హైదరాబాద్, సాక్షి: ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటన తర్వాత అజయ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్‌లో రెండు బృందాలతో ఈ ఉదయం నుంచి అధికారులు గాలింపు చేపట్టారు. మరోవైపు.. యువకుడి తల్లిదండ్రుల రోదనలతో ఈ ప్రాంతం మారుమోగుతోంది.
కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్(21)గా నిర్ధారణ అయ్యింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి భరతమాత మహా హారతి కార్యక్రమం కోసం అజయ్ ట్యాంక్ బండ్‌కు వచ్చాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. మరోవైపు.. అతని ఆచూకీ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు.
అజయ్‌కు ఈత రాదని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఉదయం నుంచి గజఈతగాళ్లతో సాగర్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
ఘటనపై కేసు నమోదు
హుస్సేన్ సాగర్‌లో భారతమాత హారతి అపశ్రుతి ఘటనపై కేసు నమోదయ్యింది. బోటు టూరిజం ఇన్‌ఛార్జి ప్రభుదాస్ ఫిర్యాదుతో లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అసలేం జరిగిందంటే..
ఆదివారం భరతమాతకు మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి కొద్దిక్షణాల ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లారు.
అనంతరం ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్‌లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలో ఉండగా... సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవ్వగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment