Committee of Ministers
-
‘కొందరు ఉద్యోగులు రాజకీయ పార్టీలతో కలవడం దురదృష్టకరం’
సాక్షి, అమరావతి: సమ్మె వరకూ వెళ్లకుండా సమస్యను పరిష్కరించామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలతో తరచూ చర్చలు జరిపామన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థత ‘‘ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా వారికి న్యాయం చేశాం. ఉన్నంతలో ఉద్యోగులకు మంచి చేశాం. కొందరు ఉద్యోగులు రాజకీయ పార్టీలతో కలవడం దురదృష్టకరం. పీఆర్సీ సాధన సమితిలో ఉపాధ్యాయ సంఘాలూ భాగమే. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు ఉపాధ్యాయ సంఘాలు సరేనన్నారు. తర్వాత బయటకెళ్లి సంతృప్తిగా లేదనడం సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం
-
ఏపీ: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలం..
సాక్షి, అమరావతి: దాదాపు7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎం జగన్ అంగీకారం తెలిపారు. కాసేపట్లో మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి చర్చల సారాంశాన్ని వివరించనున్నారు. హెచ్ఆర్ఏ స్లాబ్‌లు, పీఆర్సీ కాల పరిమితి, ఐఆర్ అడ్జస్ట్మెంట్, పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్! కాగా, శుక్రవారం రాత్రి.. ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలు సానుకూలంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాము కోరుతున్న ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చర్చలు సఫలమయ్యేలా జరుగుతున్నట్లు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, హెచ్ఆర్ఏ, ఐఆర్ రికవరీ అంశాలపై సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తెలిపింది. చర్చల అనంతరం మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో మెరుగైనది ఇచ్చినా ఉద్యోగులు ఆశించినంతగా లేదని భావించారని, అందుకే వారి అసంతృప్తి, ఆవేదన పరిష్కరించడానికి కూలంకషంగా చర్చలు జరిగాయని తెలిపారు. ప్రతి అంశంపై లోతుగా చర్చించి అందరి ఆమోదం వచ్చిందని చెప్పారు. హెచ్ ఆర్ ఏ విషయంలో వివిధ స్లాబ్స్ ఉద్యోగులతో చర్చించి పెంచినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో 16 శాతం నిర్ణయించామని,హెచ్ఓడీ, సెక్రటేరియట్ వారికి జూన్ 2024 వరకు 24 శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది. మారిన హెచ్ ఆర్ ఏ జనవరి 2022 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసినా ప్రదర్శనలు చేసినా ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగానే ఉన్నామని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వల్ల ఉన్నంతలో బెటర్ ప్యాకేజ్ ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని చెప్తున్నారు ►ఫిట్ మెంట్ 23 శాతం అదే కొనసాగుతుంది ►అడిషనల్ క్వాంటం 70-74 వయసు వాళ్ళకు 7 శాతం ►ఐఆర్ రికవరీ ఉపసంహరించుకుంటున్నాం ►పదేళ్లకో సారి కాకుండా 5 ఏళ్లకే పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించాం ►సీపీఎస్ రద్దు ప్రక్రియ మార్చ్ 21 కల్లా రూట్ మ్యాప్ తయారు అవుతుంది ►గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల కన్ఫర్మేషన్ జూన్ లోపు జరగాలి ►యధావిధిగా ఉద్యోగులు బాద్యతల్లోకి వెళ్తారని భావిస్తున్నాం -
చర్చోప చర్చలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రుల కమిటీ మధ్య మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తొలుత ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల వ్యవహారాలు) చంద్రశేఖర్‌రెడ్డి నిర్వహించిన చర్చలు సానుకూలంగా జరిగాయి. (మరో సభ్యుడు మంత్రి పేర్ని నాని అనారోగ్యంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు) పీఆర్సీ సాధన సమితి నేతలు వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితర నేతలు ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు. తమకు పాత జీతాలే వేయాలని మరోసారి మంత్రుల కమిటీని కోరారు. దీంతో పాటు కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవోలను రద్దు చేయాలని, పీఆర్సీ నివేదికను ఇవ్వాలన్నారు. అంశాల వారీగా చర్చలు జరిపిన తర్వాత మరోసారి చర్చలకు పిలుస్తామని మంత్రుల కమిటీ వారికి చెప్పింది. చర్చలకు అందుబాటులో ఉండాలని కోరింది. అన్ని విషయాల గురించి మాట్లాడుకుందామని, ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించవద్దని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలను కోరింది. అనంతరం వారు అక్కడి నుంచి బయటకు వెళ్లారు. కాగా, మంగళవారం చర్చలు సానుకూలంగా జరిగాయని, మరోసారి మళ్లీ చర్చలు జరుపుతామని సాయంత్రం తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కాగా, పీఆర్సీ సాధన సమితి నేత, ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. పీఆర్సీ సాధన కమిటీ ర్యాలీకి అనుమతి నిరాకరణ విజయవాడ స్పోర్ట్స్: పీఆర్సీ సాధన కమిటీ ఈ నెల 3వ తేదీన చేపట్టనున్న చలో విజయవాడ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పోలీస్ కమిషనరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మూడో తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడలో భారీ ర్యాలీకి పీఆర్సీ సాధన కమిటీ అనుమతి కోసం తమకు దరఖాస్తు చేసుకుందన్నారు. కరోనా మూడో దశ వ్యాప్తి, సెక్షన్ పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో వారికి అనుమతి నిరాకరించామని చెప్పారు. విజయవాడ నగరంలో కోవిడ్ ఉధృతి ఎక్కువ ఉందని, ఈ ర్యాలీ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వారి వద్దకు వచ్చే సామాన్య ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేల మందితో ర్యాలీలు చట్టపరంగానే కాకుండా ఎంప్లాయ్ కాండాక్ట్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అందువల్ల ఉద్యోగులెవ్వరూ ఈ ర్యాలీకి రాకూడదని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమ్మెకు వెళ్లొద్దు.. అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఆందోళనలు విరమించుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలను కోరాం. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఎంత చేయాలో అంత చేసిన విషయాన్ని మరోసారి వారికి వివరించాం. ఉద్యోగ సంఘాల నాయకులు పాత పీఆర్సీని అమలు చేయాలని కోరారు. పీఆర్సీ ప్రకటించి కొత్త పీఆర్సీ అమలైన తర్వాత పాత పీఆర్సీని అమలు చేయడం ఎంత వరకు సాధ్యమో ఆలోచించాలని చెప్పాం. ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని రికవరీ చేయడం ఏమీ లేదు. ఐఆర్ అనేది కేవలం సర్దుబాటు మాత్రమే. అది రికవరీ కాదు. ఉద్యోగులపై బెదిరింపులు, ఒత్తిళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించే వరకు వెళ్లవద్దని వారిని కోరాం. అధికారుల కమిటీ నివేదికలోనే పీఆర్సీ నివేదికలోని అన్ని అంశాలు ఉన్నాయని వారికి వివరించాం. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు చలో విజయవాడను విజయవంతం చేయాలి గురువారం చేపట్టే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ విజయవంతం చేయాలి. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాలేదు. ఉద్యమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుంది. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో కొత్త పీఆర్సీ ప్రకారం నష్ట పోతున్న విషయాన్ని మళ్లీ చెప్పాం. మూడు ప్రధాన అంశాలపై తేల్చాలని స్పష్టం చేశాం. అవి సాధ్యపడవని మంత్రుల కమిటీ సమాచారం ఇచ్చింది. అందుకే కార్యాచరణ యధావిధిగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు ఛలో విజయవాడకు వెళ్లొద్దని ఉద్యోగులకు చెప్పే ప్రైవేటు క్లాసులు మానుకోవాలి. ఉద్యోగులను భయ భ్రాంతులకు గురి చేయొద్దని కలెక్టర్లకు చెబుతున్నాం. సమ్మెలు, ఆందోళనలు తాత్కాలికమే. మళ్లీ అంతా కలిసి పని చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. – బండి శ్రీనివాసరావు, పీఆర్సీ సాధన సమితి నేత, ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు -
హైకోర్టు సలహాను పరిగణలోకి తీసుకోవాలి: సజ్జల
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం.. మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని జేఏసీ నేతలు చర్చలకు వచ్చారని.. అని అంశాలపై చర్చించామని ఆయన తెలిపారు. ఉద్యోగుల జీతాల నుంచి రికవరీ లేదన్నారు. చదవండి: జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు?: ఏపీ హైకోర్టు ఉద్యోగుల కార్యాచరణను వాయిదా వేయమని కోరామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు ఎవరికీ అన్యాయం చేయాలని లేదన్నారు. హైకోర్టు సలహాను ఉద్యోగ సంఘాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇది పాజిటివ్ చర్చగానే తాము భావిస్తున్నామని సజ్జల పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల డిమాండ్లపై మళ్లీ చర్చిస్తామని మంత్రుల కమిటీ తెలిపింది. -
AP: చర్చలకు సరే
సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోలను రద్దు చేస్తే కానీ మంత్రుల కమిటీతో చర్చలకు హాజరు కాబోమని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు పట్టువిడుపు ప్రదర్శించాయి. మంత్రుల కమిటీ నుంచి తమకు లిఖిత పూర్వకంగా ఆహ్వానం వస్తే చర్చలకు వెళతామని సోమవారం పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆ తరువాత కొద్దిసేపటికే మంత్రుల కమిటీ నుంచి వారికి లిఖితపూర్వక ఆహ్వానం అందడంతో ప్రతిష్టంభనకు తాత్కాలికంగా తెరపడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో చర్చలకు రావాలని మంత్రుల కమిటీ తరఫున జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆహ్వానించారు. పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కె. వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేవీ శివారెడ్డి, సీహెచ్ కృష్ణమూర్తి తదితర 20 మంది పేర్లను లేఖలో పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాకు ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో సమావేశానికి రావాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి పంపిన ఆహ్వానంలో సూచించారు. చర్చలకు సిద్ధమే: స్టీరింగ్ కమిటీ మంత్రుల కమిటీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ప్రస్తుత పరిణామాలు, కార్యాచరణ, ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాత జీతాలే ఇవ్వాలని కోరతాం: బొప్పరాజు ఈనెల 3వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి అల్లూరి సీతారామరాజు వంతెన మీదుగా భాను నగర్ చేరుకుని సభ నిర్వహిస్తామన్నారు. 7వతేదీ నుంచి సమ్మె తలపెట్టిన నేపథ్యంలో న్యాయపరమైన అంశాలను ఎదుర్కొనేందుకు ఇద్దరు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు వైవీ రవి ప్రసాద్, సత్యప్రసాద్‌లను నియమించుకున్నామని తెలిపారు. కొత్త జీవోలను నిలిపివేసి పాత జీతాలే చెల్లించాలని చర్చల్లో కోరతామన్నారు. మేం రాలేదనడం సరికాదు: బండి ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదని మంత్రుల కమిటీ పేర్కొనడం సరికాదని ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. స్టీరింగ్ కమిటీలోని 9 మంది సభ్యులంతా చర్చలకు సంబంధించిన అంశంపై సంతకాలు చేసి పంపినట్లు తెలిపారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో అర్ధం కావడం లేదన్నారు. రివర్స్ పీఆర్సీతో గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. భయపెట్టేలా మెమోలు: సూర్యనారాయణ తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ కోరారు. జీతాల చెల్లింపుపై అధికారులు భయపెట్టే విధంగా ఖజానా శాఖ ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఆటవిక చర్యని విమర్శించారు. ఆర్ధికశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. బెదిరింపులకు లొంగేది లేదని, అవసరమైతే న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఆర్థిక శాఖలోని ఐఏఎస్ అధికారులపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రింటెడ్ చార్జీ మెమోలకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల ప్రకారం సీసీఏ రూల్ 20 ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలన్నారు. సర్వీస్ రిజిస్టర్ లేకుండా పే ఫిక్సేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. చలో విజయవాడ సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని స్టీరింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. -
చర్చలే దారి
సాక్షి, అమరావతి: జీతాల విషయంలో ఏ ఒక్క ఉద్యోగిని కూడా నష్టపోనివ్వబోమని, కొత్త పే స్లిప్ వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పీఆర్సీపై అపోహలు తొలగించేందుకు ప్రభుత్వం నాలుగు మెట్లు దిగేందుకైనా సిద్ధంగా ఉందన్నారు. గురువారం సచివాలయంలో మంత్రుల కమిటీ వరుసగా మూడో రోజు సమావేశం అనంతరం రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. షరతులు విధిస్తే ఎలా? పీఆర్సీ సాధన కమిటీ నుంచే కాకుండా ఇతర ఏ సంఘాలు వచ్చినా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని సజ్జల తెలిపారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన అవసరం రాకుండా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో తెలియచేసే అవకాశం ఇవ్వకుండా చర్చలకు షరతులు విధిస్తే ఎలా? అని ప్రశ్నించారు. చర్చలు కాకుండా ఇక ఏ మార్గంలో సమస్యకు సాంత్వన లభిస్తుందో చెప్పాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన అధికారిక కమిటీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆహ్వానించినా ఉద్యోగ సంఘాలు రాకపోవడం దురదృష్టకరమన్నారు. బాధ్యతాయుత నాయకులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మొండి వైఖరి విడనాడి న్యాయబద్ధమైన అంశాలు ఉంటే ప్రభుత్వంతో కలిసి సరిదిద్దుకోవాలన్నారు. సెలవు రోజుల్లో మినహా నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి సచివాలయంలో మంత్రుల కమిటీ అందుబాటులో ఉంటుందన్నారు. కమిటీ స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రెచ్చగొట్టే ధోరణితో వ్యతిరేకతను పెంచుకోవద్దని సూచించారు. చర్చలకు వెళ్లాల్సిందిగా ఉద్యోగులు సంఘాల నాయకులకు సూచించాలని కోరారు. కొన్ని పత్రికలు వక్ర భాష్యాలు చెబుతూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. చర్చలకొచ్చి.. ఒత్తిడి తగ్గించుకోండి ‘ఉద్యోగ సంఘాల నాయకులు తమపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారు. అసలు ఒత్తిడికి గల సమస్యను పరిష్కరించుకోవాలి. సమ్మె తేదీ దగ్గరపడినా.. ఒకవేళ సమ్మెకు వెళ్లాల్సి వచ్చినా అప్పుడైనా చర్చలకు కూర్చోవాలి కదా? సీఎం సమక్షంలో ఫిట్మెంట్ ప్రకటనలో పాల్గొని సమ్మతి తెలిపారు. ఇప్పుడు మళ్లీ పాత పీఆర్సీ కోరడం అంటే పరిపక్వత లేకపోవడమో లేక ఇంకేమంటారో అర్థం కావట్లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సమ్మె చట్ట విరుద్ధం. కానీ మేము వాటి జోలికి వెళ్లట్లేదు. ఆర్థిక అంశాల వ్యవహారాలను నిరాకరించడం క్రమ శిక్షణ ఉల్లంఘన, ప్రభుత్వ వ్యతిరేక చర్యల కిందకే వస్తుంది. ఇలాంటివి జరగకుండా చర్చలకు వచ్చి సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలి. మేం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం’ అని సజ్జల పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం బాధ్యతాయుత నాయకులుగా చర్చలకు రావాలే కానీ తాము చెప్పిందే జరగాలని అనుకోవడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. -
మన వాళ్లను రప్పించేందుకు కార్యాచరణ
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని ఆంధ్రప్రదేశ్‌కు రప్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఏపీకి వచ్చేందుకు సుముఖంగా ఉన్న మన వాళ్లను తరలించడంపై రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించనుంది. ఈ మేరకు కరోనా నియంత్రణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ బుధవారం సమావేశమై చర్చించింది. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు తీరును సమీక్షించింది. అనంతరం సమావేశ వివరాలను మంత్రి ఆళ్ల నాని మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి వల్ల రాష్ట్రంలో గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా చర్యలు తీసుకుంటాం. గుజరాత్లో చిక్కుకున్న మత్స్యకారులను ఏపీకి తరలించడంపై సీఎం జగన్ ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వారిని రప్పిస్తున్నారు. ► ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్ల(ఓపీ)ను చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలిచ్చింది. దీన్ని పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. ► సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు పీవీ రమేశ్, కృష్ణబాబు, కె.భాస్కర్, గిరిజా శంకర్, విజయ్‌కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లో వైరస్తోనూ పోరాటం: మంత్రి కన్నబాబు ► రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు కరోనా వైరస్‌తోపాటు ఎల్లో వైరస్తోనూ పోరాడాల్సి వస్తోంది. లేనివి ఉన్నట్టుగా ప్రచారం చేయడమే ఎల్లో వైరస్ పని. 4 లక్షల మంది రైతులను రైతు భరోసా పథకం నుంచి తొలగించినట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేయడమే దీనికి నిదర్శనం. ► ప్రభుత్వం రైతుల నుంచి కూరగాయలు, పండ్లు కొనుగోలు చేస్తూ రైతు బజార్ల ద్వారా విక్రయిస్తోంది. మొబైల్ రైతు బజార్లను కూడా ఏర్పాటు చేశాం. ► చంద్రబాబు హైదరాబాద్ నుంచి వచ్చి రాష్ట్రంలో క్వారంటైన్ కేంద్రాలను సందర్శిస్తే నిజాలు తెలుస్తాయి. -
ఆర్టీసీ వేతన సవరణపై నేడే చర్చలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై మంత్రుల కమిటీ ఆదివారం సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘం నేతలతో చర్చించనుంది. ప్రస్తుత వేతన సవరణ గడువు 14 నెలల క్రితమే ముగిసిపోయినందున కొత్త వేతన సవరణను ప్రకటించాలని కొద్దిరోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వేతన సవరణలో జాప్యం జరిగే పరిస్థితి ఉంటే 25% మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రధాన సంఘాలన్నీ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు కూడా అందజేశాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో.. ఆర్టీసీలో వేతన సవరణ అంశాన్ని కూడా దానికి అప్పగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోని మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలతో కూడిన కమిటీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర అధికారులు, గుర్తింపు కార్మిక సంఘం నేతలతో చర్చించనుంది. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా చూడాలన్న అభిప్రాయం ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తోంది. మొత్తంగా 15 శాతం నుంచి 18 శాతం మధ్య ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. -
నేడు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు, డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలతో కూడిన కమిటీ శుక్రవారం వారితో చర్చించనుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సమావేశం ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలకు సమాచారం అందినా ముందుగా మంత్రులతో చర్చించేలా ముఖ్యమంత్రి గురువారం కమిటీని ఏర్పాటు చేశారు. సచివాలయంలో మంత్రి ఈటల చాంబర్లో మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు జరగనున్నాయి. సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు మార్చిలో సభ నిర్వహించి అందుకు సంబంధించిన తీర్మానాలను ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున సీఎస్ ఎస్కే జోషికి గత నెలలో అందించారు. తాజాగా చర్చలకు మాత్రం టీజీవో, టీఎన్జీవో సంఘాలనే పిలిచినట్లు తెలిసింది. 18 రకాల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించగా.. ఏయే సమస్యలు, డిమాండ్లపై స్పష్టత వస్తుందోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సీపీఎస్, ఆర్డర్ టు సర్వ్ రద్దు, ఉద్యోగుల బదిలీలు, రిటైర్మెంట్ వయసు పెంపు, కొత్త పీఆర్సీ ఏర్పాటు వంటి కీలక అంశాలకు పరిష్కారం లభిస్తుందా? లేదా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవీ ప్రధాన సమస్యలు.. సీపీఎస్: రాష్ట్రంలో 1–9–2004 తర్వాత నియమితులైన 1.3 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్‌కు భద్రత లేకుండా చేసిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం కొనసాగేలా రాష్ట్రమే కేంద్రానికి ప్రతిపాదించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సీపీఎస్ వల్ల ఉద్యోగులు గ్రాట్యుటీకి కూడా నోచుకోని పరిస్థితి. కేంద్రంలో, పక్క రాష్ట్రంలో ఇస్తున్నా తెలంగాణలో అమలు కావడం లేదు. ఆర్డర్ టు సర్వ్: కొత్త జిల్లాలు ఏర్పడినపుడు 6 నెలలు తాత్కాలికంగా పని చేసేందుకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులిచ్చారు. దీంతో దాదాపు 25 వేల మంది ఉద్యోగులు స్వస్థలాలు వదిలి కొత్త జిల్లాల్లో పని చేస్తున్నారు. 20 నెలలు కావస్తున్నా శాశ్వత కేటాయింపులు జరగలేదు. బదిలీలు: ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలై తరువాత బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా బదిలీలు జరగలేదు. దీంతో వేలాది మంది ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏపీలో ఉన్న 1,200 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ: 2018 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన పీఆర్సీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కమిషన్ ఏర్పాటయ్యాక అధ్యయనానికే 6 నెలలు సమయం పడుతుంది. కాబట్టి వెంటనే పీఆర్సీ ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం 2,91,270 మంది ప్రభుత్వ, లక్షకు పైగా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, 2,55,336 మంది పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. సమాన వేతనం: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ న్యాయ వివాదాల్లో చిక్కుకుంది. వివిధ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న 60 వేల మందికి సమాన వేతనం కోసం డిమాండ్ చేస్తున్నారు. పదవీవిరమణ వయసు పెంపు: పక్కనున్న ఏపీ సహా 18 రాష్ట్రాల్లో, కేంద్రంలో రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. మనిషి సగటు జీవితకాలం పెరగడం, రెగ్యులర్ నియామకాలు లేనందున రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్: పంచాయతీరాజ్ టీచర్లు, ప్రభుత్వ టీచర్లకు ఓకే విధమైన నిబంధనలు 15 ఏళ్లుగా నలుగుతున్న సమస్య. పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినా న్యాయ వివాదంలో చిక్కుకుంది. దీని పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 15 శాతం క్వాంటమ్ పెన్షన్, తెలంగాణ ఇంక్రిమెంట్ల డిమాండ్ మూడేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. వీటితోపాటు వివిధ శాఖల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పండిట్, పీఈటీ అప్‌గ్రెడేషన్, రూ.398 వేతనంతో పని చేసిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు, గ్రంథాలయ, అగ్రికల్చర్, మార్కెట్ కమిటీ, యూనివర్సిటీలు, ఎయిడెడ్ వారికి 010 పద్దు కింద వేతనాలు చెల్లింపు, హౌసింగ్, మార్కెటింగ్ శాఖల్లో తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ ఉంది. -
లేఖల సెగ
జిల్లా పునర్విభజనలో కొత్త మలుపు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలపై ఆందోళనలు రాయపర్తి, జఫర్‌గఢ్‌లో ప్రజాగ్రహం ఎర్రబెల్లి, టి.రాజయ్య దిష్టిబొమ్మల దహనం ముత్తిరెడ్డి వైఖరికి నిరసనగా నేడు చేర్యాల బంద్ సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అధికార పార్టీ శాసనసభ్యులకు తలనొప్పులు తెస్తోంది. జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇచ్చిన ప్రతిపాదనలు ఆయా నియోజకవర్గాల్లో కొత్త చిచ్చు రేపుతున్నాయి. జనగామ జిల్లా ఏర్పాటు చేసి తమ నియోజకవర్గాలను అందులో కలపాలని ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రుల కమిటీకి లేఖలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలు పలు మండలాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యేలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రతిపాదనలు చేశారని రాయపర్తి, తొర్రూరు, జఫర్‌గఢ్, ధర్మసాగర్, చేర్యాల, మద్దూరు మండలాల ప్రజలు, మండల స్థాయి నేతలు విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నాయని ఆయా మండలాల నేతలు అంటున్నారు. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గం మొత్తం ప్రజల మనోభావాల ప్రకారం వ్యవహరించాలిగానీ.. ఏకపక్షంగా ప్రతిపాదనలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్యేల లేఖలు ఇప్పుడు వారి నియోజకవర్గాల్లో రాజకీయ ఇబ్బందులకు కారణమవుతున్నాయి. ‘నా పాలకుర్తి నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. ఈ లేఖపై రాయపర్తి మండలంలో నిరసనలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే దయాకర్‌రావు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్‌కు దగ్గరగా ఉండే తమ మండలాన్ని దూరంగా ఉండే జనగామ జిల్లాలో కలపడం ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వార్థరాజకీయాలకు నిదర్శమని డీసీసీ ఉపాధ్యక్షుడు బిల్ల సుధీర్‌రెడ్డి అన్నారు. తొర్రూరు మండలాన్ని వరంగల్ జిల్లాలో కొనసాగించాలని... కొత్తగా ఏర్పాటయ్యే మహబూబాబాద్‌లో కలిపినా ఫర్వాలేదని తొర్రూరు జేఏసీ కన్వీనర్ కె.ప్రవీణ్‌రాజు పేర్కొన్నారు. ఈ రెండు ప్రతిపాదనలకు భిన్నంగా జనగామలో కలిపితే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ‘నా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని జనగామ జిల్లాలో కలిపేందుకు నేను, నా నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య మంత్రుల కమిటీకి లేఖ ఇచ్చారు. ఎమ్మెల్యే టి.రాజయ్య లేఖపై ధర్మసాగర్, జఫర్‌గఢ్ మండలాల్లో వ్యతిరేకత మొదలైంది. జఫర్‌గఢ్ మండలం కూనూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జఫర్‌గఢ్ మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ధర్మసాగర్ మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని, మంత్రుల కమిటీకి ఇచ్చిన లేఖను ఎమ్మెల్యే టి.రాజయ్య వెనక్కి తీసుకోవాలని మండలంలోని పలువురు నేతలు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా ఏర్పాటు చేసి నియోజకవర్గం మొత్తాన్ని అందులోనే కలపాలని మంత్రుల కమిటీని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరడంపై చేర్యాల, మద్దూరు మండలాల్లో వ్యతిరేకత మొదలైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రతిపాదనకు వ్యతిరేకంగా చేర్యాల జేఏసీ, చాంబర్ ఆఫ్ కామర్స్, చేర్యాల పరిరక్షణ సమితి, కుల సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. చేర్యాల, మద్దూరు మండలాల్లో మంగళవారం(ఆగస్టు 16న) బంద్ నిర్వహిస్తున్నట్లు చేర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతినిధులు ఉడుముల భాస్కర్‌రెడ్డి, పుర్మ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. చేర్యాల, మద్దూరు మండలాలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రతిపాదనలు ఇవ్వడం సరికాదని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే సహించేదిలేదని పేరొన్నారు. జనగామ జిల్లాలో చేర్యాల ప్రాంతాన్ని కలపాలని చెప్పడం స్వార్థరాజకీయ ప్రయోజనల కోసం ఇచ్చిన ప్రతిపాదన అని విమర్శించారు. -
తాగునీటికి మాస్టర్‌ప్లాన్!
► మంత్రుల కమిటీ సిఫారసు ► త్వరలో కన్సల్టెన్సీ నియామకం ► 20 జోన్లుగా విభజన సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలని జలమండలిపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సూచించింది. గతంలో 1994లో మాత్రమే కోర్‌సిటీ నీటి సరఫరాకు మాస్టర్‌ప్లాన్ రూపొందిం చారు. ఆ తరువాత నగర శివార్లు శరవేగంగా విస్తరించడంతో పాటు జనాభా అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. దీంతో గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీలు దాహార్తితో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 625 చదరపు కి.మీ. పరిధిలో ఉన్న నగరానికి సమృద్ధిగా తాగునీరందించేందుకు గ్రేటర్‌ను 20 తాగునీటి జోన్లుగా విభజించి.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కన్వీనర్లుగా ఉన్న కమిటీ జలమండలిని ఆదేశించింది. ఈ కమిటీలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సభ్యులుగా ఉన్న విషయం విదితమే. తాజా మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా తక్షణం మంచినీటి సరఫరా నెట్వర్క్ పైప్లైన్లు, రిజర్వాయర్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించనున్నారు. వీటిపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధంచేసి కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న అమృత్ పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు ప్రయత్నాలు చేయాలని, లేనిపక్షంలో హడ్కో సంస్థ నుంచి రుణం సేకరించాలని నిర్ణయంచినట్లు సమాచారం. గతంలో జలమండలి రూపొందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం శివారు ప్రాంతాల్లో సుమారు రూ.3195 కోట్ల అంచ నా వ్యయంతో 436.28 కి.మీ. మేర తాగునీటి పైప్లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాజాగా స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి ఇంతకంటే అధికంగానే వ్యయమయ్యే అవకాశాలున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కన్సల్టెంట్ నియామకంతో అంచనా వ్యయం మారనుందన్నారు. మాస్టర్‌ప్లాన్ స్వరూపం ఇదే... ♦ గ్రేటర్‌ను 20 తాగునీటి జోన్లుగా విభజించే అంశంపై దృష్టి. ఆయా జోన్ల పరిధిలో స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ నెట్వర్క్ , ఇన్లెట్, అవుట్లెట్ మెయిన్లు ఏర్పాటు చేయాల్సిన కాలనీలు, బస్తీల గుర్తింపు. ♦ వివిధ జోన్ల పరిధిలో నూతనంగా వెలసిన కాలనీలు, జనాభా, తాగునీటి అవసరాలపై శాస్త్రీయ అంచనా రూపొందించడం. ♦ మల్కాజ్గిగి, అల్వాల్, కుత్బుల్లాపూర్తదితర శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతం నాలుగైదు రోజులకోమారు నీటి సరఫరా అందుతున్న ప్రాంతాల గుర్తింపు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు. ♦ శివారు మున్సిపల్ సర్కిళ్లలో నెట్వర్క్ విస్తరణకు గతంలో జలమండలి రూపొందించిన అంచనా వ్యయం వివరాలివే. -
భూసేకరణపై కసరత్తు
సాక్షి, గుంటూరు: నూతన రాజధాని నిర్మాణానికి కావాల్సిన భూమిని సేకరించే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. భూ సేకరణకోసం ఏర్పాటైన మంత్రుల కమిటీతో గురువారం గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు సమావేశమై జిల్లాలోని మొత్తం భూముల వివరాలు అందించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ శాతం ప్రభుత్వ, అటవీ భూములు లేకపోవడంతో రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను రైతుల నుంచి ఎలా సేకరించాలి, వారికి ఏ విధమైన ప్యాకేజీ ఇవ్వాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. జిల్లాకు సంబంధించి మొత్తం 28,13,510 ఎకరాల భూమి ఉండగా, . ఇందులో మొత్తం 4,00157.29 ఎకరాల అటవీ భూములని రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. మూడు నెలలుగా రెవెన్యూ అధికారులు, లాండ్ సర్వే అధికారులు భూముల స్థితిగతులు గుర్తించారు. వివరాలను సర్వే బృందాలు పరిశీలించి ఓ మ్యాపు తయారు చేసినట్టు తెలుస్తోంది. హైవే పక్కన అందుబాటులో ఉన్న భూములు, మండల వ్యాప్తంగా ఉన్న భూములు, కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని భూములు, ఉడా పరిధిలోని 27 మండలాలకు సంబంధించిన భూముల వివరాలు, మ్యాపులను వివిధ కోణాల్లో తయారు చేయించి నివేదికను హైదరాబాద్ తీసుకెళ్లిన కలెక్టర్ మంత్రుల కమిటీకి, సీఎంకి అందించినట్లు తెలుస్తోంది. ఇందులో మూడు మండలాలకు సంబంధించిన మ్యాపులను కమిటీ ప్రత్యేకంగా అడిగినట్లు సమాచారం. ఉడా పరిధిలోని ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్, మేడికొండూరు, పెదకూరపాడు, అమరావతి, పెదకాకాని, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో సైతం ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా సర్వే చేశారు. దీంతో పాటు తెనాలి డివిజన్లోని ఐదు మండలాల్లోనూ సర్వే జరగడం గమనార్హం. మొత్తం సమాచారం ఆధారంగా భూసేకరణపై మంత్రుల కమిటీ అధ్యక్షుడు నారాయణ, సభ్యుడు గల్లా జయదేవ్ గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లతో చర్చించారు. సీఎంతో సమావేశం : మంత్రులు కలెక్టర్లతో చర్చించాక అందరు కలిసి లేక్‌వ్యూ అతిథి గృహంలో సీఎంతో రాత్రి సమావేశం అయ్యారు. గుంటూరు కలెక్టర్ అందజేసిన నిపేదికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ల్యాండ్ పుల్లింగ్ ద్వారా భూసేకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.