
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో చిన్నారులు సోషల్ మీడియా(Social Media) వాడకుండా నిషేధించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ నిర్ణయం తమ చేతుల్లో లేదన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికార యంత్రాగాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.
సోషల్ మీడియా వాడకం వల్ల చిన్నారులపై శారీరకంగా, మానసికంగా, ప్రభావం పడుతోందని, కాబట్టి 13 ఏళ్లలోపు పిల్లలు వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని ఓ పిల్(PIL) దాఖలైంది. అంతేకాదు 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని జెప్ ఫౌండేషన్ ఈ పిల్‌లో కోరింది.
దీనిని పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. అది తమ పరిధిలోని అంశం కాదని, విధానపరమైన నిర్ణయమని చెబుతూ పిల్‌ను తిరస్కరించింది.
పిల్‌లో ఏముందంటే..
13 ఏళ్లలోపు వయసున్నవాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడకూడదంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నామమాత్రంగా నిబంధనను పెట్టాయి. కేవలం యూజర్లు రిపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అలాంటి అకౌంట్ల వివరాలు బయటకు వస్తున్నాయి. ఇదీ ఆందోళన కలిగించే అంశమే.
మైనర్ల సోషల్ మీడియా అకౌంట్లకు కూడా అనియంత్రిత యాక్సెస్unrestricted access ఉంటోంది. దీని మూలంగా వాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.
మైనర్లు సోషల్ మీడియా వాడకుండా నియంత్రించని ఈ వ్యవహారం.. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి, కఠిన జరిమానాలు, ఇతర చర్యల ద్వారా పిల్లల చేతికి సోషల్ మీడియా వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
భారత్‌లో యువత సగటున ప్రతీరోజు ఐదు గంటలపాటు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఈ సమయం గణనీయంగా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగించే అంశం. అందుకు తగ్గట్లే దేశంలో సైబర్ నేరాలు.. మైనర్లకు సైబర్ వేధింపులు పెరిగిపోతున్నాయి.
ఉదాహరణకు.. మహారాష్ట్రలో 9-17 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం ఆరు గంటలకు పైగా సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో గడుపుతున్నారు. ఇది వాళ్ల చదువులపై, జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది.
ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో పలు రాష్ట్రాలు మైనర్లు సోషల్ మీడియా ఉపయోగించకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.
భారతదేశ జనాభాలో దాదాపు 30% మంది 4-18 సంవత్సరాల వయస్సు మధ్యే ఉంది. కాబట్టి 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై చట్టబద్ధమైన నిషేధాన్ని అమలు చేయడం అత్యవసరం.
అయితే పైన పేర్కొన్న దేశాలు మైనర్లకు సోషల్ మీడియా కట్టడిని కేవలం ప్రత్యేక చట్టాల ద్వారా మాత్రమే చేయగలిగాయి. ఏ సందర్భంలోనూ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదు. కాబట్టి భారత్‌లోనూ చట్ట ప్రక్రియ ద్వారా మాత్రమే కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుందనేది నిపుణుల మాట.