
భార్య ఎముకలు మాయం చేసేందుకు గురుమూర్తి చేసింది ఇదే..
‘మీర్‌పేట’ మర్డర్ కేసులో వెలుగులోకి వస్తున్న కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: ‘భార్యను చంపి, ఉడకబెట్టిన’ కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ముక్కలు చేశాక..ఉడకబెట్టడానికి కాస్టిక్ సోడాను, ఎముకలను పొడి చేయడానికి రోలు, పొత్రం వినియోగించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిసింది. భార్యను చంపిన తర్వాత మృతదేహాన్ని మాయం చేయడానికి ఓ సినిమాతోపాటు ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేయడం ద్వారా లభించిన వీడియోలను చూసి ఈ ప్లాన్ అమలు చేశాడని గుర్తించినట్టు సమాచారం.
ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇదే పనిలో ఉన్నాడని తేల్చినట్టు తెలిసింది. రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని మీర్‌పేట పరిధి జిల్లెలగూడలో జరిగిన వెంకట మాధవి హత్య కేసులో పోలీసులు ఒక్కో చిక్కుముడి విప్పుతున్నారు. ఆధారాలు సేకరించడానికి ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదిస్తూ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.
బయటికెళ్లి సామగ్రి కొనుక్కొచ్చి..
ఈ నెల 14న రాత్రి గొడవ జరగడంతో గురుమూర్తి మాధవి తలను బలంగా గోడకేసి కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి, కాసేపటికే మరణించింది. గురుమూర్తి మరుసటి రోజున ఐదుసార్లు ఇంట్లోంచి బయటికి వెళ్లి వచి్చనట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అలా వెళ్లి వస్తూ మాంసం కొట్టే మొద్దు, కత్తి, కాస్టిక్ సోడా, కొత్త వాటర్ హీటర్ కొనుక్కువచి్చనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని బాత్‌రూమ్‌లోకి లాక్కుపోయిన గురుమూర్తి..అక్కడే మాంసం కొట్టే మొద్దుపై కత్తితో ముక్కలు చేశాడు. పెద్ద బకెట్‌లో హీటర్ పెట్టి నీళ్లు మరిగిన తర్వాత ముక్కల్ని అందులో వేశాడు.
మాంసం పూర్తిగా ఉడికిపోయి విడిపోవడానికి అందులో కాస్టిక్ సోడా కలిపి ఉంటాడని.. ఉడికిపోయాక కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసి ఉంటాడని ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నారు. ఇక ఎముకలను స్టవ్ మీద పెట్టి కాల్చి..తర్వాత రోలుపై పెట్టి పొత్రంతో కొట్టి పొడిగా మార్చాడని పోలీసులు నిర్ధారించినట్టు తెలిసింది. తర్వాత ఎముకల పొడి, కత్తిని జిల్లెలగూడ చెరువులో పారేసినట్టు సమాచారం.
మృతదేహాన్ని మాయం చేయడం పూర్తయ్యాక ఆధారాలేవీ చిక్కకుండా రోలు, పొత్రం, మొద్దును, బాత్‌రూమ్‌ను పలుమార్లు కడిగేశాడని...పదే పదే నీటిని ఫ్లష్ చేస్తూ డ్రైనేజీలోనూ ఎలాంటి ఆనవాళ్లు మిగలకుండా చేశాడని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అయితే ఫోరెన్సిక్ నిపుణులు స్టవ్‌పై చిన్న మాంసం ముక్క, వెంట్రుకలతోపాటు మాధవి తలను గోడకు కొట్టిన చోట రక్తపు మరకల్ని గుర్తించారని..డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment