పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్.. ఈ కాలంలో ఇదొక యూనివర్సల్ సమస్య. నెలల పసికందు నుంచి బడులకు వెళ్లే పిల్లల దాకా సెల్‌ఫోన్ వ్యసనానికి బానిసలైపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. తల్లీదండ్రుల సమక్షంలోనే పోను పోను ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. అయితే.. ఈ పరిస్థితులను మార్చేందుకు ఇక్కడ ఓ దేశం నడుం బిగించింది.
ఎక్కువసేపు స్క్రీన్ టైం(అది సెల్‌ఫోన్లు, టీవీలు, ఇతరత్రా స్మార్ట్ గాడ్జెట్స్ కావొచ్చు) వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. మరీ చిన్నపిల్లల్లో కంటిచూపు మొదలు.. మాట్లాడడం సహా చాలా అంశాలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. అలాగే బడీడు పిల్లలపైనా ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యవంతమైన జీవనశైలిని పిల్లలకు అలవర్చే ఉద్దేశంతో సింగపూర్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
స్కూళ్లలోనే కాదు ఇంటి పట్టున ఉంటున్న పిల్లల స్క్రీన్ టైం విషయంలో కఠినంగా వ్యవహరించాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి.
దీనిప్రకారం..
18 నెలల వయసున్న పిల్లల విషయంలో ఫోన్ వాడకం నిషేధం
18 నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు పరిమితంగా స్క్రీన్ టైం ఉండాలి
అది కూడా పాఠాలు బోధించడం, నేర్చుకోవడం మాత్రమే!.తినేటప్పుడు నో సెల్‌ఫోన్స్, నో టీవీలు
ఆఖరికి బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ టైంకు కూడా అనుమతి లేదు. అంటే.. ఖాళీగా టీవీని ఆన్ చేసి కూడా వదిలేయకూడదు
మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు రోజులో గరిష్టంగా గంటసేపు మాత్రమే స్క్రీన్ టైం ఉండాలి(స్కూల్‌వర్క్ మినహాయించి)
ఏడు నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు గరిష్టంగా రెండు గంటలు ఉండొచ్చు(స్కూల్‌వర్క్ మినహాయించి)
శిక్ష ఉంటుందా?
అవును.. ఒకవేళ పరిమిత సమయానికి మించి పిల్లలు ఫోన్లు వాడినట్లు కనిపిస్తే.. అధికారులు వాటిని స్వాధీనపర్చుకుంటారు. పదే పదే అలా జరిగితే ఎక్కువ రోజులు తమ స్వాధీనంలో ఉంచుకుంటారు. అది శ్రుతి మించితే శాశ్వతంగా సీజ్ చేసేస్తారు. కాబట్టి, స్క్రీన్ టైం విషయంలో పిల్లలను అప్రమత్తంగా ఉంచాల్సిన అవసరం తల్లిదండ్రులకే ఉంది.
పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్లు, అందునా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వాడకాన్ని నియంత్రించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా శాఖ, సామాజిక & కుటుంబ సంక్షేమాభివృద్ధి శాఖ సంయుక్తంగా ఈ ఆదేశాలను జారీ చేశాయి. Grow Well SG ప్రణాళికలో భాగంగా ఈ ఆలోచన అమలు చేయబోతోంది. చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్, కుటుంబ సభ్యులతో ఇంటెరాక్షన్ లాంటి యాక్టివిటీస్‌ను పెంపొందించేందుకే ఈ ప్లాన్‌ను తెరపైకి తీసుకొచ్చారు.
చిన్నపిల్లలకే కాదు.. ప్రాథమిక, ఉన్నత విద్య అభ్యసించే పిల్లలకూ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే.. తరగతి గదులకు ఫోన్లను అనుమతించకూడదు. వాళ్ల ఫోన్‌లను స్కూల్ నిర్వాహకులు తమ ఆధీనంలో ఉంచుకోవాలి. తద్వారా ఫోన్‌ల వినియోగాన్ని తగ్గించడంతో పాటు తరగతి గదిలో వాళ్ల దృష్టి కేవలం పాఠాల మీద, నేర్చుకోవడం మీదే ఉంటుంది.
ప్రస్తుతానికి 12 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఈ మార్గదర్శకాలకు ప్రవేశపెడుతున్నప్పటికీ.. భవిష్యత్తులో టీనేజర్లకు విస్తరించే ఆలోచనలో ఉందట. తద్వారా స్మార్ట్‌ఫోన్ల అతి వినియోగం వల్ల కలిగే దుషప్రభావాల నుంచి భావితరాలను బయటపడేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment