Sewerage
-
హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్.. రూ.17,212 కోట్ల అంచనా వ్యయం!
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో భాగంగా మురుగు నీరు చేరకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ.17,212.69 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ ‘సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్’కు రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం 2.0 కింద మాస్టర్ ప్లాన్‌ను చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఆర్థిక చేయూత అందించాలని ప్రతిపాదించింది. చారిత్రక హైదరాబాద్ నగరంలో ఏళ్లనాటి మురుగు నీటి పైపులైన్ వ్యవస్థ కొనసాగుతోంది. శివారుతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో సైతం సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేకుండాపోయింది. గతంలో పంచాయతీలుగా ఉన్నప్పుడు వేసిన మురుగు కాల్వలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మొత్తమ్మీద ప్రస్తుతం 9,769 కిలో మీటర్లు మాత్రమే పైపులైన్ నెట్వర్క్ విస్తరించి ఉంది. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 2,656 కి.మీ, ఓఆర్ఆర్ పరిధిలో 4,378 కి.మీ మేర విస్తరించాలని ప్రతిపాదనలు ఉన్నా.. పెండింగ్‌లోనే మగ్గుతున్నాయి. దీంతో సమగ్ర కార్యాచరణలో మురుగు నీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. 80 శాతం మురుగు.. మహా నగరంలోని 80 శాతం మురుగు మూసీలో చేరుతోంది. మిగిలిన 20 శాతం స్థానిక చెరువుల్లో కలుస్తోంది. నగరంలో మూసీ నది సుమారు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. దానికి ఇరువైపులా కలిపి 110 కిలోమీటర్ల పొడవునా మురుగు కలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో రోజువారీగా 2,815 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1650 ఎంఎల్డీలు ఉండగా, మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని (46 శాతం) శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మురుగు నీరు మూసీలో చేరకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. అందులో భాగంగానే పైపులైన్ నెట్వర్క్ వ్యవస్థ విస్తరణతో పాటు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమరి్పంచినట్లు తెలుస్తోంది.7,034 కి.మీ సీవరేజీ నెట్వర్క్.. హైదరాబాద్‌తో పాటు శివారు, అవుటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన స్థానిక సంస్ధల (యూఎల్బీ) పరిధిలో సుమారు 7,034 కి.మీ పొడవున మురుగునీటి పైపులైన్ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. మొత్తమ్మీద ఓఆర్ఆర్ యూఎల్బీల పరిధిలో 27 పురపాలక సంఘాలను కలుపు కొని సుమారు 4,378 కి.మీ, జీహెచ్ఎంసీ పరిధి లోని శివారు, కోర్ సిటీ పరిధిని కలుపుకొని దాదా పు 2,656 కి.మీ పొడవున సీవరేజీ నెట్వర్క్ పైపులైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్ఎంసీలోని శివారు పరిధిలో మూడు ప్యాకేజీల్లో తొమ్మిది సర్కిల్స్ కలుపుకొని 2,232 కి.మీ, కోర్‌సిటీ పరిధిలోని 4 జోన్లలో 424 కి.మీ పైపులైన్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.రూ.4 వేల కోట్లతో సీవరేజీ ప్లాంట్లు.. మరోవైపు మూసీపై మురుగు నీటిశుద్ధి కోసం సుమారు 62 సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాలకు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర సర్కారు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ ప్రాజెక్టును సైతం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇప్పటికే మూడు ప్యాకేజీల్లో మొత్తం 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మాణాల ద్వారా సుమారు 1259.50 ఎంఎల్డీల మురుగునీటి శుద్ధి చేయాలని నిర్ణయించింది. ఇటీవల అమృత్ పథకం కింద 39 ఎస్టీపీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తాజాగా మూసీలో పూర్తిగా శుద్ధి చేసిన జలాలనే వదిలేలా మరికొన్ని ఎస్టీపీల నిర్మాణాలకు ప్రతిపాదించింది. చదవండి: హైదరాబాద్‌లో మొత్తం చెరువులెన్ని.. ఎన్ని మిగిలాయి? -
మురుగు నుంచి విద్యుత్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మురుగునీటి శుద్ధికి విజయవాడ నగర పాలక సంస్థ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. ఇప్పటికే ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ)ను ఆధునికీకరిస్తూనే.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త ప్లాంట్లను నెలకొల్పుతోంది. మరోవైపు ఈ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆదాయాన్ని ఆదా చేసుకునేలా ఏర్పాటు చేస్తోంది. నగరంలో 150 ఎంఎల్డీ సామర్థ్యంతో అజిత్‌సింగ్ నగర్, ఆటోనగర్, జక్కంపూడి, రామలింగేశ్వర్‌నగర్‌లో రెండు ఎస్టీపీలున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్తగా రామలింగేశ్వర్ నగర్లో 20 ఎంఎల్డీ, ఆటోనగర్‌లో 10 ఎంఎల్డీ సామర్థ్యంతో రెండు ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్లలో నీరు శుద్ధి చేసే సమయంలో వచ్చే మిథేన్ గ్యాస్‌ను స్క్రబ్బర్ మెషిన్ల ద్వారా శుద్ధి చేస్తారు. అందులోని తేమ, ఆమ్లాలను తీసేయగా వచ్చే మిథేన్ గ్యాస్‌కు టర్బెయిన్లను అనుసంధానం చేస్తారు. తద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను అక్కడ ఎస్టీపీలలోనే వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం సింగ్‌నగర్, జక్కంపూడి, రామలింగేశ్వర్ నగర్‌లోని నాలుగు ఎస్టీపీలకు స్క్రబ్బర్ మెషిన్లు ఏర్పాటు చేసి, మిథేన్ గ్యాస్‌ను శుద్ధి చేయడం ద్వారా గ్యాస్ టర్బెయిన్లకు అనుసంధానం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. యునిడో సహకారంతో.. రామలింగేశ్వర్ నగర్లో ఏర్పాటు చేసిన ఎస్టీపీ పాతది కావడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సూచించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా దానిని ఆధునికీకరిస్తున్నారు. ఈ పనుల కోసం రూ.14.93 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యునిడో) సహకారం అందిస్తోంది. విజయవాడ కార్పొరేషన్‌కు రూ.10 కోట్ల నిధులను అందించింది. ఈ నిధులు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు బయో గ్యాస్ ప్లాంట్లను స్థాపించడంలో ఈ నిధులు కీలక భూమిక పోషిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థ నుంచి వచ్చిన స్థిరమైన పద్ధతులను అవలంబించడంతోపాటు, పర్యావరణ సవాళ్లను తగ్గించడంలో విజయవాడ కార్పొరేషన్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం ఎస్టీపీల ఆధునికీకరణ పనులు నాణ్యతా ప్రమాణాలతో చేస్తున్నాం. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వైపు విజయవాడ కార్పొరేషన్ అడుగులు వేస్తోంది. రూ.135 కోట్లతో ఎస్టీపీలను ఆధునికీకరిస్తున్నాం. మురుగునీటి నిర్వహణ క్లిష్టమైన సమస్య. దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎస్టీపీల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ఆ విద్యుత్‌ను వాటికే వినియోగిస్తాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, విజయవాడ ఎస్టీపీల ఆధునికీకరణ గతంలో నిర్మించిన పాత ఎస్టీపీలను అమృత్, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.135 కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రతి ప్లాంట్‌ను ఆహ్లాదకరమైన ఇండస్ట్రియల్ వాతావరణం కలిగి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్లాంట్లలో సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మిస్తున్నారు. మరోవైపు నగరం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజల సహకారం తీసుకుంటున్నారు. రోడ్లు, డ్రెయిన్లలో చెత్త, వ్యర్థాలు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్‌రూరల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ, ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం మావలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని 468 గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులను నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్‌కు తరలించాలన్నారు. రోడ్లపై వర్షపునీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. అలాగే మురుగు కాలువలను శుభ్రం చేయాలన్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. దోమలతో వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 25 లక్షల 5వేల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఖాళీ స్థలాలు గుర్తించడం, గుంతలు తవ్వడం వంటి ఏర్పాట్లు చేసుకోవాలని, నాటిన ప్రతీ మొక్కను సంరక్షించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈనెల 30 నుంచి 8,702 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ ఉంటుందన్నారు. అర్హులైన బీసీ చేతివృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడత దళితబంధులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఎంపీడీవోల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన, అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. సమగ్ర ఓటరు జాబితా తయారీకి బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం ఇటీవల జాతీయ జలశక్తి అవార్డు అందుకున్న కలెక్టర్‌ను అధికారులు సత్కరించారు. సమావేశంలో జెడ్పీ ిసీఈవో గణపతి, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, డిప్యూటీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్, ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ... కమిషనర్‌ను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు
సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపల్ పరిధి రోజురోజుకు విస్తరించడంతోపాటు జనాభా పెరుగుతోందని, అయితే శానిటేషన్ నిర్వహణ అధ్వానంగా తయారైందని, లై అవుట్లలో రోడ్లు, లైట్లు తదితర పనులు పూర్తి కాకుండానే తుది అనుమతి ఎలా ఇస్తారని కౌన్సిలర్లు కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం అనంతరం అనధికారికంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు శానిటేషన్, లేఅవుట్లు, ఇతర అభివృద్ధి పనులు విషయంలో అధికారుల వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. మురుగు కాల్వల్లో పూడిక పెరుకుపోతుందని, పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేట్‌కు అప్పగించవద్దని 3వ వార్డు కౌన్సిలర్ చౌదరి ప్రకాశ్ చెప్పినట్లు సమాచారం. ప్రైవేట్ చెత్తసేకరణను రద్దుచేసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో చేయించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది చాలడంలేదని, సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. పట్టణ పరిధిలో ఎన్ని లే అవుట్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని, లే అవుట్లలో రోడ్లు, మురుగునీటి కాల్వలు, వాటర్ ట్యాంకు నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా పైపులైన్ నిర్మించకుండా ఫైనల్ రిలీజ్ ఎందుకు చేస్తున్నారని కౌన్సిలర్ ఇంద్రమోహన్‌గౌడ్ కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనట్లు తెలిసింది. లే అవుట్లలో అభివృద్ధి పనులు జరగకున్నా, ఇతర సౌకర్యాలు లేకున్నా ప్లాట్లు కొనుగోలు చేసినవారికి ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారని, నిబంధనల మెరకే లే అవుట్ ఫైనల్ చేస్తున్నామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు సమాచారం. సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులు నాణ్యతా జరగడంలేదని కౌన్సిలర్లు నాగరాజ్‌గౌడ్, చౌదరి ప్రకాశ్ నిలదీశారని, నాణ్యతగా పనులు చేపట్టేందుకు ఇంజనీర్‌ను ఆదేశిస్తామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. మూడు నెలలకోసారి కాకుండా ప్రతీనెల సమావేశాలు నిర్వహిస్తే ప్రజాసమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని మెజార్టీ కౌన్సిలర్లు కోరినట్లు సమాచారం. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు విద్యాసాగర్‌రెడ్డి, గుండు రవి, శ్రీనివాస్, ఇలియాస్ షరీఫ్, నాగరాజ్‌గౌడ్, గుండు రవి, ఖుద్దూస్, పిచర్యాగడి రేణుక, కోఆప్షన్ మెంబర్ కలీమ్ పటేల్ పాల్గొన్నారు. -
పచ్చగా.. పరిశుభ్రంగా
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలన్నీ పచ్చదనంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించి మురుగునీటి కాలువల నిర్వహణ, చెత్త సేకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పల్లెల్లో రోడ్ల మీద మురుగునీరు, చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలోని 13 వేలకుపైగా గ్రామ పంచాయతీల్లో మురుగు నీటి పారుదల వ్యవస్ధ సక్రమంగా ఉండేలా, కాలువల్లో మురుగునీరు పొంగి పొర్లకుండా నిర్వహణ చేపట్టాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు కల్లా 100 శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు. అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పక్కాగా ఉండాలన్నారు. చెత్త తరలించేందుకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ సమకూర్చటాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని దశలవారీగా అన్ని గ్రామాలకు అందజేయాలని సూచించారు. గ్రామీణ రహదారులకు మరమ్మతుల పనులను ఈ నెల మూడో వారంలోగా చేపట్టి వెంటనే టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. పనులు పూర్తి చేసిన అనంతరం నాడు – నేడుతో ఫొటోల ద్వారా ప్రజలకు వ్యత్యాసాన్ని తెలియచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇళ్ల నుంచి చెత్తను సేకరించే క్లాప్ మిత్రలకు గౌరవ వేతనాలు చెల్లించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గ్రామీణ రహదారులు, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం తదితరాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాగునీటి కష్టాలు తలెత్తకుండా.. వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టి గతంతో పోలిస్తే సమస్యను గణనీయంగా నియంత్రించగలిగినట్లు అధికారులు తెలిపారు. జూలై నెలాఖరు వరకు కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు. ఫ్లోరైడ్ ప్రభావం అధికంగా ఉండే ఉద్దానంతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉప్పునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలు, వైఎస్సార్ కడప జిల్లాలో యురేనియం ప్రభావిత ప్రాంతాలు, తరచూ తాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రకాశం, పల్నాడు, చిత్తూరు పశ్చిమ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సరఫరాకు చేపడుతున్న ఏర్పాట్లపై సమావేశంలో సీఎం సమీక్షించారు. కాలువలతో అనుసంధానం.. గ్రామాల్లో పేదలకు ఉపాధి హామీ పధకం ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించాలని సీఎం జగన్ సూచించారు. చెరువుల్లో పూడిక తీతతో పాటు కాలువలతో అనుసంధానించేలా పనులు చేపట్టాలన్నారు. ఐదేళ్లలో ప్రతి చెరువును కాలువలు, ఫీడర్ ఛానళ్లతో అనుసంధానించడం ద్వారా నీటిఎద్దడిని అరికట్టవచ్చన్నారు. కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కాలువల ద్వారా మంచి నీటి ట్యాంకులను అనుసంధానించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రూ.3 వేల కోట్లకుపైగా పెండింగ్ బకాయిల చెల్లింపు గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విలేజీ క్లినిక్స్ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఏ కారణంతోనూ పనులు ఆగకూడదని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాకపోయినప్పటికీ అడ్వాన్స్ రూపంలో నిధులు సర్దుబాటు చేసి బిల్లులు చెల్లింపులన్నీ పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి బిల్లుల అప్‌లోడ్‌తో పాటు చెల్లింపుల్లో ఆలస్యం జరగకూడదని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల కోసం అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాం నాటి దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా బకాయి బిల్లులను చెల్లించాల్సి రావడంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి చెల్లింపులు జరిపామని తెలిపారు. రైతుల ఖాతాల్లోకే ‘జలకళ’ డబ్బులు.. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా అర్హులైన రైతులకు బోరు, మోటారు, పైపులు అన్నీ ప్రభుత్వమే ఇస్తోందని, విద్యుత్తు సదుపాయం కల్పిచడంతో సహా ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. పథకం ద్వారా రైతుల పొలాల్లో బోరు తవ్వినప్పుడు డ్రిల్లింగ్ డబ్బులను రైతుల ఖాతాకు నేరుగా (డీబీటీ) జమ చేసి లబ్ధిదారుడి నుంచి బోరు యజమానికి చెల్లించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీనివల్ల లంచాలు లేకుండా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతాయన్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రైతుల పొలాల్లో 13,245 బోర్లు తవ్వినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణకు వీలుగా 2 కోట్ల డస్ట్బిన్లను అక్టోబరు నాటికి సిద్ధం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, స్పెషల్ కమిషనర్ శాంతిప్రియా పాండే, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ రోడ్లకు మరమ్మతులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిధిలోని గ్రామీణ రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 9,122 కిలోమీటర్ల పొడవైన 3,246 రోడ్లకు రూ.1,072 కోట్లతో మరమ్మతులకు సంబంధించి తక్షణమే పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. మే 15 – 20వతేదీ నాటికల్లా గ్రామీణ రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభం కావాలని నిర్దేశించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ పరిధిలో రహదారులకు సంబంధించి గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు వాటిని ఎలా బాగు చేశామనే వివరాలను తెలియచేసేలా నాడు–నేడు ద్వారా ఫొటోలతో వ్యత్యాసాన్ని స్పష్టంగా తెలియచేయాలన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రహదారులకు సంబంధించి చేపట్టిన పనులను వెల్లడించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫోటోలను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. -
తాగి.. తూలి.. ప్రాణాలు విడిచాడు..!
సాక్షి, హైదరాబాద్ : మద్యం మత్తులో నాలాలో తూలిపడిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన లాలాపేట నాల వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. నాలా గోడను ఆనుకుని నిలుచున్న ఓ వ్యక్తి కాసేపటి తర్వాత దానిపైన కూర్చునే ప్రయత్నం చేశాడు. అయితే, అతను మద్యం సేవించి ఉండటంతో గోడ పైనుంచి తూలిపడిపోయాడు. నేరుగా నాలాలో ఉన్నబండరాయిపై పడడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని..మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా మద్యం మత్తులో తూలుతున్న సదరు వ్యక్తి నాలా గోడపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయినట్టు వెల్లడైంది. తలకు తీవ్ర గాయమవడంతోనే అతను చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మురుగుశుద్ధికి స్వీడన్ రోబోలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మురుగునీటి పైప్లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగి శుభ్రం చేసేందుకు అధునాతన స్వీడన్ రోబోలను ప్రయోగాత్మకంగా రంగంలోకి దించాలని జలమండలి యోచిస్తోంది. అధునాతన సాంకేతికత, కెమెరాలు, తెర, వ్యర్థాలతో పూడుకుపోయిన మ్యాన్‌హోళ్లలో సిల్ట్‌ను బోరింగ్ యంత్రం తో తవ్వి తొలగించడం, మురుగు ప్రవాహానికి ఆటంకాలను తొలగించేందుకు అవసరమైన విడిభాగాలన్నీ ఈ మినీ రోబోల్లో ఉంటాయి. మరో పక్షం రోజుల్లో స్వీడన్ నుంచి నగరానికి ఈ రోబోలను తెప్పించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతానికి 3 రోబోలను ప్రయోగాత్మకంగా నగరానికి తీసుకురానున్నారు. ఇవి నగర అవసరాలకు సరిపోతాయో లేదో క్షేత్రస్థాయిలో పరీక్షించనున్నారు. కాగా దేశ వ్యాప్తంగా 2014–17 మధ్యకాలంలో మురుగునీటి పైప్లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగి సుమారు 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు మృత్యువాతపడ్డారు. పారిశుద్ధ్య పనుల్లో కార్మికుల ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించేందుకే జలమండలి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ రోబో బరువు సుమారు 80 కిలోలు. మ్యాన్‌హోళ్లలో మనుషులు దిగే అవసరం లేకుండా ఈ రోబో మురుగుశుద్ధి ప్రక్రియ నిర్వహించనుంది. ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్‌తో పూడుకుపోయిన మ్యాన్హోల్లోకి వెళ్లే రోబో విడిభాగాల బరువు 30 కిలోలు. ముందుగా ఈ రోబోకు ఉన్న వైరును మురుగు ప్రవాహానికి అడ్డంకులున్న మ్యాన్హోల్లోకి పంపిస్తారు. దీనికున్న కెమెరా ఆధారంగా లోపలి పరిస్థితిని ఫొటోలు తీస్తుంది. ఇవన్నీ బయట ఉన్న స్క్రీన్‌పై ప్రత్యక్షమవడంతో మురుగు ప్రవాహానికి ఎక్కడ ఆటంకాలున్నాయో ఫొటోల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తరవాత జెట్పైప్, టన్నెల్ బోరింగ్ యంత్రాల సాయంతో రోబో మ్యాన్హోల్లోకి వెళ్లి మురుగు ప్రవాహానికి ఆటంకంగా ఉన్న ఘన వ్యర్థాలు, సిల్ట్, ప్లాస్టిక్‌ను నిమిషాల వ్యవధిలో తొలగిస్తుంది. మురుగు ప్రవాహానికి ఉండే ఆటంకాలను పూర్తిగా తొలగిస్తుంది. మూడుగంటలపాటు ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు శ్రమపడి చేసే పనిని ఈ రోబో 30 నిమిషాల్లోనే పూర్తిచేయడం విశేషం. కాగా గ్రేటర్ పరిధిలో సుమారు 6 వేల కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది. వీటిపై 2 లక్షల వరకు మ్యాన్‌హోళ్లున్నాయి. వీటిని శుద్ధి చేసేందుకు ఏడాది క్రితం జలమండలి సుమారు 50 మినీ జెట్టింగ్ యంత్రాలను రంగంలోకి దించడంతో ఉప్పొంగే మురుగు సమస్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఈ రోబోలు సైతం పారిశుద్ధ్య విధుల్లో పాలుపంచుకోనుండటంతో పారిశుద్ధ్య కార్మికుల జీవితాలకు భద్రత చేకూరనుంది. రోబో మొత్తం బరువు: 80 కిలోలు ఇందులో విడిభాగాల బరువు: 30 కిలోలు ఒక్కో రోబో ఖరీదు(సుమారుగా..): 7 లక్షలు గ్రేటర్లో మురుగునీటి వ్యవస్థ: 6,000 కి.మీ. మ్యాన్‌హోళ్ల సంఖ్య: 2,00,000 -
అధ్వానంగా హస్నాపూర్..
లోపించిన పారిశుధ్యం..విజృంభిస్తున్న దోమలు.. వెదజల్లుతున్న దుర్వాసన పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆందోళనలో గ్రామస్తులు ఉట్నూర్ రూరల్ః మండలంలోని హస్నాపూర్ గ్రామంలో పారి శుద్యం లోపించి అధ్వానంగా మారింది. అదేదో మారుమూల గ్రామం కాదు ఆదిలాబాద్ - ఆసిఫాబాద్ ప్రధాన రహాదారికి ఈ గ్రామం ఆనుకొని ఉంది. గత కొన్ని రోజులుగా ఏకదాటిగా కురిసిన వర్షానికి మురికి కాలువల్లో పూడిక నిండి ఉండటంతో గ్రామంలో నీరు ఎక్కడిక్కడ నిలిచి దోమల విజృభనకు స్థావరంగా మారుతున్నాయి. జిల్లా ఉన్నతధికారులు పారిశుద్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని, క్లోరినేషన్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశా లు ఇస్తున్న ఇక్కడి అధికారులకు ఆదేశాలు వర్తించవేమోనని ఈ గ్రామ పరి స్థితిని చూస్తే అనిపిస్తోంది. గ్రామంలో ఎక్కడ చూసిన పా రిశుద్యం లోపించి అ ధ్వానంగా దర్శనమిస్తోంది. ప్రధాన రహా దారి పక్కన బురదతో ఉంది. ఈ రహా దారిపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలు ప్రయాణిస్తుంటారు.. కాని ఈ పరిస్థితి పట్టించుకునే నాథులు కానరావడం లేదు. గ్రామంలో ఉన్న ఇండ్ల చుట్టూ వరద నీరు చేరి బురదమయంగా మారింది. మురికికాలువలు లేక మురికి నీరు ఎక్కడిక్కడ నిలిచి దర్శనమిస్తోంది. పనిచేయని నీటి మోటారు.. గ్రామానికి నీటి సరఫరా చేసే మంచి నీటి మోటారు చెడి పోయి 4 నెలలు గడుస్తున్నప్పటికీ మరమ్మత్తులు చేయడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ మోటారు దాదాపు 50 కుటుంబాలకు నీటిని అందిస్తుంది. గ్రామస్తులు ఉపయోగించే బావి ఇది వరకు ఒకే సారి క్లోరినేషన్ చేపట్టారని, వర్షానాకి నీళ్లు మురికిగా అయ్యాయని క్లోరినేషన్ చేపట్టాలని కోరుతున్నారు. పట్టించుకునే వారు లేకుండా పోయారు. అధ్వానంగా రోడ్లు.. గ్రామంలో ఉన్న సీసీ రోడ్లపై పక్కలకు మట్టి చేరి నీరు రోడ్డుపైనే ఆగుతున్నాయి. దీంతో గ్రా మంలో రోడ్డు ఉండి నడవటానికి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు లేని ప్రాం తాల్లో బురదమంగా మారింది. ప్రధాన రోడ్డుకు ఇరువైపుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఇక గ్రామ రోడ్లు ఏ విధంగా ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైన మట్టి తీసి రోడ్లు శుభ్రపర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇళ్ల చుట్టూ అపరిశుభ్రతే.. వర్షపు నీరు చేరి గ్రామంలో పలు ఇండ్ల చుట్టు మురికి నీరు నిలిచి అధ్వానంగా మారాయి. సీసీ రోడ్లు పగుళ్లు తేలాయి. మురికి కాలువల్లో పూడిక నిండి కాలువ జాడ లేకుండా పోయింది. దీంతో వరద నీరు ఇండ్లలో చేరుతుంది. ఈ విషయమై ఎన్నో సార్లు అధికారులకు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకున్న పాపాన పోవడం లేదని గ్రామస్తులు ఆవేధన వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటికైన సంబందిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామ సమస్యలు పరిష్కరిస్తారని ఎదురుచూస్తున్నారు. మోటారు మరమ్మతు చేయించాలి నీటి కోసం గోస అయితాంది. తమకు నీరు అందించే మోటారు నాలుగు నెలల క్రితం పాడైపోయింది. బాగు చేయిస్తామని తీసుకువెళ్లి నాలుగు నెలలు గడుస్తున్న ఇంత వరకు తీసుకువచ్చి బిగించలేదు. - ఉషాబాయి, గ్రామస్తురాలు రోడ్లు మంజూరు చేయాలి గ్రామంలో సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. చినుకు పడితే రోడ్డు చిత్తడిగా మారుతోంది. దీంతో నడవటానికి సైతం ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఏర్పాటు చేసి చుట్టు పక్కల మురికి కాలువలు ఏర్పాటు చేసి తమసమస్యలు పరిష్కరించాలి. - షేక్ జిలాని, గ్రామస్తుడు అధికారులు స్పందించాలి.. రోడ్లన్ని పగుళ్లు తేలాయి. మురికి కాలువలు పూడికతో నిండి పోయాయి. ఎన్నో సార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించాం. చేద్దాం, చూద్దాం అనటమే తప్ప నేటికి తమ సమస్యలు పరిష్కరించడం లేదు. ఇప్పటికైన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలి. - రాథోడ్ లాల్‌సింగ్, గ్రామస్తుడు రోడ్లు ఏర్పాటు చేయాలి.. సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం చినుకు పడితే రోడ్డు చిత్తడిగా తయారు అయితంది. నడువడానికి ఇబ్బందిగా ఉంది. అధికారులు రోడ్లు, మురికి కాలువలను ఏర్పాటు చేయాలి. మా సమస్యలు పరిష్కరించాలి. - దేవుకాబాయి, గ్రామస్తురాలు -
పొంచి ఉన్న ప్రమాదం
వ్యాధుల కాలం వచ్చేసింది ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న నీరు పట్టించుకోని అధికారులు వర్ధన్నపేట : ఎండలతో ఉక్కిరిబిక్కిరిగా గడిపిన ప్రజలకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఈ వర్షాలతో వాతావరణం చల్లబడినప్పటికీ వ్యాధులు మాత్రం పొంచి ఉన్నాయి. వర్షపు నీరు నివాస గృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లోకి వచ్చి చేరుతుండడంతో దోమలు, ఈగల ఉధృతి ఎక్కువై సీజనల్ వ్యా ధులు ప్రబలే ప్రమాదం ఉంది. గ్రామాల్లో నెలకొన్న పారి శుద్ధ్యంతో సీజనల్ వ్యాధులపై ఆందోళన పెరుగుతోంది. లోపిస్తున్న పారిశుద్ధ్యం వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. మండలంలోని కొత్తపెల్లి, కట్య్రాల, ల్యాబర్తి, నందనం, బండౌతపురం, రాంధాన్తండా, డీసీతండాల్లో బురదనీరు రోడ్లపై చేరుతోం ది. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిం చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాధులు ప్రబలే అవకాశం.. డ్రైయినేజీలు అస్తవ్యస్తంగా ఉండడం మూలంగా వర్షపు నీటితో చెత్తాచెదారం చేరుకుని వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వర్షపు నీరు చెరువులు, కుంటలు, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చేరుతున్నాయి. వర్ధన్నపేట, ల్యాబర్తి, కట్య్రాల గ్రామాల్లో పైప్‌లై న్ల లీకేజీతో వర్షపు నీరు తాగునీటిని కలుషితం చేస్తున్నాయి. వాటర్‌ట్యాంకుల క్లోరినేషన్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. వేధిస్తున్న కార్యదర్శుల కొరత మండలంలోని 24 గ్రామాల పర్యవేక్షణకు 13 మంది కార్యదర్శులు అందుబాటులో ఉన్నారు. ఒక్కో కార్యదర్శికి రెండు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకున్నారు. కార్యదర్శుల పని ఒత్తిడితో పూర్తిస్థాయిలో పర్యవేక్ష ణ కరువైంది. గ్రామాల్లో పరిస్థితి సాధారణంగా ఉండగా, శివారు తండా ల్లో పారిశుధ్యం క్షీణించింది. పాటించాల్సిన జాగ్రత్తలు వర్షాకాలంలో కలుషిత నీటిని తాగకుండా ఉండాలి.వేడిచేసి చల్లార్చిన నీటిని తీసుకోవాలి.రాత్రి వేళల్లో దోమల బారి నుంచి రక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.విషజ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండడంతో జ్వరం సూచనలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నాం. వచ్చే నెల 2 వరకు అన్ని గ్రామాల్లో పర్యటి ంచి పారి శుద్ధ్య పనులను పూర్తిచేస్తాం. డ్రైనేజీ కాలువలు, నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్న ప్రదేశాల్లో బ్లీచింగ్ చేస్తాం. - శంకర్, ఈవోపీఆర్డీ