్తున్నాయి. గంగా యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తాబేళ్ల సంతానోత్పత్తి పునరావాస కేంద్రం 1980 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 40 వేలకు మించిన తాబేళ్లను పవిత్ర గంగా నదిలో విడిచిపెట్టింది. తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రం సాయంతో.. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు గంగానదితో పాటు పలు నదులలోని నీటి స్వచ్ఛతకు, పరిశుభ్రతకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో గంగానది నీటిని స్వచ్ఛంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండు నెలల్లో ఉత్తరప్రదేశ్, వారణాసి జిల్లాలలోని గంగానదిలో వేల తాబేళ్లను వదలనుంది. దేశంలోనే తొలిసారిగా తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రాన్ని వారణాసిలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో జన్మించిన తాబేళ్లను గంగానదిలో విడిచిపెట్టనున్నారు. ఇవి గంగానదిని పరిశుభ్రం చేయనున్నాయి. ‘నమామి గంగే’ కార్యక్రమంలో.. నమామి గంగే కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ, భారత వన్యప్రాణుల విభాగం సంయుక్తంగా తాబేళ్లను గంగానదిలో విడిచిపెట్టే పనులను చేపట్టనున్నాయి. నగం కాలిన మృతదేహాలు, విసిరివేసే పుష్పాల కారణంగా గంగానది కలుషితంగా మారుతోంది. ఇటువంటి నీటిని పరిశుభ్రంగా మార్చడంలో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త ఆశీష్ పాండ్యా మాట్లాడుతూ గంగానదిలో 2017 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 5 వేల తాబేళ్లను విడిచిపెట్టాం. ఈ ఏడాది ఇప్పటివరకూ వెయ్యి తాబేళ్లను విడిచిపెట్టామన్నారు. ఇది కూడా చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
తూర్పు తీరం ఆడపడుచులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పుట్టింటిపై మమకారం మగ పిల్లలతో పోలిస్తే ఆడ పిల్లలకు మరింత ఎక్కువే. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయినా.. పుట్టింటిపై మమకారం వారిలో చెక్కు చెదరదు. నోరులేని మూగజీవాలకు కూడా జన్మస్థలంపై అంతటి మమకారం ఉంటుందంటే ఆశ్చర్యమే. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించి పుట్టింటికి వస్తాయి ఆలివ్ రిడ్లే తాబేళ్లు. పుట్టిన కొద్ది రోజులకే సముద్రంలో ఎంతో దూరం వెళ్లిపోయే ఈ తాబేళ్లు పదేళ్ల తరువాత సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ఈదుకుంటూ.. తాము పుట్టిన ప్రాంతానికే చేరుకుంటాయి. ఇలా రాగలగటం వాటి జ్ఞాపక శక్తికి నిదర్శనమంటారు. ఆలివ్ రిడ్లే శాస్త్రీయ నామం‘లెపిడోచెలిస్ ఒలివేసియా’.గ్రీన్ టర్టిల్, లెదర్ బ్యాగ్, గ్రీన్సీ టర్టిల్, హాక్చిల్సీ వంటి జాతుల తాబేళ్లు ఉన్నప్పటికీ ఆలివ్ రిడ్లే రకం తాబేళ్లు తూర్పు తీరానికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ మూల నుంచి.. ఈ మూల వరకు ఒడిశాలోని బీతర్కానిక తీరం నుంచి.. తమిళనాడు సరిహద్దులోని తడ వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరం వరకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. అందులోనూ కాకినాడ తీరానికే వీటి రాక అధికం. ఇసుక, నీరు తేటగా ఉండటంతోపాటు 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలపై ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఆసక్తి చూపుతాయి. వివిధ సముద్రాల్లో ఉండే ఈ తాబేళ్లు సంపర్కం కోసం ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలోకి చేరుతాయి. ఆ తరువాత ఆడ తాబేళ్లు మాత్రమే గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తాయి. జనవరి రెండోవారం నుంచి ఏప్రిల్ మొదటివారం వరకు ఇవి గుడ్లు పెట్టే సీజన్. ఈ తాబేళ్లు జీవితమంతా సముద్రంలోనే గడుపుతాయి.గుడ్లు పెట్టడానికి మాత్రం భూమి మీదకు వస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. తీరంలోని ఇసుకలో బొరియలు తవ్వి ఒక్కో తాబేలు 100 నుంచి 150 వరకు గుడ్లు పెడుతున్నాయి. గుడ్లు పెట్టేశాక తల్లి సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఆ గుడ్లలోంచి 45–55 రోజుల్లో పిల్లలు బయటకొస్తాయి. వీటిని ఏపీ ఆటవీ శాఖ సంరక్షిస్తోంది. కళ్లు తెరిచిన పిల్లలను సూర్యుడు ఉదయించే వేళ అధికారులు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. వెలుతురు అంటే ఇష్టపడే తాబేలు పిల్లలు సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ కిరణాలవైపు పరుగులు తీస్తూ సముద్రంలో కలిసిపోతాయి. ఈ ప్రక్రియ నెల రోజులుగా కాకినాడ తీరంలో అటవీ రేంజర్ ఎస్.వరప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతోంది. ఇప్పటికే 8వేల పిల్లలను సముద్రంలోకి విడిచి పెట్టారు. సమతుల్యతలో కీలకం కళ్లు తెరిచిన పిల్లలు సముద్రంలోకి వెళ్లిన పదేళ్లకు కౌమార దశకు వస్తాయి. సంపర్కం తరువాత తనకు జన్మనిచ్చిన తీరాన్ని గుర్తుంచుకుని గుడ్లుపెట్టేందుకు తిరిగి అక్కడికే వస్తాయి. సముద్రం జలాల్లో వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంలో వీటి పాత్ర కీలకం. సముద్రంలో మత్స్య సంపదను మింగేస్తున్న జెల్లీ ఫిష్‌లను ఆలివ్ రిడ్లేలు ఆహారంగా తీసుకుంటాయి. మత్స్య సంపదకు రక్షణగా ఉండటం, సముద్ర జలాలలో కాలుష్యం నివారించి శుభ్రంగా ఉంచడంలో వీటి పాత్ర అమోఘం. – ఎస్.వరప్రసాద్, రేంజర్, కోరంగి అభయారణ్యం మేధస్సులో ఆడ తాబేళ్లు దిట్ట తెలివితేటల్లో ఆడ తాబేళ్లు దిట్ట. ఆడ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ముందు ఇసుక తేటగా.. చదునుగా.. అలికిడి లేని, సముద్ర అలలు తాకని ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాయి. గుడ్లు పెట్టే ప్రాంతంలో 30 సెంటీమీటర్ల మేర గొయ్యి తవ్వి గుడ్లు పెట్టి.. ఇసుకతో కప్పేస్తాయి. తవ్విన గోతిలో అడుగు భాగం (పునాది) గట్టిగా ఉండాలని శరీర బరువు (సుమారు 50 కేజీలు)తో అరగంట పాటు పైకి, కిందకు పడుతూ లేస్తూ చదును చేసి గుడ్లు పెడతాయి. గుడ్లను శత్రుజీవులు గుర్తించకుండా చుట్టుపక్కల డమ్మీగా నాలుగైదు గోతుల్ని తవ్వి ఇసుకతో కప్పేస్తాయి. నక్కలు, కుక్కలు, కాకులకు గుడ్లు పెట్టిన ప్రాంతం తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆలివ్ రిడ్లే తెలివితేటలు అమోఘం. -
20 వేల కిలో మీటర్లు ప్రయాణించి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఆసక్తికర విషయాలు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సముద్ర తీరాలకు చేరుకుంటున్నాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వీటిలో 5 రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కువ. రెండు అడుగుల వెడల్పు.. 50 కిలోల వరకూ బరువు పెరిగే ఈ తాబేలు ఎక్కడైతే గుడ్డు నుంచి పిల్లగా బయటకు వస్తుందో.. తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెట్టడం ఈ జాతి ప్రత్యేకత. ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సుమారు 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తీరానికి వస్తాయి. దేశంలోని ఒడిశా తీరంలో ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. మన రాష్ట్రంలో కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకూ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలంక ప్రాంతం వరకు ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా వస్తుంటాయి. ఆడా.. మగా నిర్ధారించేది ఉష్ణోగ్రతలే ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టి పిల్లగా మారడానికి 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. 30 నుంచి 32 డిగ్రీల మధ్య పుట్టిన తాబేలు ఆడ తాబేలు అవుతుంది. అంతకంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలో పుట్టే పిల్లలు మగ తాబేళ్లు అవుతాయి. సృష్టిలో ఒక్క తాబేలు జాతికి మాత్రమే ఇలాంటి ప్రత్యేకత ఉంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఫలదీకరణ కోసం వస్తుంటాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెడతాయి. ఇసుకలో 30 నుంచి 45 సెం.మీ. లోతున కుండాకారంలో గొయ్యి తీసి.. 60 నుంచి 120 వరకూ గుడ్లు పెడతాయి. గొయ్యి తీసేదగ్గర నుంచి గుడ్లు పెట్టడానికి 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం తీసుకుంటుంది. ఈ గుడ్లు 45 నుంచి 50 రోజుల తరువాత పిల్లలు బయటకొస్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. సముద్రంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు.. చేపల సంతానం వృద్ధి చెందేందుకు తాబేలు ఎంతగానో దోహదపడుతుంది. చేప పిల్లలను తిని జీవించే జెల్లీ చేపలను తాబేలు తినడం వల్ల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. తాబేలు ఎంత లోతులో ఉన్నా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని లోపలకు వెళుతుంటుంది. అవి నీటిలో పైకి, కిందకు రావడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఈ విధంగా పర్యావరణానికి తాబేలు ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు పెడుతున్న తాబేలు, నాగాయలంక మండలం ఐలాండ్ వద్ద సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక హేచరీల ద్వారా రక్షణ అరుదైన ఆలివ్ రిడ్లే జాతి తాబేలుని రక్షించేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద ఒకటి, నాగాయలంక మండలం లైట్‌హౌస్ శివారు ఐలాండ్ దగ్గర మూడు, సంగమేశ్వరం వద్ద ఒకటి, నిజాంపట్నం, సూర్యలంక వద్ద రెండు హేచరీలను ఏర్పాటు చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకూ 5 లక్షల తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ కృష్ణా జిల్లా పరిధిలో 12,624 గుడ్లను సేకరించినట్టు అధికారులు చెప్పారు. తాబేళ్ల సంఖ్య పెరుగుతోంది ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంలో వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లే వలలు వేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై మత్స్యశాఖ అధికారులతో కలసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో కంటే గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. – కేవీఎస్ రాఘవరావు, ఫారెస్ట్ అధికారి, అవనిగడ్డ రేంజ్ -
పుట్టిన చోటే.. ఆలివ్ రిడ్లే గుడ్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ: తొణక్కుండా తాపీగా నడిచే తాబేలు గుడ్లు పెట్టేందుకు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటే ఎంత ఆశ్చర్యం? అదే ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రత్యేకత. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీటి లింగ నిర్థారణ జరిగేది ఉష్టోగ్రత ఆధారంగానే. మత్స్య సంపదను పెంచడంతోపాటు సముద్రంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. అలాంటి విశిష్ట తాబేలు జాతి ఇప్పుడు ప్రమాదంలో ఉన్న జీవుల జాబితాలో చేరింది. ఆలివ్ రిడ్లే తాబేళ్లకు మనుషుల నుంచే ప్రధానంగా ముప్పు వాటిల్లుతోంది. ఈ అరుదైన జాతిని రక్షించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల అటవీ శాఖాధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అంతరించి పోతున్న జాబితాలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... నాగాయలంక వద్ద సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ఒడిశా తరువాత ఇక్కడే.. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులున్నాయి. వీటిలో ఐదు రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఎక్కువగా ఉన్నాయి. రెండు అడుగుల వెడల్పు, 50 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఒడిశాలో ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా ఉండగా మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకూ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలంక ప్రాంతంలో ఈ తాబేళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణోగ్రతను బట్టి లింగ నిర్ధారణ.. ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టి పిల్లగా మారడానికి 28 నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అవసరం. 30 నుంచి 32 డిగ్రీల మధ్య జన్మిస్తే ఆడ తాబేలు అవుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలో మగ తాబేళ్లు జన్మిస్తాయి. సృష్టిలో ఒక్క ఆలివ్ రిడ్లే తాబేలు జాతికి మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. ఆలివ్ రిడ్లే తాబేళ్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. సముద్రంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, చేపలు వృద్ధి చెందేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. చేప పిల్లలను తిని జీవించే జెల్లీ చేపలను తాబేళ్లు ఆహారంగా తీసుకోవడం వల్ల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ తాబేలు ఎంత లోతులో ఉన్నా ప్రతి 45 నిముషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని లోపలకు వెళుతుంటాయి. నీటిలో పైకి, కిందకు వెళ్లి రావడం వల్ల ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇలా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రత్యేక హేచరీల ద్వారా రక్షణ అరుదైన ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద ఒకటి, నాగాయలంక మండలం లైట్‌హౌస్ శివారు ఐలాండ్ దగ్గర మూడు, సంగమేశ్వరం వద్ద ఒక హేచరీలను ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలో ఇప్పటి వరకూ 4.62 లక్షల తాబేళ్లను సముద్రంలోకి వదిలినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. వలలే ఉరితాళ్లు.. చేపల ఉత్పత్తిని పెంచి మత్స్యకారులకు ఆదాయాన్ని తెచ్చి పెట్టే తాబేళ్లకు వలలే ఉరితాళ్లు అవుతున్నాయి. మరబోట్ల ద్వారా వేసే వలల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఎక్కువగా చిక్కుకుని మరణిస్తుంటాయి. ఈ వలలను లాగేందుకు మూడు గంటల సమయం పడుతుంది. వలలో చిక్కుకున్న తాబేలు పైకి రాలేక, ఆక్సిజన్ అందక మరణిస్తున్నాయి. మత్స్యకారులు ఉపయోగించే టేకు వలల్లోనూ తాబేళ్లు చిక్కుకుని చనిపోతుంటాయి. -
Olive Ridley Turtle: వెళ్తాం..పెరిగి పెద్దయి.. మళ్లొస్తాం!
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): వెళ్తాం.. పెరిగి పెద్దయి.. గుడ్లు పెట్టేందుకు మళ్లీ ఇక్కడకు వస్తాం అంటూ బుల్లి తాబేళ్లు బుడి బుడి అడుగులు వేసుకుంటూ.. సముద్రంలోకి వెళ్లిపోయాయి. అంతరించే ప్రమాదమున్న ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను జిల్లా అటవీ శాఖ పరిరక్షించి సముద్రంలోకి విడిచిపెట్టింది. సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్లను చూసి పిల్లలు, ప్రకృతి ప్రేమికులు, యువతీయువకులు పరవశించిపోయారు. ఆర్.కె.బీచ్ వేదికగా ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారులతో కలిసి కలెక్టర్ మల్లికార్జున బుల్లి తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టి.. వాటి తల్లుల వద్దకు చేర్చారు. బుడిబుడి అడుగులతో సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్లు ఏటా జనవరి నుంచి మార్చి వరకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు తీరానికి చేరుకుని గుడ్లు పెడతాయి. అది కూడా రాత్రి 2 గంటల నుంచి వేకువ 5.30 గంటల్లోపు మాత్రమే. ఈ సమయంలోనే ఇసుక తిన్నెల్లో బొరియలు చేసి గుడ్లను పెట్టి సముద్రంలోకి జారుకుంటాయి. ఆ గుడ్లను సేకరించిన అటవీ శాఖ అధికారులు బీచ్‌రోడ్డులోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో 45 రోజుల పాటు సంరక్షించారు. సేకరించిన గుడ్లు పొదిగి పిల్లలుగా మారాయి. చదవండి: అంత యాక్షన్ వద్దు.. పులి కూడా బ్రష్ చేస్తుంది! తాబేలు పిల్లను పట్టుకుని ఆనందిస్తున్న కలెక్టర్ మల్లికార్జున అలా గుడ్ల నుంచి బయటకు వచ్చిన 982 బుల్లి తాబేళ్లను సూర్యోదయం సమయంలో కలెక్టర్ సముద్రంలోకి విడిచిపెట్టారు. ఆ సమయంలో తల్లులు తీరానికి చేరువలో ఉంటాయి. అందుకే పిల్లలను సూర్యోదయ సమయంలో సముద్రంలోకి విడిచిపెట్టడం ద్వారా అవి తల్లుల వద్దకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని అటవీ శాఖ అధికారి అనంత్‌శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ సముద్ర జలాలను శుద్ధి చేసే ఈ రకం తాబేళ్లు అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సముద్రంలోకి విడిచిపెట్టేందుకు బుట్టల్లో సిద్ధంగా ఉన్న తాబేలు పిల్లలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విశాఖ బీచ్ లో ఆలివ్ రెడ్లీ తాబేళ్ల సందడి
-
నరమానవుడి అలికిడి అస్సలు ఉండకూడదు!
అర్ధరాత్రి దాటిపోవాలి.. నిశ్శబ్దం కలిసిన చీకటి తీరమంతా అలముకోవాలి. పైన ఆకాశంలో చుక్కలు.. కింద ఒడ్డున అలలు తప్ప ఇంకేమీ కనిపించకూడదు. నరమానవుడి అలికిడి అస్సలు ఉండకూడదు. అలాంటి సమయంలో నీలాల సాగరం నుంచి కూర్మాలు బయటకు వస్తాయి. ఆ తల్లి తాబేళ్లు తీరంలో గుడ్లు పెడతాయి. ఎవరూ కనిపెట్టకూడదని బొరియలు చేసి మరీ కార్యాన్ని పూర్తి చేస్తాయి. పొద్దు పొడుస్తోందని సూచన అందే ముందే మళ్లీ గుంపుగా కడలి గర్భానికి వెళ్లిపోతాయి. అవి వెళ్లిన కాసేపటికే కొందరు టార్చిలైటు వెలుతురులో వెతుక్కుంటూ వచ్చి ఆ గుడ్లను తీసుకెళ్తారు. ఎందుకంటే..? వజ్రపుకొత్తూరు రూరల్: ఆలివ్ రిడ్లే.. తెలుగు పేరు కాకపోయినా మనకు తెలిసిన పేరే. ఎక్కడో వేల నాటికల్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో నివాసముండే అరుదైన తాబేళ్లు ఇవి. కానీ సంతానోత్పత్తికి మాత్రం సిక్కోలు తీరానికి వస్తాయి. అందుకే వీటితో ఈ జిల్లాకంత చనువు. సముద్రంలో నాచు, కొన్ని రకాల మొక్కలను ఆహారంగా తీసుకునే ఈ జాతి కడలి గర్భంలోని శిలలను శుద్ధి చేస్తాయి కూడా. కాకులు, గద్దలు, పీతలు, కుక్కలు, తీరంలో వాహనాలు వంటి అవరోధాలు దాటి వీటి సంతానోత్పత్తి సజావుగా సాగాలంటే పెద్ద యజ్ఞమే జరగాలి. సిక్కోలు తీరంలో ఆ యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతోంది. ఎప్పుడు గుడ్లు పెడతాయి..? ఏటా జనవరి నుంచి మార్చి వరకు తాబేళ్లు గుడ్లు పెడతాయి. అది కూడా రాత్రి 2 గంటల నుంచి వేకువ 5.30 గంటల్లోపు మాత్రమే. ఈ సమయంలోనే ఇసుక తిన్నెల్లో బొరియలు చేసి గుడ్లను పెట్టి సముద్రంలోకి జారుకుంటాయి. అనంతరం కొందరు వలంటీర్లు టార్చిలైట్లు, సంచులు పట్టుకుని తీరంలో తిరుగుతూ ఈ గుడ్లను సేకరిస్తారు. ఈ వలంటీర్లు ఎవరో కాదు.. ఈ పని కోసమే ప్రత్యేకంగా నియమించిన ట్రీ ఫౌండేషన్, అటవీ శాఖ ప్రతినిధులు. ఇలా దాదాపు 41 మంది జిల్లాలోని పలు తీరాల్లో తాబేళ్ల గుడ్లను సేకరించి సంరక్షణ కేంద్రానికి తరలిస్తారు. తీరంలో ఏర్పాటు చేసిన హేచరీల్లో ఈ గుడ్లను పొదిగించి బుల్లి తాబేళ్లను సురక్షితంగా సముద్రంలో విడిచిపెడుతున్నారు. పొదిగించడం ఎలా..? సాధారణంగా ఒక్కో తాబేలు 30 నుంచి 140 వరకు గుడ్లు పెడుతుంది. వీటిని వలంటీర్లు హేచరీలకు తీసుకువస్తారు. ఉష్ణోగ్రతను బట్టి ఇవి 45 నుంచి 70 రోజుల్లోగా పిల్లలుగా మారుతాయి. 28–30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగిన పిల్లలు మగ తాబేళ్లుగాను, 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగిన పిల్లలు ఆడ తాబేళ్లుగా పుడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ బుల్లి తాబేళ్లను మళ్లీ వలంటీర్లే ముచ్చటగా తీరం నుంచి సముద్రంలోకి వదులుతారు. జిల్లా వ్యాప్తంగా ఇలా 16 సంరక్షణ కేంద్రాలను 193 కిలోమీటర్ల తీరం వ్యాప్తంగా అటవీ శాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు సంయుక్తంగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే శ్రీకాకుళం టాప్ ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 33,562 గుడ్లు సేకరించి రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కాగా వజ్రపుకొత్తూరు మండలంలో ఈ ఏడాది అత్యధికంగా 5,871 గుడ్లు సేకరించి జిల్లాలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. గత 22 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ఆలీవ్ రిడ్లే తాబేళ్ల గుడ్లు సేకరణ ప్రకియ ఉద్యమంగా సాగుతోంది. అరుదైన తాబేళ్ల అంతరించిపోకుండా అంతా కలిసి చర్యలు చేపడుతున్నారు. సంరక్షణ కేంద్రాలివే.. జిల్లా వ్యాప్తంగా 16 హ్యాచరీలు ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మొదటి వారం వరకు 33,562 గుడ్లు సేకరించారు. అందులో వజ్రపుకొత్తూరు సెక్షన్లో రెండు ఉండగా అందులో వజ్రపుకొత్తూరు , మెట్టూరు ఉన్నాయి. అలాగే బారువ సెక్షన్లో 5 ఉండగా వీటిలో కళింగపట్నం, గడ్డివూరు, బట్టి గళ్లూరు, బారువ ఇసువానిపాలెం లు ఉన్నాయి. కవిటి సెక్షన్లో 3 ఉండగా అందులో డొంకూరు, చేపల కపాసుకుద్ది, బట్టివానిపాలెం , శ్రీకాకుళం సెక్షన్లో కొచ్చెర్ల, గంగులవానిపేట, టెక్కలి సెక్షన్లో గుల్లవానిపేట, కుముందివానిపేట, మేఘవరం, భావనపాడు తీరాల్లో సంరక్షణ కేంద్రాలున్నాయి. అరుదైన జాతులు కాపాడుకోవాలి. సముద్ర జీవుల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు అరుదైనవి. ఈ జాతిని కాపాడుకోవాలని గుడ్లను సేకరించి సంరక్షిస్తున్నాం. – కె.సోమేశ్వరరావు, ట్రీ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ వలంటీర్ల సాయంతో.. తీరంలోని తాబేళ్ల గుడ్లను వలంటీర్ల సాయంతో సేకరించి హాచరీల్లో పెడుతున్నాం. ఇక్కడ పిల్లలను మళ్లీ సముద్రంలోకి విడిచి పెట్టి తాబేళ్ల జాతిని కాపాడుతున్నాం. – రజనీకాంత్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాశీబుగ్గ రేంజ్ -
తాబేళ్ల అక్రమ రవాణా గుట్టు రట్టు!
కైకలూరు: కృష్ణాజిల్లా కొల్లేరు పరిసర ప్రాంతాల నుంచి తాబేళ్లను రహస్యంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వదర్లపాడు గ్రామం వద్ద రూరల్ ఎస్ఐ చల్లా కృష్ణా శనివారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో ఆటో, మినీ వ్యాన్‌ల్లో 25 బస్తాల్లో నాలుగు టన్నుల తాబేళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన పంతగాని నాగభూషణం (48), గరికిముక్కు సందీప్ (30), అదే మండలం కొండూరుకు చెందిన దేవదాసు ఏసుబాబు (27) తాబేళ్లను రవాణా చేస్తుండగా వాహనాలతో సహా అదుపులోకి తీసుకుని అటవీశాఖ అధికారులకు ఆదివారం అప్పగించారు. ఇక్కడ కేజీ తాబేలు రూ.15 చొప్పున కొని ఇతర రాష్ట్రాల్లో రూ.50 నుంచి రూ.100కి విక్రయిస్తున్నారు. తాబేళ్ల మాంసానికి గిరాకీ ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. వైల్డ్ లైఫ్ ఏలూరు ఫారెస్టు రేంజ్ ఆఫీసరు కుమార్ ఆధ్వర్యంలో డెప్యూటీ రేంజ్ ఆఫీసరు జయప్రకాష్, బీటు ఆఫీసరు రాజేష్ నిందితులపై అటవీపర్యావరణ చట్టం 1972 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి కైకలూరు కోర్టుకు తరలించారు. మేజిస్ట్రేటు ఆదేశాలతో పట్టుబడిన తాబేళ్లను కొల్లేరు సరస్సులో విడిచిపెడతామని అధికారులు చెప్పారు. -
చేపల పెంపకం కోసం డజన్ల కొద్దీ తాబేళ్లకు విషం ఇచ్చి... చివరకు
ముంబై: ముంబైకి సమీపంలోని సరస్సులో డజన్ల కొద్దీ తాబేళ్లను మృతి చెందాయి. అంతేకాదు తాబేళ్ల మరణానికి ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన విషమే కారణమని వన్యప్రాణుల నిపుణులు తెలిపారు. ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణ్ నగరంలోని సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడ స్థానిక రాజకీయ నాయకుడు ఫిర్యాదు మేరకు వైల్డ్ యానిమల్ అండ్ రెప్టైల్ రెస్క్యూ కన్జర్వేషన్ బృందం రంగంలోకి దిగింది. అయితే ఆ సరస్సులో సుమారు 57 ఫ్లాప్షెల్ తాబేళ్లు చనిపోయాయని, కాగా ఆరు తాబేళ్లను రక్షించినట్లు యానిమల్ అండ్ రెప్టైల్ రెస్క్యూ కన్జర్వేషన్ బృందానికి చెందిన సుహాస్ పవార్ చెప్పారు. ఈ మేరకు సుహాస్ పవార్ మాట్లాడుతూ..."గత రెండేళ్లుగా ఉన్న కోవిడ్-19 ఆంక్షల కారణంగా తాబేళ్లు అధిక సంఖ్యలో పెరిగి ఉండవచ్చు. పైగా సరస్సులో కొంతమంది చేపల పెంపకం సాగిస్తున్నారు. అయితే ఇవి చేపలను తిని అధిక సంఖ్యలో పెరిగాయన్న కోపంతో స్థానికులే ఉద్దేశపూర్వకంగా విషం ఇచ్చి ఉండవచ్చు. అయితే ఈ తాబేళ్లు అరుదైనవి కావు గానీ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత జాతి" అని చెప్పారు. (చదవండి: 120 ఏళ్ల వృక్షానికి 24 గంటల కాపలా!!) -
వేల కిలోమీటర్ల నుంచి వచ్చి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రత్యేకతలివే..
పిఠాపురం(తూర్పుగోదావరి): అలసట లేని వలస జీవులవి. అలుపెరుగని ప్రయాణం వాటి జీవన శైలి. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి పుట్టింటికి వచ్చినట్టుగా ‘తూర్పు’ తీరానికి చేరుకుంటాయి. ఎన్నో విశేషాలకు నిలయమైన ఆ జీవులు ఆలివ్ రిడ్లే తాబేళ్లు. ప్రస్తుతం సంతానోత్పత్తి కాలం కావడంతో జిల్లాలోని సముద్ర తీరంలో సందడి చేస్తున్న ఈ తాబేళ్ల రక్షణకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. చదవండి: రూపాయికే దోసె.. ఎర్రకారం, బొంబాయి చట్నీ.. ఎక్కడో తెలుసా..? అరుదైన ఉభయచర జీవుల్లో అనేక జాతుల తాబేళ్లున్నప్పటికీ ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వీటికి స్థిర నివాసం అంటూ ఏదీ ఉండదు. రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉండే ఈ తాబేళ్లు ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వీటిల్లో 7 జాతులుండగా 5 జాతుల తాబేళ్లు జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూంటాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. అందుకే కాకినాడ సమీపంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్య తీర ప్రాంతానికి ఈ తాబేళ్లు ఎక్కువగా వస్తూంటాయి. జీవనం అంతా సముద్రంలోనే అయినప్పటికీ కేవలం గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వచ్చేవి ఆలివ్ రిడ్లే తాబేళ్లు మాత్రమే. వేల కిలోమీటర్లు వలస వచ్చి గుడ్లు పెట్టిన చోటనే తయారైన పిల్లలు.. తిరిగి పదేళ్ల తరువాత సంతానోత్పత్తి సమయంలో తిరిగి అదే చోటుకు వచ్చి గుడ్లు పెట్టడం విశేషం. ఈ విధంగా పుట్టిన చోటుకే వచ్చి, మళ్లీ అక్కడే గుడ్లు పెట్టేది ఒక్క సముద్ర తాబేలు మాత్రమే. సాధారణంగా ఇవి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెట్టేందుకు సుదూర ప్రాంతాల నుంచి ‘తూర్పు’ తీరానికి వేలాదిగా వస్తాయి. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఆయా తీరాలకు చేరి, ఇసుకలో గోతులు తవ్విన, వాటిల్లో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి, తల్లి తాబేళ్లు సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతాయి. సుమారు నెల రోజుల అనంతరం ఈ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. ఒక్కో తాబేలు 50 నుంచి 150 వరకూ గుడ్లు పెడతాయి. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు మగ తాబేళ్లుగాను, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు ఆడ తాబేళ్లుగాను తయారవుతాయి. వెన్నెల రాత్రుల వేళ ఆ పిల్లలు కూడా వాటంతట అవే సముద్రంలోకి వెళ్లిపోవడం మరో విశేషం. అన్నీ గండాలే భారీ సైజులో ఉండే సముద్ర తాబేళ్లకు తీరంలో రక్షణ కరువవుతోంది. కుక్కలు, నక్కలు, ఇతర జంతువులు వీటి గుడ్లను తినేస్తుంటాయి. చివరకు కొన్ని మాత్రమే పిల్లలుగా తయారై వాటంతటవే సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. కొన్నిసార్లు ఆ పిల్లలను కూడా కొన్ని జంతువులు వేటాడి తినేస్తుంటాయి. ఇలా పుట్టినప్పటి నుంచీ సముద్ర తాబేళ్లకు ప్రాణసంకటంగానే ఉంటుంది. గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చిన తాబేళ్లు ఒక్కోసారి మత్స్యకారుల వలలకు చిక్కుతాయి. వాటిని జాగ్రత్తగా సముద్రంలో వదిలేయాల్సిన కొంతమంది విచక్షణారహితంగా వ్యవహరించడంతో అవి మృత్యువాత పడుతుంటాయి. రాత్రి సమయాల్లో గుడ్లు పొదిగేందుకు వచ్చిన తాబేళ్లను కూడా వివిధ జంతువులు వేటాడి చంపుతుంటాయి. ఈవిధంగా ఏటా ఉప్పాడ తీరంలో అనేక తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం జనవరి, ఫిబ్రవరి నెలలు సముద్ర తాబేళ్లకు సంతానోత్పత్తి సమయం. దీంతో ఇక్కడకు వస్తున్న తాబేళ్లకు రక్షణ కల్పిస్తున్నాం. అవి సంచరించే ప్రాంతాన్ని సంరక్షణ ప్రాంతంగా నిర్ణయించి, బోర్డులు ఏర్పాటు చేసి, ప్రత్యేక కంచెలు ఏర్పాటు చేస్తున్నాం. అవి గుడ్లు పెట్టే ప్రాంతాల్లో జనసంచారం లేకుండా చూస్తున్నాం. గుడ్లు పొదిగి పిల్లలయ్యేంత వరకూ సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నాం. తాబేళ్లను, వాటి గుడ్లను ఏ జంతువులూ తినకుండా రక్షణ కలి్పస్తున్నాం. తయారైన పిల్లలు సురక్షితంగా సముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. తాళ్లరేవు సమీపంలోని కోరింగ అభయారణ్యం ప్రాంతానికి సుమారు లక్ష వరకూ తాబేళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఉప్పాడ, కాకినాడ తదితర ప్రాంతాల్లో కొన్ని పరిస్థితుల వల్ల బోట్లలో పడి కొన్ని తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. వాటి రక్షణకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. – ఎస్.అశ్వనీకుమార్, అటవీ శాఖ సెక్షన్ అధికారి, కోరంగి -
ఆపదలో ఆలివ్.. తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లేల కళేబరాలు!
ప్రపంచలోనే అత్యంత అరుదైన సముద్రపు తాబేళ్లుగా పిలవబడే ఆలివ్‌రిడ్లేల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్ర జలాలను శుద్ధిచేసి, పర్యావరణాన్ని కాపాడడంలో తోడ్పడుతున్న వీటి సంరక్షణ కరువైంది. ఏటా గంజాం జిల్లా సాగర తీరంలో మైటింగ్(సంగమం)కి వచ్చే వీటిని కాపాడేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇవి ఈసారి ఆశించినంత స్థాయిలో లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి జిల్లాలోని పలు తీర ప్రాంతాల్లో కనిపిస్తున్న ఆలివ్‌రిడ్లేల కళేబరాలే నిదర్శనం. బరంపురం (ఒడిశా): గంజాం జిల్లాలోని రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖద్వారం ఆలివ్‌రిడ్లేల సంతానాభివృద్ధికి మంచి ఆవాసం. దేశ వ్యాప్తంగా ఉన్న 3 అనువైన ప్రదేశాలకు మాత్రమే ఇవి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరీ సంగమిస్తుండడం విశేషం. ఏటా నవంబరులో వీటి మైటింగ్(సంగమం)తో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ గుడ్లు పెట్టడం, ఆ తర్వాత వాటిని పొదగడం వంటి ప్రక్రియలు జనవరి, ఫిబ్రవరి నెలల వరకు నిరవధికంగా సాగుతుంది. అయితే ఈ తాబేళ్ల పిల్లలు సముద్రంలోకి ఏ మార్గాన వెళ్తాయో అవి పెద్దవైన తర్వాత గుడ్లు పెట్టేందుకు కూడా అదే స్థావరానికి రావడం వీటి ప్రత్యేకత. ఇప్పుడు గంజాం జిల్లాలోని గోపాలపూర్, పూర్ణబొందా సాగర తీరాల్లో ఎక్కడికక్కడ ఒడ్డుకు చేరుకున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి ఏటా చేరుకుంటున్న వీటికి రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇటువంటి దృశ్యాలు తారసపడడం పర్యావరణ హితులను కలవరపరుస్తోంది. ఇటీవల ఆలివ్‌రిడ్లేల రాక నేపథ్యంలో తీరం నుంచి లోపలికి 10 కిలోమీటర్ల మేర చేపల వేట నిషేధిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ఉత్వర్వులు జారీ చేసింది. ఫిషింగ్ బోట్లతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. చదవండి: (AP PGCET: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల) తీరంలోని కళేబరాలను పీక్కుతింటున్న శునకాలు సంప్రదాయ వలలతో వేటకు ఓకే.. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోకుండా సంప్రదాయ వలలతో వేట కొనసాగించుకోవచ్చని అవకాశం కల్పించింది. తీరంలో నిబంధనలను ఎవ్వరూ అతిక్రమించకుండా అధికారులను సైతం అధికార యంత్రాంగం నియమించింది. అయితే రెండు రోజులుగా అధికారుల జాడ కొరవడడంతో కొంతమంది సముద్రంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే సాహసం చేస్తున్నారు. ఈక్రమంలో ట్రాలీల వినియోగంతో మైటింగ్లో ఉన్న తాబేళ్లు చనిపోతున్నాయి. ముఖ్యంగా ఫిషింగ్ బోట్ల చక్రాలు తాబేళ్లను ఢీకొనడం, సముద్రంలోకి చేరే ఆక్వా రసాయనాలతో ఇవి చనిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖ ద్వారంలోని నిషేధిత ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విశాఖపట్నం, కాకినాడ ఓడరేవుల నుంచి కొంతమంది వేట జరపడంతో ఇక్కడి మైటింగ్లోని ఆలివ్‌రిడ్లేలు చనిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి, ఆపదలో ఉన్న తాబేళ్ల పరిరక్షణకు చర్యలను కట్టుదిట్టం చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొదిగే సమయం 45 రోజులు.. సంతానాభివృద్ధికి ఏటా నవంబరులో తీరానికి చేరే తాబేళ్లు మైటింగ్ అనంతరం గుడ్లు పెడతాయి. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో తీరంలోని ప్రత్యేక గుంతల్లో భద్రపరిచిన గుడ్లును పొదుగుతాయి. దీనికి 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. వీటి సంరక్షణకు ట్రీ ఫౌండేషన్, బయోవర్సిటీ కన్జర్వేషన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుండగా, ఆలివ్‌రిడ్లే ఒక్కొక్కటి 3 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, దాదాపు 45 కిలోల బరువు ఉంటుంది. చదవండి: (KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు) ఆక్సిజన్ పెంచడంలో కీలకం.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లు సముద్ర జలాల్లోని వివిధ వ్యర్థాలను తిని, సముద్రం కలుషితం కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా సముద్ర జీవరాశులను అంతరించిపోకుండా ఇవి పరిరక్షిస్తున్నాయి. సముద్రంలో ఆక్సిజన్ పెంచడంలో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరంలో ఓ రకమైన జెల్‌ని విడుదల చేస్తాయి. అది భూమిలో బంకలా అతుక్కుపోయి విపత్తుల సమయంలో తీరం కోతకు గురికాకుండా నివారిస్తుంది. ఇలా అనేక ఉపయోగాలున్న వీటి సంరక్షణ నేడు గాల్లో దీపంగా మారింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏం చెబుతోంది.. వణ్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం తాబేళ్లను షెడ్యూల్–1లో పొందుపరిచి, ప్రత్యేక రక్షణ కల్పించారు. పర్యావరణాన్ని కాపాడే సముద్రపు తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కొందరు సముద్రంలోకి వ్యర్థాలను వదిలిపెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా మరబోట్లు నడపడం వల్ల తాబేళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. అలాగే తాబేళ్లను ఎవరైనా తిన్నా, చంపినా, వాటి ఆవాసాలను నాశనం చేసినా శిక్షార్హులు. నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. -
చచ్చేదాకా బతికేస్తాయి.. వీటి వయసు వందలు, వేల ఏళ్లు!
భూమ్మీద ప్రతి జీవికి ఏదో ఒక సమయంలో మరణం తప్పదు. ముసలితనం వచ్చేసి, శరీరం ఉడిగిపోయి చనిపోవడమో... ఏదో ప్రమాదం, రోగం వంటి కారణాలతో అర్ధాంతరంగా ప్రాణాలు పోవడమో జరగొచ్చు. ఇందులో ప్రమాదం, రోగాలు వంటివేవీ లేకుండా.. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక జీవి ఎంతకాలం బతకగలుగుతుందన్న దానిని దాని ఆయుష్షుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనుషుల ఆయుష్షు గరిష్టంగా 130–150 సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతకుమించి బతికారనిగానీ, బతుకుతారని గానీ చెప్పేందుకు ఆధారాల్లేవు. తాబేళ్లు వంటి జీవులు 250 ఏళ్ల వరకు జీవిస్తాయని గుర్తించారు. కానీ ఎలాంటి ప్రమాదం, రోగాలు వంటివి లేకుంటే.. చావు అనేదే లేకుండా వేలకు వేల ఏళ్లు బతికుండే జీవులు ఉన్నాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ పెద్ద జీవి.. మళ్లీ పిండంగా మారి.. ఇది సముద్రంలో జీవించి ‘టుర్రిటోప్సిస్ డోహ్రిని’ రకం జెల్లీఫిష్. ఉండేది అర సెంటీమీటరే. పారదర్శక శరీరం, సన్నగా వెంట్రుకల్లా ఉండే టెంటకిల్స్‌తో అందంగా కనిపిస్తాయి. అయితే ఈ రకం జెల్లీఫిష్‌లకు వయసు పెరగడం అంటూ ఉండదని, సహజంగా వీటికి చావు లేనట్టేనని అమెరికన్ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. సాధారణంగా ఏ ప్రాణి అయినా దశలు దశలుగా ఎదుగుతూ పూర్తిస్థాయి జీవిగా మారుతుంది. కానీ ఈ జెల్లీఫిష్ ఏదైనా గాయం కావడమో, ఇంకేదైనా సమస్య రావడమో జరిగితే.. తిరిగి పూర్వరూపమైన ‘పాలిప్స్’గా (ఉదాహరణకు పిండం అనుకోవచ్చు) మారిపోతుంది. తర్వాత మళ్లీ జెల్లీఫిష్‌గా ఉత్పత్తి అయి ఎదుగుతుంది. ఎప్పటికీ ఇలా జరుగుతూనే ఉంటుందని, సాంకేతికంగా దానికి సహజ మరణం లేనట్టేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చేపలో, ఇతర సముద్ర జీవులో వీటిని గుటుక్కుమని మింగేస్తాయి. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ జెల్లీఫిష్‌లకు మెదడు, గుండె ఉండవట. ప్రతి కణం.. ఎప్పటికప్పుడు రిఫ్రెష్ ఈ ఫొటోలో కనిపిస్తున్న మరో సముద్ర జీవి పేరు హైడ్రా. ఒక సెంటీమీటర్ వరకు పెరుగుతుంది. చూడటానికి జెల్లీఫిష్‌లా కనిపించే ఈ జీవి కూడా దాదాపు చావులేనిదే. దీని శరీరం చాలా వరకు మూలకణాలు (స్టెమ్‌సెల్స్)తో నిర్మితమై ఉంటుందట. మూలకణాలకు శరీరంలో ఏ అవయవంగా, ఏ కణాజాలంగా అయినా మారే సామర్థ్యం ఉంటుంది. దనివల్ల హైడ్రాకు గాయాలైనా, ఏ భాగం దెబ్బతిన్నా తిరిగి పునరుత్పత్తి అవుతాయి. అందువల్ల ఈ జీవులకు వృద్ధాప్య ఛాయలే కనబడవు. కానీ చేపలు, ఇతర సముద్ర జీవుల తినేయడం, రోగాలు వంటివాటితో హైడ్రాల పని ముగిసిపోతుంది. మానవ పిండం కూడా తొలిదశలో మూలకణాల సమాహారమే. ఆ కణాలే విభజన చెందుతూ.. వివిధ అవయవాలు, ఎముకలు, కండరాలుగా మారుతాయి. పూర్తిస్థాయి మనుషుల్లో ఎముక మజ్జలో మాత్రమే మూలకణాలు ఉంటాయి. వాటిని వివిధ అవయవాలుగా అభివృద్ధి చేసే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు. వీటి వయసు వందలు, వేల ఏళ్లు.. ఇవి అంటార్కిటికా మహాసముద్రం అడుగున జీవించే ‘గ్లాస్ స్పాంజ్’లు. అత్యంత శీతల పరిస్థితుల్లో, అత్యంత మెల్లగా పెరిగే ఈ జీవులు 10–15 వేల ఏళ్లపాటు జీవిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉండే ‘ఓసియన్ క్వాహోగ్’ రకం ఆల్చిప్పలు. అమెరికా నేషనల్ మ్యూజియం శాస్త్రవేత్తలు 2006లో ఈ రకం ఆల్చిప్పపై పరిశోధన చేసి.. దాని వయసు 507 ఏళ్లు అని గుర్తించారు. 1499వ సంవత్సరంలో అది పుట్టి ఉంటుందని అంచనా వేశారు. ఇది గ్రీన్‌ల్యాండ్ షార్క్. ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాల్లోని లోతైన ప్రాంతాల్లో జీవిస్తుంది. ఎనిమిది మీటర్ల పొడవు పెరిగే ఈ షార్క్‌లు 250 ఏళ్లకుపైనే జీవిస్తాయని తొలుత భావించేవారు. అయితే 2016లో వలకు చిక్కిన ఓ గ్రీన్‌ల్యాండ్ షార్క్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. దాని వయసు 392 ఏళ్లు అని తేల్చారు. తాబేళ్లు.. లెక్క తక్కువే.. మనకు స్కూళ్లు, కాలేజీల్లో పాఠాల్లో, ఇతర పుస్తకాల్లో.. భూమ్మీద ఎక్కువకాలం బతికే జంతువు తాబేలు అని చెప్తుంటారు. రెండు వందల ఏళ్లకుపైగా జీవిస్తాయని అంటుంటారు. కానీ వాస్తవంగా.. ఎక్కువకాలం బతికే జీవుల్లో తాబేలు ఓ లెక్కలోకే రాదని శాస్త్రవేత్తలు తేల్చారు. తాబేళ్లలో అన్నింటికన్నా జియాంట్ గలపాగోస్ రకం తాబేళ్లు ఎక్కువ కాలం బతుకుతాయి. వీటిలో ఇప్పటివరకు అధికారికంగా గుర్తించిన అత్యధిక వయసు 192 ఏళ్లు మాత్రమే. అయితే ఈ తాబేళ్లు ఎలాంటి ఆహారం, నీళ్లు లేకున్నా ఏడాదిపాటు బతకగలవని.. వాటి శరీరంలో ఈ మేరకు నిల్వ ఏర్పాట్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎరుపు, తెలుపు రంగులతో పెయింట్ వేసినట్టు అందంగా ఉండే చేపలు కొయి కార్ప్స్. అక్వేరియంలలో పెంచుకునే ఈ చేపలు సాధారణంగా 40 ఏళ్లు జీవిస్తాయని చెప్తారు. కానీ 1977లో జపాన్ తీరంలో పట్టుకున్న ఒక కొయికార్ప్స్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు దాని వయసు 226 ఏళ్లు అని గుర్తించారు. గుండ్రంగా ఉండి, శరీరం చుట్టూ ముళ్లలాంటి నిర్మాణాలు ఉండే సముద్ర జీవి ‘రెడ్సీ ఉర్చిన్’. పసిఫిక్ మహాసముద్రంలో బతికే ఇవి కనీసం 200 ఏళ్లపాటు బతుకుతాయట. తొండలా ఉండే ఈ జీవి పేరు ‘ట్వటరా’. న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే ఇవి. వందేళ్ల వరకు బతుకుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీటికి తలపై మధ్యభాగంలో మూడో కన్ను ఉంటుంది. వృద్ధాప్యం ఎందుకొస్తుంది? జీవుల కణాల్లోని క్రోమోజోమ్‌లపై జన్యువులు, క్రోమోజోమ్‌ల అంచుల్లో సన్నని పోగుల్లాంటి టెలోమెర్లు ఉంటాయి. మన వయసు పెరిగిన కొద్దీ, శరీర కణాలు విభజన చెందినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతినడం, టెలోమెర్ల పరిమాణం తగ్గిపోవడం జరుగుతూ ఉంటాయి. ఒకస్థాయి దాటిన తర్వాత కణాలకు పునరుత్పత్తి చెందే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనితో శరీరం, అవయవాలు బలహీనమై వృద్ధాప్యం వస్తుంది. ఇది సహజ మరణానికి దారితీస్తుంది. ఆయా జీవుల్లో జన్యువుల సామర్థ్యం, ఇతర అంశాల ఆధారంగా వాటి ఆయుష్షు ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కాలం బతకడానికి కారణాలేమిటి? ►వయసు పెరిగినకొద్దీ జన్యుపదార్థం దెబ్బతింటున్నా.. దానిని తిరిగి మరమ్మతు చేసుకునే సామర్థ్యం కొన్నిరకాల జీవుల్లో ఉంటుంది. వాటిలోని కొన్ని ప్రత్యేకమైన జన్యువులే దీనికి తోడ్పడుతుంటాయి. ►కొన్ని ప్రాణులు అవి జీవించే వాతావరణానికి తగినట్టుగా శరీరంలో మార్పులు చేసుకుంటాయి. కణాజాలాలను పునరుత్పత్తి చేసుకుంటాయి. ఈ క్రమంలో వాటి జీవితకాలం పెరుగుతుంటుంది. ►కొన్నిరకాల షార్కులు, ఎండ్రకాయలు, ఇతర జంతువుల్లో ‘టెలోమెరేస్’ అనే ప్రత్యేకమై ప్రొటీన్ విడుదలవుతుంది. అది కణాల్లో టెలోమెర్లు పొడవు పెరగడానికి తోడ్పడి.. వాటి జీవితకాలం పెరుగుతుంది. ►అత్యంత మెల్లగా ఎదిగే జీవుల్లో చాలా వరకు ఎక్కువకాలం బతుకుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిల్లో తరచూ కణాల విభజన జరగాల్సిన అవసరం లేకపోవడమే దానికి కారణమని చెప్తున్నారు. -
సొంత గూటికి అరుదైన తాబేళ్లు
సాక్షి, హైదరాబాద్: అక్రమ రవాణాలో పట్టుబడిన 266 అరుదైన తాబేళ్లు సొంత గూటికి చేరాయి. ఆదివారం హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు ఈ ఇండియన్ టెంట్ టర్టిల్ (పంగ్‌శుర టెంటోరియా సర్కమ్ డాటా), ఇండియన్ రూటెడ్ టర్టిల్ (పంగ్‌శుర టెక్టా)గా పిలిచే తాబేళ్లను సురక్షితంగా పంపించారు. గత ఆగస్టులో లక్నో సమీపంలోని గోమతి నది నుంచి తాబేళ్లను అక్రమంగా తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతుండగా ఇద్దరు నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ తాబేళ్లను జూపార్కుకు తరలించారు. అయితే సహజ సిద్ధఆవాసాల్లో ఎక్కువ సంరక్షణ ఉంటుంది కాబట్టి తాబేళ్లను లక్నోకు తరలించే విషయమై తెలంగాణ అటవీ శాఖను యూపీ పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) పవన్‌కుమార్ శర్మ సంప్రదించారు. దీంతో వాటికి ఆరోగ్య పరీక్షలు చేసి సురక్షిత ప్యాకేజింగ్‌తో ఎయిర్ ఇండియా విమానంలో లక్నో పంపించారు. అక్కడ కూడా పరీక్షలు నిర్వహించి గోమతి నదిలో వదిలేస్తామని యూపీ అధికారులు తెలిపారు. అరుదైన తాబేళ్లు కావడంతో అక్రమ రవాణా బారిన పడుతున్నాయని, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని టీఎస్ఏ(టర్టిల్ సర్వైవల్ అలయన్స్) ఇండియా డైరెక్టర్ డా.శైలేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. అక్రమ రవాణాను అడ్డుకుని పట్టుకున్న తాబేళ్లను మళ్లీ సహజసిద్ధ ఆవాసాలకు తిప్పి పంపడం ఇది రెండోసారి. 2015లో మహారాష్ట్రలోని పుణె నుంచి 500 తాబేళ్లను లక్నోకు తరలించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఏ బృందం ఇమ్రాన్ సిద్దిఖీ, సుజిత్, లక్నో సబ్‌డివిజనల్ ఆఫీసర్ అలోక్‌పాండే, బయోలాజిస్ట్ అరుణిమ పాల్గొన్నారు. -
సంద్రం ఒడిలోకి తాబేళ్ల పిల్లలు
ఇచ్ఛాపురం రూరల్: సముద్ర తాబేళ్లను రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని బూర్జపాడు సర్పంచ్ బుడ్డ మోహనాంగి అన్నారు. డొంకూరు మత్స్యకార గ్రామంలో ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక తీరం ఒడ్డున కొంత కాలంగా తాబేళ్ల గుడ్లను సేకరిస్తూ పిల్లలు పొదిగేంత వరకు వాటిని సంరక్షిస్తూ సముద్రంలో విడిచిపెడుతుండేవారు. శుక్రవారం రాత్రి సుమారు 300 తాబేళ్ల పిల్లలను ఆమె విడిచిపెట్టారు. వైఎస్సార్సీపీ నాయకుడు బుడ్డ కాంతారావు, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు చీకటి గురుమూర్తి, ట్రీ ఫౌండేషన్ సంరక్షకులు పాల్గొన్నారు. చదవండి: కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్స్ మాత్రం.. ఫలరాజు.. ఎగుమతుల్లో రారాజు -
ఏడాది తర్వాత ఆ అద్భుతాన్ని చూశా
భువనేశ్వర్ : మనం రోజు చూసే ప్రకృతిలో కొన్ని దృశ్యాలు మనం ఎప్పుడు మరిచిపోలేని అనుభూతులు మిగిలిస్తాయనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాగర తీరాన ఒకేసారి వేళ తాబేళ్లు సముద్రంలోకి పరిగెడుతున్నఅద్భుతాన్ని ఎప్పుడు చూడకపోతే మాత్రం ఇప్పుడు చూసేయండి. ఒడిశాలోని గహిర్మాతా బీచ్‌లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ప్రతీ ఏడాది సముద్రం అడుగుబాగం నుంచి ఒడ్డుకు వస్తాయి. గుడ్లను పెట్టడంతో పాటు పొదిగిన తర్వాత వాటి పిల్లలు ఉండడానికి ఇసుక గూళ్లు తయారుచేస్తుంటాయి. ఈ ప్రక్రియను అరిబాడా అనే పేరుతో పిలుస్తారు. తమ పిల్లలు కొంచెం ఎదిగాక ఒకేసారి అన్నీ కలిసి యధావిధిగా సముద్ర అడుగుబాగంలోకి చేరుకుంటాయి. అలాంటి వీడియోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుషాంత నంద తన ట్విటర్లో షేర్ చేశారు. ' ఏడాది తర్వాత మళ్లీ ఆ అద్భుతాన్ని చూశాను. ఒడిశాలోని గహిర్మాతా బీచ్‌లో గుడ్ల పెట్టడానికి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వచ్చే దృశ్యం ఎంతో బాగుంటుంది. దాదాపు 2 కోట్ల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు 4 లక్షల ఇసుక గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి . తమ పిల్లలను తీసుకొని ఒకేసారి సముద్రంలోకి వెళ్లే దృశ్యం మాత్రం చూపరులను ఆకట్టుకుంటుంది.ఇప్పుడు ఈ వీడియో మీకు చూపిస్తున్నా..' అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఆ తాబేళ్లు ఎక్కడివి?
సాక్షి, ములకలపల్లి(ఖమ్మం) : మండల శివారులో ఆదివారం తెల్లవారుజామున భారీగా తాబేళ్లు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. మండల పరిధిలోని పొగళ్లపల్లి, తిమ్మంపేట మధ్య ఆర్అండ్బీ రోడ్డు పక్కనే తాబేళ్లు కనిపించాయి. ఉదయం పత్తి తీసేందుకు వెళ్తున్న కూలీలు వాటిని చూశారు. అయితే తాబేళ్లలో కొన్ని మృత్యువాత పడగా, మరికొన్ని ప్రాణాలతోనే ఉన్నాయి. దీంతో స్థానికులు కొందరు ఆ తాబేళ్లను ఇంటికి తీసుకువెళ్లారు. తాబేళ్ల కోసం స్థానికులు ఎగబడటంతో విషయం బయటకు పొక్కింది. ఆనోట.. ఈనోట పాకి మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మండలంలో తొలిసారిగా భారీగా తాబేళ్లు బయటపడటం గమనార్హం. కాగా ఆంధ్రా నుంచి ములకలపల్లి మీదుగా భద్రాచలం ఏరియాకు వీటిని తరలించే క్రమంలో గుట్టురట్టయినట్లు తెలుస్తోంది. చేపల లోడుతో తాబేళ్లను తరలించే సమయంలో అటుగా పోలీసులు రావడంతో రోడ్డు పక్కన వాటిని పడేసినట్లు పలువురు అనుమానిస్తున్నారు. తాబేళ్లను తరలించడం అక్రమార్కుల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. విచారణ చేపట్టాం.. ఘటనా స్థలాన్ని అటవీ శాఖాధికారులు పరిశీలించి విచారణ చేపట్టారు. ములకలపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు నేతృత్వంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుమారు 40 తాబేళ్లను పట్టుకోగా, వాటిల్లో 14 మృతిచెంది ఉన్నాయి. మిగిలిన 26 తాబేళ్లను పాల్వంచలోని కిన్నెరసాని రిజర్వాయర్‌కు తరలించారు. భారీగా తాబేళ్లు దొరికిన విషయంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై సురేశ్ సైతం ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
తరలిపోతున్న తాబేళ్లు
ఎవరికీ ఏమాత్రం హాని తలపెట్టని సాధు జీవులు తాబేళ్లు. వేలాది ఏళ్ల చరిత్రకు ఇవి సాక్షిగా నిలుస్తాయి. అందుకేనేమో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. కొల్లేరు కేంద్రంగా తాబేళ్ల స్మగ్లింగ్ య«థేచ్ఛగా సాగుతోంది. ఒడిశా, అసోం, కర్ణాటక రాష్ట్రాలకు కొల్లేరు తాబేళ్లను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి కలిదిండి మండలం మద్వానిగూడెంలో 1,850 తాబేళ్లను అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. అమరావతి ,కైకలూరు: కొల్లేరు కేంద్రంగా ముఠా సభ్యులు తాబేళ్లను గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో తరలించేస్తున్నారు. ఈ ప్రాంతంలో చేపల చెరువుల పట్టుబడి సమయంలో చెరువు అడుగున వందల సంఖ్యలో తాబేళ్లు లభ్యమవుతున్నాయి. అక్రమార్కులు చేపల వలల మేస్త్రీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇవేకాకుండా డ్రెయిన్లు, గోతుల్లో లభ్యమయ్యే తాబేళ్లను ఆయా గ్రామాల్లో ఓ పెద్ద పీపాలో నిల్వ చేస్తున్నారు. వారంలో ఒక రోజు వ్యాన్‌లో అన్నింటినీ సేకరించి రాష్ట్రం దాటించేస్తున్నారు. చేపల ట్రేలలో పైన చేపలు, కింద తాబేళ్లను ఉంచి సరిహద్దులు దాటించేస్తున్నారు. తాబేలు మాంసానికి డిమాండ్ అస్సాం, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో తాబేలు మాంసానికి మంచి డిమాండ్ ఉంది. కొన్ని ఔషధాల్లో ఈ మాంసాన్ని ఉపయోగిస్తారు. కొల్లేరు ప్రాంతంలో కేజీ తాబేలును రూ.300కు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో కేజీ రూ.750కి విక్రయిస్తున్నారు. తాబేళ్లు పొదిగే కాలంలో అక్రమ రవాణాకు గురవడంతో వాటి సంతతి అంతరించిపోతోంది. ఈ ప్రాంతంలో 2014 డిసెంబరు 7న కలిదిండి మండలం వెంకటాపురం వద్ద 13 బస్తాల్లో 700 తాబేళ్లను అప్పటి రేంజర్ సునీల్‌కుమార్ పట్టుకున్నారు. ముదినేపల్లిలో భారీ తాబేళ్ల లోడును గతంలో స్వాధీనం చేసుకున్నారు. కైకలూరు శివారు ఏలూరు రోడ్డు వద్ద తాబేళ్ల మూటలతో ఒకరిని అరెస్టు చేశారు. తాజాగా మద్వానిగూడెం వద్ద ఘటన వెలుగుచూసింది. అటవీ అధికారులు సరైన నిఘాను పెట్టకపోవడంతో తాబేళ్లు సరిహద్దులు దాటుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చట్టం ఏమి చెబుతుందంటే.. అంతరించిపోతున్న తాబేలు జాతిని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు షెడ్యూలు –1 కేటగిరీలో చేర్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేళ్లను వేటాడితే 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించే అవకాశం ఉంది. కొల్లేరు ప్రాంతం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా తాబేళ్లను పట్టుకుని నిల్వ చేస్తే అటవీ అధికారులకు సమాచారం అందిస్తే దాడులు చేసి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సెల్లో కాల్‌డేటా కీలకం.. కలిదిండి మండలం మద్వానిగూడెం వద్ద శుక్రవారం అర్ధరాత్రి పట్టుబడిన పశ్చిమబెంగాల్‌కు చెందిన హరమ్ఘోష్, దివాసిస్దాసుల సెల్ఫోన్లలో అక్రమ తాబేళ్ల ముఠాకు చెందిన స్థానిక నాయకుల సెల్ నెంబర్లను కనుగొన్నారు. పోలీసులు ఆ సెల్ నెంబర్లను విచారణ చేస్తే ఖచ్చితంగా కొల్లేరు ప్రాంతంలో ముఠా సభ్యుల గుట్టురట్టవుతుంది. ఇప్పటికైనా అటవీశాఖాధికారులు పూర్తి స్థాయి విచారణ చేయించి నిందితులను అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నారు. నిఘాను ముమ్మరం చేస్తాం కొల్లేరు పరిసర ప్రాంతాల్లో తాబేళ్ల అక్రమ రవాణాపై నిఘాను ముమ్మరం చేస్తాం. పెద్ద పులి మాదిరిగా షెడ్యూల్ –1 జాబితాలో తాబేలు ఉంది. ఇది అంతరించే జాతుల జాబితాలోకి చేరుతోంది. చేపల చెరువుల పట్టుబడి సమయంలో సిబ్బందితో నిఘా నిర్వహిస్తాం. తాబేళ్లను వేటాడం చట్టరీత్యా నేరం. 7 సంవత్సరాలు కఠినకారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తారు.– బి.విజయ, ఫారెస్టు రేంజర్, కైకలూరు -
కూర్మాలకు గడ్డు కాలం
తూర్పుగోదావరి, పిఠాపురం: పర్యావరణ పరిరక్షణలో ముఖ్య పాత్ర పోషించే సముద్ర తాబేళ్లకు గుడ్లు పెట్టే కాలం గడ్డుకాలంగా మారింది. కాకినాడ సమీపంలో ఉప్పాడ సాగరతీరం కొట్టుకుపోవడంతో గుడ్లు పెట్టేందుకు స్థలం లేక తాబేళ్లు సముద్రకోతకు రక్షణగా వేసిన రాళ్లకు కొట్టుకుని విగతజీవులుగా మారుతున్నాయి. ఏటా డిసెంబర్ నెల నుంచి ఫిబ్రవరి వరకు అనేక ప్రాంతాల నుంచి గుడ్లు పొదిగేందుకు ఈ తీరానికి వందల సంఖ్యలో సముద్ర తాబేళ్లు వలస వస్తుంటాయి. అవి రాత్రి సమయాల్లో తీరానికి చేరుకుని గోతులు తవ్వి గుడ్లు పొదిగి మళ్లీ ఆ గోతులను ఇసుకతో పూడ్చి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. ఆ గుడ్లు పిల్లలుగా తయారై వాటంతటవే సముద్రంలోకి వెళుతుంటాయి. ఈ పరిణామంలో తీరంలో ఇసుక తిన్నెల్లో పెట్టిన గుడ్లు కొన్ని నక్కలు, కుక్కలు తినేస్తుండగా తాబేళ్ల సంతతికి రక్షణ లేకుండా పోయింది. గుడ్లు పెట్టేందుకు తీరానికి వచ్చిన తాబేళ్లు మత్స్యకారులు తీరం వెంబడి సాగించే అలివి వేటలో వలలకు చిక్కి చనిపోతున్నాయి. ప్రస్తుతం ఈ తాబేళ్లకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. అసలు గుడ్లు పెట్టడానికి వాటికి ఇసుక తిన్నెలే కరువయ్యాయి. తీరంలో ఎక్కడ చూసినా సముద్ర కోతకు రక్షణగా వేసిన రాళ్లు మాత్రమే ఉండడంతో సంతానోత్పత్తి కోసం వచ్చిన తాబేళ్లు ఈ రాళ్లకు కొట్టుకుని మృత్యువాత పడుతున్నాయి. భవిష్యత్తులో వాటి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తుండడంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపనుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మత్స్యకారుల్లో అవగాహన కల్పించడంతో పాటు తీరంలో రక్షణ చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. -
తాబేళ్ల అక్రమ రవాణా
భువనేశ్వర్ : రాష్ట్రం సరిహద్దులో తాబేళ్ల అక్రమ రవా ణా గుట్టు రట్టయింది. చాందీపూర్ అటవీ శాఖ పోలీసులు, బాలాసోర్ రైల్వే రక్షక దళం ఉమ్మడి ప్రయత్నంతో ఈ గుట్టు రట్టయింది. పొరుగు రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు ఈ తాబేళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం ఆధారంగా ఈ రెండు వర్గాలు ఆకస్మికంగా దాడి చేశా యి. రాజ్‌ఘాట్ రైల్వేస్టేషన్లో ఆకస్మికంగా దాడి చేపట్టారు. ఈ దాడిలో 4 జాతుల 91 తాబేలు పిల్లల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇద్దరు వ్యక్తుల సందిగ్ధ కదలిక నేపథ్యంలో రైల్వే రక్షక దళం ఈ వర్గంపై దృష్టి సారించింది. పోలీసు దళాలు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పశ్చిమ బెంగాల్‌లోని బాలాసోర్ జిల్లా బొగొరాయి ప్రాంతీయుడుగా గుర్తించారు. వీరిద్దరూ తరచూ ఇటువంటి అక్ర మ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచా రం అందినట్లు చాందీపూర్ అటవీ శాఖ పోలీసు లు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న 91 తాబేలు పిల్లల్ని సువర్ణరేఖ, సముద్ర సంగమం కేంద్రంలో విడిచి పెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
కూర్మనాథాలయంలో ఆరుబయటే తాబేళ్లు
గార : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మంలో పార్కులో ఉండాల్సిన తాబేళ్లు సమీపంలో పూలమొక్కల్లో నూ దర్శనమిస్తున్నాయి. తాబేళ్ల అక్రమ రవా ణాపై వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటిని సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. తాబేలుని ఈశాన్యం భాగంలో ఉంచుకోవడం ద్వారా శని ప్ర వేశాన్ని అడ్డుకోవచ్చన్న ఓ మూఢ నమ్మకం తాబేలుని ఉంచాలన్న కోరికను భక్తుల్లో కలిగేలా చేస్తోంది. వాస్తవానికి వన్య ప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం దేశంలో నక్షత్ర తాబేళ్లు అంతరించిపోతున్న అరుదైన జాతి. దీన్ని బంధించడం గానీ, పెంచడం గానీ చేయకూడదు. అందుకే శ్రీకూర్మంలో పార్క్ ఏర్పాటు చేశారు. అయితే సంరక్షణ వి షయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. సంరక్షణతో పాటు ఆహారం పూర్తిస్థాయిలో అందడం లేదన్న మీడియా కథనాలను ఇటీవలే వచ్చిన ఈఓ గురునాధరావు సీరియస్‌గా తీసుకున్నారు. భక్తులు డబ్బుల రూపంలో సాయం చేయాలని, ఆహారం మాత్రం తీసుకురావద్దని ఆదేశాలిచ్చి అమలయ్యేలా చూశారు. తాబేలు మరణిస్తే ప్రత్యే క పద్ధతిలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చే యాలని వన్యప్రాణ సంరక్షణ చట్టం చెబుతుంది. గత నెలలో సమీప శ్వేతపుష్కరిణి ఒడ్డున చెత్తతో పాటు చనిపోయిన తాబేలు కూడా ఉంది. దీనిపై ఆలయ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అయితే పార్కులో ఎన్ని తాబేళ్లు ఉన్నాయి, ఇటీవల ఎన్ని జన్మించాయన్న సమాచారం దేవాలయ అధికారుల వద్ద లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
1,125 నక్షత్ర తాబేళ్ల పట్టివేత
సాక్షి, విశాఖపట్నం: మన రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌కు అక్రమంగా రవాణా అవుతున్న 1,125 నక్షత్ర తాబేళ్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు డీఆర్ఐ అధికారులు ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో తాబేళ్లు తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో రైలు విశాఖకు రాగానే దాడి చేసి 1,125 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాబేళ్లను చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి సేకరించి కర్ణాటకలోని చెల్లూరు ప్రాంతం బాలెగౌడనహళ్లి గ్రామంలో అప్పగించారని, అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి.. రైలులో హౌరాకు, అక్కడ నుంచి బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్టు నిందితులు చెప్పినట్టు డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. -
నేస్తానికి కష్టకాలం
విజయనగరం పూల్‌భాగ్: ఆలీవ్ రిడ్లే తాబేళ్లు.. సముద్ర తాబేళ్లుగా పేరొందిన వీటికి పర్యావరణ నేస్తాలు అని పిలుస్తుంటారు. తీర ప్రాంతంలో పరిశ్రమలు అధికం కావడం, సముద్రంలో పెద్దబోట్లు తిరుగుతుండడంతో వీటి మనుగడే కష్టంగా మారింది. అలాంటి సమయంలో అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు తాబేళ్ల సంరక్షణకు శ్రీకారం చుట్టారు. పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐదేళ్ల కాలంలో 1,52,232 గుడ్లను సేకరించారు. 1,22,658 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. జిల్లాలోని సముద్రతీరం వెంబడి 2014లో విజయనగరం అటవీశాఖ వన్యప్రాణి విభాగం వారు భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 28 కిలోమీటర్లు సముద్రతీరంలో 10 ఆలివ్‌రిడ్లే తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెంపకం ఎలా అంటే..? ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సముద్రంలోని తల్లి తాబేళ్లు తీరానికి చేరుకుని గుడ్లు పెడతాయి. వీటిని నక్కలు, అడవి పందులు తినేయకుండా అటవీ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాబేళ్ల పునరుత్పత్తికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటుందో ముందుగా గుర్తించి, అక్కడ మినీ హేచరీ ఏర్పాటు చేసి అందులో రెండు నుంచి మూడు అడుగుల సైజు గుంతలు తవ్వి గుడ్లు ఉంచుతారు. గుంతల్లో పొదిగిన గుడ్లు నుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు 45 రోజుల నుంచి 60 రోజుల సమయం పడుతుంది. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఉత్పత్తి కేంద్రాల ద్వారా తాబేళ్లను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియలో ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెట్టిన గుడ్లను సురక్షిత ప్రాంతాల్లో ఉంచి 20 మంది కాపలాదారులను నియమించారు. చంపినా, తిన్నా నేరమే.. తాబేళ్లను వేటాడి చంపినా, వాటి గుడ్లను తిన్నా వన్యప్రాణి సంరక్షణ చట్టం – 1972 కింద నేరంగా పరిగణిస్తారు. మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరం వెంబడి 500 మీటర్ల పరిధిలో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేపట్టకూడదు. భారత ప్రభుత్వం ఈ తాబేళ్ల చట్టం పరిధిలో షెడ్యూల్–1ను చేర్చింది. ఎంత సాయమంటే..? తాబేళ్లు సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి. దీంతో తీర ప్రాంతాల్లో నివశించే ప్రజలకు సముద్రపు గాలి సోకడం వల్ల అంటు వ్యాధులు రావని అధికారులు చెబుతున్నారు. సముద్రంలో ఆక్సిజన్ పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. అడ్డదిడ్డంగా ఉండే సీ గ్రాస్‌ను తాబేళ్లు తినడంతో సీ గ్రాస్ బెడ్ ఏర్పడుతుంది. దీంతో సముద్రంలో ఉన్న జీవరాశులు బెడ్‌పై గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తిని చేస్తాయి. దీంతో మత్స్య సంపద పెరుగుతుంది. ఇదీ ప్రత్యేకత.. ఆలివ్ రిడ్లే తాబేలు సుమారు 45 కిలోల బరువు, మూడడుగుల పొడవు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉంటుంది. పుట్టిన పిల్ల మూడు సెంటీమీటర్లు పొడవు, అరంగులం వెడల్పు ఉంటుంది. ఆడ తాబేలు ఒడ్డుకు వచ్చి 60 నుంచి 150 గుడ్లు వరకు పెడుతుంది. మగ తాబేలు 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆడ తాబేలు 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే బయటకు వస్తాయి. ఆడ తాబేలు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ తీరం నుంచి సముద్రతీరంలోకి వెళతాయో పెద్దయ్యాక అదే తీరానికి వచ్చి గుడ్లు పెట్టడం ప్రత్యేకత. తాబేలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అధికారుల ఆదేశాలతోనే.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలివ్ రిడ్లే తాబేళ్లను సంరక్షించే బాధ్యత తీసుకున్నాం. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని సముద్ర తీర ప్రాంతంలో 1,52,232 గుడ్లను సేకరించి పునరుత్పత్తి కేంద్రాల ద్వారా 1,22,658 పిల్లలను ఉత్పత్తిచేసి సముద్రంలో విడిచి పెట్టాం. బయోశాప్, కాంపా స్కీములు, బీడీఎస్(బయో డైవర్సిటీ కాంపౌండ్) ద్వారా వచ్చిన ని«ధులతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. – గంపా లక్ష్మణ్, డీఎఫ్ఓ (టెరిటోరియల్), విజయనగరం. -
ముంబై తీరానికి ఆత్మీయ అతిథి!
సాక్షి, ముంబై: ఒక విశిష్ట అతిథి రాక రాక వచ్చింది. దేశదేశాలు దాటుకుంటూ, అలుపుసొలుపు లేకుండా సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ వచ్చింది. ముంబై తీరంలో సందడిని, పర్యావరణవేత్తల్లో సంబరాన్ని ఒకేసారి మోసుకువచ్చింది. ఆ ఆత్మీయ అతిథి కోసం పర్యావరణవేత్తలు 20 ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఆ అరుదైన జాతిని ముంబై బీచ్‌లలో చూడగలమో లేదోనని కొన్నాళ్లు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. అత్యంత అరుదైన జాతికి చెందిన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ముంబై వెర్సోవా బీచ్‌లో మెరిశాయి. మొత్తం 80 గుడ్లు ఈ తీరంలో మార్నింగ్ వాకర్లకి, బీచ్‌ని శుభ్రం చేసే కార్మికులకు కనిపించాయి. అయితే అవి నిజంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్ల గుడ్లేనా అన్న అనుమానాలను కొందరు పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు వ్యక్తం చేశారు. సంతానాభివృద్ధి కోసం ఈ అరుదైన జాతి ముంబై తీరానికి వచ్చిందో లేదో నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. వారి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారి ప్రశాంత్ దేశ్‌ముఖ్ నేతృత్వంలోని ఒక బృందం వెర్సోవా బీచ్‌ను సందర్శించింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తమకు సురక్షితమని భావించే సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుకను తవ్వి ఆ గోతుల్లో గుడ్లను పెడతాయి. అలాంటి గోతులు, వాటిల్లో కొన్ని విరిగిపోయిన గుడ్లు వెర్సోవా బీచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం బృందానికి కనిపించాయి. కొన్ని గుడ్ల నుంచి మృతి చెందిన తాబేలు పిల్లలు కూడా కనిపించాయి. వాటిని పరీక్షించగా అవి అరుదైన ఆలివ్ రిడ్లీ జాతికి చెందినవేనని తేలింది. ‘ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇది నిజంగా శుభవార్త. వెర్సోవా బీచ్ కూడా ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పొదగడానికి అనువైన ప్రాంతంగా మారింది. జీవవైవిధ్యాన్ని కోరుకునేవారిలో స్ఫూర్తిని నింపే పరిణామం ఇది. ఇదే బీచ్‌లో మరిన్ని ఎగ్ షెల్స్ ఉండే అవకాశం ఉంది. ‘ అని అటవీ సంరక్షణ శాఖ అధికారి వాసుదేవన్ చెప్పారు. అరుదైన తాబేళ్లు కనిపించగానే సంబరాలు చేసుకోనక్కర్లేదు. ఇప్పుడు వాటిని కాపాడుకోవమే చాలా ప్రయాసతో కూడుకున్న పని. కుక్కలు, మత్స్యకారుల మరబోట్లు, బీచ్ సందర్శకుల నుంచి వాటికి ముప్పు పొంచి ఉంది. తాబేళ్ల గుడ్లను సంరక్షించి అరుదైన జాతిని కాపాడుకోవడమే అటవీ శాఖ అధికారుల ముందున్న పెద్ద సవాల్ అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.