Musi riverfront development project: గ్రేటర్ భాగ్యరేఖ..చారిత్రక మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)తయారీకి చర్యలు తీసుకోవాలని ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.
(చదవండి: అధిక సీరో పాజిటివిటీ కాపాడుతోంది!)
ప్రస్తుతం అక్కడక్కడా చేపట్టిన సుందరీకరణ పనులు మినహా..శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేపట్టకపోవడంతో ఈ దిశగా చర్యలు చేపట్టారు. త్వరలో మాస్టర్‌ప్లాన్ తయారీకి ముందుకొచ్చే సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. మూడునెలల కాలవ్యవధిలోగా ప్రణాళిక సిద్ధం చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అంతర్జాతీయంగా పేరొందిన దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ మాస్టర్‌ప్లాన్ తయారీకి ముందుకొచ్చే అవకాశాలున్నట్లు సంస్థ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
పనులు ఇలా...
- ∙నూతనంగా సిద్ధం చేయనున్న మూసీ మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధి, ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.
- ∙ప్రధానంగా నగరంలో నది ప్రవహించే బాపూఘాట్–నాగోలు(25 కి.మీ) మార్గంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
- ∙మార్గమధ్యలో నదిలోకి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వ్యర్థజలాలు చేరకుండా ఆయా నీటిని నూతనంగా నిర్మించే ఎస్టీపీల్లో శుద్ధిచేసిన అనంతరమే నదిలోకి చేరేలా ఏర్పాట్లు చేయనున్నారు.
- ∙నదికి ఇరువైపులా సుమారు 13 నూతన బ్రిడ్జిలు..14 చోట్ల సుందరమైన ఉద్యానవనాలను తీర్చిదిద్దనున్నారు.
- ∙ఇప్పటికే సిటీలో మూసీని మూసేస్తూ ఏర్పాటుచేసిన పదివేలకు పైగా ఉన్న ఆక్రమణలను తొలగించడం, పట్టా భూములు, స్థిర ఆస్తులు కోల్పోయే బాధితులకు పరిహారం అందజేయడం వంటి అంశాలను ఈ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చనున్నారు.
- ∙ఈ పనులన్నీ వచ్చే ఏడాది జూన్‌లో మొదలుపెట్టి..2023 జూన్ నాటికి సగం పనులు పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించుకోవడం విశేషం.
- నిధుల సమీకరణకు యత్నాలు..
- మాస్టర్‌ప్లాన్ అమలుకు అవసరమైన నిధుల సమీకరణకు యత్నాలు మొదలయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు నిర్మాణ సంస్థలకు బీఓటీ విధానంలో అప్పజెప్పడం లేదా భూములను విక్రయించడం లేదా హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపట్టడం..రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని బడ్జెటరీ నిధుల ద్వారా కేటాయించడం తదితర ఆర్థిక అంశాలపై మున్సిపల్ శాఖ తాజాగా దృష్టిసారించినట్లు సమాచారం.
(చదవండి: కరోనా చావులు.. కాకి లెక్కలు!)
Comments
Please login to add a commentAdd a comment