సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 2023లో ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించారు. దీంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే కీలక విషయాలు వెల్లడి కాగా.. తాజాగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిసింది. 2023 అక్టోబర్ 26న ఆయన గవర్నర్‌గా నియామకం అయ్యారు. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డి పీఏను పోలీసులు విచారించారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్కులను డీఎస్సీ ప్రణీత్ రావు బృందం ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న ఏ4 నిందితుడిగా ఉన్నారు. గత ఎనిమిది నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు. ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, మరో కీలక వ్యక్తి శ్రవణ్ కుమార్ అమెరికాలో ఉండటంతో విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసుపై పోలీసులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో పాటు మరో ముఖ్య నిందితుడు అరువుల శ్రవణ్ రావును పట్టుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఎక్స్‌ట్రడిషన్(నేరస్థుల అప్పగింత) అస్త్రం ప్రయోగిస్తున్నారు. అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దర్నీ అప్పగించాలంటూ ఆ దేశానికి సమాచారమిచ్చే ప్రక్రియను ప్రారంభించారు.
కాగా, కరడుగట్టిన నేరస్థులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్‌కు ఒప్పందం ఉన్న నేపథ్యంలో తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సీఐడీ ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించారు. అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఆ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకుంటే నిందితులిద్దరిని భారత్‌కు అప్పగించే అవకాశముంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టనున్నా.. నిందితులను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు గల ఏ అవకాశాన్నీ వదులుకోవద్దనే ఉద్దేశంతో పోలీసులు ఈ దిశగా కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment