గుడ్లు పొదిగేందుకు తీరానికి వస్తున్న క్రమంలో మృత్యువాత
తీరాల్లో కలవరపెడుతున్న కళేబరాలు
ఆవేదన వ్యక్తంచేస్తున్న పర్యావరణ ప్రేమికులు
వజ్రపుకొత్తూరు రూరల్: మానవ తప్పిదాలు, సముద్ర జల కాలుష్యం అరుదైన ఆలీవ్ రిడ్లే తాబేళ్ల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. సముద్ర జీవులలో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు వేల మైళ్లు దూరం ప్రయాణంచేసి తమ సంతతిని వృద్ధిచేసేందుకు తీరాలకు వచ్చి గుడ్లు పొదిగి మళ్లీ లోపలకు వెళ్లిపోతాయి.
అయితే, అదే సమయంలో మరబోట్లకు ఉన్న రంపాలు, వలలకు తాబేళ్లు తగిలి ప్రమాదాల బారినపడుతున్నాయి. తీవ్రంగా గాయపడిన తాబేళ్లు మృత్యువాత పడుతూ వాటి కళేబరాలు సముద్ర తీరాలకు కొట్టుకొస్తున్నాయి. దీంతో సరదాగా గడుపుదామని వచ్చే పర్యాటకులకు, పర్యావరణ ప్రేమికులకు తీరంలో తాబేళ్ల కళేబరాలు కలవరపెడుతున్నాయి.
సంతానోత్పత్తికి వస్తూ మృత్యువాత..
ఆలివ్ రిడ్లే తాబేళ్లు న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, జపాన్, వెనిజులా తదితర దేశాలతో పాటు మనకు నాటికల్ మైళ్ల దూరంలో గంగమ్మ ఒడిలో ఒదిగి ఉంటున్నాయి. అయితే, ఈ తాబేళ్లు వాటి సంతానోత్పత్తి కోసం సముద్ర జలాల్లో వేల మైళ్ల దూరం ప్రయాణించి గుడ్లు పెట్టేందుకు అనువైన సముద్ర తీరాలకు చేరుకుంటాయి.
ఇసుక తిన్నెలలో ఒక్కో తాబేలు 30 నుంచి 140 వరకు గుడ్లను పొదిగి మళ్లీ సముద్ర జలాల్లోకి జారుకుంటాయి. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో విశాలమైన సముద్ర తీరం ఉంది. దీంతో వేలాది సంఖ్యలో తాబేళ్లు ఇక్కడ గుడ్లు పొదుగుతాయి.
జిల్లాలోని రట్టి, డొంకూరు, బారువ, గంగులవానిపేట, మెట్టూరు, గడ్డివూరు, ఇసుకవానిపాలెం, గుణుపల్లి, అక్కుపల్లి, డోకులపాడు, చినకొత్తూరు, నువ్వలరేవు, మంచినీళ్లపేట, కంబాలరాయుడుపేట, బావనపాడు, హుకుంపేట, కళింగపట్నం తదితర తీరాలకు తాబేళ్లు చేరుకుని గుడ్లను పొదుగుతున్నాయి. ఇక్కడే ప్రమాదాలకు గురవుతున్నాయి.
అంతరించిపోతున్న సముద్ర జీవుల జాబితాలోకి..
అంతరించనున్న అరుదైన సముద్ర జీవులలో షార్క్‌లు, తిమింగలాల జాబితాలో నేడు ఆలివ్ రిడ్లే తాబేళ్లు కూడా చేరుతున్నాయి. సముద్ర జలాల్లో 1,000 వరకు బుల్లి తాబేళ్లను విడిచిపెడితే వాటిలో 1–5 వరకు మాత్రమే పెద్దవి అవుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాబేళ్లు తీరాలలో లక్షల సంఖ్యలో గుడ్లు పొదుగుతాయి. ఈ గుడ్లను అటవీశాఖాధికారులు, ట్రీ స్వచ్ఛంద సంస్థ కలిసి సేకరించి వాటిని హేచరీల్లో సంరక్షించి వేల సంఖ్యలో బుల్లి తాబేళ్లను సముద్ర జలాల్లోకి విడిచి పెడుతున్నారు.
వాటిలో వందల సంఖ్యలో తాబేళ్లు పెరిగి పెద్దవై మళ్లీ వాటి సంతానోత్పత్తికి కోసం తీరాలకు వస్తూ మృత్యువాత పడుతుండటంతో వాటి ఉనికి రానున్న రోజుల్లో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
యమపాశాలుగా వలలు, బోట్లు..
ఇక మెకనైజ్డ్ బోట్లు, పెలాజిక్, టోకు వలలకు చిక్కి ఈ తాబేళ్లు చనిపోతున్నాయి. అలాగే, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, విషపూరిత రసాయనాలు కూడా ఇవి అంతరించిపోవడానికి కారణాలే. అరుదైన సముద్ర జీవులను కాపాడాల్సిన అధికారులు చొరవ చూపకపోవడం వీటికి శాపంగా మారింది.
నిషేధ వలల వినియోగం వద్దు..
మత్స్యకారులు చేపల వేటలో నిషేధ వలలు, బోట్లను వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మత్య్సకార గ్రామాల్లో పర్యటించి నిషేధ సామగ్రిపై అవగాహన కల్పిస్తున్నాం. అలాగే, ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. – మురళీకృష్ణ నాయుడు, అటవీశాఖాధికారి, కాశీబుగ్గ రేంజ్, శ్రీకాకుళం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment