సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు, డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలతో కూడిన కమిటీ శుక్రవారం వారితో చర్చించనుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సమావేశం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందినా ముందుగా మంత్రులతో చర్చించేలా ముఖ్యమంత్రి గురువారం కమిటీని ఏర్పాటు చేశారు. సచివాలయంలో మంత్రి ఈటల చాంబర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు జరగనున్నాయి. సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు మార్చిలో సభ నిర్వహించి అందుకు సంబంధించిన తీర్మానాలను ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున సీఎస్ ఎస్‌కే జోషికి గత నెలలో అందించారు. తాజాగా చర్చలకు మాత్రం టీజీవో, టీఎన్‌జీవో సంఘాలనే పిలిచినట్లు తెలిసింది. 18 రకాల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించగా.. ఏయే సమస్యలు, డిమాండ్లపై స్పష్టత వస్తుందోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సీపీఎస్, ఆర్డర్ టు సర్వ్ రద్దు, ఉద్యోగుల బదిలీలు, రిటైర్‌మెంట్ వయసు పెంపు, కొత్త పీఆర్‌సీ ఏర్పాటు వంటి కీలక అంశాలకు పరిష్కారం లభిస్తుందా? లేదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవీ ప్రధాన సమస్యలు..
సీపీఎస్: రాష్ట్రంలో 1–9–2004 తర్వాత నియమితులైన 1.3 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్‌కు భద్రత లేకుండా చేసిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం కొనసాగేలా రాష్ట్రమే కేంద్రానికి ప్రతిపాదించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సీపీఎస్ వల్ల ఉద్యోగులు గ్రాట్యుటీకి కూడా నోచుకోని పరిస్థితి. కేంద్రంలో, పక్క రాష్ట్రంలో ఇస్తున్నా తెలంగాణలో అమలు కావడం లేదు.
ఆర్డర్ టు సర్వ్: కొత్త జిల్లాలు ఏర్పడినపుడు 6 నెలలు తాత్కాలికంగా పని చేసేందుకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులిచ్చారు. దీంతో దాదాపు 25 వేల మంది ఉద్యోగులు స్వస్థలాలు వదిలి కొత్త జిల్లాల్లో పని చేస్తున్నారు. 20 నెలలు కావస్తున్నా శాశ్వత కేటాయింపులు జరగలేదు.
బదిలీలు: ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలై తరువాత బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా బదిలీలు జరగలేదు. దీంతో వేలాది మంది ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఏపీలో ఉన్న 1,200 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
పీఆర్‌సీ: 2018 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన పీఆర్‌సీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కమిషన్ ఏర్పాటయ్యాక అధ్యయనానికే 6 నెలలు సమయం పడుతుంది. కాబట్టి వెంటనే పీఆర్‌సీ ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం 2,91,270 మంది ప్రభుత్వ, లక్షకు పైగా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, 2,55,336 మంది పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు.
సమాన వేతనం: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న 60 వేల మందికి సమాన వేతనం కోసం డిమాండ్ చేస్తున్నారు.
పదవీవిరమణ వయసు పెంపు: పక్కనున్న ఏపీ సహా 18 రాష్ట్రాల్లో, కేంద్రంలో రిటైర్‌మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. మనిషి సగటు జీవితకాలం పెరగడం, రెగ్యులర్ నియామకాలు లేనందున రిటైర్‌మెంట్ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు.
ఏకీకృత సర్వీసు రూల్స్: పంచాయతీరాజ్ టీచర్లు, ప్రభుత్వ టీచర్లకు ఓకే విధమైన నిబంధనలు 15 ఏళ్లుగా నలుగుతున్న సమస్య. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినా న్యాయ వివాదంలో చిక్కుకుంది. దీని పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 15 శాతం క్వాంటమ్ పెన్షన్, తెలంగాణ ఇంక్రిమెంట్ల డిమాండ్ మూడేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. వీటితోపాటు వివిధ శాఖల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పండిట్, పీఈటీ అప్‌గ్రెడేషన్, రూ.398 వేతనంతో పని చేసిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు, గ్రంథాలయ, అగ్రికల్చర్, మార్కెట్ కమిటీ, యూనివర్సిటీలు, ఎయిడెడ్ వారికి 010 పద్దు కింద వేతనాలు చెల్లింపు, హౌసింగ్, మార్కెటింగ్ శాఖల్లో తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment