వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసేలా కనిపిస్తున్నారు. డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరికన్సన్‌కు ఫోన్‌లో వాగ్వాదానికి దిగారు. గ్రీన్‌ల్యాండ్ అంశం విషయంలోనే ఈ హాట్ హాట్ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులను ఉటంకిస్తూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రముఖంగా కథనం ప్రచురించింది.
ఉత్తర అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో, యూరప్‌కి వాయువ్యంగా వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది గ్రీన్‌ల్యాండ్(Greenland). స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం అయినప్పటికీ.. డెన్మార్క్ సామ్రాజ్యపు నియంత్రణలో ఉంటోంది. దీంతో ఎలాంటి సంప్రదింపులకైనా డెన్మార్క్‌తో చర్చించాల్సిందే.
గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలని డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌తో ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ట్రంప్, డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. తన ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే డెన్మార్క్‌ను ఆర్థికంగా శిక్షిస్తానని ట్రంప్ ఈ ఫోన్‌కాల్‌లో హెచ్చరించారట. ఫోన్‌కాల్‌లో ట్రంప్ సంభాషించిన తీరుకు తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆ అధికారులు వెల్లడించినట్లు సదరు కథనం పేర్కొంది.
ఫోన్ కాల్‌లో సంభాషణ ఇలా..
గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో తాము సీరియస్ ఆలోచన చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. దానికి ఫ్రెడెరిక్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే గ్రీన్‌ల్యాండ్ అమ్మడంపై ఎలాంటి ఆసక్తి లేదని ఆమె తేల్చిచెప్పారు. తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ట్రంప్ కోపంతో ఆమెతో దూకుడుగా మాట్లాడారట. ఒక దశలో బెదిరింపులకు దిగారని సదరు కథనం పేర్కొంది. వీరిద్దరి మధ్య సుమారు 45 నిమిషాల పాటు ఫోన్ కాల్ సాగినట్లు సమాచారం.
డొనాల్డ్ ట్రంప్ 2016లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ ప్రతిపాదనను తెర పైకి తెచ్చారు. కానీ, ట్రంప్ కంటే చాలాఏళ్ల ముందే అమెరికా నుంచి ఈ ప్రతిపాదన వెళ్లింది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన హ్యారీ ట్రూమాన్ ఈ ద్వీపం కొనుగోలుపై ఆసక్తి చూపించారు. గ్రీన్‌ల్యాండ్ భౌతిక స్వరూపం, అక్కడ నిక్షిప్తమైన సహజ సంపద వనరులే అందుకు కారణం. అయితే.. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ దానిని డెన్మార్క్ తిరస్కరించింది.
మళ్లీ ఇన్నాళ్లకు.. పనామా కాలువు, కెనడా, గ్రీన్‌ల్యాండ్ ప్రకటనలతో ట్రంప్ సంచలన చర్చకు దారి తీశారు. తమ ప్రతిపాదనకు ఒప్పుకోకుంటే.. ఆర్థిక ఆంక్షలు విధిస్తానని, అవసరమైతే సైన్యపరమైన చర్యలకు తాను వెనకాడబోనంటూ ప్రకటించారాయన. అయితే ట్రంప్ బహిరంగ ప్రకటన ప్రపంచ దేశాలను.. ప్రత్యేకించి ఈయూ దేశాలను ఆందోళనకు గురి చేసింది. గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదని, భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని, అది తమ దేశ ప్రజల గౌరవానికి సంబంధించిన విషయమని ఆ దేశ ప్రధాని మ్యూట్ బౌరప్ ఎగిడే ఇటీవల స్పష్టంచేసిన విషయం తెలిసిందే.
గ్రీన్‌లాండ్‌లో ఏముందంటే..
గ్రీన్‌ల్యాండ్ చాలా వనరులు అధికంగా ఉన్న ద్వీపం. ఇది చమురు, గ్యాస్ నిల్వలతో సమృద్ధిగా ఉంది. రేర్ ఎర్త మెటీరియల్ లభ్యం అవుతుంది. రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికా వాటిపై దృష్టిపెట్టింది. గ్రీన్‌లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.94 లక్షల కోట్లు)గా ఉండొచ్చని ఓ అంచనా. చైనాకు కూడా గ్రీన్ ల్యాండ్‌పై కన్నుంది.
Comments
Please login to add a commentAdd a comment