సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట(Meerpet Case) వెంకటమాధవి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. గురుమూర్తి(Gurumurthy) కాల్ డేటా Call Data) మొత్తాన్ని చెక్ చేసిన పోలీసులు.. అతనికి ఎవరితోనైనా వివాహేతర సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఆధారాలు దొరకకుండా భార్యను హత్య చేయడం వెనుక మరో మహిళతో అక్రమ సంబంధం కారణంగానే భార్యను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మాధవి మృతదేహం బూడిద ఆధారాల కోసం పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు: డీసీపీ
ఎల్‌బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో విచారణ కొనసాగుతుందని.. ఇప్పటివరకు మిస్సింగ్ కేసు గానే మేము విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. సీసీ కెమెరాలు రికార్డయిన దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. వెంకట మాధవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ కూతురిని గురుమూర్తే హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
బాడీని ముక్కలు ముక్కలు చేసి చెరువులో పడేసినట్లు ఇంకా ఆధారాలు దొరకలేదు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో మాత్రం వెంకట మాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు దృశ్యాలు లేవు. వెంకట మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసినట్లు వాళ్ల కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వెల్లడించారు.
ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ గురుమూర్తి (39), వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలోకి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి విపరీత ప్రవర్తన, అనుమానిస్తూ వేధిస్తుండటంతో భార్య మాధవి ఇబ్బందిపడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా హత్యచేశాడు. కానీ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరికీ చెప్పాడు. మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: హైదరాబాద్: కిడ్నీ ఆపరేషన్ కేసులో కీలక మలుపు
ఇంట్లో గొడవ జరిగిన సమయంలోనే మాధవిని గురుమూర్తి హత్య చేశాడు. కానీ ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతో పాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్‌పేట్ సీఐ నాగరాజు తెలిపారు.
భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్ చేశాడు. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించాడు. క్రైమ్, హర్రర్ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్‌లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి, ఉడకబెట్టాడు. ఎండబెట్టి, కాల్చి పొడి చేశాడు.
మాధవి మిస్సింగ్ కేసు నేపథ్యంలో.. జిల్లెలగూడ న్యూవేంకటేశ్వర కాలనీలో గురుమూర్తి, మాధవి నివాసమున్న ఇల్లు, పరిసర ప్రాంతాలను పోలీసులు మూడు రోజులుగా క్షుణ్నంగా పరిశీలించినట్టు తెలిసింది. ఆమె హత్యకు గురై ఉంటే ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని డ్రైనేజీ మ్యాన్‌హోల్స్, నాలాలను కూడా తెరిచి పరిశీలించినట్టు స్థానికులు తెలిపారు. కానీ నిందితుడిని విచారించిన సమయంలో అసలు సంగతి బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment