
తమకు పెన్షన్ అందడం లేదంటూ వృద్ధులు, వికలాంగుల ఆందోళన
శ్రీకాకుళం జిల్లా కోట»ొమ్మాళి మండలం కమలనాభపురంలో 8 మందికి బంద్
రెండు నెలలుగా నిలిపివేశారంటూ అధికారులను నిలదీసిన బాధితులు
మూకుమ్మడి సెలవులో ఎంపీడీవో, ఇన్‌చార్జి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి
పల్నాడు జిల్లా పొట్లూరులో 22 మందికి, పిచికలపాలెంలో 9మందికి నిలిపివేత
బాధితుల్లో ముగ్గురు ఆడపిల్లలున్న నిస్సహాయ వికలాంగుడు
టెక్కలి, శావల్యాపురం: పింఛనో రామచంద్రా అంటూ రాష్ట్రంలో లబ్ధిదారులు వేడుకుంటున్నారు.. నెలవారీగా తమకు రావాల్సిన పెన్షన్ ఆగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.. ఎప్పుడు ఇస్తారో తెలియక కలవరపడుతున్నారు.. కూటమి ప్రభుత్వం కట్ చేసేసిందని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడ్డాక నాలుగు లక్షల పింఛన్లను కట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం, పల్నాడు జిల్లా శావల్యాపురంలో నిరసనలకు దిగారు.
మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలోని కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురంలో వృద్ధులు దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణకు రెండు నెలలుగా పింఛన్ల పంపిణీ నిలిపేశారు. బాధితులు స్థానిక, జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా మంజూరు చేయలేదు. గురువారం మే నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో కొందరు గ్రామస్థులు బాధితులకు అండగా నిలిచి అధికారులను నిలదీశారు. గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తే అందరికీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఏ కారణాలు లేకుండా ఆపేసిన 8 మందికి.. పింఛను తొలగిస్తున్నట్లుగా నోటీసులిచ్చి, మిగతావారికి ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పింఛన్ల పంపిణీ జరగలేదు. చివరకు సచివాలయ సిబ్బంది విషయాన్ని ఈవోపీఆర్‌డీ ఆనందరావు దృష్టికి తీసుకువెళ్లి వెనుదిరిగారు.
గ్రామస్థులు, బాధితులు.. కోటబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ఈవోపీఆర్‌డీ చాంబర్‌లో బైఠాయించారు. ఆయన డీఆర్‌డీఏ అధికారులకు నివేదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తప్పించుకున్నారు. కాగా, రెండు నెలలుగా ఇదే మాట చెబుతున్నారని, ఇప్పుడు మూడో నెల పింఛన్ కూడా ఇవ్వకపోతే శాశ్వతంగా పింఛన్లకు దూరమవుతారంటూ లబ్ధిదారులు వాపోయారు.
కాగా, పింఛన్ల వ్యవహారం ప్రారంభమైనప్పటి నుంచి కోటబొమ్మాళి ఎంపీడీవో ఫణీంద్రకుమార్, ఇన్‌చార్జిగా వ్యవహరించిన సంతబొమ్మాళి ఎంపీడీవో జయంత్‌ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు మూకుమ్మడిగా సెలవులు పెట్టడం గమనార్హం. సంతబొమ్మాళి మండలం కోటపాడులో లింగూడు ఏకాశి అనే వృద్ధురాలికి పింఛను కట్ చేశారు. గ్రామ టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేయడంతో పింఛను నిలిచిపోయింది.
రెండు గ్రామాల్లో 31 మందికి
పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పొట్లూరులో 22 మందికి, పిచికలపాలెం గ్రామంలో 9 మందికి పింఛను కోత పెట్టారు. దీంతో లబ్ధిదారులు గురువారం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయ సూపరింటెండెంట్‌కు పిర్యాదు చేశారు. పొట్లూరు, పిచికలపాలెంలో పింఛనుదారుల నుంచి ఫిర్యాదు అందిందని, క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని శావల్యాపురం ఎంపీడీవో మీనా సీతారామయ్య తెలిపారు.
ముగ్గురు ఆడపిల్లల కుటుంబానికి పింఛనే ఆధారం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను. మూడు ఆపరేషన్లు చేశారు. ఎలాంటి పనులు చేయలేను. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నెలవారీగా వచ్చే రూ.6 వేల పింఛనుతోనే కుటుంబ పోషణ ఆధారపడి ఉంది. అధికారులు స్పందించి పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాథేయపడుతున్నా. – అమృతపూడి అలెగ్జాండర్ (పిచికలపాలెం, పింఛనుదారుడు)