ఆ సినిమా చూసి.. మాధవి కేసులో మరిన్ని కొత్త విషయాలు! | This Malayalam Movie Inspiration For Venkata Madhavi Case | Sakshi
Sakshi News home page

ఆ సినిమా చూసి.. మీర్‌పేట మాధవి కేసులో మరిన్ని కొత్త విషయాలు

Published Mon, Jan 27 2025 8:13 AM | Last Updated on Mon, Jan 27 2025 1:07 PM

This Malayalam Movie Inspiration For Venkata Madhavi Case

హైదరాబాద్‌, సాక్షి:  సంచలనం సృష్టించిన మీర్‌పేట వెంకట మాధవి హత్య కేసులో.. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్మయం కలిగించే విషయాలు బయటపడుతున్నాయి. మలయాళ హిట్‌ మూవీ సూక్ష్మదర్శిని ప్రేరణతోనే గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని మాయం చేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు.. ఈ కేసు దాదాపుగా ఓ కొలిక్కి రావడంతో నిందితుడిపై పోలీసులు చర్యలకు దిగనున్నారు.

వెంకట మాధవి మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో అనే ఆలోచనలో గురుమూర్తికి ఈ  ఆలోచన తట్టింది. సూక్ష్మదర్శిని సినిమా తరహాలోనే మృతదేహాన్ని డిస్పోస్‌ చేశాడు గురుమూర్తి. ఆ చిత్రంలో మాదిరే.. భార్య మాధవి మృతదేహాన్ని కెమికల్స్‌లో నానబెట్టి, ఆపై కాల్చి పొడి చేశాడు గురుమూర్తి. ఇవాళ డీఎన్‌ఏ రిపోర్ట్‌తో పాటు క్లూస్‌టీం ఆధారంగా ఇచ్చే నివేదిక వచ్చే అవకాశం ఉంది. దీంతో.. సాయంత్రంలోగా నిందితుడపై యాక్షన్‌కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

నజ్రియా, బసిల్‌ జోసెఫ్‌ కీలక పాత్రల్లో ఎం.సి.జతిన్‌ రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘సూక్ష్మదర్శిని’. మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం ప్రస్తుతం అందుబాటులో ఉంది. తన చుట్టు పక్కల జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ ఉన్న ఇల్లాలు.. తన పక్క ఇంట్లో జరిగిన ఓ ఘోరమైన నేరాన్ని ఎలా బయట పెట్టిందన్నది ఈ చిత్ర కథ.

దుర్వాసన రాకుండా..
మీర్‌పేట పరిధి జిల్లెలగూడ న్యూవెంకటేశ్వరనగర్‌ కాలనీలో ఉండే మాజీ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి ఈ నెల 15న భార్య వెంకటమాధవిని హత్య చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రకాశం జిల్లాలోని సొంతూరులో మరో మహిళతో వివాహేతర బంధం వ్యవహారం తెలిసినప్పుడు భార్య తరఫు కుటుంబీకులు గురుమూర్తిపై దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు భార్య మరణం విషయం తెలిస్తే దారుణంగా స్పందిస్తారేమోనని భయపడ్డాడు. ఇంటర్నెట్‌లో మృతదేహం ఎలా ముక్కలు చేయాలని వెతికాడు. చైతన్యపురిలో నర్సు హత్య ఉదంతంతోపాటు వెబ్‌సిరీస్‌లు, సినిమాల ప్రేరణ పొందాడు. ఇంట్లో అందుబాటులో ఉన్న హ్యాక్సా బ్లేడుతో తలను వేరుచేసి మొండేన్ని మూడు ముక్కలు చేశాడు. ఆ తర్వాత బకెట్‌లో వేడినీటిలో ముక్కల్ని ఉడికించిన తర్వాత మళ్లీ పెద్ద స్టవ్‌ మీద కాల్చాడు. ఈ క్రమంలో ముక్కలు మాంసం ముద్దలుగా మారిపోయాయి. పొరుగింట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని ద్రావణాలు వాడాడు. సాయంత్రం వరకూ ఈ పనిపూర్తి చేసి మీర్‌పేటలోని పెద్ద చెరువులో వేశాడు. 

ఆ తర్వాత తనకేం తెలియనట్లు భార్య తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి వెంకట మాధవి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాక అతడిచ్చిన సమాచారంతో చెరువులో మృతదేహం ముక్కల కోసం పోలీసులు వెతికారు. ఎలాంటి ఆనవాళ్లు లభించక.. పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే దఫదఫాలుగా ఫోరెన్సిక్, క్లూస్‌టీంలతో ఇంటిని పరిశీలించినప్పుడు తల వెంట్రుకలు, స్టవ్, వాటర్‌ బకెట్, హీటర్‌ వద్ద కొన్ని రక్తం, ఆనవాళ్లు లభించాయి. వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి విశ్లేషించారు. ఇవన్నీ వెంకట మాధవివేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. 

ఇక ఈ కేసులో ముందుకు వెళ్లే కొద్దీ పోలీసులకు కొత్త విషయాలు వెలుగు తెలుస్తున్నాయి. ఘటన తర్వాత ఎనిమిది సార్లు గురుమూర్తి ఫోన్‌ మాట్లాడాడు. అందులో.. బడంగ్‌పేటలో ఉన్న సోదరితోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. నిందితుడి ఫోన్‌ కాల్‌ డాటా సేకరణలో ఈ విషయాలు వెలుగు చూశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement