సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నేడు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లను తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేయర్‌పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన ఆరోపణలు చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘మేయర్ సునీల్ రావు అత్యంత అవినీతిపరుడు. ఈ ఐదు సంవత్సరాల్లో కోట్ల రూపాయలు సంపాదించాడు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలో వివరాలు వెల్లడిస్తాను. అవినీతిని బయటపెడతాను అంటున్న సునీల్ రావే ఈ ఐదేళ్లు దోపిడీ చేశాడు. అతడికి పార్టీలు మారడం అలవాటు. ఆయనతో ఒక్క కార్పొరేటర్ కూడా వెళ్లడం లేదు. నాపై అవినీతి ఆరోపణలు చేశారు కదా.. ఏ విచారణకైనా సిద్ధం’ అంటూ సవాల్ విసిరారు. దీంతో, జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది.
ఇదిలా ఉండగా.. పార్టీ మార్పుపై మేయర్ సునీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం సునీల్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాను. బండి సంజయ్ నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో బీజేపీలోకి వెళ్తున్నాను. వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌పై కాషాయ జెండా ఎగురేస్తాం. నా వెంట రెండు వేల మంది కార్యకర్తలు ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో జాయిన్ అవుతున్నారు. నేను మొదట ఏబీవీపీ కార్యకర్తనే. మాజీ ఎంపీ వినోద్ కుమార్ వల్లే నాకు మేయర్ పీఠం దక్కింది. కాంగ్రెస్‌లో చేరాలని కూడా చాలా మంది కోరారు. నన్ను మేయర్ పీఠంపై కూర్చోకుండా చాలామంది స్థానిక నాయకులు అడ్డుపడ్డారు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment