![Another Sensation In The Meerpet Madhavi Case](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/meerpet-madhavi-case4.jpg.webp?itok=AP1ySkvY)
సాక్షి, హైదరాబాద్: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తతో కలిసి మరో ముగ్గురు హత్య చేసి ఉంటారనే అనుమానాలున్నాయి. ఆ ముగ్గురిలో ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు సహకరించిన వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. అవసరమైతే గురుమూర్తికి పాలీగ్రాఫ్ టెస్ట్‌లు నిర్వహించే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.
ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే అతడిని రిమాండ్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మీర్‌పేట పోలీసులు కస్టడీ పిటిషన్ వేసి గురుమూర్తిని విచారణ నిమిత్తం శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. సరూర్‌నగర్‌లోని సీసీఎస్ లేదా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12 వరకు వరకు అతన్ని విచారణ చేయనున్నట్లు సమాచారం.
ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా చేరి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్‌డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేశాడు.
మరోవైపు.. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా, అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. శరీరం ఆనవాళ్లు లభ్యమైనా వెంకట మాధవి పిల్లల డీఎన్‌ఏతో పోల్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. క్లూస్‌టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది. వెంకట మాధవి అదృశ్యంపై కేసు నమోదు చేశామని, ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్లు పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ఉన్మాదిలా మారి.. 70 సార్లు కత్తితో పొడిచి..
Comments
Please login to add a commentAdd a comment