meerpet police
-
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరిపై పీడీయాక్ట్
సాక్షి, రంగారెడ్డి: గుట్టుచప్పుడు కాకుండా ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మీర్‌పేట పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఎల్లంపేటకు చెందిన గంధ భవానీ(25) తన స్నేహితుడైన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకు చెందిన కసిరెడ్డి దొరబాబు (23)తో కలిసి మీర్‌పేట టీకేఆర్ కళాశాల సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రవాణా చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు అక్టోబరు 13వ తేదీన ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు గంధ భవానీ, కసిరెడ్డి దొరబాబును అరెస్ట్ చేసి.. నగరానికి చెందిన ఇద్దరు మహిళలను రక్షించారు. భవిష్యత్‌లో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడకుండా సీపీ ఆదేశాల మేరకు పోలీసులు భవానీ, దొరబాబుపై బుధవారం పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. చదవండి: మహిళా యూట్యూబర్‌పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్.. -
పుట్టినరోజు వేడుకలకొచ్చిన మామ ఇంట్లో అల్లుడు చోరీ
సాక్షి, సిటీబ్యూరో: పుట్టినరోజు వేడుకల కోసమని వచ్చిన మామ ఇంట్లో చోరీకి స్కెచ్ వేశాడో వ్యక్తి. స్నేహితులను ఉసిగొల్పి.. వారితో దోపిడీ చేయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. డీసీపీ క్రైమ్స్ యాదగిరితో కలిసి ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ శనివారం వివరాలు వెల్లడించారు. సైదాబాద్, కుర్మగూడకు చెందిన యాసిర్ ఉల్లిఖాన్ గత నెల 31న పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అతడి మామ హాజరయ్యాడు. అతను ధరించిన ఖరీదైన గడియారాలు, ఆభరణాలను చూసిన యాసిర్‌కు దుర్బుద్ధి పుట్టింది. మామ ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ వేశాడు. ఇదే విషయాన్ని అతని స్నేహితులైన మహ్మద్ అయ్యాజ్ ఖాన్, హమ్దాన్ అశ్వాక్లకు సూచించాడు. ముగ్గురు కలిసి పథకం పన్నారు. గత నెల 31న అశ్వాక్ బురఖా ధరించి అయాజ్ ఖాన్ బైక్‌పై మీర్‌పేటలోని షరీఫ్‌నగర్‌లోని ఉల్లిఖాన్ మామ ఇంటి పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఇంటి బయట అయాజ్ కాపు కాస్తుండగా.. అశ్వాక్ ఇంటి అద్దాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చుకున్న స్క్రూడ్రైవర్‌తో మొదటి, రెండో అంతస్తులోని అల్వారాలను తెరిచి, అందులోని సొత్తును చోరీ చేసి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీర్‌పేట ఠాణా పరిధిలో శనివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా సంచరిస్తున్న అశ్వాక్, అయాజ్, ఉల్లిఖాన్లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.33.02 లక్షల విలువ చేసే 36 తులాల బంగారం ఆభరణాలు, 9 ఖరీదైన చేతి గడియారాలు, 405 అమెరికన్ డాలర్లు, బైక్, సెల్‌ఫోన్, డిజిటల్ కెమెరాలను స్వా«దీనం చేసుకున్నారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు.. ఘరానా దొంగ రమేష్ అరెస్టు -
దొంగలు అరెస్ట్: భారీగా బంగారు, వెండి స్వాధీనం
హైదరాబాద్: తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అమర్‌రాజ్ అనే పాత నేరస్తుడిని, కుమార్ రెడ్డి, కరమోత్ సంతోష్ అనే ఇద్దరు నిందితులను మీర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 28 తులాల బంగారు ఆభరణాలు,13 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మూడు బైక్‌లు, ఒక ఐపోడ్, రెండు మొబైల్ ఫోన్లు, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. -
చోరీ చేస్తూ అడ్డంగా దొరికిన ఎస్ఐ
హైదరాబాద్: సామాన్య ప్రజలను దొంగల భయం నుంచి రక్షించాల్సిన ఓ పోలీస్ చోరీలకు పాల్పడుతున్నాడు. కథ అడ్డం తిరగడంతో చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన నగరంలోని మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మహేందర్ రెడ్డి నగరంలో సీసీఎస్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే నేటి(శుక్రవారం) ఉదయం మహేందర్ రెడ్డి మీర్ పేట ఏరియాలో దొంగతనానికి యత్నించాడు. సరిగా అదే సమయంలో మీర్ పేట పోలీసులకు మహేందర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. మహేందర్ రెడ్డిని మీర్ పేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దారి దోపిడీ ముఠా అరెస్ట్
హైదరాబాద్ : దారి దోపిడీకి పాల్పడిన ఓ ముఠాను మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి కారు, బైక్‌తోపాటు రూ. 6.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్, మీర్‌పేట ఇన్స్పెక్టర్ భిక్షంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 13న తెలుగు రాములు అనే వ్యక్తి బాలాపూర్ చౌరస్తా మీదుగా కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. సాయినగర్ కాలనీలో లెనిన్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కేతావత్ రఘు (25), మన్సురాబాద్‌కు చెందిన కేంసారం హరీశ్ (22), ప్రశాంతినగర్‌కు చెందిన పెయింటర్ ఎర్లపల్లి జగదీప్ (19) లిఫ్ట్ ఇవ్వాలని కారు ఎక్కారు. కొద్ది దూరం వెళ్లాక డ్రైవర్ రాములును కత్తులతో బెదిరించి దాడి చేశారు. అనంతరం రాములు వద్దనున్న రూ.6 లక్షల 50 వేలు లాక్కొని, అతని కారుతోపాటు ఉడాయించారు. బాధితుడి మీర్‌పేట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. స్పెషల్ టీమ్‌కు ఈ కేసును అప్పగించటంతో గాలింపు తీవ్రం చేశారు. ఈ నెల 21న విరాట్‌నగర్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు దుండగులు ఎత్తుకెళ్లిన రాములు కారు (టీఎస్ 08 వైడీ టీఆర్ నెం.4833) కనిపించింది. పోలీసులు ఆ కారును ఆపి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టారు. నిందితుల నుంచి కారుతో పాటు బైక్, నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు. ఇదిలావుండగా కేతావత్ రఘు గతంలో తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల తవ్వకాల కేసులో జైలు శిక్ష అనుభవించినట్లు ఏసీపీ తెలిపారు. మరో నిందితుడు కేంసారం హరీశ్ సీతాఫల్మండి, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర పోలీస్ స్టేషన్ పరిధుల్లో చోరీలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. -
దేవరకొండ టీడీపీ అభ్యర్థి కుమార్తె ఆచూకీ లభ్యం
మూడు రోజుల క్రితం అదృశ్యమైన దేవరకొండ టీడీపీ అభ్యర్థి బిల్యానాయక్ కుమార్తె హారికా క్షేమంగా ఉన్నట్లు నగరంలోని మీర్పేట్ పోలీసులు శనివారం వెల్లడించారు. అదృశ్యానికి గల కారణాలపై ఆమెను విచారిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హారికను ఆమె తల్లితండ్రులకు అప్పగిస్తామన్నారు. ఇప్పటికే హారిక క్షేమంగా ఉన్నట్లు ఆమె తండ్రి బిల్యానాయక్‌కు సమాచారం అందించారమన్నారు. నల్గొండ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి కేతావత్ బిల్యానాయక్ కుమార్తె మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. దాంతో ఆయన తన కుమార్తె ఆచూకీ తెలపాలంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... హారిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.