సాక్షి, రంగారెడ్డి: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు విచారణలో భాగంగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. మాధవిని భర్త గురుమూర్తే దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. భార్య శరీర భాగాలను ముక్కలు చేసి ఉడికించడానికి పోటాషియం హైడ్రాక్సైడ్ వాడినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు.
మీర్‌పేట్ మాధవి హత్య కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. తాజాగా పోలీసులు విచారణలో భాగంగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. మాధవిని హత్య చేసిన తర్వాత గురుమూర్తి.. ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసి ఉడికించడానికి పోటాషియం హైడ్రాక్సైడ్‌ను వాడినట్టు పోలీసుల విచారణలో తేలింది. బాత్‌రూంలో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. వాటిని వేడి నీటలో ఉడికించి, బొక్కలు పొడి చేసి బాత్‌రూమ్ ఫ్లస్ ద్వారా డ్రైనేజీలోకి పంపించాడని పోలీసులు గుర్తించారు.
ఇక, ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా బ్లూ రేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇదే సమయంలో ఈనెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల రికార్డు ఫుటేజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు విషయమై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. కాగా, నేడు పోలీసుల చేతికి డీఎన్‌ఏ రిపోర్టు అందే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించారు. కేసు నుంచి తప్పించుకోడానికి మాజీ సైనికుడు గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. అయితే, మృతదేహాన్ని నరకడానికి ఉపయోగించిన కత్తి, చెక్క మొద్దును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆ కత్తిని ఏం చేశాడు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అసలు కారణం..
సంక్రాంతి పండుగ కోసం భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లాడు గురుమూర్తి. అక్కడే ఈ కుటుంబం పండుగ జరుపుకుంది. పిల్లలకు సెలవులు కావడంతో వారిని సోదరి ఇంటి దగ్గర వదిలేసి.. జనవరి 14న సాయంత్రం గురుమూర్తి, మాధవి తిరిగొచ్చారు. ఆ తర్వాత రోజు రాత్రి మాధవితో గొడవపడిన గురుమూర్తి.. ఆమెను కొట్టి విసురుగా తోసేయడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో కంగారుపడిపోయిన గురుమూర్తి, కేసు తనపై రాకుండా మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో రాత్రంతా వీడియోలు చూసి జనవరి 16న ఉదయం భార్య మృతదేహాన్ని ముక్కులుగా కట్ చేశాడు.
ఇంటి యజమాని కుటుంబంతో సహా బెంగళూరులో ఉండటం, పిల్లలు సోదరి ఇంట్లో ఉండటంతో గురుమూర్తికి కలిసొచ్చింది. జనవరి 17న మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. తనతో గొడవపడి అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో మాధవి తల్లి సుబ్బమ్మ మీర్‌పేటకు వచ్చి.. అల్లుడితో కలిసి బంధువులు, తెలిసినవారి ఇళ్లలో వాకబు చేసింది. ఆ మర్నాడు అల్లుడితో కలిసి వెళ్లి మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం, మాధవి ఇంట్లోంచి వెళ్లినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు. అతడిపైనే పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. తానే భార్యను చంపినట్లు ఒప్పుకున్నాడు.
వివాహేతర సంబంధం..
కాగా, భార్య మాధవి బంధువుల అమ్మాయితో గురుమూర్తి సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై మూడేళ్ల కిందటే గొడవ జరగడంతో ఇరువురూ తమ స్వగ్రామానికి వెళ్లడం మానేశారు. ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పండగలు, వేడుకలకు వెళ్లలేకపోతున్నామని భార్యాభర్తలు తరుచూ దీనిపై గొడవపడినట్టు వెలుగులోకి వచ్చింది. ఆ యువతిని పెళ్లిచేసుకోడానికే భార్యను గురుమూర్తి హత్య చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment