biswal
-
Soumya Ranjan Biswal: సాగర తీరాన సైన్యమై కదులుతున్నాడు
చిన్నప్పుడు చందమామ కథలతో పాటు సముద్రపు తాబేళ్ల కష్టాల కథలు కూడా విన్నాడు ఒడిషాకు చెందిన సౌమ్య రాజన్ బిస్వాల్. ప్రమాదం అంచున ఉన్న తాబేళ్ల స్థితి గురించి ‘అయ్యో!’ అనుకోవడానికి మాత్రమే పరిమితం కాలేదు సౌమ్య రాజన్. తానే ఒక ఉద్యమమై, సైన్యమై బలమైన అడుగులు వేస్తున్నాడు... చిన్నప్పుడు స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పే హుషారైన కథలు వినేవాడు సౌమ్య రాజన్ బిస్వాల్. దీంతో పాటు పర్యావరణ సంబంధిత అంశాలలో భాగంగా సముద్రపు తాబేళ్ల గురించి కూడా వినేవాడు. ఎన్నో కథల్లో తాబేలు మనకు సుపరిచిత ఫ్రెండు. అయితే వాస్తవప్రపంచంలో వాటి పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రతి 7 జాతులలో 3 జాతులు అంతరించబోయే ప్రమాదకర పరిస్థితులలో ఉన్నాయి. తాబేళ్లకు ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల గురించి విన్న తరువాత తన వంతుగా ఏదైనా చేయాలని బలంగా అనుకున్నాడు సౌమ్య. అప్పటికింకా తాను హైస్కూల్ విద్యార్థి. రోజూ పెద్ద సంచిని భుజాన వేసుకొని పూరీ జిల్లాలోని అస్తరంగ బీచ్‌కు వెళ్లేవాడు. ప్లాస్లిక్ట్ సంచులు, వాటర్ బాటిల్స్, ఖాళీ సీసాలను ఆ సంచిలో వేసుకొని వచ్చేవాడు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు పెట్టిన గుడ్లు నక్కలు, కుక్కలు, ఇతర జంతువుల పాలు కాకుండా రక్షించేవాడు. ఆ తరువాత సౌమ్య రాజన్‌కు స్నేహితులు కూడా తోడయ్యారు. కాలేజీరోజుల విషయానికి వస్తే, ప్రతి ఆదివారం పర్యావరణ విషయాలపై ఊరూవాడా సైకిల్‌యాత్ర నిర్వహించేవాడు. పర్యావరణ నేస్తాలైన తాబేళ్లను రక్షించుకోవాల్సిన ఆవశక్యత గురించి జాలర్లకు చెప్పేవాడు. పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలను విస్తృతం చేయడం కోసం ‘ఒడిషా పర్యావరణ్ సంఘర్షణ్ అభియాన్’ అనే స్వచ్ఛందసంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా వందమందితో ఒక సైన్యాన్ని తయారుచేశాడు సౌమ్య రాజన్. చుట్టు పక్కల ఎన్నో జిల్లాలకు వెళ్లి ఈ సైన్యం పర్యావరణ అంశాలపై ప్రచారం నిర్వహిస్తోంది. ‘యూఎన్ ఇండియా యువ అడ్వకేట్స్’లో ఒకరిగా గుర్తింపు పొందిన 27 సంవత్సరాల సౌమ్య రాజన్ బిస్వాల్ ఎజెండాలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం కూడా చేరింది. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత గురించి గిరిజనుల దగ్గరికి వెళ్లి ప్రచారం చేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ వికాస కోణంలో తన మనసులోని భావాలకు అక్షర రూపం ఇస్తుంటాడు సౌమ్య రాజన్. మచ్చుకు ఒకటి... ‘గతంలో చేసిన తప్పుల నుంచి బయటికి రండి. కొత్త ప్రయాణం ప్రారంభించండి. కొత్త ప్రయాణానికి ప్రతిరోజూ ఒక అపురూప అవకాశమే’. -
ఉద్యోగులకు శుభవార్త: ఫిట్మెంట్ 20 శాతం..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసుల నివేదిక ప్రభుత్వానికి అందింది. తెలంగాణ తొలి పీఆర్సీ కమిటీ చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్, సభ్యుడు మహమ్మద్ అలీ రఫత్ గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమక్షంలో సీఎస్ సోమేశ్‌కుమార్‌కు నివేదిక అందజేశారు. 25% ఫిట్మెంట్తో ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలని కమిటీ సిఫారసు చేసినట్టు సమాచారం. మూడేళ్లుగా దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం నెలకొనడం, కరోనాతో ఆర్థిక వ్యవస్థ పతనమైన నేపథ్యంలో 25% ఫిట్మెంటే సాధ్యమని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. 1% ఫిట్మెంట్ అమలుకు ఏటా రూ.300 కోట్లు లెక్కన 25% ఫిట్మెంట్తో వేతన సవరణ చేయడానికి రూ.7,500 కోట్ల భారం పడనుంది. రెండున్నరేళ్ల తర్వాత నివేదిక..: చివరిసారిగా ఉమ్మడి ఏపీలో నియమించిన పదో పీఆర్సీ కమిటీ 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేయగా, 43 శాతానికి పెంచి వేతన సవరణను ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వేతన సవరణ గడువు 2018 జూన్‌తో ముగిసిపోయింది. జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన వేతనాలను అమలు చేయాల్సి ఉంది. సీఆర్ బిస్వాల్‌ను చైర్మెన్‌గా, రిటైర్డు ఐఏఎస్‌లు మహమ్మద్ అలీ రఫత్, సి.ఉమామహేశ్వర్‌రావులను సభ్యులుగా నియమిస్తూ 2018 మేలో పీఆర్సీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీఆర్సీతో పాటు ఉద్యోగుల సర్వీసు రూల్స్ సరళీకరించడం, కొత్త జోనల్ వ్యవస్థ అమలు అంశాలపై ఈ కమిటీ అధ్యయనం జరపాలని ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది. చదవండి: (చిక్కుముడులు వీడినట్టే!) ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం పీఆర్సీ నివేదికను బిస్వాల్ కమిటీ సిద్ధం చేసింది. నివేదిక సమర్పించడంలో ఆలస్యం జరగడంతో ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు గడువు పొడిగించింది. డిసెంబర్ 31తో గడువు ముగుస్తుండగా, ఎట్టకేలకు చివరిరోజు గురువారం పీఆర్సీ నివేదికను సమర్పించింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, టీజీవోల అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవోల అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.నరేందర్‌రావు, ప్రధనా కార్యదర్శి యూసుఫ్ మియా పాల్గొన్నారు. తొలివారంలో చర్చలు.. సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్‌లతో నియమించిన హైలెవల్ కమిటీ పీఆర్సీ నివేదికపై జనవరి 2, 3 తేదీల్లో క్షుణ్ణంగా అధ్యయనం జరపనుంది. అనంతరం జనవరి 5 నుంచి 7 తేదీల మధ్య రెండ్రోజుల పాటు ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించనుంది. పెంచిన వేతనాల చెల్లింపులు ఎప్పట్నుంచి అమలు చేయాలి? పీఆర్సీ బకాయిలను ఎలా, ఎప్పుడు చెల్లించాలన్న అంశంపై ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఈ కమిటీ ముందుంచనున్నారు. ఫిట్మెంట్ శాతంపై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు అనంతరం జనవరి రెండో వారంలోగా సీఎం కేసీఆర్‌కు నివేదికను సమర్పించనుంది. జనవరి మూడో వారంలో ముఖ్యమంత్రి ఫిట్మెంట్ శాతాన్ని పెంచి వేతన సవరణ అమలుపై కీలక ప్రకటన చేయనున్నారు. చదవండి: (సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం) బిస్వాల్ కమిటీ గడువు పొడిగింపు.. పీఆర్సీ నివేదిక సమర్పించినప్పటికీ, ఇంకా ఉద్యోగుల కొత్త సర్వీసు రూల్స్, కొత్త జోనల్ వ్యవస్థ అమలు, కేడర్ స్ట్రెంథ్ తదితర అంశాలపై బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరో మూడు నెలల పాటు ఈ కమిటీ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. -
రూ.22 వేలు ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనంపై ఉద్యోగ సంఘాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)కు ప్రతిపాదనలను అందజేశాయి. కొద్దిపాటి తేడాతో అన్ని సంఘాలు దాదాపు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అందులో కింది స్థాయి ఉద్యోగుల నుంచి మొదలయ్యే మాస్టర్ స్కేల్లో కనీస మూల వేతనం రూ.22 వేలుగా నిర్ణయించాలని కొన్ని సంఘాలు పేర్కొంటే, రూ.23 వేలు ఉండాలని, రూ.24 వేలుగా నిర్ణయించాలని మరికొన్ని సంఘాలు ప్రతిపాదించాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 150 వరకు ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు తెలంగాణ మొదటి పే రివిజన్ కమిషన్‌కు తమ ప్రతిపాదనలను అందజేశాయి. గురువారంతో సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ గడువు ముగిసింది. ఒక్క గురువారమే దాదాపు 40 సంఘాల ప్రతినిధులు సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ సీఆర్ బిస్వాల్, సభ్యులు మహ్మద్ అలీ రఫత్, ఉమామహేశ్వర్‌రావులను కలసి తమ ప్రతిపాదనలను అందజేశారు. అలాగే శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు, వేతన వివరాలను కూడా ఆయా శాఖలు పీఆర్సీ కమిషన్‌కు పంపించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల ప్రస్తుత ఆదాయం, పెరిగిన ఖర్చుల ప్రకారం కనీస వేతనంపై తమ అంచనాలతో కూడిన ప్రతిపాదనలు అందజేశాయి. ముఖ్యంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ, టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, రాజేందర్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, బాపురావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్, పీఆర్టీయూ, టీటీఎఫ్, టీఎస్టీయూ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘాలు ప్రత్యేకంగా తమ ప్రతిపాదనలను అందజేశాయి. ప్రధాన అంశాలపై దాదాపు ఏకాభిప్రాయమే రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన అంశాలపై దాదాపు ఏకాభిప్రాయాన్నే వ్యక్తం చేశాయి. కనీస మూల వేతనంలో ఒకటీ రెండు వేల రూపాయల తేడాతో ప్రతిపాదనలు మినహాయిస్తే మిగతా అన్ని అంశాల్లో ఏకాభిప్రాయమే వ్యక్తం చేశాయి. ఉద్యోగుల కనీస మూల వేతనం రూ. 22 వేల నుంచి మొదలుకొని గరిష్ట వేతనం రూ. 2.19 లక్షలుగా ఉండాలని ప్రతిపాదించాయి. అలాగే ఇప్పటికిప్పుడు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని, 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాయి. తాము శాస్త్రీయ అంచనాల ప్రకారమే 63 శాతం ఫిట్మెంట్ కోరుతున్నామని, పెరిగిన నిత్యావసరాల ప్రకారం ఆ మేరకు ఇవ్వాలని ప్రతిపాదించాయి. మిగిలిందల్లా అధ్యయనమే ఆగస్టు 15వ తేదీ నాటికి పీఆర్సీ నివేదిక తెప్పించుకొని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగానే పీఆర్సీ చర్యలు చేపడుతోంది. సంఘాలు, శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి అధ్యయనం చేసేందుకు సిద్ధం అవుతోంది. గురువారంతో ప్రతిపాదనల స్వీకరణ ముగిసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణను చేపట్టి, వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని కమిషన్ భావిస్తోంది. సీపీఎస్ సంఘాల ప్రత్యేక విజ్ఞప్తులు ఉద్యోగ సంఘాలు వేతన స్కేళ్లపై ప్రతిపాదనలు అందజేస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగ సంఘాలు మాత్రం ఒకే అంశంపై తమ ప్రతిపాదనలను అందజేశాయి. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ కోరారు. సీపీఎస్‌ను రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోందని, కానీ గత నాలుగేళ్ల బడ్జెట్‌ను పరిశీలిస్తే ప్రభుత్వం పెన్షన్లపై పెట్టే ఖర్చు 5 శాతానికి మించడం లేదని పేర్కొన్నారు. పైగా అది తగ్గుతూ వస్తోందని, ఈ నేపథ్యంలో సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. మరోవైపు పాత పెన్షన్ విధానం లేకపోవడం వల్ల కుటుంబ పెన్షన్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, లోన్ సదుపాయం లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మరో సీపీఎస్ సంఘం నాయకుడు కమలాకర్ పేర్కొన్నారు. గత పీఆర్సీ కంటే ఎక్కువ లేకపోతే ఎలా? తెలంగాణ రాష్ట్రంలో వేసిన మొదటి పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం చేకూరాలని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వేసిన పదో పీఆర్సీలో 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వగా.. ఇపుడు అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పదో పీఆర్సీ అమలు సమయంలో 63.344 శాతం డీఏ ఉండగా, అప్పట్లో ఐఆర్ 27 శాతంగా ఉంది. అప్పటి డీఏ కలుపుకొని రూపొందించిన స్కేళ్లపై ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. 2017 జూలై నాటికి డీఏ 25.676 శాతంగా ఉండగా, 2018 జనవరిలో రావాల్సిన డీఏ కలిపితే 28.016 శాతం అవుతుంది. మరోవైపు ఇప్పటికిప్పుడు 30 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఫిట్మెంట్ గతంలో కంటే ఎక్కువ ఉండాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు గత పీఆర్సీలో కనీస మూల వేతనం రూ.13,000గా, గరిష్ట మూల వేతనం 1.10,850 ఉంది కాబట్టి కొత్త పీఆర్సీలో కనీస మూల వేతనం రూ.22 వేలుగా, గరిష్ట మూలవేతనం 2.19 లక్షలతో మాస్టర్ స్కేల్‌ను నిర్ధారించాలని కోరుతున్నాయి. ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంను ప్రస్తుతం ఉన్న 6/12/18/24 ఏళ్ల విధానాన్ని 5/10/15/20/25 ఏళ్లకు కుదించాలని కోరాయి. -
భారత్‌లో కుదరకపోతే దక్షిణాఫ్రికాలో..
ఐపీఎల్-7పై చైర్మన్ బిస్వాల్ బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్ ఎక్కడ జరుగుతుందనే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఏప్రిల్ 9 నుంచి జూన్ 3 వరకు ఐపీఎల్ జరగాల్సి ఉన్నా ఇదే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో మ్యాచ్‌లకు భద్రత విషయంలో ఇబ్బంది ఎదురవనుంది. మరోవైపు వేదికపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐపీఎల్ అధికారులు వచ్చే వారం హోం మంత్రిత్వ శాఖతో సమావేశం కానున్నారు. ‘మేం చాలా ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నాం. షిండేతో సమావేశమయ్యాక మాకు వీలయ్యే తేదీల గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాతే పాలక మండలి ద్వారా కచ్చితమైన షెడ్యూల్ విడుదలవుతుంది. సాధ్యమైనంత మేరకు భారత్‌లోనే అన్ని మ్యాచ్‌లను జరపాలని చూస్తున్నాం. ఒకవేళ వీలు కాకుంటే దక్షిణాఫ్రికాలో జరుపుతాం’ అని లీగ్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్ తెలిపారు. -
పంచాయతీ కొలువులు
-
పంచాయతీ కొలువులు
సాక్షి, గుంటూరు: ఏపీపీఎస్సీ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నూతన సంవత్సరం కానుకగా ఆశావహులకు తీపి కబురందించింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో జిల్లాలో పలువురు నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారమే ఏపీపీఎస్సీ ఛైర్మన్ బిశ్వాల్ ప్రకటన జారీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రం మొత్తం 2,677 ఖాళీల భర్తీకి గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో జిల్లాలో 26 పోస్టుల భర్తీకి అవకాశం పంచాయతీ కొలువులు దక్కింది. అయితే జిల్లాలో 50 పోస్టులు ఖాళీలున్నాయి. జిల్లాలో మొత్తం 1,011 పంచాయతీలు వున్నాయి. క్లస్టర్లుగా విభజించడంతో 575 క్లస్టర్లున్నాయి. పంచాయతీ కార్యదర్శులు 525 మంది వరకు ఉన్నారు. ఏపీపీఎస్సీ ప్రకటనతో ఇవన్నీ భర్తీ జరుగుతాయని అధికారులు భావించారు. అయితే 26 పోస్టుల భర్తీకే ఏపీపీఎస్సీ అనుమతివ్వడం గమనార్హం. ఆబ్జెక్టివ్ టైప్‌లో మొత్తం 300 మార్కుల (150 చొప్పున)కు రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపరు జనరల్ స్టడీస్, రెండో పేపరులో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలపై ప్రశ్నలుంటాయి. జనవరి 4 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23న పరీక్ష ఉంటుంది. మార్చి 24న జిల్లా స్థాయిలో ర్యాంకింగ్ జాబితాలు తయారు చేస్తారు. డిగ్రీ అర్హతతో 18 ఏళ్ల నుంచి 36 లోపు జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. వికలాంగులకు 46 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. వివరాలకు www.apspsc.gov.in లో తెలుసుకోవచ్చు.