మాట్లాడుతున్న కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆదిలాబాద్‌రూరల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ, ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం మావలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని 468 గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులను నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్‌కు తరలించాలన్నారు. రోడ్లపై వర్షపునీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. అలాగే మురుగు కాలువలను శుభ్రం చేయాలన్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు.
దోమలతో వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 25 లక్షల 5వేల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఖాళీ స్థలాలు గుర్తించడం, గుంతలు తవ్వడం వంటి ఏర్పాట్లు చేసుకోవాలని, నాటిన ప్రతీ మొక్కను సంరక్షించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈనెల 30 నుంచి 8,702 ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలను పంపిణీ ఉంటుందన్నారు. అర్హులైన బీసీ చేతివృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు.
బడీడు పిల్లలను బడిలో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడత దళితబంధులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఎంపీడీవోల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన, అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. సమగ్ర ఓటరు జాబితా తయారీకి బీఎల్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం ఇటీవల జాతీయ జలశక్తి అవార్డు అందుకున్న కలెక్టర్‌ను అధికారులు సత్కరించారు. సమావేశంలో జెడ్పీ ిసీఈవో గణపతి, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, డిప్యూటీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్, ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment