పూర్ణబొందా తీరంలో మృతి చెందిన తాబేళ్లు చూస్తున్న గ్రామస్తులు
ప్రపంచలోనే అత్యంత అరుదైన సముద్రపు తాబేళ్లుగా పిలవబడే ఆలివ్‌రిడ్లేల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్ర జలాలను శుద్ధిచేసి, పర్యావరణాన్ని కాపాడడంలో తోడ్పడుతున్న వీటి సంరక్షణ కరువైంది. ఏటా గంజాం జిల్లా సాగర తీరంలో మైటింగ్(సంగమం)కి వచ్చే వీటిని కాపాడేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇవి ఈసారి ఆశించినంత స్థాయిలో లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి జిల్లాలోని పలు తీర ప్రాంతాల్లో కనిపిస్తున్న ఆలివ్‌రిడ్లేల కళేబరాలే నిదర్శనం.
బరంపురం (ఒడిశా): గంజాం జిల్లాలోని రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖద్వారం ఆలివ్‌రిడ్లేల సంతానాభివృద్ధికి మంచి ఆవాసం. దేశ వ్యాప్తంగా ఉన్న 3 అనువైన ప్రదేశాలకు మాత్రమే ఇవి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరీ సంగమిస్తుండడం విశేషం. ఏటా నవంబరులో వీటి మైటింగ్(సంగమం)తో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ గుడ్లు పెట్టడం, ఆ తర్వాత వాటిని పొదగడం వంటి ప్రక్రియలు జనవరి, ఫిబ్రవరి నెలల వరకు నిరవధికంగా సాగుతుంది. అయితే ఈ తాబేళ్ల పిల్లలు సముద్రంలోకి ఏ మార్గాన వెళ్తాయో అవి పెద్దవైన తర్వాత గుడ్లు పెట్టేందుకు కూడా అదే స్థావరానికి రావడం వీటి ప్రత్యేకత.
ఇప్పుడు గంజాం జిల్లాలోని గోపాలపూర్, పూర్ణబొందా సాగర తీరాల్లో ఎక్కడికక్కడ ఒడ్డుకు చేరుకున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి ఏటా చేరుకుంటున్న వీటికి రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇటువంటి దృశ్యాలు తారసపడడం పర్యావరణ హితులను కలవరపరుస్తోంది. ఇటీవల ఆలివ్‌రిడ్లేల రాక నేపథ్యంలో తీరం నుంచి లోపలికి 10 కిలోమీటర్ల మేర చేపల వేట నిషేధిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ఉత్వర్వులు జారీ చేసింది. ఫిషింగ్ బోట్లతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది.
చదవండి: (AP PGCET: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల)
తీరంలోని కళేబరాలను పీక్కుతింటున్న శునకాలు
సంప్రదాయ వలలతో వేటకు ఓకే..
మత్స్యకారులు జీవనోపాధి కోల్పోకుండా సంప్రదాయ వలలతో వేట కొనసాగించుకోవచ్చని అవకాశం కల్పించింది. తీరంలో నిబంధనలను ఎవ్వరూ అతిక్రమించకుండా అధికారులను సైతం అధికార యంత్రాంగం నియమించింది. అయితే రెండు రోజులుగా అధికారుల జాడ కొరవడడంతో కొంతమంది సముద్రంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే సాహసం చేస్తున్నారు. ఈక్రమంలో ట్రాలీల వినియోగంతో మైటింగ్‌లో ఉన్న తాబేళ్లు చనిపోతున్నాయి.
ముఖ్యంగా ఫిషింగ్ బోట్ల చక్రాలు తాబేళ్లను ఢీకొనడం, సముద్రంలోకి చేరే ఆక్వా రసాయనాలతో ఇవి చనిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖ ద్వారంలోని నిషేధిత ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విశాఖపట్నం, కాకినాడ ఓడరేవుల నుంచి కొంతమంది వేట జరపడంతో ఇక్కడి మైటింగ్‌లోని ఆలివ్‌రిడ్లేలు చనిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి, ఆపదలో ఉన్న తాబేళ్ల పరిరక్షణకు చర్యలను కట్టుదిట్టం చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పొదిగే సమయం 45 రోజులు..
సంతానాభివృద్ధికి ఏటా నవంబరులో తీరానికి చేరే తాబేళ్లు మైటింగ్ అనంతరం గుడ్లు పెడతాయి. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో తీరంలోని ప్రత్యేక గుంతల్లో భద్రపరిచిన గుడ్లును పొదుగుతాయి. దీనికి 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. వీటి సంరక్షణకు ట్రీ ఫౌండేషన్, బయోవర్సిటీ కన్జర్వేషన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుండగా, ఆలివ్‌రిడ్లే ఒక్కొక్కటి 3 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, దాదాపు 45 కిలోల బరువు ఉంటుంది.
చదవండి: (KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు)
ఆక్సిజన్ పెంచడంలో కీలకం..
ఆలివ్‌రిడ్లే తాబేళ్లు సముద్ర జలాల్లోని వివిధ వ్యర్థాలను తిని, సముద్రం కలుషితం కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా సముద్ర జీవరాశులను అంతరించిపోకుండా ఇవి పరిరక్షిస్తున్నాయి. సముద్రంలో ఆక్సిజన్ పెంచడంలో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరంలో ఓ రకమైన జెల్‌ని విడుదల చేస్తాయి. అది భూమిలో బంకలా అతుక్కుపోయి విపత్తుల సమయంలో తీరం కోతకు గురికాకుండా నివారిస్తుంది. ఇలా అనేక ఉపయోగాలున్న వీటి సంరక్షణ నేడు గాల్లో దీపంగా మారింది.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏం చెబుతోంది..
వణ్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం తాబేళ్లను షెడ్యూల్–1లో పొందుపరిచి, ప్రత్యేక రక్షణ కల్పించారు. పర్యావరణాన్ని కాపాడే సముద్రపు తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కొందరు సముద్రంలోకి వ్యర్థాలను వదిలిపెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా మరబోట్లు నడపడం వల్ల తాబేళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. అలాగే తాబేళ్లను ఎవరైనా తిన్నా, చంపినా, వాటి ఆవాసాలను నాశనం చేసినా శిక్షార్హులు. నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment