ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టంలో సవరణలు
రాజధానిలో రూ.2,723.02 కోట్లతో రెండు పనులకు ఆమోదం
ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర
8న విశాఖలో ప్రధాని పర్యటన విజయవంతానికి రాజకీయ కమిటీ
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి
సాక్షి, అమరావతి: ‘రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా 22 ఏ, భూ సర్వే, భూ రికార్డుల సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని వెంటనే పరిష్కరించేందుకు, భూములకు సంబంధించి రెవెన్యూ నిబంధనల సరళతరం కోసం పరిశ్రమలు, మునిసిపల్, ఆర్థిక, రెవెన్యూ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది’ అని మంత్రి పార్థసారథి తెలిపారు. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించినట్లు తెలిపారు.
రైతులకు తదుపరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా వాటాను చూశాక... రైతు భరోసాలో రాష్ట్రం వాటాపై ఆలోచన చేయాలని చర్చించినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు ‘తల్లికి వందనం’ అమలు చేయాలని చర్చించినట్లు చెప్పారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏప్రిల్‌లో రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి మెగా డీఎస్సీతో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు రాజకీయ కమిటీని నియమించి కూటమి నేతలంతా జన సమీకరణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. విశాఖ పర్యటనలో ఎన్టీపీసీ ఇంటిగ్రేడెట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండ్రస్టియల్ హబ్, బల్క్ డ్రగ్ పార్కు, రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ భవనాలకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు.
⇒ తిరుపతిలో 50 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని వంద పడకలకు అప్‌గ్రెడేషన్, 191 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం.
⇒ ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సూచనల మేరకు రాజధానిలో మరో రూ.2,723.02 కోట్లతో రెండు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సీఆర్‌డీఏకు అనుమతి.
⇒ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్ట సవరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం. తద్వారా రాజధాని మాస్టర్ ప్లాన్‌తో పాటు జోనల్ డెవలప్‌మెంట్‌లో అవసరమైన మార్పులు.
⇒ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 6.35 ఎకరాల్లో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ఆమోదం.
⇒ కడపలో టీడీపీ కార్యాలయానికి గత ప్రభుత్వం రద్దు చేసిన రెండు ఎకరాలను తిరిగి కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం.
⇒ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐబీపీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో రిలయన్స్ లిమిటెడ్ నెలకొల్పే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వృథాగా ఉన్న ప్రభుత్వ భూమి అయితే ఎకరాకు ఏడాదికి 15 వేల చొప్పున, అదే రైతుల భూమి అయితే ఎకరాకు ఏడాదికి 30 వేల చొప్పున 15 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం.
డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో కారిడార్
విశాఖ, విజయవాడలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ రహదారులు ఉన్నచోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో కారిడార్ నిర్మించాలని నిర్ణయించింది. గురువారం సచివాలయంలో మెట్రో ప్రాజెక్టుల నిధుల అంశంపై సీఎం ఎన్.చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
విశాఖలో మొదటి స్టేజ్‌లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్‌లో మెట్రో నిర్మించాలన్న మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ. డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు.
అవార్డు గ్రహీతలకు సీఎం అభినందనలు
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మకమైన ఖేల్‌రత్న అవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment