సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో మురుగునీటి పైప్‌లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగి శుభ్రం చేసేందుకు అధునాతన స్వీడన్ రోబోలను ప్రయోగాత్మకంగా రంగంలోకి దించాలని జలమండలి యోచిస్తోంది. అధునాతన సాంకేతికత, కెమెరాలు, తెర, వ్యర్థాలతో పూడుకుపోయిన మ్యాన్‌హోళ్లలో సిల్ట్‌ను బోరింగ్ యంత్రం తో తవ్వి తొలగించడం, మురుగు ప్రవాహానికి ఆటంకాలను తొలగించేందుకు అవసరమైన విడిభాగాలన్నీ ఈ మినీ రోబోల్లో ఉంటాయి. మరో పక్షం రోజుల్లో స్వీడన్ నుంచి నగరానికి ఈ రోబోలను తెప్పించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతానికి 3 రోబోలను ప్రయోగాత్మకంగా నగరానికి తీసుకురానున్నారు. ఇవి నగర అవసరాలకు సరిపోతాయో లేదో క్షేత్రస్థాయిలో పరీక్షించనున్నారు. కాగా దేశ వ్యాప్తంగా 2014–17 మధ్యకాలంలో మురుగునీటి పైప్‌లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగి సుమారు 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు మృత్యువాతపడ్డారు. పారిశుద్ధ్య పనుల్లో కార్మికుల ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించేందుకే జలమండలి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఈ రోబో బరువు సుమారు 80 కిలోలు. మ్యాన్‌హోళ్లలో మనుషులు దిగే అవసరం లేకుండా ఈ రోబో మురుగుశుద్ధి ప్రక్రియ నిర్వహించనుంది. ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్‌తో పూడుకుపోయిన మ్యాన్‌హోల్‌లోకి వెళ్లే రోబో విడిభాగాల బరువు 30 కిలోలు. ముందుగా ఈ రోబోకు ఉన్న వైరును మురుగు ప్రవాహానికి అడ్డంకులున్న మ్యాన్‌హోల్‌లోకి పంపిస్తారు. దీనికున్న కెమెరా ఆధారంగా లోపలి పరిస్థితిని ఫొటోలు తీస్తుంది. ఇవన్నీ బయట ఉన్న స్క్రీన్‌పై ప్రత్యక్షమవడంతో మురుగు ప్రవాహానికి ఎక్కడ ఆటంకాలున్నాయో ఫొటోల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ తరవాత జెట్‌పైప్, టన్నెల్ బోరింగ్ యంత్రాల సాయంతో రోబో మ్యాన్‌హోల్‌లోకి వెళ్లి మురుగు ప్రవాహానికి ఆటంకంగా ఉన్న ఘన వ్యర్థాలు, సిల్ట్, ప్లాస్టిక్‌ను నిమిషాల వ్యవధిలో తొలగిస్తుంది.
మురుగు ప్రవాహానికి ఉండే ఆటంకాలను పూర్తిగా తొలగిస్తుంది. మూడుగంటలపాటు ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు శ్రమపడి చేసే పనిని ఈ రోబో 30 నిమిషాల్లోనే పూర్తిచేయడం విశేషం. కాగా గ్రేటర్ పరిధిలో సుమారు 6 వేల కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది. వీటిపై 2 లక్షల వరకు మ్యాన్‌హోళ్లున్నాయి. వీటిని శుద్ధి చేసేందుకు ఏడాది క్రితం జలమండలి సుమారు 50 మినీ జెట్టింగ్ యంత్రాలను రంగంలోకి దించడంతో ఉప్పొంగే మురుగు సమస్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఈ రోబోలు సైతం పారిశుద్ధ్య విధుల్లో పాలుపంచుకోనుండటంతో పారిశుద్ధ్య కార్మికుల జీవితాలకు భద్రత చేకూరనుంది.
రోబో మొత్తం బరువు: 80 కిలోలు
ఇందులో విడిభాగాల బరువు: 30 కిలోలు
ఒక్కో రోబో ఖరీదు(సుమారుగా..): 7 లక్షలు
గ్రేటర్‌లో మురుగునీటి వ్యవస్థ: 6,000 కి.మీ.
మ్యాన్‌హోళ్ల సంఖ్య: 2,00,000
మురుగుశుద్ధికి స్వీడన్ రోబోలు
Published Wed, Feb 28 2018 1:06 AM | Last Updated on Wed, Feb 28 2018 1:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment