చిన్నప్పుడు చందమామ కథలతో పాటు సముద్రపు తాబేళ్ల కష్టాల కథలు కూడా విన్నాడు ఒడిషాకు చెందిన సౌమ్య రాజన్ బిస్వాల్. ప్రమాదం అంచున ఉన్న తాబేళ్ల స్థితి గురించి ‘అయ్యో!’ అనుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు సౌమ్య రాజన్. తానే ఒక ఉద్యమమై, సైన్యమై బలమైన అడుగులు వేస్తున్నాడు...
చిన్నప్పుడు స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పే హుషారైన కథలు వినేవాడు సౌమ్య రాజన్ బిస్వాల్. దీంతో పాటు పర్యావరణ సంబంధిత అంశాలలో భాగంగా సముద్రపు తాబేళ్ల గురించి కూడా వినేవాడు. ఎన్నో కథల్లో తాబేలు మనకు సుపరిచిత ఫ్రెండు. అయితే వాస్తవప్రపంచంలో వాటి పరిస్థితి ఘోరంగా ఉంది.
ప్రతి 7 జాతులలో 3 జాతులు అంతరించబోయే ప్రమాదకర పరిస్థితులలో ఉన్నాయి. తాబేళ్లకు ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల గురించి విన్న తరువాత తన వంతుగా ఏదైనా చేయాలని బలంగా అనుకున్నాడు సౌమ్య. అప్పటికింకా తాను హైస్కూల్ విద్యార్థి. రోజూ పెద్ద సంచిని భుజాన వేసుకొని పూరీ జిల్లాలోని అస్తరంగ బీచ్‌కు వెళ్లేవాడు. ప్లాస్లిక్ట్ సంచులు, వాటర్ బాటిల్స్, ఖాళీ సీసాలను ఆ సంచిలో వేసుకొని వచ్చేవాడు.
ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెట్టిన గుడ్లు నక్కలు, కుక్కలు, ఇతర జంతువుల పాలు కాకుండా రక్షించేవాడు. ఆ తరువాత సౌమ్య రాజన్‌కు స్నేహితులు కూడా తోడయ్యారు. కాలేజీరోజుల విషయానికి వస్తే, ప్రతి ఆదివారం పర్యావరణ విషయాలపై ఊరూవాడా సైకిల్‌యాత్ర నిర్వహించేవాడు. పర్యావరణ నేస్తాలైన తాబేళ్లను రక్షించుకోవాల్సిన ఆవశక్యత గురించి జాలర్లకు చెప్పేవాడు.
పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలను విస్తృతం చేయడం కోసం ‘ఒడిషా పర్యావరణ్ సంఘర్షణ్ అభియాన్’ అనే స్వచ్ఛందసంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా వందమందితో ఒక సైన్యాన్ని తయారుచేశాడు సౌమ్య రాజన్. చుట్టు పక్కల ఎన్నో జిల్లాలకు వెళ్లి ఈ సైన్యం పర్యావరణ అంశాలపై ప్రచారం నిర్వహిస్తోంది.
‘యూఎన్ ఇండియా యువ అడ్వకేట్స్’లో ఒకరిగా గుర్తింపు పొందిన 27 సంవత్సరాల సౌమ్య రాజన్ బిస్వాల్ ఎజెండాలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం కూడా చేరింది. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత గురించి గిరిజనుల దగ్గరికి వెళ్లి ప్రచారం చేస్తున్నాడు.
సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ వికాస కోణంలో తన మనసులోని భావాలకు అక్షర రూపం ఇస్తుంటాడు సౌమ్య రాజన్. మచ్చుకు ఒకటి... ‘గతంలో చేసిన తప్పుల నుంచి బయటికి రండి. కొత్త ప్రయాణం ప్రారంభించండి. కొత్త ప్రయాణానికి ప్రతిరోజూ ఒక అపురూప అవకాశమే’.
Comments
Please login to add a commentAdd a comment