వయోపరిమితి విధించనున్న ఆస్ట్రేలియా
చట్టం తెస్తామన్న ప్రధాని అల్బనీస్
మెల్‌బోర్న్: 16 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల వినియోగంపై నిషేధం విధిస్తామని ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. పిల్లలను ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వేరు చేసి మైదానాల్లోకి తీసుకొస్తామని వ్యాఖ్యానించారు. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడానికి ఫెడరల్ చట్టాన్ని ఈ సంవత్సరం ప్రవేశపెడతామని చెప్పారు. వచ్చే మేలోపు తాము గెలిస్తే 16 ఏళ్లలోపు చిన్నారులు సోషల్‌మీడియా వాడకుండా నిషేధం విధిస్తామని విపక్షపార్టీ వాగ్దానం చేయడంతో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యువతపై వెబ్‌సైట్ల ప్రభావాన్ని ‘విపత్తు’గా ప్రధాని అభివర్ణించారు.
‘‘ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాల్లోకి లాగిన్ కావడానికి పిల్లలకు ప్రస్తుతానికైతే ఎలాంటి వయసు పరిమితి లేకపోయినప్పటికీ త్వరలోనే 16 ఏళ్లను పరిమితిగా విధించే వీలుంది. 16 ఏళ్లలోపు యూజర్లను బ్లాక్ చేస్తాం. త్వరలో వయస్సు నిర్ధారణ ట్రయల్స్ నిర్వహిస్తాం. గాడ్జెట్‌లు వదిలి పిల్లలు క్రీడా ప్రాంగణాల్లో పరుగులు తీయాలి. ఈతకొలనుల్లో ఈత కొట్టాలి. టెన్నిస్ కోర్టులకు వెళ్లాలి. వారు వర్చువల్‌గా కాకుండా నిజమైన వ్యక్తులతో నిజమైన అనుబంధాలను కలిగి ఉండాలి. సోషల్ మీడియా వల్ల వస్తున్న ఆన్‌లైన్ బెదిరింపులు, హానికరమైన విషయాల నుంచి పిల్లలను దూరం చేయొచ్చని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. సోషల్ మీడియా సంస్థలు తాము అందరికన్నా అతీతులమని భావిస్తున్నాయి. వారికి సామాజిక బాధ్యతను గుర్తుచేస్తాం’’అని ప్రధాని అన్నా రు. ప్రభుత్వం ప్రతిపాదించిన వయోపరిమితికి తాము మద్దతిస్తామని ఆస్ట్రేలియా కన్జర్వేటివ్ ప్రతిపక్ష నేత పీటర్ డాటన్ తెలిపారు.
సరైన పరిష్కారం కాదంటున్న నిపుణులు..
సామాజిక మాధ్యమాల్లో వయో పరిమితి విధించడం సమస్యకు పరిష్కారం కాదేమోనంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ ప్రణాళిక నిర్లక్ష్యపూరితంగా ఉందని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డేనియల్ ఆంగస్ అన్నారు. ‘‘ఈ చర్య ప్రజాస్వామ్య మూల సూత్రాలను బలహీనపరుస్తుంది. డిజిటల్ ప్రపంచంలో కొత్తతరం అర్థవంతమైన, ఆరోగ్యకరమైన భాగస్వామ్యాన్ని హరించడం హానికరం. వారిని సమాజంతో సంబంధాల నుంచి దూరం చేస్తుంది’’అని అన్నారు. ఇలాంటి నిషేధాలను పూర్తి పారదర్శకంగా అమలు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉందో లేదో స్పష్టంగా తెలియదని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం కంప్యూటింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ టోబీ ముర్రే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment