ముగిసిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్
మూడు రోజుల పాటు సకల కళల సంగమంగా సందడి
కవులు, కళాకారులు, ఎన్జీవోలు, ప్రముఖుల చర్చలు
గొప్ప అనుభూతిని అందించిందన్న సందర్శకులు
భాగ్యనరం వేదికగా మూడు రోజుల పాటు జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ ఆదివారంతో ముగిసింది. ఇందులో అనేక మంది మేధావులు, కవులు, కళాకారులు, ఎన్జీవోలు తమ అభిప్రయాలను తమ తమ కళలు, రచనలు, ప్రసంగాల ద్వారా సందర్శకులతో పంచుకున్నారు. ఓ రకంగా ఇది సకలం.. సంగమం అన్నట్లు.. సందర్శకులతో సందడిగా మారింది. ఈ ప్రదర్శన ఎంతో గొప్ప అనుభూతిని పంచిందని పలువురు సందర్శకులు చెబుతున్నారు. కాగా ఇందులో ప్రముఖులతో పాటు సినీ తారలు కూడా భాగస్వామ్యం కావడం గమనార్హం.
నగరం వేదికగా నిర్వహించిన సాహితీ కళల సంగమం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ముగిసింది. కేవలం కళలు, కవితలకు మాత్రమే కాదు సంగీత వేదికలు, సేవా సంస్థల కార్యక్రమాలు, ఇంకా మరెన్నో విశేషాలకు ఈ ఫెస్ట్ చిరునామాగా నిలిచింది. మూడు రోజుల పాటు సందర్శకులకు వైవిధ్యభరిత అనుభూతులు పంచిన ఈ ఈవెంట్‌లో తమతమ కళలు, కార్యక్రమాల ద్వారా పాల్గొన్నవారితో సాక్షి జరిపిన చిరు ముచ్చట..వారి అనుభూతులు వారి మాటల్లోనే..
ప్రముఖులకు చేరువగా..
నేను ఆర్ట్ కళాశాల విద్యార్థిని. మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు. అక్కడ నేను చిన్ననాటి నుంచి చూసిన చాట తదితర వస్తువులు, వ్యవసాయ పరికరాలను ఉపయోగించి కళాత్మక వస్తువును తయారు చేశాను. హెచ్‌ఎల్‌ఎఫ్‌లో ఈ కళను ప్రదర్శించడంలో అనేక మంది ప్రముఖుల ప్రశంసలు లభించడం సంతోషాన్ని ఇచి్చంది.
– అనూఖ్య, పెద్దపల్లి కరీంనగర్
రాతి.. విలువ తెలిపేలా..
తెలంగాణలోని రాతి శిలలు చాలా వైవిధ్యమైనవి. 2500 యేళ్ల నాటి అరుదైన, అపురూపమైనవి. వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శిలలను పోగొట్టుకుంటే నీటి వనరులు, పక్షులతో సహా చాలా కోల్పోతాం. వీటిపై నగరవాసులకు అవగాహన లేదు. యేటా జరిగే హెచ్‌ఎల్‌ఎఫ్‌లో క్రమం తప్పకుండా పాల్గొంటాం. ఈ వేదిక ద్వారా యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కలి్పస్తున్నాం.
– పద్మిని పటేల్, జాయింట్ సెక్రెటరీ, సేవ్ రాక్స్ సంస్థ
బంజారా కళకు గుర్తింపుగా..
మేం బంజారాలం. నేను ఫైన్ ఆర్ట్స్‌కి వచ్చాక బంజారా హస్తకళలు నేర్చుకున్నాను. క్రాఫ్ట్‌తో చిత్రం రూపొందించే ఆలోచనతో ఇది చేశాను. దీనిని గమనిస్తే బంజారా క్రాఫ్ట్, వస్త్రధారణ విలువ తెలుస్తుంది. కనెక్టింగ్ ఫ్యామిలీ.. అనే థీమ్‌తో తల్లిదండ్రులు మన కోసం చేసే త్యాగం ఎలాంటిది? దానిని మనం ఎలా గుర్తించాలి? అనే థీమ్‌తో ఈ కళారూపాన్ని తీర్చిదిద్దాను. బంజారా హస్తకళలను ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేయడం ఆనందంగా ఉంది.
– నవీన్‌నాయక్, సంగాగుడి తాండా, మెదక్ జిల్లా
పేదల విద్యకు అండగా..
నిరుపేద విద్యార్థులకు ఖరీదైన విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన ఎన్జీవో మాది. విదేశాల నుంచి తిరిగి వచి్చన మహిళ శోభ భన్సాలీ దీన్ని ప్రారంభించారు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఉండే బుక్స్, ఇతర విశేషాలను ప్రభుత్వ పాఠశాలలు, కొన్ని చిన్నచిన్న ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు పరిచయం చేయడం మా సంస్థ లక్ష్యం. దీనిలో భాగంగా.. స్టోరీ టెల్లింగ్ సెషన్, వర్క్‌షీట్స్, కలరింగ్ నిర్వహిస్తాం. మొబైల్ లైబ్రరీ ద్వారా పుస్తకాలను అందించడం, ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెంపొందించడమే లక్ష్యం. నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 53 పాఠశాలలకు చెందిన చిన్నారులు మా ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. దీని ద్వారా మరింత మందికి చేరువవ్వాలనేదే లక్ష్యం.
– రాజేశ్వరి, పుస్తకారా
నేషన్స్ రాక్ బీట్..
శ్రియా గుప్తా అనే కార్పొరేట్ ఉద్యోగిని క్రియేటివ్ ఆర్ట్ హౌస్ ప్రారంభించారు. ఇందులో ఉండే మేమంతా వీకెండ్స్‌లో మాత్రమే ఆరి్టస్టులం. మిగిలిన రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగులం. వారాంతాల్లో రెండు రోజుల పాటు కళాత్మక హృదయాల కోసం పనిచేస్తాం. ఈ నేషన్స్‌రాక్ బీట్స్‌లో వివిడ్, ఇండి ఎక్స్‌ప్రెస్, రాగా.. తదితర పేర్లతో 7 బ్యాండ్స్ ఉన్నాయి. మా ఈవెంట్స్‌లో మ్యూజిక్, డ్యాన్స్, స్టోరీ టెల్లింగ్, పొయెట్రీ, స్టాండప్ కామెడీ.. ఉంటాయి. హెచ్‌ఎల్‌ఎఫ్‌లో వచ్చే యంగ్ బ్లడ్ కోసం ఏర్పాటైందే యంగిస్తాన్ నుక్కడ్.. హెచ్‌ఎల్‌ఎఫ్ ప్రారంభం నుంచీ పెర్ఫార్మ్ చేస్తున్నాం.
– రజత్, సింగర్, గిటారిస్ట్
మూగజీవుల దాహం తీరుస్తాం..
మాది ఏడబ్ల్యూబీపీ (యానిమల్ వాటర్ బౌల్ ప్రాజెక్ట్) ఎన్జీవో. లక్ష్మణ్ మొల్లేటి అనే హైదరాబాద్ వాసి దీనిని స్థాపించారు. జంతువులు, మూగజీవుల దాహార్తి తీర్చేందుకు అవసరమైన వాటర్ బౌల్స్ ఉచితంగా అందిస్తాం. కుక్కలు, ఆవులు వంటి జంతువులు దాహంతో అలమటిస్తూ ఉండడం మనం గమనిస్తాం. చెన్నై, ముంబయి తదితర నగరాల్లోనూ మా కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ ఫెస్టివల్ ద్వారా మూగజీవుల సమస్యపై అవగాహన కలి్పస్తున్నాం.
– ఏడబ్ల్యూబీపీ ప్రతినిధి
నా కళకు పట్టం కట్టింది..
కార్పెంటరీ కుటుంబానికి చెందిన వాడిని. ఉడ్ ఆర్టుగా సామాజిక స్థితిగతులు, జీవనశైలి, అలంకరణ, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా చెక్కాను. కళపై ఇష్టంతో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాను. ప్రస్తుతం మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాను. గ్రామీణ ఇతివృత్తాలను, జీవనశైలిని విశ్వవ్యాప్తం చేయాలనేదే లక్ష్యం. ఈ ప్రయాణంలో నాన్నే నాకు స్ఫూర్తి.
– సాయి కుమార్, లోయపల్లి, రంగారెడ్డి జిల్లా
డిప్రెషన్ నుంచి పుట్టిన ప్యాషన్..
నా మెటీరియల్ శానిటరీ ప్యాడ్. ఎంబ్రాయిడరీ అనే మీడియంతో పీరియడ్స్ అనే అంశం పైనే ఈ ఆర్ట్ వర్క్ చేశాను. ఇంట్లో ఆ సమయాన్ని అంటరానిదిలా చూస్తుంటారు. అలాంటి సమయంలో మెనుస్ట్రువల్ డిప్రెషన్‌కు ఎంతగా గురవుతాం అనేది నేను వ్యక్తిగతంగా అనుభవించా. అది అందరికీ అర్థం కావాలనే ఉద్దేశ్యంతో అలాంటి బాధ మరెవరికీ రాకూడదనే హెచ్‌ఎల్‌ఎఫ్ ద్వారా ప్రచారం ప్రారంభించా.
– సాహితి, జేఎన్‌ఎఫ్‌యూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment