అర్ధరాత్రి దాటిపోవాలి.. నిశ్శబ్దం
కలిసిన చీకటి తీరమంతా అలముకోవాలి. పైన ఆకాశంలో చుక్కలు.. కింద ఒడ్డున అలలు తప్ప ఇంకేమీ కనిపించకూడదు. నరమానవుడి అలికిడి అస్సలు ఉండకూడదు. అలాంటి సమయంలో నీలాల సాగరం నుంచి కూర్మాలు బయటకు వస్తాయి. ఆ తల్లి తాబేళ్లు తీరంలో గుడ్లు పెడతాయి. ఎవరూ కనిపెట్టకూడదని బొరియలు చేసి మరీ కార్యాన్ని పూర్తి చేస్తాయి. పొద్దు పొడుస్తోందని సూచన అందే ముందే మళ్లీ గుంపుగా కడలి గర్భానికి వెళ్లిపోతాయి. అవి వెళ్లిన కాసేపటికే కొందరు టార్చిలైటు వెలుతురులో వెతుక్కుంటూ వచ్చి ఆ గుడ్లను తీసుకెళ్తారు. ఎందుకంటే..?
వజ్రపుకొత్తూరు రూరల్: ఆలివ్ రిడ్లే.. తెలుగు పేరు కాకపోయినా మనకు తెలిసిన పేరే. ఎక్కడో వేల నాటికల్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో నివాసముండే అరుదైన తాబేళ్లు ఇవి. కానీ సంతానోత్పత్తికి మాత్రం సిక్కోలు తీరానికి వస్తాయి. అందుకే వీటితో ఈ జిల్లాకంత చనువు. సముద్రంలో నాచు, కొన్ని రకాల మొక్కలను ఆహారంగా తీసుకునే ఈ జాతి కడలి గర్భంలోని శిలలను శుద్ధి చేస్తాయి కూడా. కాకులు, గద్దలు, పీతలు, కుక్కలు, తీరంలో వాహనాలు వంటి అవరోధాలు దాటి వీటి సంతానోత్పత్తి సజావుగా సాగాలంటే పెద్ద యజ్ఞమే జరగాలి. సిక్కోలు తీరంలో ఆ యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతోంది.
ఎప్పుడు గుడ్లు పెడతాయి..?
ఏటా జనవరి నుంచి మార్చి వరకు తాబేళ్లు గుడ్లు పెడతాయి. అది కూడా రాత్రి 2 గంటల నుంచి వేకువ 5.30 గంటల్లోపు మాత్రమే. ఈ సమయంలోనే ఇసుక తిన్నెల్లో బొరియలు చేసి గుడ్లను పెట్టి సముద్రంలోకి జారుకుంటాయి. అనంతరం కొందరు వలంటీర్లు టార్చిలైట్లు, సంచులు పట్టుకుని తీరంలో తిరుగుతూ ఈ గుడ్లను సేకరిస్తారు. ఈ వలంటీర్లు ఎవరో కాదు.. ఈ పని కోసమే ప్రత్యేకంగా నియమించిన ట్రీ ఫౌండేషన్, అటవీ శాఖ ప్రతినిధులు. ఇలా దాదాపు 41 మంది జిల్లాలోని పలు తీరాల్లో తాబేళ్ల గుడ్లను సేకరించి సంరక్షణ కేంద్రానికి తరలిస్తారు. తీరంలో ఏర్పాటు చేసిన హేచరీల్లో ఈ గుడ్లను పొదిగించి బుల్లి తాబేళ్లను సురక్షితంగా సముద్రంలో విడిచిపెడుతున్నారు.
పొదిగించడం ఎలా..?
సాధారణంగా ఒక్కో తాబేలు 30 నుంచి 140 వరకు గుడ్లు పెడుతుంది. వీటిని వలంటీర్లు హేచరీలకు తీసుకువస్తారు. ఉష్ణోగ్రతను బట్టి ఇవి 45 నుంచి 70 రోజుల్లోగా పిల్లలుగా మారుతాయి. 28–30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగిన పిల్లలు మగ తాబేళ్లుగాను, 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగిన పిల్లలు ఆడ తాబేళ్లుగా పుడతాయని అధికారులు చెబుతున్నారు. ఈ బుల్లి తాబేళ్లను మళ్లీ వలంటీర్లే ముచ్చటగా తీరం నుంచి సముద్రంలోకి వదులుతారు. జిల్లా వ్యాప్తంగా ఇలా 16 సంరక్షణ కేంద్రాలను 193 కిలోమీటర్ల తీరం వ్యాప్తంగా అటవీ శాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు సంయుక్తంగా ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోనే శ్రీకాకుళం టాప్
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 33,562 గుడ్లు సేకరించి రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. కాగా వజ్రపుకొత్తూరు మండలంలో ఈ ఏడాది అత్యధికంగా 5,871 గుడ్లు సేకరించి జిల్లాలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. గత 22 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ఆలీవ్ రిడ్లే తాబేళ్ల గుడ్లు సేకరణ ప్రకియ ఉద్యమంగా సాగుతోంది. అరుదైన తాబేళ్ల అంతరించిపోకుండా అంతా కలిసి చర్యలు చేపడుతున్నారు.
సంరక్షణ కేంద్రాలివే..
జిల్లా వ్యాప్తంగా 16 హ్యాచరీలు ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మొదటి వారం వరకు 33,562 గుడ్లు సేకరించారు. అందులో వజ్రపుకొత్తూరు సెక్షన్‌లో రెండు ఉండగా అందులో వజ్రపుకొత్తూరు , మెట్టూరు ఉన్నాయి. అలాగే బారువ సెక్షన్‌లో 5 ఉండగా వీటిలో కళింగపట్నం, గడ్డివూరు, బట్టి గళ్లూరు, బారువ ఇసువానిపాలెం లు ఉన్నాయి. కవిటి సెక్షన్‌లో 3 ఉండగా అందులో డొంకూరు, చేపల కపాసుకుద్ది, బట్టివానిపాలెం , శ్రీకాకుళం సెక్షన్‌లో కొచ్చెర్ల, గంగులవానిపేట, టెక్కలి సెక్షన్‌లో గుల్లవానిపేట, కుముందివానిపేట, మేఘవరం, భావనపాడు తీరాల్లో సంరక్షణ కేంద్రాలున్నాయి. అరుదైన జాతులు కాపాడుకోవాలి. సముద్ర జీవుల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు అరుదైనవి. ఈ జాతిని కాపాడుకోవాలని గుడ్లను సేకరించి సంరక్షిస్తున్నాం.
– కె.సోమేశ్వరరావు,
ట్రీ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్
వలంటీర్ల సాయంతో..
తీరంలోని తాబేళ్ల గుడ్లను వలంటీర్ల సాయంతో సేకరించి హాచరీల్లో పెడుతున్నాం. ఇక్కడ పిల్లలను మళ్లీ సముద్రంలోకి విడిచి పెట్టి తాబేళ్ల జాతిని కాపాడుతున్నాం.
– రజనీకాంత్,
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాశీబుగ్గ రేంజ్
Comments
Please login to add a commentAdd a comment