తాబేళ్లను సంరక్షిస్తున్న డాక్టర్ సుప్రజ ధారిణి
సంరక్షణ
కుందేలు, తాబేలు కథలో తాబేలు మెల్లగా అయినా సరే రేస్ పూర్తి చేసి గెలుస్తుంది. కాని గెలవాలంటే తాబేళ్లు ఉండాలి కదా. కాలుష్యం వల్ల, వలలకు చిక్కుకుని, గుడ్లు పెట్టే ఏకాంతం కోల్పోయి.. సముద్ర తాబేళ్లు ప్రమాదంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో తాబేళ్ల సంరక్షణ కోసం పని చేస్తున్న డాక్టర్ సుప్రజ ధారిణి కృషి.
‘సముద్ర తీరానికి వెళ్లి చూస్తే అంతా ప్రశాంతం గా అనిపిస్తుంది. నీలి ఉపరితలం, ఒడ్డుకు వచ్చి వెళ్లే కెరటాలు... ఎంత బాగుందో కదా అని మనసు ఆహ్లాదపడుతుంది. కాని సముద్ర గర్భంలో ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. మనిషి చర్యల వల్ల సముద్రం లోపల ఎంత ధ్వంసమవుతోందో తెలుసుకోవాలి. జలధి పర్యావరణాన్ని కాపాడుకోవాలి’ అంటుంది డాక్టర్ సుప్రజ ధారిణి.
చెన్నైలో స్థిరపడ్డ ఈ తెలుగు పర్యావరణ కార్యకర్త ఇప్పడు సముద్ర తాబేళ్లకి రక్షకురాలిగా మారింది. లక్షలాది తాబేళ్లు మృత్యవాత పడకుండా తిరిగి సముద్రానికి చేరేలా చూడగలిగింది. చెన్నై తీరం, ఆంధ్రా తీరం, ఒడిశా తీరంలో ఆమె తయారు చేసిన దళాలు గస్తీ తిరుగుతూ తాబేళ్లను కాపాడుతున్నాయి.
అంతులేని విధ్వంసం
‘సముద్ర ఆరోగ్యం బాగుంటే మత్స్యకారుల జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే సముద్రమే వారి జీవనాధారం కాబట్టి. సముద్ర ఆరోగ్యం, అందులోని పర్యావరణం ఎలా ఉందో తెలియాలంటే తాబేళ్ల ఉనికి, వాటి జనాభా ఒక కొండ గుర్తు. ఎందుకంటే సముద్రగర్భంలో ఉండి నేల మీదకు వచ్చే ఏకైక జలచరం అదే. తాబేళ్లలో ఒక ముఖ్యలక్షణం ఏమిటంటే అవి గుడ్డు పగిలి ఏ నేల మీద ప్రాణం పోసుకున్నాయో ఆ నేలను గుర్తు పెట్టుకుని పెరిగి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే నేలకు వస్తాయి.
అంటే పుట్టింటికి వచ్చినట్టే. కాని అవి మనుషుల మీద నమ్మకంతో పెట్టిన గుడ్లను మత్స్యకారులు నిర్లక్ష్యం చేయడం నేను చూశాను. ఇక కుక్కలు దాడి చేసి గుడ్లు తవ్వుకుని తినేస్తాయి. కొన్ని పిల్లలు బయటకు తీసి ఆడుకుంటారు. వాటి వల్ల తాబేళ్ల సంఖ్య తగ్గి సముద్ర జీవ సమతుల్యత దెబ్బ తింటుంది. అందుకని మొదట మేము మత్స్యకారులను చైతన్యవంతం చేశాం. తాబేళ్లను కాపాడితే సముద్రం బాగుంటుంది.... సముద్రం బాగుంటే మీ జీవితాలు బాగుంటాయి అని చెప్పాం. వారిప్పుడు కార్యకర్తలుగా మారి తాబేళ్లను కాపాడుతున్నారు’ అని తెలిపింది సుప్రజ ధారిణి.
మచిలీపట్నం సొంతూరు
సుప్రజది మచిలీపట్నం. ముప్పై ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం చెన్నై తరలి వెళ్లింది. ఫిలాసఫీలో పిహెచ్‌డి చేసిన సుప్రజ చెన్నైలోనే ఒక ఆర్ట్ స్టుడియో స్థాపించుకుంది. అయితే 25 ఏళ్ల క్రితం ఆమె చెన్నైలోని నీలాంకరై బీచ్‌కు మార్నింగ్ వాక్‌కు వెళ్లినప్పుడు అక్కడ తాబేలు చచ్చిపడి ఉంది. దాపునే పిల్లలు తాబేలు గుడ్లు ఇసుక నుంచి బయటకు లాగి ఆడుకుంటూ ఉన్నారు. మత్స్యకారులు చూసినా వారించడం లేదు. ఇదంతా చూసి బాధపడింది సుప్రజ.
తాబేళ్లు వొడ్డుకొచ్చి పడి చనిపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించింది. ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు చేపల వలల వల్ల గాయపడి చనిపోతున్నాయని, వాటి గుడ్ల సంరక్షణ సరిగ్గా జరగక సంతతి తరిగిపోతున్నదని తెలుసుకుంది. మొదట మత్స్యకారుల్లో చైతన్యం తెచ్చి తర్వాత సమాజంలో మార్పు తేవాలని నిశ్చయించుకుంది. అలా 2002లో ఆమె తాబేళ్ల సంరక్షణ, సముద్ర పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా ‘ట్రీ ఫౌండేషన్’ అనే సంస్థను ప్రారంభించింది.
33 లక్షల తాబేలు పిల్లల రక్షణ
తమిళనాడులోని కంచి నుంచి ఒరిస్సాలోని గంజాం వరకు తీర ప్రాంతంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర తీర ప్రాంత సంరక్షణ, తాబేళ్ల గుడ్ల పరిరక్షణ, గాయపడిన తాబేళ్లకు చికిత్స చేసి మళ్లీ సముద్రంలో ఒదిలిపెట్టడం, గుడ్లకు గస్తీ కాయడం వంటి చర్యల కోసం గార్డ్‌లను ఏర్పాటు చేసింది సుప్రజ. ఇందుకు అవసరమైన గుర్తింపు కార్డులను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇప్పించగలిగింది.
కొందరికి గౌరవ భత్యాలు కూడా అందుతున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే సీజన్‌లో వాటిని ఒకచోట చేర్చి వెదురు దడి కట్టి కాపాడటం వల్ల ఈ ఇరవై ఏళ్లలో దాదాపు 33 లక్షల గుడ్లు పొదగబడి తాబేళ్లు పిల్లలుగా సముద్రంలో చేరాయంటే అది సుప్రజ, ఆమె సేన ప్రయత్నం వల్లే. ‘సముద్రానికి నేలకూ ఉన్న అనుబంధం విడదీయరానిది. నేల మీద నివసించేవాళ్లమే సముద్రాన్ని కాపాడుకోవాలి’ అంటోంది సుప్రజ.
Comments
Please login to add a commentAdd a comment