తాగునీటికి మాస్టర్‌ప్లాన్!
► మంత్రుల కమిటీ సిఫారసు
► త్వరలో కన్సల్టెన్సీ నియామకం
► 20 జోన్లుగా విభజన
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా తాగునీటి అవసరాలు తీర్చేందుకు సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలని జలమండలిపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సూచించింది. గతంలో 1994లో మాత్రమే కోర్‌సిటీ నీటి సరఫరాకు మాస్టర్‌ప్లాన్ రూపొందిం చారు. ఆ తరువాత నగర శివార్లు శరవేగంగా విస్తరించడంతో పాటు జనాభా అనూహ్యంగా పెరుగుతూనే ఉంది. దీంతో గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీలు దాహార్తితో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 625 చదరపు కి.మీ. పరిధిలో ఉన్న నగరానికి సమృద్ధిగా తాగునీరందించేందుకు గ్రేటర్‌ను 20 తాగునీటి జోన్లుగా విభజించి.. సమగ్ర ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కన్వీనర్‌లుగా ఉన్న కమిటీ జలమండలిని ఆదేశించింది. ఈ కమిటీలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సభ్యులుగా ఉన్న విషయం విదితమే. తాజా మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా తక్షణం మంచినీటి సరఫరా నెట్‌వర్క్ పైప్‌లైన్లు, రిజర్వాయర్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించనున్నారు. వీటిపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధంచేసి కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న అమృత్ పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు ప్రయత్నాలు చేయాలని, లేనిపక్షంలో హడ్కో సంస్థ నుంచి రుణం సేకరించాలని నిర్ణయంచినట్లు సమాచారం. గతంలో జలమండలి రూపొందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం శివారు ప్రాంతాల్లో సుమారు రూ.3195 కోట్ల అంచ నా వ్యయంతో 436.28 కి.మీ. మేర తాగునీటి పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాజాగా స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి ఇంతకంటే అధికంగానే వ్యయమయ్యే అవకాశాలున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కన్సల్టెంట్ నియామకంతో అంచనా వ్యయం మారనుందన్నారు.
మాస్టర్‌ప్లాన్ స్వరూపం ఇదే...
♦ గ్రేటర్‌ను 20 తాగునీటి జోన్లుగా విభజించే అంశంపై దృష్టి. ఆయా జోన్ల పరిధిలో స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ నెట్‌వర్క్ , ఇన్‌లెట్, అవుట్‌లెట్ మెయిన్‌లు ఏర్పాటు చేయాల్సిన కాలనీలు, బస్తీల గుర్తింపు.
♦ వివిధ జోన్ల పరిధిలో నూతనంగా వెలసిన కాలనీలు, జనాభా, తాగునీటి అవసరాలపై శాస్త్రీయ అంచనా రూపొందించడం.
♦ మల్కాజ్‌గిగి, అల్వాల్, కుత్బుల్లాపూర్‌తదితర శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతం నాలుగైదు రోజులకోమారు నీటి సరఫరా అందుతున్న ప్రాంతాల గుర్తింపు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు.
♦ శివారు మున్సిపల్ సర్కిళ్లలో నెట్‌వర్క్ విస్తరణకు గతంలో జలమండలి రూపొందించిన అంచనా వ్యయం వివరాలివే.