మనం ఆటలో అరటిపండుల అయిపోతున్నాం
చెబితే విన్నావు కాదు.. మనకెందుకీ పల్లకీ మోత!
పవన్ కు సూచనలతో కేడర్ ఫ్లెక్సీలు
అన్నయ్యా.. మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం కానీ నువ్వు విన్నావు కాదు.. మనం లేకుంటే వాళ్లకు కుర్చీ ఎక్కే ఛాన్స్ దక్కేనా?. అలాంటప్పుడు మనం గౌరవప్రదమైన సీట్లు తీసుకుని పోటీ చేద్దాం అంటే నువ్వు ఒప్పుకోలేదు.. జస్ట్ గుప్పెడు సీట్లు తీసుకుని వాటితో మనం చేసేదేం లేదు.
మనం గేమ్‌లో అరటిపండులం అయిపోతాం తప్ప గేమ్ చేంజర్స్ కాలేం. వాళ్ళు ఆట ఆడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలి. ఈ ఖర్మ మనకు ఎందుకు అన్నయ్యా.. కలలు కనండి.. అవి నిజం చేసుకోవడానికి కృషి చేయండి అని అబ్దుల్ కలాం చెప్పారు కానీ ఆయన మన సొంత కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడాలని చెప్పారు తప్ప వేరే వారి కలలు నిజం చేసేందుకు మనం శ్రమించాలని చెప్పలేదు.
వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తారు.. పాలనను అస్తవ్యస్తం చేస్తారు .. ఆ ఫెయిల్యూర్స్‌ను నీ మీద నెట్టేస్తారు చూస్తూండండి.. ఏదైనా మంచి జరిగితే వాళ్ళ ఖాతాలో వేసుకుని.. తప్పులన్నిటికీ మనను నిందిస్తారు.. ఎందుకొచ్చిన దరిద్రం మనకు.. బయటకు వెళ్ళిపోదాం.. ప్రతిపక్షంలో ఉందాం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. మనకు ఈ అధికారం అనే లంపటం వద్దు.. అంటూ ఆవేదనతో జనసైనికులు కడపజిల్లాలో ఫ్లెక్సీలు కట్టారు.
వాస్తవానికి పవన్ సపోర్ట్‌తోనే చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో గెలిచారని.. ఇంకా చెప్పాలంటే చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన ఏనాడో విశ్వసనీయతను కోల్పోయారని.. కానీ కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వెనకుండి.. బాబు ఇచ్చిన హామీలకు తానూ బాధ్యుడిగా ఉంటూ వాటిని నెరవేర్చే బాధ్యతను నెత్తిన పెట్టుకుంటానని చెప్పడంతోనే ప్రజలు విశ్వసించి ఈ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారని కేడర్ భావిస్తోంది. అయితే ఎన్నికల సమయంలో కనీసం యాభై సీట్లయినా తీసుకోకుండా కేవలం 21 సీట్లలో పోటీ చేయడం ద్వారా ప్రభుత్వంలో క్రియాశీలకంగా.. కీలకంగా ఉండలేని పరిస్థితి వస్తోందని కేడర్ లోలోన బాధ పడుతోంది.
పైగా చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌ను సైతం అడుగడుగునా అవమానిస్తున్నారని.. మొన్నటి దావోస్ సభలకు సైతం డిప్యూటీ సీంఎను తీసుకుని వెళ్లలేదని.. కేవలం చంద్రబాబు.. లోకేష్ వెళ్లి ఆయనను పక్కనబెట్టేశారని.. తీరా అట్నుంచి ఇద్దరూ ఒట్టి చేతులతో వచ్చారని ఆ ఫ్లెక్సీల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వారిమీద నమ్మకం లేకనే పెట్టుబడులు రాలేదని.. అదే పవన్ వెళ్లి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని.. పవన్‌ను చూసి అయినా కనీసం నాలుగైదు కంపెనీలు వచ్చేవని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయినా అట్నుంచి వచ్చాక బాబును ఎలివేట్ చేస్తూ టీవీలు.. ఛానెళ్లలో ప్రోగ్రామ్‌లు నడుపుతున్నారని. కేడర్ ఆవేదన చెందుతోంది.
తప్పులు చేసేది వాళ్ళు.. ఒప్పుకునేది మీరు
తిరుమలలో తొక్కిసలాట వంటి ఘోరాలు జరిగినపుడు వారెవరూ తమకు సంబంధం లేనట్లు ఉంటారు.. మీరు మాత్రం నిజాయితీగా జనంలోకి వెళ్లి తప్పు ఒప్పుకుని క్షమాపణ చెబుతున్నారు. కానీ, ఆ ఘోరానికి కారణమైన చంద్రబాబు తాలూకా మనుషులు మాత్రం కనీసం చీమ కుట్టినట్టు అయినా భావించడం లేదు. మనం ప్రతిపక్షంలో ఉండి .. ప్రభుత్వాన్ని నిలదీస్తే బాగుండు.. అధికారంలో భాగమై ఎందుకూ విలువలేకుండా పోతున్నాం.. అంటూ ఏర్పాటైన ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
సగటు జనసైనికుడి ఆవేదన.. అంతర్మథనాన్ని ఆ ఫ్లెక్సీలో పాయింట్లుగా రాసి అందర్నీ ఆలోచింపజేస్తున్నారని అంటున్నారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు జనసేన కేడర్ ఫోన్లలో సర్క్యులేట్ అవుతూ వారిని ఆలోచనలో పడేసింది.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment