Job associations
-
రెవెన్యూ సంఘాల విలీనం!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. వేర్వేరుగా ఉద్యమాలు నడిపిన సంఘాలు ప్రస్తుతం ఒకే గొడుగు కిందకు చేరాయి. ఇప్పటివరకు విడివిడిగా సాగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా), తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ) ఏకమయ్యాయి. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, ఇతర శాఖల్లో ఉద్యోగుల విలీనం, వీఆర్ఓ వ్యవస్థ రద్దు, తహసీల్దార్ల బదిలీలపై పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి ఉద్యోగ సంఘాల్లో అనైక్యత కారణమని అభిప్రాయం వ్యక్తమైంది. ఉద్యోగుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్న నేపథ్యంలో వేర్వేరుగా ఉద్యమాలు సాగించడం సరికాదని ఉద్యోగవర్గాల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఇరు సంఘాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశాల్లో విలీనానికి ఆమోదముద్ర వేస్తూ తీర్మానాలు చేశాయి. దీంతో టీజీటీఏను రద్దు చేసి.. దాని స్థానే ట్రెసా కొనసాగింపునకు పచ్చజెండా ఊపాయి. రెండు సంఘాల విలీనంపై గత రెండు నెలలుగా ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ చర్చోపచర్చలు సాగించారు. ఉద్యోగుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఐకమత్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ ఇరువురి చర్చలు ఫలప్రదం కావడంతో వైరి సంఘాలు కాస్తా ఒకే సంఘంగా అవతరించాయి. ప్రధాన కార్యదర్శిగా గౌతమ్‌కుమార్ తహసీల్దార్ల సంఘం (టీజీటీఏ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గౌతమ్‌కుమార్‌ను ట్రెసా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి ప్రకటించారు. మిగతా కార్యవర్గాన్ని త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రతే ప్రధాన లక్ష్యంగా సంఘం పనిచేయనుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ట్రెసా మాజీ ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంజుల, వెంకటేశ్వర్రావు, ప్రభాకర్‌రావు, ఎల్లారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ల సంఘం కొనసాగుతుంది తహసీల్దార్ల సంఘం ట్రెసాలో విలీనం కాలేదని, స్వతంత్రంగా కొనసాగుతుందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటభాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ యాదగిరి, కోశాధికారి రాములు తెలిపారు. టీజీటీఏ విలీనం చేస్తున్నట్లు చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రత్యేకంగా తహసీల్దార్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు ఈ సంఘం ఏర్పడిందని, కేవలం అధ్యక్షుడు గౌతమ్‌కుమార్, మరికొందరు మాత్రమే ట్రెసాలో చేరారని, త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని ఆ ప్రకటనలో వారు వెల్లడించారు. -
జెట్ ఎయిర్వేస్ను టేకోవర్ చేస్తాం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ భవితవ్యంపై అనిశ్చితి కొనసాగుతుండగా, తాజాగా ఆ కంపెనీ ఉద్యోగ సంఘాలు కంపెనీని నడిపించడానికి ముందుకు వచ్చాయి. పైలెట్లు, ఇంజనీర్లకు ప్రాతినిధ్యం వహించే రెండు ఉద్యోగ సంఘాలు– ఎస్‌డబ్ల్యూఐపీ, జేఏఎమ్‌ఈవీఏలు ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్‌కు ఒక లేఖ రాశాయి. రూ.7,000 కోట్ల మేర నిధులు సమీకరించగలమని, జెట్‌ను టేకోవర్ చేస్తామని ఆ లేఖలో ఆ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఎస్‌డబ్ల్యూఐపీ(ద సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్)లో 800 మంది, జేఏఎమ్ఈవీఏ(జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్)లో 500 మంది వరకూ సభ్యులున్నారు. కాగా జెట్ టేకోవర్‌కు సంబంధించిన బిడ్లు దాఖలు చేసే గడువు తేదీ దాటిపోయింది. టేకోవర్‌కు అర్హత సాధించే కంపెనీల తుది జాబితా వచ్చే నెల 10న వెల్లడి కావచ్చు. -
రూ.22 వేలు ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనంపై ఉద్యోగ సంఘాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)కు ప్రతిపాదనలను అందజేశాయి. కొద్దిపాటి తేడాతో అన్ని సంఘాలు దాదాపు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అందులో కింది స్థాయి ఉద్యోగుల నుంచి మొదలయ్యే మాస్టర్ స్కేల్లో కనీస మూల వేతనం రూ.22 వేలుగా నిర్ణయించాలని కొన్ని సంఘాలు పేర్కొంటే, రూ.23 వేలు ఉండాలని, రూ.24 వేలుగా నిర్ణయించాలని మరికొన్ని సంఘాలు ప్రతిపాదించాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 150 వరకు ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు తెలంగాణ మొదటి పే రివిజన్ కమిషన్‌కు తమ ప్రతిపాదనలను అందజేశాయి. గురువారంతో సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ గడువు ముగిసింది. ఒక్క గురువారమే దాదాపు 40 సంఘాల ప్రతినిధులు సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ సీఆర్ బిస్వాల్, సభ్యులు మహ్మద్ అలీ రఫత్, ఉమామహేశ్వర్‌రావులను కలసి తమ ప్రతిపాదనలను అందజేశారు. అలాగే శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు, వేతన వివరాలను కూడా ఆయా శాఖలు పీఆర్సీ కమిషన్‌కు పంపించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల ప్రస్తుత ఆదాయం, పెరిగిన ఖర్చుల ప్రకారం కనీస వేతనంపై తమ అంచనాలతో కూడిన ప్రతిపాదనలు అందజేశాయి. ముఖ్యంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ, టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, రాజేందర్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, బాపురావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్, పీఆర్టీయూ, టీటీఎఫ్, టీఎస్టీయూ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘాలు ప్రత్యేకంగా తమ ప్రతిపాదనలను అందజేశాయి. ప్రధాన అంశాలపై దాదాపు ఏకాభిప్రాయమే రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన అంశాలపై దాదాపు ఏకాభిప్రాయాన్నే వ్యక్తం చేశాయి. కనీస మూల వేతనంలో ఒకటీ రెండు వేల రూపాయల తేడాతో ప్రతిపాదనలు మినహాయిస్తే మిగతా అన్ని అంశాల్లో ఏకాభిప్రాయమే వ్యక్తం చేశాయి. ఉద్యోగుల కనీస మూల వేతనం రూ. 22 వేల నుంచి మొదలుకొని గరిష్ట వేతనం రూ. 2.19 లక్షలుగా ఉండాలని ప్రతిపాదించాయి. అలాగే ఇప్పటికిప్పుడు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలని, 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాయి. తాము శాస్త్రీయ అంచనాల ప్రకారమే 63 శాతం ఫిట్మెంట్ కోరుతున్నామని, పెరిగిన నిత్యావసరాల ప్రకారం ఆ మేరకు ఇవ్వాలని ప్రతిపాదించాయి. మిగిలిందల్లా అధ్యయనమే ఆగస్టు 15వ తేదీ నాటికి పీఆర్సీ నివేదిక తెప్పించుకొని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగానే పీఆర్సీ చర్యలు చేపడుతోంది. సంఘాలు, శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి అధ్యయనం చేసేందుకు సిద్ధం అవుతోంది. గురువారంతో ప్రతిపాదనల స్వీకరణ ముగిసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణను చేపట్టి, వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని కమిషన్ భావిస్తోంది. సీపీఎస్ సంఘాల ప్రత్యేక విజ్ఞప్తులు ఉద్యోగ సంఘాలు వేతన స్కేళ్లపై ప్రతిపాదనలు అందజేస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగ సంఘాలు మాత్రం ఒకే అంశంపై తమ ప్రతిపాదనలను అందజేశాయి. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ కోరారు. సీపీఎస్‌ను రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోందని, కానీ గత నాలుగేళ్ల బడ్జెట్‌ను పరిశీలిస్తే ప్రభుత్వం పెన్షన్లపై పెట్టే ఖర్చు 5 శాతానికి మించడం లేదని పేర్కొన్నారు. పైగా అది తగ్గుతూ వస్తోందని, ఈ నేపథ్యంలో సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. మరోవైపు పాత పెన్షన్ విధానం లేకపోవడం వల్ల కుటుంబ పెన్షన్, కమ్యుటేషన్, గ్రాట్యుటీ, లోన్ సదుపాయం లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని మరో సీపీఎస్ సంఘం నాయకుడు కమలాకర్ పేర్కొన్నారు. గత పీఆర్సీ కంటే ఎక్కువ లేకపోతే ఎలా? తెలంగాణ రాష్ట్రంలో వేసిన మొదటి పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం చేకూరాలని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వేసిన పదో పీఆర్సీలో 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వగా.. ఇపుడు అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పదో పీఆర్సీ అమలు సమయంలో 63.344 శాతం డీఏ ఉండగా, అప్పట్లో ఐఆర్ 27 శాతంగా ఉంది. అప్పటి డీఏ కలుపుకొని రూపొందించిన స్కేళ్లపై ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. 2017 జూలై నాటికి డీఏ 25.676 శాతంగా ఉండగా, 2018 జనవరిలో రావాల్సిన డీఏ కలిపితే 28.016 శాతం అవుతుంది. మరోవైపు ఇప్పటికిప్పుడు 30 శాతం ఐఆర్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఫిట్మెంట్ గతంలో కంటే ఎక్కువ ఉండాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు గత పీఆర్సీలో కనీస మూల వేతనం రూ.13,000గా, గరిష్ట మూల వేతనం 1.10,850 ఉంది కాబట్టి కొత్త పీఆర్సీలో కనీస మూల వేతనం రూ.22 వేలుగా, గరిష్ట మూలవేతనం 2.19 లక్షలతో మాస్టర్ స్కేల్‌ను నిర్ధారించాలని కోరుతున్నాయి. ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంను ప్రస్తుతం ఉన్న 6/12/18/24 ఏళ్ల విధానాన్ని 5/10/15/20/25 ఏళ్లకు కుదించాలని కోరాయి. -
నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు, డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలతో కూడిన కమిటీ శుక్రవారం వారితో చర్చించనుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సమావేశం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందినా ముందుగా మంత్రులతో చర్చించేలా ముఖ్యమంత్రి గురువారం కమిటీని ఏర్పాటు చేశారు. సచివాలయంలో మంత్రి ఈటల చాంబర్లో మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు జరగనున్నాయి. సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు మార్చిలో సభ నిర్వహించి అందుకు సంబంధించిన తీర్మానాలను ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున సీఎస్ ఎస్కే జోషికి గత నెలలో అందించారు. తాజాగా చర్చలకు మాత్రం టీజీవో, టీఎన్జీవో సంఘాలనే పిలిచినట్లు తెలిసింది. 18 రకాల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించగా.. ఏయే సమస్యలు, డిమాండ్లపై స్పష్టత వస్తుందోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సీపీఎస్, ఆర్డర్ టు సర్వ్ రద్దు, ఉద్యోగుల బదిలీలు, రిటైర్మెంట్ వయసు పెంపు, కొత్త పీఆర్సీ ఏర్పాటు వంటి కీలక అంశాలకు పరిష్కారం లభిస్తుందా? లేదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవీ ప్రధాన సమస్యలు.. సీపీఎస్: రాష్ట్రంలో 1–9–2004 తర్వాత నియమితులైన 1.3 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్‌కు భద్రత లేకుండా చేసిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం కొనసాగేలా రాష్ట్రమే కేంద్రానికి ప్రతిపాదించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సీపీఎస్ వల్ల ఉద్యోగులు గ్రాట్యుటీకి కూడా నోచుకోని పరిస్థితి. కేంద్రంలో, పక్క రాష్ట్రంలో ఇస్తున్నా తెలంగాణలో అమలు కావడం లేదు. ఆర్డర్ టు సర్వ్: కొత్త జిల్లాలు ఏర్పడినపుడు 6 నెలలు తాత్కాలికంగా పని చేసేందుకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులిచ్చారు. దీంతో దాదాపు 25 వేల మంది ఉద్యోగులు స్వస్థలాలు వదిలి కొత్త జిల్లాల్లో పని చేస్తున్నారు. 20 నెలలు కావస్తున్నా శాశ్వత కేటాయింపులు జరగలేదు. బదిలీలు: ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలై తరువాత బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా బదిలీలు జరగలేదు. దీంతో వేలాది మంది ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏపీలో ఉన్న 1,200 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ: 2018 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన పీఆర్సీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కమిషన్ ఏర్పాటయ్యాక అధ్యయనానికే 6 నెలలు సమయం పడుతుంది. కాబట్టి వెంటనే పీఆర్సీ ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం 2,91,270 మంది ప్రభుత్వ, లక్షకు పైగా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, 2,55,336 మంది పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. సమాన వేతనం: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న 60 వేల మందికి సమాన వేతనం కోసం డిమాండ్ చేస్తున్నారు. పదవీవిరమణ వయసు పెంపు: పక్కనున్న ఏపీ సహా 18 రాష్ట్రాల్లో, కేంద్రంలో రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. మనిషి సగటు జీవితకాలం పెరగడం, రెగ్యులర్ నియామకాలు లేనందున రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్: పంచాయతీరాజ్ టీచర్లు, ప్రభుత్వ టీచర్లకు ఓకే విధమైన నిబంధనలు 15 ఏళ్లుగా నలుగుతున్న సమస్య. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినా న్యాయ వివాదంలో చిక్కుకుంది. దీని పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 15 శాతం క్వాంటమ్ పెన్షన్, తెలంగాణ ఇంక్రిమెంట్ల డిమాండ్ మూడేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. వీటితోపాటు వివిధ శాఖల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పండిట్, పీఈటీ అప్‌గ్రెడేషన్, రూ.398 వేతనంతో పని చేసిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు, గ్రంథాలయ, అగ్రికల్చర్, మార్కెట్ కమిటీ, యూనివర్సిటీలు, ఎయిడెడ్ వారికి 010 పద్దు కింద వేతనాలు చెల్లింపు, హౌసింగ్, మార్కెటింగ్ శాఖల్లో తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ ఉంది. -
పేలని ప‘టాస్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 స్థాయి అధికారుల సేవలను అన్ని విభాగాల్లో సమర్థవంతంగా వినియోగించుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలనుకున్న తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) అటకెక్కింది. మూడేళ్ల కిందట టాస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఇంతవరకు ఆచరణ దిశగా అడుగులు పడలేదు. గ్రూప్–1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ, గెజిటెడ్ అధికారుల సంఘాలు.. కేరళ, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పనితీరు తెలుసుకుని, మన రాష్ట్రంలో ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి ఏడాది కిందట నివేదికలు ఇచ్చాయి. ఆ నివేదికను పట్టించుకున్న నాథుడే లేడు. పైగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ నేతృత్వంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులతో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ.. ఎంజీ గోపాల్ రిటైర్మెంట్ తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. అసలు కమిటీ ఉందా, లేదా అనే దానిపైనా స్పష్టతలేదు. ఫలితంగా అన్ని విభాగాల్లో గ్రూప్–1 స్థాయి అధికారుల సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలన్న లక్ష్యం నెరవేరక పోగా, కన్ఫర్డ్ ఐఏఎస్ కోటాలో రెవెన్యూ యేతర విభాగాలకు చెందిన గ్రూప్–1 స్థాయి అధికారులకు తగిన ప్రాతినిధ్యం ఎండమావిగానే మిగిలింది. కన్ఫర్డ్ ఐఏఎస్ తేనెతుట్టె! ఓవైపు ‘టాస్’ప్రక్రియ అలాగే నిలిచిపోగా, తాజాగా చేపట్టిన కన్ఫర్డ్ ఐఏఎస్ పదోన్నతుల ప్రక్రియ వివాదాస్పదం అవుతోంది. రెవెన్యూ యేతర గ్రూప్–1 స్థాయి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, సీనియారిటీ విషయంలో రెవెన్యూ విభాగానికి చెందిన ప్రమోటీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టాస్ ఏర్పాటు చేసి తమకు ఐఏఎస్ పోస్టుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని నాన్ రెవెన్యూ గ్రూప్–1 స్థాయి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, నాన్ రెవెన్యూ అనే తేడా లేకుండా టాస్‌ను ఏర్పాటు చేసి, గ్రూప్–1 స్థాయి వారందరిని స్టేట్ సివిల్ సర్వీసెస్ కిందకు తీసుకురావాలని కోరుతున్నారు. మరోవైపు రెవెన్యూలో డైరెక్ట్ రిక్రూటీస్, ప్రమోటీల సీనియారిటీ కేసుకు సంబంధించి.. హైకోర్టు తీర్పు వెలువడకముందే ఆగమేఘాలపై కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం జాబితాను కేంద్రానికి పంపడంపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పిల్ల పుట్టకముందే కుల్ల కుట్టించినట్లు..’ డిప్యూటీ కలెక్టర్ల విభజన ఈనెల 29న పూర్తయినట్టు నోటిఫికేషన్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే అందులో తెలంగాణకు అలాట్ అయిన వారు కొందరు ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోనే పని చేస్తున్నారు. అధికారికంగా తెలంగాణలో చేరలేదు. ఇంకొందరికి 8 ఏళ్ల సర్వీసు పూర్తి కాలేదు. ఇలా తెలంగాణలో చేరని వారి పేర్లు, 8 ఏళ్ల కనీస సర్వీసు పూర్తి కాని వారి పేర్లు కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం జాబితాలో చేర్చడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఏపీ స్థానికత కలిగిన వారు కూడా అందులో ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలివీ.. రాష్ట్ర సర్వీసుల్లో విశేష అనుభవం, సమర్థత ఉన్న అధికారులకి కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతులు కల్పించాలని నియమ నిబంధనలు చెబుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా రెవెన్యూ వారికే ప్రాధాన్యం ఇస్తుండటంపై నాన్ రెవెన్యూ అధికారుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ప్రమోషన్) రెగ్యులేషన్స్–1955 ప్రకారం రాష్ట్ర సర్వీసుల్లో రెవెన్యూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్యూటీ కలెక్టర్ లేదా అంతకంటే పైహోదా కలిగిన వారు ‘రాష్ట్ర సివిల్ సర్వీస్’కింద పని చేస్తూ ఉండాలి. వారికి కనీసం 8 ఏళ్ల సర్వీసు ఉండాలి. కానీ కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఇంత వరకు ఏ సర్వీసునూ ‘రాష్ట్ర సివిల్ సర్వీస్’గా గుర్తించలేదు. రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులంటే స్పష్టత లేదు. కనీసం పాత జీవోలను కూడా అడాప్ట్ చేసుకోలేదు. కానీ రెవెన్యూ వారినే పరిగణనలోకి తీసుకు ని ఐఏఎస్ కోసం జాబితా రూపొందించి పంపారని నాన్ రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. 20 రాష్ట్రాల్లో గ్రూప్–1 స్థాయి అధికారులు అందరితో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఏర్పాటు చేశారని, కేరళ ప్రభుత్వం కూడా జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానుందని పేర్కొంటున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం ఆ దిశగా అడుగులు పడకపోవ డంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సచివాలయం తరలింపు జూన్ 15న
♦ ఆరోజే ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళిక ♦ జూలై ఆఖరు నుంచి హెచ్‌వోడీల తరలింపు తొలిదశ ♦ ఉద్యోగ సంఘాలతో మంత్రి నారాయణ, సీఎస్ టక్కర్ భేటీ ♦ స్పష్టత ఇవ్వడంలో సర్కారు విఫలం.. ఉత్తర్వులివ్వాలి ♦ ఉద్యోగ సంఘాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని అమరావతికి సచివాలయం తరలింపును ఈఏడాది జూన్ 15న ప్రారంభిస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు తెలిపింది. పురపాలకశాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ సోమవారం సచివాలయంలో.. ఉద్యోగ సంఘాల నేతలు, సచివాలయ భవన నిర్మాణ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సచివాలయం తరలింపును ఒకేదఫా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించామని మంత్రి, సీఎస్ వెల్లడించారు. శాఖాధిపతుల కార్యాలయాల (హెచ్‌వోడీ) తరలింపును రెండు దఫాలుగా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నామన్నారు. జూలై ఆఖరున తొలిదశ, ఆగస్టు ఆఖరులో మలిదశ తరలింపు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సచివాలయం కోసం జీ+1 అంతస్తు నిర్మిస్తున్న భవనం మీదే మరో రెండంతస్తులు నిర్మించి, శాఖాధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని వెల్లడించారు. సచివాలయం కోసం మొత్తం 6 బ్లాకులు నిర్మిస్తున్నామని, అందులో 1, 2, 3 బ్లాకులు సచివాలయానికి, 4, 5 బ్లాకులు శాఖాధిపతుల కార్యాలయాలకు, ఆరోబ్లాక్ను శాసనసభ, మండలికి ఇవ్వాలనే ప్రతిపాదన ఉందన్నారు. స్పష్టత ఇవ్వడంలో విఫలం.. తరలింపుపై స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తరలింపు తేదీలు, ఇతర డిమాండ్లపై కేవలం ప్రకటనలు చేయడమే కాకుండా ఉత్తర్వులు ఇస్తే ఉద్యోగులు మానసికంగా సిద్ధమవుతారని సూచించారు. 30 శాతం హెచ్ఆర్ఏ కొనసాగింపు, సీసీఏ, ప్రత్యేక అలవెన్స్, వారానికి 5 రోజుల పని విధానం, పిల్లల స్థానికత, విద్యాసంస్థల్లో సీట్లు.. తదితర అంశాల్లో ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, వచ్చే సోమవారం మరోసారి ఉద్యోగ సంఘాలతో సమావేశమై వెల్లడిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తరలి వెళ్లాల్సిన ఉద్యోగులు 6-7 వేలకు మించరు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో కొత్త రాజధానికి తరలి వెళ్లాల్సిన ఉద్యోగుల సంఖ్య 6-7 వేలకు మించదని ఉద్యోగ సంఘాలు కొత్త లెక్కలను తెర మీదకు తెచ్చాయి. ఈ కార్యాలయాల్లోని శాంక్షన్ పోస్టుల్లో దాదాపు సగం ఖాళీలున్నాయని, కాంట్రాక్టు-ఔట్సోర్సింగ్ ఉద్యోగులంతా కొత్త రాజధానికి తరలివచ్చే అవకాశం లేదని చెబుతున్నాయి. ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులు 10 శాతం ఉంటారని అంచనా. 15-20 శాతం సిబ్బందిని ఇక్కడే కొనసాగించనున్న దృష్ట్యా.. కొత్త రాజదానికి వెళ్లే ఉద్యోగుల సంఖ్య 6-7 వేలకు మించదని చెబుతున్నాయి. తాత్కాలిక సచివాలయం నిర్మాణపనుల్లో ప్రమాదం పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడి దుర్మరణం తుళ్లూరు: తుళ్లూరు మండలం వెలగపూడిలో జరుగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో అపశ్రుతి దొర్లింది. సోమవారం ఉదయం పునాది పనులు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన సామ్రాట్ రౌతు(20)అనే యువకుడు రిగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. పునాదుల కోసం రిగ్మిషన్ ఆపరేట్ చేస్తుండగా సోమవారం ఉదయం 6.30 సమయంలో మిషన్ పక్కకు పడిపోయింది.భయపడిన సామ్రాట్ కిందకు దూకగా మిషన్ కింద పడి మరణించాడు. మృతదేహాన్ని భారీ కేన్ల సాయంతో రెండుగంటలకు పైగా శ్రమించి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. షాపూర్జీ పల్లోంజీ సంస్థకు సంబంధించి పునాదులు తవ్వే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.