రూ.22 వేలు ఉండాల్సిందే! | Minimum wage should be Rs 22 thousand! | Sakshi
Sakshi News home page

రూ.22 వేలు ఉండాల్సిందే!

Published Fri, Jul 6 2018 1:01 AM | Last Updated on Fri, Jul 6 2018 1:01 AM

Minimum wage should be Rs 22 thousand! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనంపై ఉద్యోగ సంఘాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్‌సీ)కు ప్రతిపాదనలను అందజేశాయి. కొద్దిపాటి తేడాతో అన్ని సంఘాలు దాదాపు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అందులో కింది స్థాయి ఉద్యోగుల నుంచి మొదలయ్యే మాస్టర్‌ స్కేల్‌లో కనీస మూల వేతనం రూ.22 వేలుగా నిర్ణయించాలని కొన్ని సంఘాలు పేర్కొంటే, రూ.23 వేలు ఉండాలని, రూ.24 వేలుగా నిర్ణయించాలని మరికొన్ని సంఘాలు ప్రతిపాదించాయి.

ఈ మేరకు రాష్ట్రంలోని 150 వరకు ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు తెలంగాణ మొదటి పే రివిజన్‌ కమిషన్‌కు తమ ప్రతిపాదనలను అందజేశాయి. గురువారంతో సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ గడువు ముగిసింది. ఒక్క గురువారమే దాదాపు 40 సంఘాల ప్రతినిధులు సచివాలయంలో పీఆర్‌సీ చైర్మన్‌ సీఆర్‌ బిస్వాల్, సభ్యులు మహ్మద్‌ అలీ రఫత్, ఉమామహేశ్వర్‌రావులను కలసి తమ ప్రతిపాదనలను అందజేశారు. అలాగే శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు, వేతన వివరాలను కూడా ఆయా శాఖలు పీఆర్‌సీ కమిషన్‌కు పంపించాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల ప్రస్తుత ఆదాయం, పెరిగిన ఖర్చుల ప్రకారం కనీస వేతనంపై తమ అంచనాలతో కూడిన ప్రతిపాదనలు అందజేశాయి. ముఖ్యంగా తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ, టీఎన్‌జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, రాజేందర్, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, బాపురావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్, పీఆర్‌టీయూ, టీటీఎఫ్, టీఎస్‌టీయూ, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘాలు ప్రత్యేకంగా తమ ప్రతిపాదనలను అందజేశాయి.

ప్రధాన అంశాలపై దాదాపు ఏకాభిప్రాయమే
రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన అంశాలపై దాదాపు ఏకాభిప్రాయాన్నే వ్యక్తం చేశాయి. కనీస మూల వేతనంలో ఒకటీ రెండు వేల రూపాయల తేడాతో ప్రతిపాదనలు మినహాయిస్తే మిగతా అన్ని అంశాల్లో ఏకాభిప్రాయమే వ్యక్తం చేశాయి.

ఉద్యోగుల కనీస మూల వేతనం రూ. 22 వేల నుంచి మొదలుకొని గరిష్ట వేతనం రూ. 2.19 లక్షలుగా ఉండాలని ప్రతిపాదించాయి. అలాగే ఇప్పటికిప్పుడు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇవ్వాలని, 63 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరాయి. తాము శాస్త్రీయ అంచనాల ప్రకారమే 63 శాతం ఫిట్‌మెంట్‌ కోరుతున్నామని, పెరిగిన నిత్యావసరాల ప్రకారం ఆ మేరకు ఇవ్వాలని ప్రతిపాదించాయి.

మిగిలిందల్లా అధ్యయనమే
ఆగస్టు 15వ తేదీ నాటికి పీఆర్‌సీ నివేదిక తెప్పించుకొని అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగానే పీఆర్‌సీ చర్యలు చేపడుతోంది. సంఘాలు, శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి అధ్యయనం చేసేందుకు సిద్ధం అవుతోంది. గురువారంతో ప్రతిపాదనల స్వీకరణ ముగిసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణను చేపట్టి, వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని కమిషన్‌ భావిస్తోంది.

సీపీఎస్‌ సంఘాల ప్రత్యేక విజ్ఞప్తులు
ఉద్యోగ సంఘాలు వేతన స్కేళ్లపై ప్రతిపాదనలు అందజేస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) ఉద్యోగ సంఘాలు మాత్రం ఒకే అంశంపై తమ ప్రతిపాదనలను అందజేశాయి. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ స్కీంను పునరుద్ధరించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ కోరారు.

సీపీఎస్‌ను రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోందని, కానీ గత నాలుగేళ్ల బడ్జెట్‌ను పరిశీలిస్తే ప్రభుత్వం పెన్షన్‌లపై పెట్టే ఖర్చు 5 శాతానికి మించడం లేదని పేర్కొన్నారు. పైగా అది తగ్గుతూ వస్తోందని, ఈ నేపథ్యంలో సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. మరోవైపు పాత పెన్షన్‌ విధానం లేకపోవడం వల్ల కుటుంబ పెన్షన్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, లోన్‌ సదుపాయం లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మరో సీపీఎస్‌ సంఘం నాయకుడు కమలాకర్‌ పేర్కొన్నారు.  


గత పీఆర్‌సీ కంటే ఎక్కువ లేకపోతే ఎలా?
తెలంగాణ రాష్ట్రంలో వేసిన మొదటి పీఆర్‌సీ ద్వారా ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం చేకూరాలని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వేసిన పదో పీఆర్‌సీలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వగా.. ఇపుడు అంతకంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

పదో పీఆర్‌సీ అమలు సమయంలో 63.344 శాతం డీఏ ఉండగా, అప్పట్లో ఐఆర్‌ 27 శాతంగా ఉంది. అప్పటి డీఏ కలుపుకొని రూపొందించిన స్కేళ్లపై ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. 2017 జూలై నాటికి డీఏ 25.676 శాతంగా ఉండగా, 2018 జనవరిలో రావాల్సిన డీఏ కలిపితే 28.016 శాతం అవుతుంది. మరోవైపు ఇప్పటికిప్పుడు 30 శాతం ఐఆర్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఫిట్‌మెంట్‌ గతంలో కంటే ఎక్కువ ఉండాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

మరోవైపు గత పీఆర్‌సీలో కనీస మూల వేతనం రూ.13,000గా, గరిష్ట మూల వేతనం 1.10,850 ఉంది కాబట్టి కొత్త పీఆర్‌సీలో కనీస మూల వేతనం రూ.22 వేలుగా, గరిష్ట మూలవేతనం 2.19 లక్షలతో మాస్టర్‌ స్కేల్‌ను నిర్ధారించాలని కోరుతున్నాయి. ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీంను ప్రస్తుతం ఉన్న 6/12/18/24 ఏళ్ల విధానాన్ని 5/10/15/20/25 ఏళ్లకు కుదించాలని కోరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement