సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ చిల్లెలగూడలో జరిగిన దారుణ హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు విచారణలో భాగంగా గురుమూర్తి నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిన గురుమూర్తి, ఓ వెబ్ సిరీస్ తరహాలో మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలని చూసినట్టు పోలీసులు నిర్ధారించారు.
మీర్‌పేట్‌కు చెందిన మాధవి హత్య కేసులో ఆమె భర్త, నిందితుడు గురుమూర్తిని పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక, ఇప్పటికే రెండుసార్లు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరోసారి సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. సుమారు మూడు గంటల పాటు గురుమూర్తి ఇంట్లో క్లూస్ టీమ్ సోదాలు నిర్వహించింది. అలాగే, సీసీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, మాధవి హత్య కేసులో ఇద్దరు పిల్లల స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేశారు. పిల్లల స్టేట్‌మెంట్ సందర్భంగా కూడా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తమ తల్లి కనిపించకపోయిన తర్వాత ఇంట్లో చెడు వాసన వచ్చినట్టు పిల్లలు తెలిపారు. అలాగే, కుటుంబ సభ్యలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. నిందితుడు విషయాలపై ఆధారపడకుండా పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడి ఫోన్ పరిశీలించినప్పుడు మరో మహిళ ఫొటోలు కొన్ని ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన నమోదు చేసిన వెంకట మాధవి అదృశ్యం కేసును హత్య కేసు సెక్షన్ల కింద మారుస్తున్నారు. కేసు విషయంలో నేడు కొంత స్పష్టత వచ్చే అవకాశముంది.
జరిగింది ఇదీ..
ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా చేరి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్‌డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.
సంక్రాంతి పండుగ సందర్భంగా గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటి దగ్గర దింపాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయం సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేవారు. 15వ తేదీన ఉదయం గురుమూర్తికి భార్యకు గొడవ మొదలైంది. మరో మహిళతో సంబంధం, ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు భార్య చూసింది. అప్పటికే భార్యను హతమార్చాలని కసితో ఉన్న గురుమూర్తి అనుకున్నంత పని చేశాడు. భార్యను తలమీద కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన వెబ్‌సిరీస్‌లోని పాత్రల తరహాలోనే మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా మృతదేహాన్ని టాయిలెట్‌లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు.
శరీరాన్ని ముక్కలుగా చేసి..
ఆ తర్వాత బకెట్ నీళ్లను హీటర్‌తో వేడి చేసి ముక్కల్ని వేశాడు. ముక్కలు మొత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు. ఎముకల్ని ముక్కలుగా చేసి అంతా సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత దాదాపు రెండ్రోజులు నిద్రలేకుండా ఇదంతా చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో శుభ్రం చేశాడు. 17వ తేదీ సాయంత్రం భార్య కనిపించడం లేదని వెంకట మాధవి తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేయించాడు.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే పోలీసులకు గురుమూర్తి మీద అనుమానమొచ్చింది. మాధవి ఇంటి లోపలికి వెళ్లడం తప్ప బయటకు వచ్చే దృశ్యాలు రికార్డవలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు అసలు విషయం బయటపడింది. బుధ, గురువారాల్లో నిందితుడి నివాసాన్ని పరిశీలించిన క్లూస్‌టీం, ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్, వాటర్ హీటర్‌తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించాయి. వీటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. బకెట్‌లో వేసి శరీరం ముక్కలు ఉడికించినట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.
పోలీసులకే ట్విస్ట్..
నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా, అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. శరీరం ఆనవాళ్లు లభ్యమైనా వెంకట మాధవి పిల్లల డీఎన్‌ఏతో పోల్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. క్లూస్‌టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది. వెంకట మాధవి అదృశ్యంపై కేసు నమోదు చేశామని, ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్లు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment