Sea turtles
-
Dr Supraja Dharini: తాబేలు గెలవాలి
కుందేలు, తాబేలు కథలో తాబేలు మెల్లగా అయినా సరే రేస్ పూర్తి చేసి గెలుస్తుంది. కాని గెలవాలంటే తాబేళ్లు ఉండాలి కదా. కాలుష్యం వల్ల, వలలకు చిక్కుకుని, గుడ్లు పెట్టే ఏకాంతం కోల్పోయి.. సముద్ర తాబేళ్లు ప్రమాదంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో తాబేళ్ల సంరక్షణ కోసం పని చేస్తున్న డాక్టర్ సుప్రజ ధారిణి కృషి. ‘సముద్ర తీరానికి వెళ్లి చూస్తే అంతా ప్రశాంతం గా అనిపిస్తుంది. నీలి ఉపరితలం, ఒడ్డుకు వచ్చి వెళ్లే కెరటాలు... ఎంత బాగుందో కదా అని మనసు ఆహ్లాదపడుతుంది. కాని సముద్ర గర్భంలో ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. మనిషి చర్యల వల్ల సముద్రం లోపల ఎంత ధ్వంసమవుతోందో తెలుసుకోవాలి. జలధి పర్యావరణాన్ని కాపాడుకోవాలి’ అంటుంది డాక్టర్ సుప్రజ ధారిణి. చెన్నైలో స్థిరపడ్డ ఈ తెలుగు పర్యావరణ కార్యకర్త ఇప్పడు సముద్ర తాబేళ్లకి రక్షకురాలిగా మారింది. లక్షలాది తాబేళ్లు మృత్యవాత పడకుండా తిరిగి సముద్రానికి చేరేలా చూడగలిగింది. చెన్నై తీరం, ఆంధ్రా తీరం, ఒడిశా తీరంలో ఆమె తయారు చేసిన దళాలు గస్తీ తిరుగుతూ తాబేళ్లను కాపాడుతున్నాయి. అంతులేని విధ్వంసం ‘సముద్ర ఆరోగ్యం బాగుంటే మత్స్యకారుల జీవితాలు బాగుంటాయి. ఎందుకంటే సముద్రమే వారి జీవనాధారం కాబట్టి. సముద్ర ఆరోగ్యం, అందులోని పర్యావరణం ఎలా ఉందో తెలియాలంటే తాబేళ్ల ఉనికి, వాటి జనాభా ఒక కొండ గుర్తు. ఎందుకంటే సముద్రగర్భంలో ఉండి నేల మీదకు వచ్చే ఏకైక జలచరం అదే. తాబేళ్లలో ఒక ముఖ్యలక్షణం ఏమిటంటే అవి గుడ్డు పగిలి ఏ నేల మీద ప్రాణం పోసుకున్నాయో ఆ నేలను గుర్తు పెట్టుకుని పెరిగి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే నేలకు వస్తాయి. అంటే పుట్టింటికి వచ్చినట్టే. కాని అవి మనుషుల మీద నమ్మకంతో పెట్టిన గుడ్లను మత్స్యకారులు నిర్లక్ష్యం చేయడం నేను చూశాను. ఇక కుక్కలు దాడి చేసి గుడ్లు తవ్వుకుని తినేస్తాయి. కొన్ని పిల్లలు బయటకు తీసి ఆడుకుంటారు. వాటి వల్ల తాబేళ్ల సంఖ్య తగ్గి సముద్ర జీవ సమతుల్యత దెబ్బ తింటుంది. అందుకని మొదట మేము మత్స్యకారులను చైతన్యవంతం చేశాం. తాబేళ్లను కాపాడితే సముద్రం బాగుంటుంది.... సముద్రం బాగుంటే మీ జీవితాలు బాగుంటాయి అని చెప్పాం. వారిప్పుడు కార్యకర్తలుగా మారి తాబేళ్లను కాపాడుతున్నారు’ అని తెలిపింది సుప్రజ ధారిణి. మచిలీపట్నం సొంతూరు సుప్రజది మచిలీపట్నం. ముప్పై ఏళ్ల క్రితం వాళ్ల కుటుంబం చెన్నై తరలి వెళ్లింది. ఫిలాసఫీలో పిహెచ్డి చేసిన సుప్రజ చెన్నైలోనే ఒక ఆర్ట్ స్టుడియో స్థాపించుకుంది. అయితే 25 ఏళ్ల క్రితం ఆమె చెన్నైలోని నీలాంకరై బీచ్‌కు మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు అక్కడ తాబేలు చచ్చిపడి ఉంది. దాపునే పిల్లలు తాబేలు గుడ్లు ఇసుక నుంచి బయటకు లాగి ఆడుకుంటూ ఉన్నారు. మత్స్యకారులు చూసినా వారించడం లేదు. ఇదంతా చూసి బాధపడింది సుప్రజ. తాబేళ్లు వొడ్డుకొచ్చి పడి చనిపోవడానికి కారణాలు తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించింది. ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు చేపల వలల వల్ల గాయపడి చనిపోతున్నాయని, వాటి గుడ్ల సంరక్షణ సరిగ్గా జరగక సంతతి తరిగిపోతున్నదని తెలుసుకుంది. మొదట మత్స్యకారుల్లో చైతన్యం తెచ్చి తర్వాత సమాజంలో మార్పు తేవాలని నిశ్చయించుకుంది. అలా 2002లో ఆమె తాబేళ్ల సంరక్షణ, సముద్ర పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా ‘ట్రీ ఫౌండేషన్’ అనే సంస్థను ప్రారంభించింది. 33 లక్షల తాబేలు పిల్లల రక్షణ తమిళనాడులోని కంచి నుంచి ఒరిస్సాలోని గంజాం వరకు తీర ప్రాంతంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర తీర ప్రాంత సంరక్షణ, తాబేళ్ల గుడ్ల పరిరక్షణ, గాయపడిన తాబేళ్లకు చికిత్స చేసి మళ్లీ సముద్రంలో ఒదిలిపెట్టడం, గుడ్లకు గస్తీ కాయడం వంటి చర్యల కోసం గార్డ్లను ఏర్పాటు చేసింది సుప్రజ. ఇందుకు అవసరమైన గుర్తింపు కార్డులను తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇప్పించగలిగింది. కొందరికి గౌరవ భత్యాలు కూడా అందుతున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే సీజన్లో వాటిని ఒకచోట చేర్చి వెదురు దడి కట్టి కాపాడటం వల్ల ఈ ఇరవై ఏళ్లలో దాదాపు 33 లక్షల గుడ్లు పొదగబడి తాబేళ్లు పిల్లలుగా సముద్రంలో చేరాయంటే అది సుప్రజ, ఆమె సేన ప్రయత్నం వల్లే. ‘సముద్రానికి నేలకూ ఉన్న అనుబంధం విడదీయరానిది. నేల మీద నివసించేవాళ్లమే సముద్రాన్ని కాపాడుకోవాలి’ అంటోంది సుప్రజ. -
Soumya Ranjan Biswal: సాగర తీరాన సైన్యమై కదులుతున్నాడు
చిన్నప్పుడు చందమామ కథలతో పాటు సముద్రపు తాబేళ్ల కష్టాల కథలు కూడా విన్నాడు ఒడిషాకు చెందిన సౌమ్య రాజన్ బిస్వాల్. ప్రమాదం అంచున ఉన్న తాబేళ్ల స్థితి గురించి ‘అయ్యో!’ అనుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు సౌమ్య రాజన్. తానే ఒక ఉద్యమమై, సైన్యమై బలమైన అడుగులు వేస్తున్నాడు... చిన్నప్పుడు స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పే హుషారైన కథలు వినేవాడు సౌమ్య రాజన్ బిస్వాల్. దీంతో పాటు పర్యావరణ సంబంధిత అంశాలలో భాగంగా సముద్రపు తాబేళ్ల గురించి కూడా వినేవాడు. ఎన్నో కథల్లో తాబేలు మనకు సుపరిచిత ఫ్రెండు. అయితే వాస్తవప్రపంచంలో వాటి పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రతి 7 జాతులలో 3 జాతులు అంతరించబోయే ప్రమాదకర పరిస్థితులలో ఉన్నాయి. తాబేళ్లకు ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల గురించి విన్న తరువాత తన వంతుగా ఏదైనా చేయాలని బలంగా అనుకున్నాడు సౌమ్య. అప్పటికింకా తాను హైస్కూల్ విద్యార్థి. రోజూ పెద్ద సంచిని భుజాన వేసుకొని పూరీ జిల్లాలోని అస్తరంగ బీచ్‌కు వెళ్లేవాడు. ప్లాస్లిక్ట్ సంచులు, వాటర్ బాటిల్స్, ఖాళీ సీసాలను ఆ సంచిలో వేసుకొని వచ్చేవాడు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెట్టిన గుడ్లు నక్కలు, కుక్కలు, ఇతర జంతువుల పాలు కాకుండా రక్షించేవాడు. ఆ తరువాత సౌమ్య రాజన్‌కు స్నేహితులు కూడా తోడయ్యారు. కాలేజీరోజుల విషయానికి వస్తే, ప్రతి ఆదివారం పర్యావరణ విషయాలపై ఊరూవాడా సైకిల్‌యాత్ర నిర్వహించేవాడు. పర్యావరణ నేస్తాలైన తాబేళ్లను రక్షించుకోవాల్సిన ఆవశక్యత గురించి జాలర్లకు చెప్పేవాడు. పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలను విస్తృతం చేయడం కోసం ‘ఒడిషా పర్యావరణ్ సంఘర్షణ్ అభియాన్’ అనే స్వచ్ఛందసంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా వందమందితో ఒక సైన్యాన్ని తయారుచేశాడు సౌమ్య రాజన్. చుట్టు పక్కల ఎన్నో జిల్లాలకు వెళ్లి ఈ సైన్యం పర్యావరణ అంశాలపై ప్రచారం నిర్వహిస్తోంది. ‘యూఎన్ ఇండియా యువ అడ్వకేట్స్’లో ఒకరిగా గుర్తింపు పొందిన 27 సంవత్సరాల సౌమ్య రాజన్ బిస్వాల్ ఎజెండాలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం కూడా చేరింది. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత గురించి గిరిజనుల దగ్గరికి వెళ్లి ప్రచారం చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ వికాస కోణంలో తన మనసులోని భావాలకు అక్షర రూపం ఇస్తుంటాడు సౌమ్య రాజన్. మచ్చుకు ఒకటి... ‘గతంలో చేసిన తప్పుల నుంచి బయటికి రండి. కొత్త ప్రయాణం ప్రారంభించండి. కొత్త ప్రయాణానికి ప్రతిరోజూ ఒక అపురూప అవకాశమే’. -
రండి రండి.. అరుదైన అతిథులు వస్తున్నారోచ్!
ఎల్లలు లేని సాగరంలో జీవించే ఉభయచర జీవులు వడివడిగా పుట్టింటి వైపు అడుగులు వేస్తున్నాయి. అరుదైన ఈ అతిథుల ఆగమనంతో రుషికుల్య తీరం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ సంతానవృద్ధికి అర్ధరాత్రి దాటిన తరువాత తీరానికి చేరుకుంటున్న ఆలివ్‌రిడ్లేలు.. గుడ్లు పెట్టి, వాటిని ఇసుకలో భద్ర పరిచిన అనంతరం సంద్రంలోకి తిరిగి చేరుకుంటున్నాయ. వీటి రాకతో తీరమంతా సందడి నెలకొంది. – భువనేశ్వర్ భువనేశ్వర్: గుడ్లు పెట్టేందుకు ఏటా రుషికుల్య తీరానికి ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అతిథులుగా విచ్చేయడం పర్యావరణ ప్రియులకు ఆహ్లాదపరుస్తోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 5,48,768 తాబేళ్లు ఈ తీరానికి చేరడం విశేషం. 2018లో అత్యధికంగా 4,82,128 ఆలివ్‌రిడ్లే ఈ ప్రాంతానికి విచ్చేశాయి. మార్చి 27 నుంచి రుషికుల్య తీరంలో తాబేళ్లు గుడ్లు పొదగడం ప్రారంభమైంది. ఈనెల 3తో ముగిసిందని డీఎఫ్ఓ అమ్లాన్ నాయక్ తెలిపారు. మరో 45 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక జాగ్రత్తలు.. అపురూపమైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఆగమనం పురస్కరించుకుని రుషికుల్య తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సువిశాల తీరాన్ని 50 సెగ్మెంట్లుగా విభజించారు. గుడ్లు పెట్టేందుకు అనుకూలమైన పర్యావరణంతో ఈ సెగ్మెంట్లు ఏర్పాటు చేయడం విశేషం. తాబేళ్ల గుడ్లని కుక్కలు, కాకులు, ఇతర పక్షలు నష్ట పరచకుండా ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. పొదిగిన గుడ్లు నుంచి బయటపడిన ఆలివ్ రిడ్లే తాబేళ్ల కొత్త సంతతి సురక్షితంగా తిరిగి సముద్ర గర్భానికి వెళ్లేంత వరకు ఈ కార్యాచరణ నిరవధికంగా కొనసాగుతుందని డీఎఫ్ఓ వివరించారు. చదవండి: కట్నంతో లాభాలెన్నో! -
తాబేలు.. గుండె గుభేలు
ఏదో బాడీ బిల్డర్ పోటీల్లో తాబేలు తన కండలు చూపిస్తున్నట్టుంది గదా ఫొటో చూస్తుంటే. ఎదురుగా ఉన్నవాళ్లు భయపడిపోయేలా కోపంగా చూస్తోంది కదా. ఇదో గ్రీన్ సీ టర్టల్. గాలపగోస్లో ట్రిప్‌లో ఉండగా ఇటాలియన్ ఫొటోగ్రాఫర్ డానియెలె కొమిన్ దీని ఫొటో తీశారు. ‘సముద్రంలోకి హామర్హెడ్స్ షార్క్‌ల ఫొటోలు తీయడానికని కొమిన్ బయలుదేరా. అది మిట్టమధ్యాహ్నం సమయం. కెమెరా సెట్ చేసుకుని డైవ్ చేశా. ఆ నీళ్లు పచ్చగా ఉన్నాయి. వెలుతురు సరిగా లేదు. సరైన ఫొటోల కోసం కెమెరాను సరి చేయడానికి చాలా సమయం పట్టింది’ అని తన కష్టాన్ని వివరించారు ఫొటోగ్రాఫర్. -
ఆపదలో ఆలివ్.. తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లేల కళేబరాలు!
ప్రపంచలోనే అత్యంత అరుదైన సముద్రపు తాబేళ్లుగా పిలవబడే ఆలివ్‌రిడ్లేల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్ర జలాలను శుద్ధిచేసి, పర్యావరణాన్ని కాపాడడంలో తోడ్పడుతున్న వీటి సంరక్షణ కరువైంది. ఏటా గంజాం జిల్లా సాగర తీరంలో మైటింగ్(సంగమం)కి వచ్చే వీటిని కాపాడేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇవి ఈసారి ఆశించినంత స్థాయిలో లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి జిల్లాలోని పలు తీర ప్రాంతాల్లో కనిపిస్తున్న ఆలివ్‌రిడ్లేల కళేబరాలే నిదర్శనం. బరంపురం (ఒడిశా): గంజాం జిల్లాలోని రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖద్వారం ఆలివ్‌రిడ్లేల సంతానాభివృద్ధికి మంచి ఆవాసం. దేశ వ్యాప్తంగా ఉన్న 3 అనువైన ప్రదేశాలకు మాత్రమే ఇవి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరీ సంగమిస్తుండడం విశేషం. ఏటా నవంబరులో వీటి మైటింగ్(సంగమం)తో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ గుడ్లు పెట్టడం, ఆ తర్వాత వాటిని పొదగడం వంటి ప్రక్రియలు జనవరి, ఫిబ్రవరి నెలల వరకు నిరవధికంగా సాగుతుంది. అయితే ఈ తాబేళ్ల పిల్లలు సముద్రంలోకి ఏ మార్గాన వెళ్తాయో అవి పెద్దవైన తర్వాత గుడ్లు పెట్టేందుకు కూడా అదే స్థావరానికి రావడం వీటి ప్రత్యేకత. ఇప్పుడు గంజాం జిల్లాలోని గోపాలపూర్, పూర్ణబొందా సాగర తీరాల్లో ఎక్కడికక్కడ ఒడ్డుకు చేరుకున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి ఏటా చేరుకుంటున్న వీటికి రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇటువంటి దృశ్యాలు తారసపడడం పర్యావరణ హితులను కలవరపరుస్తోంది. ఇటీవల ఆలివ్‌రిడ్లేల రాక నేపథ్యంలో తీరం నుంచి లోపలికి 10 కిలోమీటర్ల మేర చేపల వేట నిషేధిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ఉత్వర్వులు జారీ చేసింది. ఫిషింగ్ బోట్లతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. చదవండి: (AP PGCET: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల) తీరంలోని కళేబరాలను పీక్కుతింటున్న శునకాలు సంప్రదాయ వలలతో వేటకు ఓకే.. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోకుండా సంప్రదాయ వలలతో వేట కొనసాగించుకోవచ్చని అవకాశం కల్పించింది. తీరంలో నిబంధనలను ఎవ్వరూ అతిక్రమించకుండా అధికారులను సైతం అధికార యంత్రాంగం నియమించింది. అయితే రెండు రోజులుగా అధికారుల జాడ కొరవడడంతో కొంతమంది సముద్రంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే సాహసం చేస్తున్నారు. ఈక్రమంలో ట్రాలీల వినియోగంతో మైటింగ్లో ఉన్న తాబేళ్లు చనిపోతున్నాయి. ముఖ్యంగా ఫిషింగ్ బోట్ల చక్రాలు తాబేళ్లను ఢీకొనడం, సముద్రంలోకి చేరే ఆక్వా రసాయనాలతో ఇవి చనిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖ ద్వారంలోని నిషేధిత ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విశాఖపట్నం, కాకినాడ ఓడరేవుల నుంచి కొంతమంది వేట జరపడంతో ఇక్కడి మైటింగ్లోని ఆలివ్‌రిడ్లేలు చనిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి, ఆపదలో ఉన్న తాబేళ్ల పరిరక్షణకు చర్యలను కట్టుదిట్టం చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొదిగే సమయం 45 రోజులు.. సంతానాభివృద్ధికి ఏటా నవంబరులో తీరానికి చేరే తాబేళ్లు మైటింగ్ అనంతరం గుడ్లు పెడతాయి. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో తీరంలోని ప్రత్యేక గుంతల్లో భద్రపరిచిన గుడ్లును పొదుగుతాయి. దీనికి 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. వీటి సంరక్షణకు ట్రీ ఫౌండేషన్, బయోవర్సిటీ కన్జర్వేషన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుండగా, ఆలివ్‌రిడ్లే ఒక్కొక్కటి 3 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, దాదాపు 45 కిలోల బరువు ఉంటుంది. చదవండి: (KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు) ఆక్సిజన్ పెంచడంలో కీలకం.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లు సముద్ర జలాల్లోని వివిధ వ్యర్థాలను తిని, సముద్రం కలుషితం కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా సముద్ర జీవరాశులను అంతరించిపోకుండా ఇవి పరిరక్షిస్తున్నాయి. సముద్రంలో ఆక్సిజన్ పెంచడంలో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరంలో ఓ రకమైన జెల్‌ని విడుదల చేస్తాయి. అది భూమిలో బంకలా అతుక్కుపోయి విపత్తుల సమయంలో తీరం కోతకు గురికాకుండా నివారిస్తుంది. ఇలా అనేక ఉపయోగాలున్న వీటి సంరక్షణ నేడు గాల్లో దీపంగా మారింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏం చెబుతోంది.. వణ్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం తాబేళ్లను షెడ్యూల్–1లో పొందుపరిచి, ప్రత్యేక రక్షణ కల్పించారు. పర్యావరణాన్ని కాపాడే సముద్రపు తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కొందరు సముద్రంలోకి వ్యర్థాలను వదిలిపెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా మరబోట్లు నడపడం వల్ల తాబేళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. అలాగే తాబేళ్లను ఎవరైనా తిన్నా, చంపినా, వాటి ఆవాసాలను నాశనం చేసినా శిక్షార్హులు. నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. -
బుడిబుడి అడుగులు బాపట్లలో..
సాక్షి, అమరావతి బ్యూరో/బాపట్ల టౌన్ : సముద్ర తాబేళ్లుగా పిలిచే ‘ఆలీవ్ రిడ్లే’ జాతిని సంరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాపట్ల తీరంలోని సూర్యలంక బీచ్‌లో ఇప్పటికే 8 వేలకు పైగా ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్లను సేకరించారు. వాటిని పొదిగించి 6 వేల పిల్లలను సముద్రంలోకి వదిలిపెట్టారు. మరో 2 వేల గుడ్లను పొదిగించే పనిలో ఉన్నారు. ఈ తాబేళ్లు సముద్ర గర్భంలోని పాచి, పిచ్చి మొక్కలు, జెల్లీ ఫిష్, ఇతర వ్యర్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చూస్తాయి. మత్స్య సంపదను పెంపొందించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూ మత్స్యకారులకు జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన, పర్యావరణ నేస్తాలైన ఈ జాతి తాబేళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్రంలో భారీగా కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, పెద్దబోట్ల రాకపోకల వల్ల నలిగిపోవడం, వాటి గుడ్లను నక్కలు, కుక్కలు వంటివి తినేయడం వంటి కారణాల వల్ల వాటి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. దీంతో ఈ జాతిని సంరక్షించేందుకు ఆటవీ శాఖ అధికారులు బాపట్ల డివిజన్ పరిధిలోని సూర్యలంక, నిజాం పట్నం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సంరక్షణ కేంద్రాల ఏర్పాటుతో.. అనువైన పరిస్థితులు ఉండటంతో ఆలివ్ రిడ్లే తాబేళ్లు రేపల్లె రేంజ్ పరిధిలోని బాపట్ల, నిజాంపట్నం తీరాలకు ఏటా వలస వచ్చి గుడ్లు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఆటవీ శాఖ 2020 డిసెంబర్లో సూర్యలంక, నిజాంపట్నం తీరాల్లో తాబేళ్ల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ రెండుచోట్లా హేచరీలను నెలకొల్పి మత్స్యకారులను కూలీలుగా నియమించింది. ఈ తాబేళ్లు అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల మధ్య ఒడ్డుకు చేరతాయి. తీరంలోని ఇసుక తిన్నెల్లో గుంతలు తీసి గుడ్లు పెట్టి.. వాటిని ఇసుక మూసివేసి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఇసుక తిన్నెల్లో తాబేళ్ల అడుగు జాడలను మత్స్యకారులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. వాటి గుడ్లను సేకరించి హేచరీలకు తరలిస్తుంటారు. గతంలో సముద్ర తాబేళ్ల గుడ్లను నక్కలు, కుందేళ్లు, కుక్కలు వంటివి తింటూ ఉండేవి. దీనివల్ల ఆ జాతి తాబేళ్ల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. వీటి బారినుంచి సంరక్షించేందుకు అటవీ శాఖ నడుం కట్టడంతో ఆ జాతి మనుగడకు అవకాశం ఏర్పడింది. తీరం నుంచి సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్ల పిల్లలు మత్స్యకారులకు వరం ఈ తాబేళ్ళు సముద్రంలోని చేపలకు హాని కలిగించే జెల్లీ ఫిష్‌ను తిని మత్స్య సంపద పెరుగుదలకు సహకరిస్తుంది. చేపల వేట సమయంలో జెల్లీ ఫిష్ మత్స్యకారుల వలలకు తగిలితే వాటి పోగులు దెబ్బతింటాయి. ఆ పోగులు తగిలితే మత్స్యకారులకు జ్వరం, శరీరమంతా నొప్పులతో అనారోగ్యం పాలవుతుంటారు. ఇంతటి ప్రమాదకరమైన జెల్లీ ఫిష్‌ను తినే శక్తి ఒక్క ఆలివ్ రిడ్లే తాబేళ్లకు మాత్రమే ఉంది. సముద్రంలో అలజడి నెలకొన్నప్పుడు ఈ తాబేళ్లు వాతావరణ పరిస్థితులను ముందుగానే పసిగట్టి తీరానికి చేరుకుంటాయి. వీటి రాకను గమనించిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం మానుకుంటారు. చేపలు గుడ్లు పెట్టే సమయంలో సముద్రంలో పేరుకుపోయిన వ్యర్థాలు వాటికి అడ్డుపడుతుంటాయి. అలాంటి వ్యర్థాలను తాబేళ్లు భుజించి చేపల పునరుత్పత్తికి దోహదం చేస్తాయి. సముద్రంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కూడా ఈ తాబేళ్లు ఎంతగానో దోహదపడతాయి. సంరక్షించేందుకే హేచరీలు ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్ల సంతతిని అభివృద్ధి చేసేందుకు డీఎఫ్‌వో రామచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేక హేచరీలు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 8 వేలకు పైగా గుడ్లను సేకరించాం. వాటిల్లో 6 వేల పిల్లలను సముద్రంలో ఇప్పటికే వదిలిపెట్టాం. మిగిలిన రెండు వేల గుడ్లు పొదిగే దశలో ఉన్నాయి. – జఫ్రుల్లా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, బాపట్ల వీటి జీవనం మత్స్యకారులకు వరం సముద్రంలో ఉండే జెల్లీ ఫిష్ వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ జాతి తాబేళ్లు సూర్యలంక తీరంలో సంచరిస్తున్నప్పటి నుంచి జెల్లీ ఫిష్ సమస్యల నుంచి మత్స్యకారులకు ఊరట లభిస్తోంది. ఈ తాబేళ్లు జీవనం మత్స్యకారులకు వరం. – కన్నా మామిడయ్య, డైరెక్టర్, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సంఘం, బాపట్ల -
సంద్రం ఒడిలోకి తాబేళ్ల పిల్లలు
ఇచ్ఛాపురం రూరల్: సముద్ర తాబేళ్లను రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని బూర్జపాడు సర్పంచ్ బుడ్డ మోహనాంగి అన్నారు. డొంకూరు మత్స్యకార గ్రామంలో ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక తీరం ఒడ్డున కొంత కాలంగా తాబేళ్ల గుడ్లను సేకరిస్తూ పిల్లలు పొదిగేంత వరకు వాటిని సంరక్షిస్తూ సముద్రంలో విడిచిపెడుతుండేవారు. శుక్రవారం రాత్రి సుమారు 300 తాబేళ్ల పిల్లలను ఆమె విడిచిపెట్టారు. వైఎస్సార్సీపీ నాయకుడు బుడ్డ కాంతారావు, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు చీకటి గురుమూర్తి, ట్రీ ఫౌండేషన్ సంరక్షకులు పాల్గొన్నారు. చదవండి: కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్స్ మాత్రం.. ఫలరాజు.. ఎగుమతుల్లో రారాజు -
సముద్రపు తాబేలు మనుగడ ప్రశ్నార్థకం
సముద్రపు తాబేలుగా పిలిచే అలివ్‌రిడ్లీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్ర జలాలను శుద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడుతున్న ఈ అలివ్‌రిడ్లీ తాబేళ్లు కడలి కలుషితం కారణంగా పదుల సంఖ్యలో చనిపోతున్నాయి. సముద్రంలో ఆక్వా రసాయనాలు అధికంగా కలుస్తుండడంతో ఈ తాబేళ్లు మృతిచెందుతున్నట్లు తెలుస్తోంది. సాక్షి, వాకాడు: వాకాడు మండల పరిధిలోని కొండూరుపాళెం, శ్రీనివాసపురం, వైట్‌కుప్పం, పూడి కుప్పం, నవాబుపేట సముద్ర తీరంలో 2013 నుంచి వన్యప్రాణి విభాగం సూళ్లూరుపేట, ట్రీ పౌండేషన్ చెన్నై ఆధ్వర్యంలో అలివ్‌రిడ్లీ తాబేళ్ల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తాబేళ్ల గుడ్లను సేకరించి వాటి పిల్లలను సముద్రంలోకి వదులుతున్నారు. అయితే మానవుడి స్వార్థ ప్రయోజనాల కారణంగా పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థాలను సముద్రంలోకి వదిలిపెట్టడం వల్ల తాబేళ్లు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయి. సముద్ర తీరంలో రొయ్యల హేచరీలు, రొయ్యల చెరువులు వెలసి వాటి నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదులుతున్నారు. దీని కారణంగా కడలి విషపూరితమైన వ్యర్థాలతో నిండిపోతోంది. తద్వారా తాబేళ్లు జీర్ణశక్తిని కోల్పోయి ఊపిరాడక రోజుకి పదుల సంఖ్యలో మృతిచెందుతున్నాయి. అలాగే నిబంధనలను అతిక్రమించి చెన్నైకు చెందిన మరబోట్లు ఈ ప్రాంతంలో వేట చేయడం వల్ల తాబేళ్లు వాటికి తగిలి మృత్యువాత పడుతున్నాయి. సహజంగా మెరైన్ యాక్ట్ 1999 ప్రకారం మరబోట్లు తీరం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో చేపల వేట చేయాలి. నిబంధనలను ఉల్లంగించి వేట చేయడం వల్ల గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చే తాబేళ్లు బోట్ల కింద చనిపోతున్నాయి. అలివ్‌రిడ్లీతో ప్రయోజనం అలివ్‌రిడ్లీ తాబేళ్లు సముద్ర జలాల్లోని పాచి, మొక్కలు వివిధ వ్యర్థ పదార్థాలను తింటూ సముద్రం కలుషితం కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా సముద్ర జీవరాశులను అంతరించి పోకుండా ఇవి పరిరక్షిస్తున్నాయి. సముద్రంలో ఆక్సిజన్ పెంచడంలో ఈ తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. అలివ్‌రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టే సమయంలో తీరంలో ఒక రకమైన జెల్‌ను విడుదల చేస్తాయి. అది భూమిలో బంకలా అతుక్కుపోయి విపత్తుల సమయంలో తీరం కోతకు గురికాకుండా నివారిస్తుంది. అనేక ఉపయోగాలు ఉన్న ఈ అలివ్‌రిడ్లీ తాబేళ్ల సంరక్షణ నేడు గాల్లో దీపంలా మారింది. తాబేళ్ల సంరక్షణకు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వాకాడు మండల తీరప్రాంత గ్రామాల్లో తాబేళ్ల పెంపకానికి ప్రత్యేక నిధులతో హేచరీలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణి విభాగం అధికారులు ప్రతి ఏడాది అధిక మొత్తంలో గుడ్లను సేకరించి హేచరీల ద్వారా పిల్లలను ఉత్పత్తి చేసి సముద్రంలో విడిచి పెడుతున్నారు. వైట్‌కుప్ప సముద్ర తీరంలో మృతిచెందిన పెద్దసైజు అలివ్‌రిడ్లీ తాబేలు ఇప్పటివరకు 29,784 గుడ్లను సేకరించి వాటి ద్వారా పిల్లలను ఉత్పత్తి చేసి 19,102 వరకు పిల్లలను సముద్రంలోకి వదిలారు. ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో సముద్ర తీరంలో ప్రత్యేక గుంతల్లో గుడ్లను పొదుగుతారు. ఇవి దాదాపు 45 నుంచి 60 రోజుల లోపు పిల్లలుగా తయారవుతాయి. తాబేళ్ల అభివృద్ధికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరిస్తున్నాయి. అందులో ట్రీ ఫౌండేషన్, బయోవర్సీటీ కంజర్వేషన్ ఫౌండేషన్ సంస్థలు వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నాయి. అలివ్‌రిడ్లీ తాబేలు 3 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, సుమారు 45 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ తాబేళ్ల పిల్లలు సముద్రంలోకి ఏ మార్గం నుంచి వెళతాయో అవి పెద్దవై గుడ్లు పెట్టడానికి అదే స్థావరానికి రావడం వీటి ప్రత్యేకత. తాబేళ్లను చంపినా, వాటి గుడ్లను తిన్నా, ధ్వంసం చేసినా వన్యప్రాణి చట్టం 1972 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంలో నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తాబేళ్ల సంరక్షణ మన కర్తవ్యం పర్యావరణాన్ని కాపాడే సముద్రపు తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కొందరు సముద్రంలోకి వ్యర్థాలను వదిలిపెట్టడం వల్ల, నిబంధనలకు విరుద్ధంగా మరబోట్లు నడపడం వల్ల తాబేళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. తాబేళ్లను తిన్నా, చంపినా, వీటి ఆవాసాలను నాశనం చేసిన వారు శిక్షార్హులు. వణ్యప్రాణి చట్టం 1972 ప్రకారం ఈ జాతిని షెడ్యూల్–1 లో పొందుపరిచి ప్రత్యేక రక్షణ కల్పించడం జరిగింది. – గాయం శ్రీనివాసులు, వన్యప్రాణి బీట్ ఆఫీసర్ -
సముద్ర తాబేళ్లు స్వాధీనం
మోతుగూడెం: రామచంద్రపురం నుంచి చింతూరు మండలం పొల్లూరు మీదుగా ఒడిశా రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 338 సముద్ర తాబేళ్లను లక్కవరం ఎఫ్ఆర్ఓ జి.ఉషారాణి స్వాధీనం చేసుకున్నారు. ఆమె విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరం అటవీ రేంజ్‌లోని 1977 టేకు ప్లాంటేషన్ వద్ద అటవీ బృందం పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఇద్దరు వ్యక్తులు జీపులో తాబేళ్లను తరలిస్తూ కంటపడ్డారు. ఆ వాహనాన్ని వెంబడించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా, ఏడు మూటల్లో కట్టిఉన్న తాబేళ్లు లభించాయి. వారిని విచారణ చేయగా.. రామచంద్రపురం నుంచి పొల్లూరు మీదుగా ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నట్టు తెలిపారు. తాబేళ్లను స్వాధీనం చేసుకుని, పొల్లూరు గ్రామానికి చెందిన మడ్డు గంగునాయుడు, కొల్లు సత్యనారాయణను అరెస్టు చేశారు. దాడిలో డీఆర్ఓ ఎం.జాన్సన్ పాల్గొన్నారు. -
గుడ్లు పెట్టబోతే గొడ్డలిపెట్టు
* సాగరతీరంలో పెరుగుతున్న ప్రతికూల పరిస్థితులు * తాబేళ్లకు ప్రాణాంతకమవుతున్న పునరుత్పత్తి తరుణం పిఠాపురం: మనిషి మినహా ప్రతి జీవీ ప్రకృతి నిర్దేశాన్ని తు.చ. తప్పక పాటిస్తుంది. సముద్రపు తాబేళ్లదీ అలాంటి క్రమశిక్షణే. అయితే.. పాపం, అదే వాటి పాలిట మరణదండనగా మారుతోంది. ఏటా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ సముద్రపు తాబేళ్లకు జాతి పునరుత్పత్తి రుతువు. ఇప్పుడు వాటికి గుడ్లు పెట్టే కాలమే గొడ్డలిపెట్టుగా మారింది. ఏటా గుడ్లు పెట్టే తరుణంలో కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద సాగరతీరానికి వేలాది తాబేళ్లు వస్తుంటాయి. రాత్రి సమయాల్లో తీరానికి చేరుకుని గోతులు తవ్వి, గుడ్లు పెట్టి, పొదిగి, మళ్లీ ఆగోతులను ఇసుకతో పూడ్చి సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. అనంతరం ఆ గుడ్లు పిల్లలుగా తయారయ్యి వాటంతటవే సముద్రంలోకి వెళుతుంటాయి. అయితే ఈ క్రమంలో తీరంలో పెట్టిన గుడ్లలో కొన్ని నక్కలు, కుక్కలు తినేస్తున్నాయి. గుడ్లు పెట్టేందుకు తీరానికి వచ్చిన తాబేళ్లలో కొన్ని మత్స్యకారులు తీరం వెంబడి సాగించే అలివి వలలకు చిక్కి చనిపోతుండగా, మరికొన్ని ఇతర జంతువుల దాడిలో మృత్యువాత పడుతున్నాయి. కాగా ఇప్పుడు వాటికి మరింత దురవస్థ దాపురించింది. అసలు గుడ్లు పెట్టడానికి తీరంలో ఇసుక తిన్నెలే కరువయ్యాయి. ఇక్కడ తీరంలో ఎక్కడ చూసినా సముద్ర కోతకు రక్షణగా వేసిన రాళ్లు మాత్రమే ఉన్నాయి. సంతానోత్పత్తి కోసం వచ్చిన తాబేళ్లు అలల తాకిడికి ఈ రాళ్లకు కొట్టుకుని మృత్యువాత పడుతున్నాయి. ఆ గండాన్ని గడిచి, ఉన్న కొద్దిపాటి ఇసుక తిన్నెల వద్దకు వస్తే ఇతర జంతువులు చంపేస్తున్నాయి. ఈ పరిణామంతో సముద్ర తాబేళ్ల సంతానోత్పత్తి పూర్తిగా దెబ్బతిని భవిష్యత్తులో వాటి సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని, అది పర్యావరణంపై దుష్ర్పభావం చూపుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ ముప్పును గుర్తించి, మత్స్యకారుల్లో అవగాహన కల్పించడంతో పాటు తీరంలో తాబేళ్ల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.