సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా ఎఫ్‌ఈవో కంపెనీకి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కారులో రేసులో భాగంగా రూ.55కోట్లను ఎఫ్‌ఈవోకు బదిలీ చేసిన హెచ్‌ఎండీఏ. ఈ క్రమంలో ఎఫ్‌ఈవో సంస్థ సీఈవో స్టేట్‌మెంట్‌ను ఏసీబీ రికార్డ్ చేయనుంది. ఈ నేపథ్యంలో విచారణ కోసం ఏసీబీని నాలుగు వారాల సమయం కోరారు ఎఫ్‌ఈవో సంస్థ సీఈవో. దీంతో, ఏసీబీ ఎలాంటి నిర్ణయం చెబుతుందో తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో నిందితులను మరోమారు విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు ఏ–2.. ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ–3.. హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక, ఇప్పటికే ఈనెల 9న కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం.. కార్ రేసు నిర్వహణలో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్‌జెన్, దాని అనుబంధ సంస్థ గ్రీన్‌కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను విచారించిన అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసింది. రేస్ నిర్వహణ, అందుకు సంబంధించి జరిగిన ఆర్థిక లావాదేవీలు, రేస్ నుంచి సంస్థ తప్పుకోవడం.. అందుకు దారి తీసిన పరిస్థితులు ఇలా పలు కోణాల్లో ఆయన్ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.
ఈసారి మరింత లోతుగా..
చలమలశెట్టి ఇచ్చిన కీలక సమాచారం, గతంలో సేకరించిన పత్రాల ఆధారంగా మరోమారు కేటీఆర్‌ను లోతుగా ప్రశ్నించాలని ఏసీబీ భావిస్తున్నట్టు సమాచారం. అప్పటి మంత్రి ఆదేశాల మేరకు తాము కేవలం విధులు నిర్వర్తించామని అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలు తమ స్టేట్‌మెంట్లలో పేర్కొన్నారు. ఇక కేటీఆర్.. మంత్రిగా తానే ఆదేశాలు జారీ చేశానని, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యానే తాను ఆదేశించానని, నిధుల చెల్లింపులలో నిబంధనలు పాటించడం అన్నది అధికారులకు సంబంధించిన అంశమని పలుమార్లు స్పష్టం చేశారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, మరోమారు కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలను విచారించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈసారి కేటీఆర్ విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment