కాంగ్రెస్ పార్టీని నిత్యం విమర్శించే భారతీయ జనతా పార్టీ హామీల విషయంలో ఇప్పుడు ఆ పార్టీ బాటనే పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఇచ్చిన కొన్ని హామీలు కాంగ్రెస్ పలు రాష్ట్రాలలో చేసినవి కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలను ఎలా అమలు చేయాలో తెలియక అవస్థలు పడుతుంటే.. బీజేపీ కూడా అదే తరహా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి ప్రజలను ఆకరర్షించడానికి నానా పాట్లు పడుతోంది. కాంగ్రెస్ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేస్తూ చెప్పిన సంగతులు కూడా చిత్రంగానే ఉన్నాయి!.
వరుస విజయాలతో ఢిల్లీలో బలంగా నాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రెండు జాతీయ పార్టీలకు సవాల్‌గా మారింది. ఆశ్చర్యకరంగా.. పొరుగున ఉన్న పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో ఈసారి గెలిస్తే అది తమ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చని బీజేపీ భావిస్తోంది. లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయినప్పటికీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా బెయిల్‌పై విడుదలై పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళుతున్నారు. విద్య, వైద్యం వంటివాటిలో, సంక్షేమ స్కీముల అమలులో కేజ్రీవాల్ బలమైన ముద్ర వేసుకున్నారు. దానిని నిలబెట్టుకోవడానికి ఆప్ కృషి చేస్తుంటే, ఆ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ పలు ఆకర్షణీయమైన స్కీములతో మానిఫెస్టోని విడుదల చేసింది.
వాటిలో ముఖ్యమైనది.. మహిళా సమృద్ధి యోజన. దీని ప్రకారం ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తారట. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఒక్క ఢిల్లీకే ఈ హామీని పరిమితం చేయడమేమిటి?. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి దేశమంతటా అలాగే చేస్తామని చెబుతారేమో తెలియదు. ఈ హామీ కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టిందే అనిపిస్తుంది. బీజేపీ గతంలో ఇలాంటి హామీలకు విరుద్దమని చెబుతుండేది. మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఉచితాలు, రుణమాఫీల వంటి హామీలను బీజేపీ ఒప్పుకోదని పలు సభలలో బహిరంగంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల బృందం దేశ రాజకీయాలను శాసించడం ఆరంభమయ్యాక, ప్రతి రాష్ట్రంలో అధికారం సాధించాలన్న లక్ష్యంతో పని చేయడం ఆరంభించారు. అందులోనూ దేశ రాజధాని కావడంతో ఢిల్లీకి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ స్కీమును అమలు చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఏడాది గడిచినా అమలు చేయలేకపోయింది. అలాగే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కాని ఆ ఊసే ఎత్తడం లేదు. బీజేపీ నేరుగా టీడీపీ, జనసేనల మానిఫెస్టోలో భాగస్వామి కాకపోయినా, ఆ ప్రణాళిక విడుదలలో భాగస్వామి అయింది. ఏపీలో ఈ హామీ అమలు చేయడానికి ఏడాదికి సుమారు రూ.36 వేల కోట్లు అవసరమవుతాయి. అవి ఎక్కడ నుంచి వస్తాయో ఇంతవరకు చెప్పలేకపోయారు.
ఇక.. ఢిల్లీలో గర్భిణులకు రూ.21 వేలు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, హోళీ, దీపావళి పండగలకు ఉచితంగా ఒక్క గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ స్కీములను కొనసాగిస్తామని కూడా ఆయన అన్నారు. వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని హామీలు ఇచ్చారు. రెండో విడత మరికొన్ని హామీలు ఇచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని అందులో తెలిపారు. ఎన్నికలు జరిగే లోపు మరికొన్ని ప్రజాకర్షక వాగ్దానాలు చేస్తారట. సిద్దాంతంతో సంబంధం లేకుండా బీజేపీ ఇలా దిగజారి పోయిందా? అనే ప్రశ్నకు జవాబు దొరకదు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు పరస్పరం దారుణమైన విమర్శలు చేసుకున్న తర్వాత, తిరిగి ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. అప్పుడే బీజేపీ విలువలు ఏమిటో అర్ధమైపోయింది.
ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం. ఆ పార్టీ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేశారు. ఆయనకు జాతీయ స్థాయి ఎలివేషన్ రావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడి ఉండవచ్చు. కానీ ఆయన పేర్కొన్న హామీలు ఎంతవరకు అమలు అవుతాయో గ్యారంటీ లేదు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసేస్తున్నామని చెప్పడం చిత్రంగానే ఉంటుంది. మహిళలకు రూ.1500 రూపాయల చొప్పున ఇచ్చే హామీని ఎందుకు అమలు చేయలేకపోయారు?. రైతు భరోసా స్కీమ్ పరిస్థితి ఏమిటి? పూర్తిగా అయినట్లు చెప్పలేకపోతున్నారు. ఇంతవరకు రూ.22 వేల కోట్ల మేర మాఫీ చేశామని చెప్పారు. కాగా ఢిల్లీలో 300 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని ప్రకటించారు. అలాగే రూ.500లకే గ్యాస్ సరఫరా చేస్తామని డిల్లీ కాంగ్రెస్ పక్షాన ప్రకటించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించి ఆ స్కాం అసలు పార్టనర్ ను ఓడిస్తే ఢిల్లీలో మంచిరోజులు వస్తాయని అన్నారు.
తెలంగాణ బీఆర్‌ఎస్ నేత కవిత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరికొందరు ఆప్ నేతలు ఈ కేసులో జైలుకు వెళ్లారు. కవిత అరెస్టును స్వాగతించిన కాంగ్రెస్, కేజ్రీవాల్ అరెస్టు అయినప్పుడు మాత్రం బీజేపీని విమర్శిస్తూ ధర్నాలు చేసింది. ఈ ద్వంద్వ వైఖరిపై ఇంతవరకు వివరణ ఇచ్చినట్లు కనిపించదు. పొత్తు కుదరలేదు కనుక లిక్కర్ స్కామ్ పార్టనర్ అని రేవంత్ చెబుతున్నారు. కేసీఆర్ టైమ్ లో ఉన్న అవినీతి నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామని రేవంత్ ప్రచారం చేసి వచ్చారు. దీనిలో ఎంత నిజం ఉందన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. కొన్ని హామీలు అమలు చేశామని చెబితే ఫర్వాలేదు కాని, అన్నింటిని చేసేసినట్లు ప్రచారం చేస్తే విమర్శలు వస్తాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ తన హామీలలో కొత్తగా విద్యార్ధులందరికి ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పటికే విద్యార్దినులకు ఉచిత బస్ అమలు చేస్తుండగా.. ఇకపై బాలురకు కూడా ఫ్రీ బస్ సదుపాయం అని హామీ ఇచ్చారు. విద్యార్ధులకు మెట్రో చార్జీలలో ఏభై శాతం భరిస్తామని మరో హామీ ఇచ్చారు. యువతను ఆకర్షించడానికి ఆప్ వేసిన గాలం ఇది. ఢిల్లీలో ఉచిత విద్యుత్, ఉచిత నీరు తదితర హామీలను ఆప్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో గవర్నర్ ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేజ్రీవాల్‌ను, ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక వ్యూహాలను అమలు చేసింది. అందులో భాగంగా ఈడీని కూడా ప్రయోగించిందన్న రాజకీయ విమర్శలు వచ్చాయి. మొత్తంగా.. బీజేపీ ఇన్ని వ్యూహాలు పన్నుతూ డిల్లీలో ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందన్నది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలు తేల్చుతాయి.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment