లెక్క తేల్చడంపై దృష్టిపెట్టిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశం
ఆ డేటాతో సమగ్ర నివేదిక రూపొందించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం పరిధిలో మొత్తంగా ఎన్ని చెరువులు ఉండేవి? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయి? అనే లెక్కలను శాస్త్రీయంగా తేల్చాలని ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’నిర్ణయించింది. దీని కోసం సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకోనుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర అధికారులు మంగళవారం హబ్సిగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లారు.
సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే దేబబ్రత పాలిత్‌తోపాటు ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. సర్వే ఆఫ్ ఇండియా గతంలో రూపొందించిన మ్యాప్‌లను రంగనాథ్ పరిశీలించారు. 1971–72 నాటి సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? అప్పట్లో వాటి విస్తీర్ణం ఎంత? నాలాలు ఎక్కడెక్కడ, ఎంత విస్తీర్ణంలో ఉండేవి? తదితర విషయాలు పరిశీలించారు. తాజా మ్యాప్‌లతో వాటిని సరిపోల్చి చూశారు. ఈ అంశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హైడ్రా బృందానికి వివరించారు.
పూర్తి వివరాలతో నివేదిక రూపకల్పనపై దృష్టి
చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్, మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియాలను గుర్తించడానికి, తాజాగా నిర్థారించడానికి ఇప్పటికే హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీలతో కలిసి ముందుకు వెళ్తున్న హైడ్రా.. ఇప్పటికే ఆయా విభాగాల నుంచి సమాచారం సేకరించింది. ఆ డేటాను సర్వే ఆఫ్ ఇండియా డేటాతో క్రోడీకరించనుంది. మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల పరిస్థితిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని నిర్ణయించింది. సర్వే ఆఫ్ ఇండియా డేటాను డిజిటలైజ్ చేయడంతోపాటు చెరువుల విస్తీర్ణం, నాలాల పొడవు, వెడల్పులను నిర్ధారించి ఈ నివేదికలో పొందుపర్చనుంది. నివేదికకు తుదిరూపు ఇచ్చాక తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. ప్రాధాన్యత క్రమంలో చెరువులను గుర్తించి పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment