నదిలోకి మురుగును కట్టడి చేసేలా చర్యలు
7,034 కి.మీ మేర సీవరేజీ పైపులైన్ నెట్‌వర్క్
మరోవైపు కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో భాగంగా మురుగు నీరు చేరకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ.17,212.69 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ ‘సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్’కు రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం 2.0 కింద మాస్టర్ ప్లాన్‌ను చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఆర్థిక చేయూత అందించాలని ప్రతిపాదించింది. చారిత్రక హైదరాబాద్ నగరంలో ఏళ్లనాటి మురుగు నీటి పైపులైన్ వ్యవస్థ కొనసాగుతోంది.
శివారుతో పాటు ఓఆర్‌ఆర్ పరిధిలో సైతం సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేకుండాపోయింది. గతంలో పంచాయతీలుగా ఉన్నప్పుడు వేసిన మురుగు కాల్వలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మొత్తమ్మీద ప్రస్తుతం 9,769 కిలో మీటర్లు మాత్రమే పైపులైన్ నెట్‌వర్క్ విస్తరించి ఉంది. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,656 కి.మీ, ఓఆర్‌ఆర్ పరిధిలో 4,378 కి.మీ మేర విస్తరించాలని ప్రతిపాదనలు ఉన్నా.. పెండింగ్‌లోనే మగ్గుతున్నాయి. దీంతో సమగ్ర కార్యాచరణలో మురుగు నీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
80 శాతం మురుగు..
మహా నగరంలోని 80 శాతం మురుగు మూసీలో చేరుతోంది. మిగిలిన 20 శాతం స్థానిక చెరువుల్లో కలుస్తోంది. నగరంలో మూసీ నది సుమారు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. దానికి ఇరువైపులా కలిపి 110 కిలోమీటర్ల పొడవునా మురుగు కలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో రోజువారీగా 2,815 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్డీలు ఉండగా, మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని (46 శాతం) శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మురుగు నీరు మూసీలో చేరకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. అందులో భాగంగానే పైపులైన్ నెట్‌వర్క్ వ్యవస్థ విస్తరణతో పాటు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణాల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమరి్పంచినట్లు తెలుస్తోంది.
7,034 కి.మీ సీవరేజీ నెట్‌వర్క్..
హైదరాబాద్‌తో పాటు శివారు, అవుటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన స్థానిక సంస్ధల (యూఎల్‌బీ) పరిధిలో సుమారు 7,034 కి.మీ పొడవున మురుగునీటి పైపులైన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. మొత్తమ్మీద ఓఆర్‌ఆర్ యూఎల్‌బీల పరిధిలో 27 పురపాలక సంఘాలను కలుపు కొని సుమారు 4,378 కి.మీ, జీహెచ్‌ఎంసీ పరిధి లోని శివారు, కోర్ సిటీ పరిధిని కలుపుకొని దాదా పు 2,656 కి.మీ పొడవున సీవరేజీ నెట్‌వర్క్ పైపులైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్‌ఎంసీలోని శివారు పరిధిలో మూడు ప్యాకేజీల్లో తొమ్మిది సర్కిల్స్ కలుపుకొని 2,232 కి.మీ, కోర్‌సిటీ పరిధిలోని 4 జోన్లలో 424 కి.మీ పైపులైన్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
రూ.4 వేల కోట్లతో సీవరేజీ ప్లాంట్లు..
మరోవైపు మూసీపై మురుగు నీటిశుద్ధి కోసం సుమారు 62 సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణాలకు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర సర్కారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ ప్రాజెక్టును సైతం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇప్పటికే మూడు ప్యాకేజీల్లో మొత్తం 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మాణాల ద్వారా సుమారు 1259.50 ఎంఎల్‌డీల మురుగునీటి శుద్ధి చేయాలని నిర్ణయించింది. ఇటీవల అమృత్ పథకం కింద 39 ఎస్టీపీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తాజాగా మూసీలో పూర్తిగా శుద్ధి చేసిన జలాలనే వదిలేలా మరికొన్ని ఎస్టీపీల నిర్మాణాలకు ప్రతిపాదించింది.
చదవండి: హైదరాబాద్‌లో మొత్తం చెరువులెన్ని.. ఎన్ని మిగిలాయి?
Comments
Please login to add a commentAdd a comment