ఏపీపీఎస్సీ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నూతన సంవత్సరం కానుకగా ఆశావహులకు తీపి కబురందించింది.
సాక్షి, గుంటూరు: ఏపీపీఎస్సీ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నూతన సంవత్సరం కానుకగా ఆశావహులకు తీపి కబురందించింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో జిల్లాలో పలువురు నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారమే ఏపీపీఎస్సీ ఛైర్మన్ బిశ్వాల్ ప్రకటన జారీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రం మొత్తం 2,677 ఖాళీల భర్తీకి గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో జిల్లాలో 26 పోస్టుల భర్తీకి అవకాశం పంచాయతీ కొలువులు దక్కింది. అయితే జిల్లాలో 50 పోస్టులు ఖాళీలున్నాయి. జిల్లాలో మొత్తం 1,011 పంచాయతీలు వున్నాయి. క్లస్టర్లుగా విభజించడంతో 575 క్లస్టర్లున్నాయి. పంచాయతీ కార్యదర్శులు 525 మంది వరకు ఉన్నారు.
ఏపీపీఎస్సీ ప్రకటనతో ఇవన్నీ భర్తీ జరుగుతాయని అధికారులు భావించారు. అయితే 26 పోస్టుల భర్తీకే ఏపీపీఎస్సీ అనుమతివ్వడం గమనార్హం. ఆబ్జెక్టివ్ టైప్‌లో మొత్తం 300 మార్కుల (150 చొప్పున)కు రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపరు జనరల్ స్టడీస్, రెండో పేపరులో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలపై ప్రశ్నలుంటాయి. జనవరి 4 నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 23న పరీక్ష ఉంటుంది. మార్చి 24న జిల్లా స్థాయిలో ర్యాంకింగ్ జాబితాలు తయారు చేస్తారు. డిగ్రీ అర్హతతో 18 ఏళ్ల నుంచి 36 లోపు జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. వికలాంగులకు 46 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. వివరాలకు www.apspsc.gov.in లో తెలుసుకోవచ్చు.