Sanitation workers
-
కార్మికులను పట్టించుకునేవారే లేరా?
పటమట (విజయవాడ తూర్పు): ఊరు కాని ఊరు.. రోజూ 18 గంటలు పారిశుద్ధ్య పని.. ఉండటానికి సరైన వసతి లేదు.. రోడ్ల పక్కనే జీవనం.. అన్నం పెట్టే వారు లేరు.. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే భోజనంతోనే కడుపు నింపుకోవడం.. ఇదీ విజయవాడలో వరద అనంతర పారిశుద్ధ్య పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇతర జిల్లాల నుంచి తెప్పించిన కార్మికుల దుస్థితి. మహిళా కార్మికులకు కూడ సరైన వసతి, సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో గంటల తరబడి మురుగు, చెత్తా చెదారంలో పనిచేస్తున్నా కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇప్పటికే 40 మందికి పైగా కార్మికులు అనారోగ్యం బారిన పడ్డారు. అయినా అధికారులు వారి సంరక్షణ గురించి ఆలోచించడమే లేదు. బుడమేరు వరదకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 7 డివిజన్లు, సెంట్రల్ డివిజన్లోని 13, పశ్చిమ నియోజకవర్గంలోని 12 డివిజన్లు మునిగిపోయాయి. ఆ ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు, వీధుల్లో పేరుకుపోయిన వందల టన్నుల వ్యర్థాలను తొలగించటానికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి 6,800 మంది పారిశుద్ధ్య కార్మికులను పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ తీసుకొచ్చింది. వీరంతా తొమ్మిది రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వారితో రోజూ 18 గంటలు పని చేయిస్తున్నారు. వీరికి సరైన వసతి కల్పించలేదు. దీంతో వారంతా రోడ్ల వెంబడి, షాపుల వద్ద గూడు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఓవైపు వర్షం, మరోవైపు చలిలో కనీస నిద్ర కూడా లేక కార్మికులు తల్లడిల్లుతున్నారు. మురుగులో పని చేసే వీరికి చెప్పులు, చెత్త ఎత్తే కనీస పరికరాలు కూడా ఇవ్వడంలేదు. సరైన ఆహారాన్ని అందించడం లేదు. ఇదేమని అడిగితే సూపర్వైజర్లు కసురుకుంటున్నారు. దీంతో స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న ఆహార శిబిరాల వద్ద ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన 40 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్యం చేయించకుండానే అధికారులు వారిని స్వస్థలాలకు పంపించారు.మమ్మల్ని పట్టించుకోవటం లేదురేయింబవళ్లు పనిచేస్తున్నాం. ఇళ్ల నుంచి వచ్చే చెత్తనంతా ట్రాక్టర్లు, లారీల్లో ఎత్తుతున్నాం. బురద నీరు శరీరమంతా పడుతుంది. దురదలు వస్తున్నాయి. కాళ్లు పాశాయి. మా సమస్యలను చెప్పుకుందామంటే అధికారులు వినే పరిస్థితి లేదు. ఎంతసేపైనా పని చేయాలని ఆదేశిస్తున్నారే కానీ మా సమస్యలను పట్టించుకోవటంలేదు. మా ఆరోగ్యం, కుటుంబాల గురించి కూడా పట్టించుకోవాలి.– శేఖర్, ఆదోని మున్సిపాలిటీ కార్మికుడు -
సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చిరుద్యోగులు కన్నెర్ర చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్కీమ్ వర్కర్లు, కారి్మకులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కదం తొక్కారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలనే నినాదాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. వారి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది.సాక్షి నెట్వర్క్: బలవంతపు తొలగింపులు, రాజకీయ వేధింపులకు నిరసనగా ఐకేపీ, వీఓఏలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుధ్య కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లతోపాటు వివిధ రంగాలకు చెందిన చిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎనీ్టఆర్ జిల్లాలో చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని కోరుతూ విజయవాడలో సోమవారం ధర్నా జరిగింది. ప్రభుత్వ విభాగాలకు చెందిన చిరుద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు.చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. బాపట్ల కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన చిరుద్యోగులంతా పుట్టపర్తి చేరుకుని అధికార పార్టీ నాయకుల వేధింపులకు నిరసనగా కదం తొక్కారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్యాయత్నం, మరో కార్యకర్త సుహాసినిపై దాడికి కారణమైన టీడీపీ కార్యకర్త ఆంజనేయులు కుటుంబంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని నినదించారు. ఖాళీ ప్లేట్లతో నిరసన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో చిరుద్యోగులు ధర్నాలు నిర్వహించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపును నిరసిస్తూ.. చేసిన పనులకు వేతనాలు చెల్లించాలంటూ ఖాళీ ప్లేట్లతో ఉపాధి కూలీలు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు తక్షణం నిలుపుదల చేయాలని, ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కాకినాడలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి నేతల రాజకీయ వేధింపులను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్వతీపురంలోని కలెక్టరేట్ ఎదుట చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ నినాదాలు చేశారు. మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి ‘మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి.. మాకు రాజకీయ మరకలు పూయకండి’ అంటూ చిరుద్యోగులు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ పొట్టగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిరుద్యోగులను తొలగిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీఓఏలు, అంగన్వాడీ హెల్పర్లు ఒంగోలులో కదం తొక్కారు. లేనిపోని కారణాలు చూపుతూ చిరుద్యోగులను బలవంతంగా తొలగించడం, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నిరవధిక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. -
మోదీ ప్రమాణ స్వీకారానికి ట్రాన్స్జెండర్లు, పారిశుధ్య కార్మికులు, కూలీలు
న్యూఢిల్లీ: మోదీ ప్రమాణ స్వీకారానికి భిన్న వర్గాల ప్రజలు హాజరయ్యారు. ట్రాన్స్జెండర్లు, పారిశుధ్య కార్మికులతోపాటు నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలు సైతం హాజరుకావడం విశేషం. ప్రమాణ స్వీకారం కంటే ముందు ట్రాన్స్జెండర్లను కేంద్ర మాజీ మంత్రి వీరేంద్ర కుమార్, పారిశుధ్య కార్మికులను బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెకావత్ ఘనంగా సత్కరించారు. ‘సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్’ అంటూ ప్రధాని మోదీ ఇచి్చన పిలుపును అందిపుచ్చుకుంటూ ట్రాన్స్జెండర్లను సత్కరించినట్లు వీరేంద్ర కుమార్ తెలిపారు. -
పారిశుధ్య కార్మికులతో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు సోమవారం పారిశుధ్య కార్మికులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కార్మికులతో ముచ్చటిస్తూ సహపంక్తి భోజనం చేశారు. సెల్పిలు దిగారు. కాగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను పారిశుధ్య కార్మికులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి చేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని చెప్పారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కలి్పంచడంతో పాటు ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో తమకూ మెడికల్ లీవ్ సౌకర్యం ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పారిశుధ్య కార్మికులకు మూడు పర్యాయాలు వేతనం పెంచిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. సమస్యలను మేయర్ గద్వాల విజయలక్ష్మి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నేతలు, కార్యకర్తల స్వాగతం నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలు, సెల్పిలు దిగారు. సుమారు ఐదు గంటల పాటు తెలంగాణ భవన్లో గడిపిన కేటీఆర్ కార్యకర్తలను కూడా కలిశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులున్నారు. కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, నగేష్, టీఆర్ఎస్వీ నాయకులు శ్రీకాంత్ గౌడ్, తుంగ బాలు, కాటం శివ తదితరులు కేటీఆర్‌ను కలిశారు. -
క్లాప్‌మిత్రల వేతన బకాయిల చెల్లింపు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేసే క్లాప్ మిత్రలకు (పారిశుధ్య కార్మికులు) వేతన బకాయిలన్నింటినీ వేగంగా చెల్లించే ప్రక్రియ ఇటీవలే మొదలైందని.. అయినా “ఈనాడు’ పత్రిక ఉద్దేశపూర్వకంగా ఓ తప్పుడు భావనతో మంగళవారం “పారిశుధ్య కార్మికులకూ జగన్ దెబ్బ’ అంటూ దుష్ప్రచారం చేస్తూ కథనాన్ని ప్రచురించిందని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43,534 మంది క్లాప్‌మిత్రలకు 2022 అక్టోబరు నుంచి జూన్ 2023 మధ్య కాలానికి చెల్లించాల్సిన వేతన బకాయిలకు గాను రూ.84.03 కోట్లు ఇప్పటికే చెల్లించడం జరిగిందని, మరో రూ.141 కోట్ల చెల్లింపు ప్రక్రియ పురోగతిలో ఉందని పంచాయతీరాజ్ శాఖ “ఫ్యాక్ట్ చెక్’ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ చెల్లింపులకు గాను 2,055 గ్రామ పంచాయతీల్లో వెండర్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు పేర్కొంది. ఇక మీదట గ్రామ పంచాయతీల నిధుల నుంచి ఎప్పటికప్పుడు క్లాప్‌మిత్రల వేతనాల చెల్లింపులు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు.. మరోవైపు.. క్లాప్‌మిత్రల వేతనాల చెల్లింపు విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు వీలుగా ప్రత్యేక డ్యాష్‌బోర్డును ఏర్పాటుచేసినట్లు కూడా ఆ శాఖ వివరించింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తూ.. గ్రామాల్లో ఎక్కడా చెత్తాచెదారం పోగవకుండా పూర్తి పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని 2021 అక్టోబరు 2న ప్రారంభించిందని.. ఆ రోజు నుంచి ప్రతి గ్రామంలోనూ ఉ.6గంటల నుంచి క్లాప్‌మిత్రల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణ కొనసాగుతోందని తెలిపింది. ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 43,534 మంది పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియలో.. గ్రామ పంచాయతీలకు 32,777 చెత్త తరలించే రిక్షాలు, 1,004 టిప్పర్లను ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చినట్లు పంచాయతీరాజ్‌శాఖ వివరించింది. అలాగే, ప్రతినెలా క్లాప్‌మిత్రల వేతనాల చెల్లింపు కోసమే ప్రభుత్వం రూ.27 కోట్లు ఖర్చుచేస్తోందని తెలిపింది. -
కేరళ మున్సిపల్ మహిళా కార్మికులకు జాక్‌పాట్
మలప్పురం: లాటరీ టికెట్ కొనేందుకు నానా హైరానా పడిన ఈ మహిళలు ఎన్నడూ ఊహించని విధంగా జాక్‌పాట్ కొట్టేశారు. కేరళ లాటరీ విభాగం ప్రకటించిన వర్షాకాల ఫలితాల్లో వీరు కొనుగోలు చేసిన టికెట్ ఒకటీ రెండూ కాదు..ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకుంది. కేరళలోని పరప్పనంగడి మున్సిపల్ కొర్పొరేషన్లో ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్త నుంచి ‘హరిత కర్మ సేన’కు చెందిన 11 మంది మహిళా సభ్యులు ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తుంటారు. వీరు తలా రూ.25 కంటే తక్కువగా పోగేయగా జమయిన రూ.250 పెట్టి ఇటీవల కేరళ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో హరిత కర్మ సేన కొనుగోలు చేసిన టికెట్ రూ.10 కోట్ల జాక్‌పాట్ వరించింది. దీంతో, వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గత ఏడాది కూడా ఓనమ్ పండుగ సందర్భంగా తలాకొంత పోగేసి కొన్న టికెట్‌కు రూ.7,500 రాగా అందరం సమానంగా పంచుకున్నామని చెప్పారు. అదే ధైర్యంతో ఈసారి కొన్న టికెట్‌కు ఏకంగా రూ.10 కోట్లు వస్తాయని ఊహించలేదన్నారు. ఈ డబ్బును అందరం సమంగా పంచుకుంటామని తెలిపారు. అప్పులు తీర్చుకుని, పిల్లల పెళ్లిళ్లు చేస్తామని, కుటుంబసభ్యులకు అవసరమైన వైద్యం చేయించుకుంటామని చెబుతున్నారు. వీరి నెలవారీ వేతనం రూ.7,500–రూ.14,000 వరకు ఉంది. -
11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు..
కొచ్చిన్: కేరళలోని 11 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. అందరూ కలిసి చందాలు వేసి కొనుక్కున్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.10 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకుంది. రాత్రికి రాత్రే అంత పెద్ద మొత్తంలో నడమంత్రపుసిరి సొంతం కావడంతో వారంతా ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నారు. కేరళ ప్రభుత్వం 2023 వర్షాకాలం బంపర్ లాటరీ టికెట్ కొనడం కోసం 11 మంది మహిళా పారిశుధ్య కార్మికులు తలా కొంచెం చందాలు వేసుకున్నారు. పరప్పనంగడి మునిసిపాలిటీలోని హరిత కర్మ సేనకు చెందిన వీరందరివి అత్యంత నిరుపేద కుటుంబాలు. చందాలు పోగు చేసే సమయానికి వారిలో కొందరి వద్ద కనీసం రూ. 25 కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో చేతిలో ఎంత ఉంటే అంత పెట్టి ఎలాగోలా రూ. 250 పోగుచేసి బంపర్ లాటరీ టికెట్టు కొన్నారు. వారు కష్టపడి కొన్న అదే టికెట్‌కు రూ.10 కోట్లు బహుమతి లభించిందని తెలియగానే వారంతా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వారిలో ఒకామె మాట్లాడుతూ.. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. మేము మరికొంతమందిని అడిగి దీన్ని నిర్ధారించుకోవాలి. మేమంతా చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చినవారమే. మాలో చాలామందికి పెద్ద మొత్తంలో అప్పులున్నాయి. నాకే రూ.3 లక్షలు అప్పు ఉంది. ఇందులో నా వాటా డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తాను. డబ్బు సరైన సమయానికి చేతికందిందని అనుకుంటున్నానంది. ఇక హరిత కర్మ సేన కోఆర్డినేటర్ వారి సిబ్బందిలో కొంతమంది లాటరీ గెలవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వారంతా తమ జీవనాన్ని సాఫిగా గడపడం కోసం ఏంతో కష్టపడేవారు. వారు సాధారణంగా ప్రతి ఇల్లు తిరిగి చెత్తను సేకరిస్తూ ఉంటారు. వారి నెల జీతం కూడా రూ. 8000 నుండి రూ. 15000 మాత్రమేనని అన్నారు. ఈ లాటరీలో వారి జీవితాలు మారిపోయినట్లేనని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ 11 మంది పారిశుద్ధ్య కార్మికులు గత నాలుగేళ్లుగా ఈ బంపర్ కాటరీ టికెట్ కొంటుండగా గతంలో ఒకసారి వీరికి ఓనమ్ బంపర్ లాటరీలో రూ. 1000 బహుమతి లభించగా ఈ సారి మాత్రం ఏనుగు కుంభస్థలాన్ని కొల్లగొట్టారు. ఇది కూడా చదవండి: వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం.. -
కాలేజీ కుర్రాళ్ల వినూత్న ఆలోచన, బ్యాండికూట్ వస్తుంది తప్పుకోండి.. తప్పుకోండి!
ఉపాయాలు ఊరకే రావు. గట్టిగా ఆలోచిస్తేనే వస్తాయి. ఈ నలుగురు కుర్రాళ్లు అలాగే ఆలోచించారు. శానిటేషన్, హెల్త్‌కేర్, కెమికల్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లకు ఉపయోగపడే రోబోటిక్స్‌కు రూపకల్పన చేశారు. శాస్త్రానికి సామాజిక ధర్మం జోడించి ‘జెన్ రోబోటిక్స్’తో ఘన విజయం సాధించారు.. సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే క్రమంలో ఎంతోమంది అమాయకులు బలైతున్నారు. ప్రకటిత గణాంకాల కంటే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని సఫాయి కర్మాచారి ఆందోళన (ఎస్‌కేఎ) అనే స్వచ్ఛంద సంస్థ చెబుతోంది. మాన్యువల్ స్కావేంజింగ్ను నిషేధించాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తుంది. కేరళలో ముగ్గురు స్కావెంజర్లు చనిపోయిన విషాదం ఇంజనీరింగ్ చేస్తున్న అరుణ్ జార్జ్, నిఖిల్ ఎన్పీ, రషీద్ కె, విమల్ గోవింద్ ఎంకేలను బాగా కదిలించింది. ‘ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి’ అని గట్టిగా అనుకున్నారు. మలప్పురం(కేరళ) జిల్లాలోని కుట్టిపురం ఎంఈఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే రోజుల్లో ‘రోబోటిక్ స్కావెంజర్’ ఆలోచన చేశారు. మొదట కాలేజీ ప్రాజెక్ట్‌గా ఆ ఆలోచనను పట్టాలెక్కించారు. చదువులు పూర్తైతే ఉద్యోగాల కోసం కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టాక కూడా వారిని ‘రోబోటిక్ స్కావెంజర్’ ఆలోచన వదల్లేదు. దీంతో ఉద్యోగాలు వదులు కొని ‘జెన్ రోబోటిక్స్’ అనే స్టార్టప్ మొదలుపెట్టారు. రోబోటిక్ స్కావెంజర్ ‘బ్యాండికూట్’తో ఈ స్టార్టప్ ప్రస్థానం మొదలైంది. 50 కిలోల బరువు ఉండే ‘బ్యాండికూట్’ రిమోట్–కంట్రోల్డ్ రోబోట్. 360 డిగ్రీల మోషన్స్‌లో పనిచేస్తుంది. సింగిల్ షిఫ్ట్‌లో పది నుంచి పన్నెండు మురుగు కాలువలను శుభ్రపరుస్తుంది. ఒక్కొక్క మురుగు కాలువను, మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. స్కై స్క్రాపర్స్కు సంబంధించిన గ్లాస్ ఫేసాడ్లను శుభ్రం చేసే ‘జీ–బిటల్’ రోబోట్ కూడా మెగా హిట్ అయింది. ఇక ‘వెల్బోర్’ అనేది ఆయిల్ అండ్ గ్యాస్, కెమికల్ ఇండస్ట్రీలకు సంబంధించిన పెద్ద ట్యాంకులను శుభ్రపరుస్తుంది. ‘బ్యాండికూట్’తో మొదలైన జెన్ రోబోటిక్స్ ప్రయాణం హెల్త్‌కేర్, కెమికల్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్... మొదలైన వాటికి విస్తరించింది. ‘శానిటేషన్‌కు సంబంధించి పరిష్కరించుకోవాల్సిన పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిపై దృష్టి పెడుతున్నాం’ అంటున్నాడు కో–ఫౌండర్స్‌లో ఒకరైన విమల్. ‘మరి ఈ యంత్రాల వల్ల కార్మికుల ఉపాధి దెబ్బతింటుంది కదా?’ అనే సందేహం అందరికీ వస్తుంది.దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులు సులభంగా ఆపరేట్ చేసేలా ఈ యంత్రాలను రూపొందించారు. మూడు వేల మందికి పైగా కార్మికులు ఈ యంత్రాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. పారిశుద్ధ్య పనుల్లో మార్పు తీసుకురావడానికి సేఫ్టీ అండ్ డిగ్నిటీ నినాదంతో సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలు చేయాలనుకుంటాం’ అంటున్నాడు ఫౌండర్స్‌లో ఒకరైన విమల్ గోవింద్. తిరువనంతపురం కేంద్రంగా మొదలైన ‘జెన్ రోబోటిక్స్’ పదిహేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తోంది. బ్రిటన్, ఇండోనేషియ, మలేషియాలతో ఇటు ఆఫ్రికన్ దేశాలకు విస్తరించింది. ‘ఈ యువ బృందం ప్యాషన్, సామాజిక దృష్టి మమ్మల్ని ఆకట్టుకుంది’ అంటున్నాడు ‘జెన్ రోబోటిక్స్’ ఇన్వెస్టర్ ‘యూనికార్న్ ఇండియా వెంచర్స్’ ఫౌండర్, మెనేజింగ్ పాట్నర్ అనీల్ జోషి. -
May Day Gift: పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ మే డే గిఫ్ట్..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజున పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. పారిశుధ్య కార్మికుల జీతం రూ.వెయ్యి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా అందే జీతంతోపాటు పెరిగిన రూ.1000 కూడా అందుతుందని సీఎం తెలిపారు. తక్షణమే ఈ పెంపు అమలులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్‌తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల జీతాలను సైతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆర్థికశాఖను ఆదేశించారు. చదవండి: Video: కొత్త సచివాలయానికి రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు పాలమూరు -రంగారెడ్డి పథకంపై సమీక్ష కాగా, కొత్తగా నిర్మించిన సచివాలయంలో తొలిసారి సీఎం కేసీఆర్ పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం చర్చించారు. జులై వరకు కరివెన జలాశయంకు నీళ్లు తరలించాలని, ఆగస్ట్ వరకు ఉద్దండాపూర్ వరకు నీటిని ఎత్తిపోయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నార్లపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని.. పంప్‌హౌస్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, కన్వేయర్ సిస్టమ్‌లోని పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పనులకు సంబంధించిన పురోగతిపై సమీక్షించారు. మిగిలిన కొద్దిపాటి పనులను ఈ జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం సూచించారు. ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు! హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలోని పేదల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా.. నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయమైన హక్కులను కల్పించినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నోటరీ స్థలాలను జీవో 58-59 ప్రకారం క్రమబద్ధీకరించుకునేందుకు మరో నెల రోజులు గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: ఎమ్మెల్సీ కవితపై కీలక అభియోగాలు మోపిన ఈడీ.. తెరపైకి భర్త అనిల్ పేరు.. -
ప్రజాస్వామ్యం పతనం కాకుండా...
భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు దారుణంగా పతనమయ్యాయని స్వీడన్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ ‘వి–డెమ్’ వెల్లడించింది. పాత్రికేయుల మీద వేధింపుల సంఖ్య పెరిగిందని కూడా నమోదు చేసింది. పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ కవచాలు లేక వారు ప్రాణాలు విడుస్తున్న ఉదాహరణలను చూస్తూనే వున్నాం. విష వాయు మాళిగల్లోకి వారిని ‘తోసి’ ప్రాణాలు తీసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా చూడం. ఇలాంటి పరిస్థితుల్లో పండుగలు, పబ్బాలు కూడా పేద వర్గాల జీవితాల్లో నామమాత్రం అయిపోయాయి. ఇన్ని సమస్యలు దేశంలో ఉండగా, పాలక వ్యవస్థను ప్రజావసరాలు తీర్చడానికి వినియోగించేందుకు నడుం బిగించడం మానేసి న్యాయ వ్యవస్థను తటస్థం చేసేందుకు పాలక పక్షం యత్నిస్తోంది. ‘‘2014 తర్వాత భారతదేశంలో ప్రజా స్వామ్య విలువలు దారుణంగా పతనమై నాయి. ఈ పతన దశ 1975 నాటి ఎమర్జెన్సీ కాలం పరిస్థితుల స్థాయికి 2022లో చేరుకుంది. 2014–2022 మధ్య కాలంలో ఇండియాలో ప్రజాస్వామ్య విలువల పతనం గ్రీస్, బ్రెజిల్, పోలెండ్, ఫిలిప్పీన్స్లలో పతన దశకు సమాన స్థాయిలో నమోదయింది.’’ – అమలులో ఉన్న వివిధ రకాల ప్రజాస్వామ్యాల గురించి గోథెన్బర్గ్ నగరంలోని స్వీడన్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ ‘వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ’ (క్లుప్తంగా వి–డెమ్) పరిశోధనలో ఈ సత్యాలు వెల్లడ య్యాయి. ‘హిందూ’ పత్రిక ‘డేటా పాయింట్’ విశ్లేషకుడు విఘ్నేశ్ రాధా కృష్ణన్ ఈ వివరాలను పొందుపరిచారు. (20 మార్చ్ 2023) ఈ వెల్లడి ఇలా ఉన్న సమయంలోనే బీజేపీ ప్రభుత్వ న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటన చేస్తూ (19 మార్చ్ 2023)– భారతదేశంలో కొందరు రిటైర్డ్ (విశ్రాంత) న్యాయమూర్తులు భారత వ్యతిరేక ముఠాతో చేతులు కలిపి పనిచేస్తున్నారనీ, వీరు భారత న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పార్టీ పాత్ర వహించాలని చూస్తున్నారనీ ఆరోపించారు. ఇది చెల్లుబాటు కాదని కూడా అన్నారు. ‘ఇది మంత్రి బెదిరింపు’ అని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ఖండించారు! ఆట్టే చూస్తుంటే ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణల తంతు ఎలా ఉందంటే, ‘అభిరుచి భేదాల’ గురించి రష్యన్ మహాకవి మయ కోవస్కీ చెప్పిన వ్యంగ్య రచన గుర్తుకొస్తోంది: వెనకటికొక ‘‘గుర్రం ఒంటె వైపు చూపు సారించి అరిచింది, ఛీ! ఇది సంకర జాతికి చెందిన గుర్రం’ అని. ఒంటె (తాను మాత్రం తక్కువ తిన్నానా అనుకుని) అన్నది కదా ‘నువ్వు గుర్రానివి కావు చిన్న సైజు ఒంటెవి అంతే అనుకో’ అని! కానీ అసలు సంగతి ఆ దేవునికే తెలుసు! విశాల నక్షత్ర వీధుల్లో ఆ విశ్వ ప్రభువుకి, ఈ రెండూ రెండు విభిన్న జాతులకి చెందిన మృగాలని తెలుసు’’! భారత లౌకిక రాజ్యాంగం గుర్తించి రూపొందించిన వాక్, సభా స్వాతంత్య్రం లాంటి ప్రాథమిక హక్కులను నర్మగర్భంగా అణచివేసే పద్ధతుల్ని ఏ పాలకులు అనుసరిస్తున్నా, కనీస ప్రజాస్వామ్య విలు వల్ని రకరకాల ‘మిష’ చాటు చేసుకుని గౌరవించని దశలోనే ఇలా ‘అభిరుచిలో భేదాలు’ బాహాటంగా చోటు చేసుకుంటాయని మరచి పోరాదు! అంతేగాదు, 2014–2022 మధ్య కాలంలో దేశంలో పెక్కు మంది పాత్రికేయుల మీద వేధింపుల సంఖ్య కూడా పెరిగిందని ‘వి–డెమ్’ సంస్థ నమోదు చేసింది. పశువులకు మేత లేక తిండి కరవుతో చస్తున్నా, ‘మతం’ పేరిట ముస్లిం యువకుల్నీ, వారి కుటుంబాలనూ వేధిస్తున్న ఘటనలకు అసాధారణ చొరవ చూపారు ఉత్తర ప్రదేశ్ పాలకులు. ‘గోరక్షణ’ పేరిట పలుచోట్ల జరిగిన దారుణమైన దాడులు సామాజిక అశాంతికి దారి తీశాయి. ఇలాంటి ఎన్నో ఘటన లను ‘హిందూ’ పత్రిక అనుబంధ విశిష్ట పక్ష పత్రిక ‘ఫ్రంట్‌లైన్’ (మార్చి 10, 2023) నమోదు చేసింది. ఇదిలా ఉండగా– చివరికి పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ కవచాలు లేక అనేక సీవేజ్ గుంటల్లో ప్రాణాలు విడుస్తున్న ఉదా హరణలను పేర్కొంటూ సుప్రీంకోర్టు చలించిపోయింది. దుర్గంధపూరిత విష వాయువుల మధ్య చనిపోతున్న పారిశుధ్య కార్మికుల పరిస్థితులను ప్రస్తావించి, ఇలా ‘విష వాయు మాళిగ (గ్యాస్చాంబర్స్)ల్లోకి తోసి ప్రాణాలు తీసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా చూడ బోమని’ (2019లో) వ్యాఖ్యానించింది! పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమ నాయకుడు బెజవాడ విల్సన్ దేశంలో వీరి పరిస్థితి ఎందుకు మెరుగవటం లేదో కారణాలు వివరంగా పేర్కొన్నారు: ‘‘కుల వ్యవస్థ దేశంలో బలంగా ఉన్నందున, ఈ కార్మికుల ఆరోగ్య పరిస్థితుల్ని పట్టించుకోవడం లేదు. పాలకులు రాజ్యాంగ విధుల్ని పాటించడం మానేశారు. దేశంలో ప్రతి మూడవ రోజున ఒక పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతున్నాడు. అయినా వారి రక్షణ గురించిన పల్లెత్తు హామీ లేదు.’ (ఫ్రంట్‌లైన్, 10 మార్చ్ 2023)ఇలాంటి పరిస్థితుల్లో చివరికి పండుగలు, పబ్బాలు కూడా పేద వర్గాల జీవితాల్లో నామ మాత్రం అయిపోయాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇలాంటి దీన పరిస్థితుల్ని తలచుకున్నప్పుడల్లా ‘మాకు గాదులు లేవు, ఉగాదులు లేవ’ని పలుమార్లు ఎత్తిపొడుస్తూ వచ్చాడు. చివరికి ‘ఎంత పెద్ద పండుగ’ వచ్చినా పేదసాదలు యథాలాపంగా జరుపుకోవడమేగానీ, వారి బతుకుల్లో నిజమైన వెలుగులు చూడలేక పోతున్నాం! అందుకే శ్రీశ్రీ కూడా ‘పండుగెవరికి? పబ్బమెవరికి?’ అన్న పాటలో సమాధానాలు లేని ప్రశ్నల వర్షం కురిపించాల్సి వచ్చింది: ‘‘పెద్ద పండుగ, పెద్ద పండుగ, పేరు దండగ! పండుగెవరికి, పబ్బమెవరికి? తిండి లేక, దిక్కు లేక దేవులాడే దీన జనులకు పండుగెక్కడ! పబ్బమెక్కడ? ఎండు డొక్కల పుండు రెక్కల బండ బతుకుల బానిసీండ్రకు పండుగేమిటి? పబ్బమేమిటి? ఉండటానికి గూడు లేకా ఎండవానల దేబిరించే హీన జనులకు పేద నరులకు పండుగొకటా? పబ్బమొకటా?’’ ఇన్ని ఈతిబాధలు పేద వర్గాలను నిత్యం వెంటాడుతుండగా– పాలక వ్యవస్థను ప్రజావసరాలు తీర్చడానికి వినియోగించేందుకు నడుం బిగించడం మానేసి న్యాయ వ్యవస్థను తటస్థం చేసేందుకు పాలక పక్షం యత్నిస్తోంది. అఖిల పక్ష– పాలక వర్గ, ప్రతిపక్ష, న్యాయ వ్యవస్థ ప్రతినిధులతో సమాన ఫాయాలో ఏర్పడే క్రియాశీల సంస్థ ఉంటేనే వివక్షకు తావుండదని న్యాయ వ్యవస్థ భావించింది. ఇది ఆచరణలోకి వస్తే పాలక వర్గ ఏకపక్ష నిర్ణయాలూ, ఆటలూ సాగవు. అలాంటి పరిణామానికి ప్రస్తుత క్రియాశీల అత్యున్నత ధర్మాసనం సానుకూలం. కేంద్రం ప్రతికూలం. ఈ వైరుధ్యం, రాజ్యాంగం ఉభయ శాఖలకు నిర్దేశించిన పరిధుల్ని గౌరవించి వ్యవహరించినంత కాలం తలెత్తదు. ఇప్పుడా పరిధిని పాలకులు అతిక్రమించడానికి ఘడియలు లెక్కపెడుతూ కూర్చున్నందుననే ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయి! ప్రస్తుత పాలకవర్గానికి అసలు భయమంతా – 2024 జనరల్ ఎన్నికల వరకే గాక ఆ తరువాత కూడా ప్రస్తుత క్రియాశీల ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మరికొంత కాలం పదవిలో ఉండ బోవడమే! ప్రస్తుతం కిరణ్ రిజిజు మనోవేదనంతా సుప్రీం చుట్టూనే తిరుగుతోంది! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
AP: పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పాదపూజ
రామచంద్రపురం(కోనసీమ జిల్లా): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పాదాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శనివారం కడిగారు. దుశ్శాలువాలు, పూలమాలలు, నూతన వ్రస్తాలతో ఘనంగా సత్కరించారు. వీరితో పాటు పోలీసులు, వైద్యులను కూడా సన్మానించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతకు భోగి, స్వేచ్ఛతకు సంక్రాంతి, సేవకు గుర్తుగా కనుమ పండుగ జరుపుకొంటారని తెలిపారు. చదవండి: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు -
గయ డిప్యూటీ మేయర్‌గా పారిశుద్ధ్య కార్మికురాలు
పట్నా: పారిశుద్ధ్య కార్మికురాలిని డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నుకోవడం ద్వారా బిహార్‌లోని గయ మున్సిపాలిటీ ప్రజలు చరిత్ర సృష్టించారు. చింతాదేవి గత 40 ఏళ్లుగా మున్సిపాలిటీలో స్కావెంజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈమె 16వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 1996లో కూడా గయ ప్రజలు ముసాహిర్ వర్గానికి చెందిన రాళ్లు కొట్టుకునే భగవతీదేవి అనే సాధారణ మహిళను లోక్‌సభకు పంపారు. -
బాత్రూముల్లో కంపు.. ట్విట్టర్ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్న మస్క్
వాషింగ్టన్: ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచీ సిబ్బందికి చుక్కులు చూపుతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నిర్వాకాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు పొదుపు చర్యలకు దిగుతుంటే పారిశుధ్య సిబ్బంది వేతన పెంపుకు డిమాండ్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి వారందరినీ పీకిపడేశారు. దాంతో సరైన నిర్వహణ లేక బాత్రూములన్నీ భరించలేనంత కంపు కొడుతున్నాయని సిబ్బంది మొత్తుకుంటున్నారు. చివరికి వాటిలో టాయ్‌లెట్ పేపర్లకు కూడా దిక్కు లేదట! వాటిని ఇంటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. పలు నగరాల్లోని ట్విట్టర్ కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా కరువయ్యారట! నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఉద్యోగులందరినీ రెండంతస్తుల్లోనే కుక్కి నాలుగింటిని ఖాళీ చేశారట. సియాటిల్, శాన్ఫ్రాన్సిస్కో కార్యాలయ భవనాలకు అద్దె చెల్లించడం కూడా ఆపేశారు. సిబ్బందిని వీలైనంత వరకూ వర్క్ ఫ్రం హోం చేయాలని చెబుతున్నారు. ట్విట్టర్ సిబ్బందిలో సగం మందిని తీసేయడం తెలిసిందే. టెస్లా, స్పేస్ ఎక్స్ తదితర సొంత కంపెనీల నుంచి సిబ్బందిని ట్విట్టర్‌కు మస్క్ తరలిస్తున్నారట! -
పోలీస్టేషన్ ముందే కొట్లాట...బీజేపీ కార్పోరేటర్ భర్తను చితకబాదిన పారిశుద్ధ్య కార్మికులు
ఇండోర్: పారిశుద్ధ్య కార్మికుల బృందం బీజేపీ కార్పోరేటర్ భర్తను పోలీస్టేషన్ ముందే చితకబాదేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని రౌ పోలీస్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...సందీప్ చౌహన్‌పై ఫిర్యాదు చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున సముహంగా పోలీస్ స్టేషన్‌వద్దకు వచ్చారు. సదరు వ్యక్తి ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని ఫోన్లో దుర్భాషలాడటంతో.... ఆమె బంధువులు, తోటి కార్మికులు ఆగ్రహావేశాలతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కి వచ్చారు. దీంతో పోలీసులు సందీప్ చౌహన్‌ని పోలీస్టేషన్‌కి పిలపించి ఇద్దరి మధ్య సమస్య రాజీ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం తలెత్తి చౌహన్‌పై దాడి చేసేందుకు యత్నించారు పారిశుద్ధ్య కార్మికులు. అంతేగాదు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరి దాడి చేసుకుని, బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులు చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఐతే చౌహన్ భార్య 13వ వార్డు రౌ మున్సిపాలటి బీజేపీ కార్పోరేటర్. (చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు) -
చెత్త బుట్టలో ఉంగరాన్ని పడేసుకున్న మహిళ.. ‘స్పందన’తో స్పందన
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్పొరేషన్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ఓ చిత్రమైన ఫిర్యాదు అందింది. ఒక మహిళ ఫోన్ చేసి తన ఉంగరం పొరపాటున ప్రభుత్వ చెత్త బుట్టలో పడిపోయిందని చెప్పింది. ఆ ఉంగరాన్ని వెతికించి.. ఇవ్వాలని కోరింది. దీంతో శానిటేషన్ సిబ్బంది చెత్తనంతా జల్లెడ పట్టి.. చివరకు ఉంగరాన్ని ఆమెకు అప్పగించారు. వివరాలు.. ఇన్నీస్‌పేటకు చెందిన నాగలక్ష్మి సోమవారం తన ఇంట్లోని చెత్తను తీసుకెళ్లి.. సమీపంలోని ప్రభుత్వ చెత్త తొట్టెలో వేసింది. ఆ తర్వాత కొంతసేపటికి.. తన చేతికి ఉన్న 6 గ్రాముల బంగారు ఉంగరం కనబడకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. చెత్త బుట్టలో జారిపోయి ఉంటుందన్న సందేహంతో.. అక్కడకు వెళ్లింది. కానీ అదంతా చెత్తతో నిండిపోయి ఉండటంతో.. నాగలక్ష్మి ‘స్పందన’ కార్యక్రమాన్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కమిషనర్ దినేశ్‌కుమార్.. స్థానిక సచివాలయ సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను అప్రమత్తం చేశారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ బుద్ధ శ్రీను, శానిటేషన్ సెక్రటరీ ఎం.రాజేశ్, పారిశుధ్య కార్మికులు బంగారు శ్రీను, జయకుమార్, మేస్త్రీ శ్రీను దాదాపు 5 గంటల పాటు చెత్తనంతా వెతికి.. ఉంగరాన్ని బాధితురాలికి అందజేశారు. దీంతో నాగలక్ష్మి వారికి కృతజ్ఞతలు తెలిపింది. -
ఏపీ: గుడ్‌న్యూస్.. OHA ఉత్తర్వులు జారీ
సాక్షి, విజయవాడ: మున్సిపాలిటీలో పని చేసే పారిశుధ్య కార్మికులకు ఓహెచ్ఏ(ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్సు)కు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రూ. 6 వేలు చెల్లింపులపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపల్ కార్మికుల 15 వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓ హెచ్ ఏను చెల్లించనునుంది ఏపీ ప్రభుత్వం. దీంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ. 21 వేలకు పెరిగినట్లు అయ్యింది. తాజా ఉత్తర్వులతో 43 వేలమందికి పైగా కార్మికులకు మేలు జరగనుంది. పలు డిమాండ్లతో పాటు ఆరోగ్య భృతిని ప్రస్తావిస్తూ.. సమ్మెకు దిఆరు పట్టణ పారిశుద్ధ్య, ఒప్పంద కార్మికులు. ఈ తరుణంలో సీఎం జగన్ సమస్యలను తెల్చుకుని వెంటనే పరిష్కరించాలని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఆదేశించడం.. కేబినెట్ కమిటీ ద్వారా సమస్య పరిష్కారం త్వరగతిన పరిష్కారం అయ్యాయి. అంతేకాదు.. జీవో నం.233 ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేయనున్నట్లు తెలిపింది ఏపీ సర్కార్. చదవండి: టీడీపీ హయాంలో తక్కువ.. సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం -
పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులకు రూ.6 వేలు ఓహెచ్ఏ
సాక్షి, అమరావతి: పట్టణ పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్సు (ఆరోగ్య భృతి–ఓహెచ్ఏ) రూ.6 వేలు చెల్లిస్తామని, రూ.15 వేల వేతనంతో కలిపి మొత్తం రూ.21 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. కార్మికుల ప్రధాన డిమాండ్ పరిష్కారమైనందున సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేష్‌తో పాటు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ కార్మికుల డిమాండ్లపై సీఎంతో చర్చించింది. అనంతరం మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ అలవెన్సు రూ.6 వేలు చెల్లించాలని సీఎం నిర్ణయించినట్టు చెప్పారు. జీవో నం.233 ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేస్తామన్నారు. మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. కార్మికులు సమ్మె విరమించాలని ఆయన కోరారు. 43,233 మంది కార్మికులకు మేలు రాష్ట్రంలోని 123 నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల్లో మొత్తం 51,306 మంది కార్మికులు ప్రజారోగ్య శాఖ, ఇతర విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. వీరిలో 8,073 మంది రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. 43,233 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు రూ.12 వేలు వేతనంగా చెల్లించేది, అయితే, వారి కష్టాన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి మేలు చేయాలని ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్సు కింద రూ.6 వేలు కలిపి మొత్తం రూ.18 వేలకు పెంచింది. అనంతరం పీఆర్సీ అమలు చేయడంతో వారి వేతనాలు రూ.15 వేలకు పెరగడంతో ఓహెచ్‌ఏను సవరించి రూ.3 వేలు కలిపి వేతనం రూ.18 వేలుగా ఇస్తున్నారు. అయితే, తొలుత ప్రకటించిన ఓహెచ్ఏ మొత్తం చెల్లించాలని సోమవారం నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికుల వినతి మేరకు ఆరోగ్య భృతి రూ.6 వేలు చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.21 వేలకు చేరింది. ఓహెచే పూర్తిస్థాయిలో రూ.6 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంపై మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తంచేశారు. తమ డిమాండ్లు పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విధుల్లో చేరండి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించినందున పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో చేరాలి. ప్రస్తుత వర్షాలు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శుక్రవారం నుంచి విధుల్లోకి రావాలి. ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక మున్సిపల్ కమిషనర్ల ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. – ప్రవీణ్‌కుమార్, సీడీఎంఏ -
సమ్మె విరమించండి.. మాట్లాడుకుందాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మికుల మేలుకోరే ప్రభుత్వం ఉందని, ప్రజా సేవలకు విఘాతం కలిగించి మునిసిపల్ ఒప్పంద పారిశుధ్య కార్మికులు సమ్మె చేయడం భావ్యం కాదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ అంశంపై పట్టుబట్టి సమ్మె చేయడం సరికాదని మునిసిపల్ ఒప్పంద కార్మికులకు హితవు పలికారు. ధర్నాలు, సమ్మెలతో సమస్యలు పరిష్కారం కావని, కలిసి చర్చించుకుంటే పరిష్కారమవుతాయన్నారు. పక్క రాష్ట్రంతో పోలిస్తే పారిశుధ్య ఒప్పంద కార్మికులకు ఏపీలో మెరుగైన వేతనాలు ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సీఎం వైఎస్ జగన్ కార్మికులకు న్యాయం చేస్తారన్నారు. ప్రస్తుతం కార్మికుల్లో ఏ ఒక్కరికీ రూ.18 వేలకు తక్కువ కాకుండా వేతనం ఇస్తున్నట్టు చెప్పారు. కార్మికులకు కావల్సిన అన్ని సౌకర్యాలు, పనిముట్లు కూడా సరిపడినన్ని అందుబాటులో ఉంచామన్నారు. దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒప్పంద కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి రావాలని సూచించారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజా సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రెగ్యులర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని, కొందరు కాంట్రాక్ట్ సిబ్బంది సైతం సేవలు అందిస్తున్నారని వివరించారు. అవసరమైన యూఎల్బీల్లో తాత్కాలిక సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. యూఎల్బీల్లో సేవలకు వాహనాలు అవసరమైన చోట స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపారు. హోటళ్లు, మార్కెట్ల వద్ద చెత్త ఉండిపోకుండా ఎప్పటికప్పుడు తరలించాలని సీడీఎంఏ ప్రవీణ్ కుమార్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. సమ్మె నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గురువారం మంత్రులు ఆదిమూలపు, బొత్స, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం కానున్నారు. సమ్మెను ఉధృతం చేస్తాం: కార్మిక జేఏసీ మునిసిపల్ కార్మికుల సమ్మెను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు పట్టణ పారిశుధ్య కార్మిక జేఏసీ, సీఐటీయూ నేత కె.ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. శుక్రవారం నుంచి మునిసిపల్ ఒప్పంద కార్మికులు విద్యుత్ నిర్వహణ సేవలను నిలిపివేస్తారని చెప్పారు. ఈ నెల 17 నుంచి అన్ని అత్యవసర విభాగాల్లో పనిచేస్తోన్న మునిసిపల్ కార్మికులు విధుల్లో పాల్గొనరాదని కోరారు. గురువారం అన్ని పట్టణాల్లో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలు చేయనున్నారని, శుక్రవారం మునిసిపల్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. -
సమ్మె విరమిస్తేనే చర్చలు
సాక్షి, అమరావతి: పట్టణ పారిశుధ్య కార్మికులు సమ్మెను విరమించి, విధుల్లోకి వస్తేనే వారి సమస్యల పరిష్కారంపై చర్చిస్తామని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ మేరకు పారిశుధ్య కార్మిక ఐక్య కార్యాచరణ సమితికి (జేఏసీ) సమాచారం ఇచ్చినట్లు మంగళవారం ఆయన చెప్పారు. మంత్రుల ముందుంచిన డిమాండ్లలో ఆరోగ్య భత్యం మినహా మిగిలిన అన్నింటినీ పరిష్కరిస్తామని సోమవారం మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో కార్మిక జేఏసీకి చెప్పినప్పటికీ కార్మికులు సమ్మెకే మొగ్గు చూపారని, దీంతో పట్టణ పారిశుధ్య నిర్వహణ, ఇతర విధులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెను విరమించి విధులకు హాజరైతేనే వారితో చర్చిస్తామని ఆయన ప్రకటించారు. సచివాలయంలో సోమవారం రాత్రి జరిగిన మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో మంత్రులు సురేష్, బొత్స సత్యనారాయణ మున్సిపల్ కార్మిక జేఏసీతో చర్చించారు. ఇందులో కార్మికులు వెల్లడించిన మొత్తం 23 డిమాండ్లలో ఓహెచ్ఏ మినహా మిగిలిన అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఓహెచ్‌ఏను గతంలో మాదిరిగా రూ.6 వేలు చెల్లించాల్సిందేనని జేఏసీ నేతలు పట్టుబట్టారు. గత ప్రభుత్వంలో పట్టణ పారిశుధ్య విభాగంలోని ఒప్పంద కార్మికుల వేతనం రూ.12 వేలుగా ఉండేదని, వేతనాలు తక్కువగా ఉన్నందున వారికి అదనంగా ఓహెచ్ఏ రూపంలో రూ.6 వేలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిందన్నారు. పీఆర్సీ పెరిగినందున వారి వేతనాలు రూ.15 వేలకు పెరగడంతో ఆ మేరకు ఆరోగ్య భత్యాన్ని సవరించి రూ.3 వేలు కలిపి రూ.18 వేలు చెల్లిస్తున్నట్లు మంత్రి సురేష్ వివరించారు. అయినప్పటికీ కార్మిక సంఘం నేతలు మిగిలిన రూ.3 వేలు కూడా కలిపి మొత్తం రూ.21 వేలు వేతనంగా ఇవ్వాలంటున్నారన్నారు. కానీ, కార్మికులు విధుల్లో చేరితేనే వారితో చర్చించాలని, అంతవరకు చర్చలు ఉండబోవని మంత్రి ఆదిమూలపు తేల్చిచెప్పారు. విధుల్లో సగం మందికి పైగా కార్మికులు సమ్మెకు మద్దతుగా సగంమంది కార్మికులు విధులకు దూరంగా ఉండగా, మిగిలిన సగం మంది విధుల్లో ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. రెండ్రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ మొత్తం ఒప్పంద కార్మికుల్లో సగం మంది సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వర్తించారు. ప్రజా సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వర్షాల కారణంగా ప్రజలకు పారిశుధ్య ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పాలనా విభాగం కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్‌కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా, అవసరాన్ని బట్టి చర్యలు చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ముఖ్యంగా.. చెత్త ఎక్కువగా ఉత్పత్తయ్యే రెస్టారెంట్లు, హోటళ్లు, కల్యాణ మండపాలు, మార్కెట్లు, ఆస్పత్రుల వంటి ప్రదేశాల నుంచి చెత్తను తరలించేందుకు మొదట ప్రాధాన్యతనిచ్చి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే, వాటి యాజమాన్యాలు సైతం సహకరించాలని, సమ్మె కాలంలో చెత్తను స్వయంగా ఎత్తివేసేందుకు సహకరించాలని కోరారు పట్టణ ప్రజా సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇక వర్షాల కారణంగా ప్రజలకు పారిశుధ్య ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్రంలోని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పాలనా విభాగం కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రవీణ్‌కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా, అవసరాన్ని బట్టి చర్యలు చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ముఖ్యంగా.. చెత్త ఎక్కువగా ఉత్పత్తయ్యే రెస్టారెంట్లు, హోటళ్లు, కల్యాణ మండపాలు, మార్కెట్లు, ఆస్పత్రుల వంటి ప్రదేశాల నుంచి చెత్తను తరలించేందుకు మొదట ప్రాధాన్యతనిచ్చి, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే, వాటి యాజమాన్యాలు సైతం సహకరించాలని, సమ్మె కాలంలో చెత్తను స్వయంగా ఎత్తివేసేందుకు సహకరించాలని తెలిపారు. -
Andhra Pradesh : మిషన్ ‘క్లీన్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ పట్టణాలు, నగరాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నదీ జలాలు కలుషితం కాకుండా తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. విజయవాడలో పంట కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పారవేయకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల్లో పనుల పురోగతిపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు. పట్టణాల్లో పరిశుభ్రత కోసం పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరెవరూ చేయలేరని సీఎం పేర్కొన్నారు. 2015 నుంచి 2018 సెప్టెంబర్ వరకు చంద్రబాబు హయాంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వేతనాలు కేవలం రూ.10 వేలు మాత్రమే ఉండేవన్నారు. ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు మాత్రమే రూ.12 వేలు చేశారన్నారు. అంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో పారిశుధ్య కార్మికులకు ఇచ్చింది నెలకు రూ.10 వేలు మాత్రమేనన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిని..,వారి సేవలను గుర్తిస్తూ వేతనాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పారిశుధ్య కార్మికుల వేతనాలను 80 శాతం పెంచినట్లైందని సీఎం తెలిపారు. రూ.వేల కోట్లతో టిడ్కో ఇళ్లకు సదుపాయాలు పట్టణ పేదల కోసం చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ నిర్దేశించుకున్న గడువులోగా పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ.4,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు. మరో రూ.6 వేల కోట్ల ఖర్చుతో పనులు చేపట్టామని తెలిపారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికే పేదలకు అందించిందన్నారు. ఇక 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి గత సర్కారు లబ్ధిదారుడి వాటాగా పెనుభారం మోపగా ఇప్పుడు వారికి కూడా ఉపశమనం కలిగిస్తూ 50 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తున్నట్లు చెప్పారు. పట్టణ రోడ్లకు మెరుగులు నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో 16,762 రహదారులకు సంబంధించి 4,396.65 కి.మీ మేర రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని, ఇందుకోసం రూ.1,826.22 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పనుల ప్రగతిని ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. ఇప్పటికే 55.15 శాతం పనులు పూర్తి చేశామని, రోడ్లపై గుంతలు పూడ్చివేతను ముమ్మరంగా చేపట్టామని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 51.92 శాతం గుంతల పూడ్చివేత పనులు పూర్తయ్యాయని, జూలై 15 నాటికల్లా మొత్తం పూర్తి చేస్తామని వెల్లడించారు. జూలై 20 నాటికి మునిసిపాలిటీల్లో రోడ్ల పరిస్థితిని తెలియచేస్తూ నాడు – నేడు ద్వారా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మరింత సుందరంగా ఎయిర్‌పోర్టు రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ప్రారంభించిన జగనన్న హరిత నగరాలు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. ఎయిర్ పోర్టుల నుంచి నగరాలకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. గన్నవరం – విజయవాడ, భోగాపురం – విశాఖ వెళ్లే రహదారుల్లో మార్పు స్పష్టంగా కనిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులు నగరాల అందాలను మెరుగుపరిచేలా ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. విజయవాడలోని రామవరప్పాడు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు ఉన్న రోడ్డును ఇటీవల ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఆయా ప్రాంతాల్లో నాటే మొక్కలపై గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు సీఎంకు వివరించారు. నియోజకవర్గానికో స్మార్ట్ టౌన్షిప్ నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్మార్ట్ టౌన్షిప్ తప్పనిసరిగా ప్రారంభం కావాలని, ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరిన్ని మహిళా మార్టులు.. మెప్మా ఆధ్వర్యంలో ఆరు పట్టణాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటైన జగనన్న మహిళా మార్టుల పనితీరుపై అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఇవి విజయవంతమయ్యాయని, జూలైలో కొత్తగా మరిన్ని మహిళా మార్టులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సుందర విజయవాడ.. విజయవాడలో కాలువల సుందరీకరణపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ముఖ్యంగా పంట కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పారవేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పట్టణ పరిశుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలను సమర్ధంగా నిర్వహించాలన్నారు. నగరంలో చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్ చేసి పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా కరకట్ట రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్డులోని నాలుగు గ్యాప్‌లను పూర్తిచేసే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్‌శర్మ, పురపాలక, పట్ణణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పరిశుభ్ర కృష్ణా, గోదావరి.. మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి ప్రాజెక్టును సమర్థంగా నిర్వహించేందుకు ఇదే సరైన సమయమని సీఎం జగన్ పేర్కొన్నారు. కాలుష్యాన్ని అరికట్టడంలో కాలుష్య నియంత్రణ మండలి, స్వచ్ఛాంధ్రతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు భాగస్వామ్యం కావాలన్నారు. పట్టణ, నగర ప్రాంతాల నుంచి వస్తున్న మురుగునీటితో కృష్ణా, గోదావరి నదులు, పంట కాలువలు కలుషితం అవుతున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. శుద్ధి చేసిన తరువాతే నదులు, కాలువల్లోకి వదిలేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. మురుగునీటి శుద్ధి కోసం ఇప్పటిదాకా చేపట్టిన పనులు, ఎక్కడెక్కడ శుద్ధి సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ చేపట్టాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్లో కోత
సికింద్రాబాద్ జోన్‌లోని అయిదు సర్కిళ్లలో 3,228 మంది కార్మికులున్నారు. వీరిలో 1,683 మంది వేతనాల్లో కోత విధించారు. అంటే దాదాపు సగం మందికి జీతాల్లో కోత పడింది. కొన్ని సర్కిళ్లలో దాదాపు 70 శాతం మందికి వేతనాల్లో కోత విధించారు. కార్మికులకు రూ. 14వేల పైచిలుకు వేతనానికి రూ.1500 నుంచి రూ.8000 వరకు వేతనాల్లో కోత పడింది. నగరాన్ని పరిశుభ్రం చేసే 20వేల మందికి పైగా బల్దియా పారిశుద్ధ్య కార్మికుల కన్నీటి వెతలకు ఇది ఓ ఉదాహరణ. బయోమెట్రిక్ మెషిన్లలో సాంకేతిక లోపాలున్నా, సరిచేయాల్సిన కాంట్రాక్టు ఏజెన్సీ పనిచేయకున్నా దానిపై చర్యలు తీసుకోవడం మానిన అధికార యంత్రాంగం కార్మికుల కడుపు కొట్టింది. జీహెచ్ఎంసీలో దాదాపు నాలుగైదేళ్లుగా బయోమెట్రిక్ హాజరు నిర్వహిస్తున్నారు. మెషిన్లు పనిచేయని సందర్బాల్లో మాన్యువల్ హాజరు నమోదు చేసి వేతనాలిచ్చేవారు. మార్చి– ఏప్రిల్ నెలల్లో బయోమెట్రిక్ హాజరున్న రోజులకు మాత్రమే వేతనాలిచ్చారు. సమయంలో తేడా వచ్చినా కోత విధించారు. పారిశుద్ధ్య కార్మికుల సాధారణ పనివేళలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. వేసవి సందర్భంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందని దీన్ని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు అమలుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విషయం కార్మికులకు ముందస్తుగా తెలియజేయలేదు. ఉదయం 5 నుంచి 6 గంటల లోపున హాజరైన వారికి హాజరు నమోదుచేయాల్సి ఉండగా, 5.30 గంటలు దాటితే వేయడం లేదని కొందరు కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్, యాకుత్‌పురా, గచ్చిబౌలి, వెంగళ్రావునగర్, అంబర్‌పేట సాంకేతిక సమస్యలు పరిష్కరించేదెవరు? బయోమెట్రిక్ హాజరు నమోదుకు వేల రూపాయల వ్యయమయ్యే మెషిన్లను కొనుగోలు చేయకుండా జీహెచ్ఎంసీ ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్టుకిచ్చి దానికి లక్షల రూపాయలు చెల్లిస్తోంది. సాంకేతిక లోపాలు తలెత్తినా, మెషిన్లు సక్రమంగా పనిచేయకున్నా ఏజెన్సీ బాధ్యత వహించాల్సి ఉండగా ఆ పనిచేయడం లేదు. కార్మికుల హాజరు నమోదు చేసే గ్రూప్‌లోని లీడర్(ఎస్ఎఫ్ఏ) సొంత జేబులోంచి ఖర్చు చేసుకోవాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు.బయోమెట్రిక్ మెషిన్లను సరిగ్గా వినియోగించడం రానందున కూడా ఆబ్సెంట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. వినియోగంపై తగిన అవగాహన కల్పించాల్సిన అధికారులు కాంట్రాక్టు ఏజెన్సీకిచ్చి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిలాపాపం .. తలా పిడికెడు ► ఎస్ఎఫ్ఏలకు పైస్థాయిలోని వైద్యాధికారులు, ఇతరత్రా అధికారులకు నడుమ ఉండే అవినాభావ సంబంధాలు సైతం అక్రమాలకు దారి చూపుతున్నాయి. ఫంక్షన్లు చేసినప్పుడు టీలు, బిస్కెట్లు, పూలదండలు, శాలువాల నుంచి ఇతరత్రా వన్నీ తెమ్మని అధికారులు ఎస్ఎఫ్ఏలను పురమాయిస్తారు. వారి ఈ వైఖరి తెలిసిన ఎస్ఎఫ్ఏలు సైతం సమయానికి కార్మికులు రాకున్నా, అసలు రాకున్నా బయోమెట్రిక్ పనిచేయడం లేదని హాజరు నమోదు చేస్తారు. ఆ మేరకు కార్మికుల వేతనాల్లో వాటాలు పొందుతారు. ► దీన్ని ఆసరా చేసుకొని చాలామంది విధులకు రాకుండానే వేతనాలు పొందుతున్నారని తెలుస్తోంది. అలాంటి వారిలో ఎస్ఎఫ్ఏల కుటుంబసభ్యులు సైతం ఉంటారు. దీన్ని సక్రమంగా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అందరినీ ఒకేగాటన కట్టి ఇష్టానుసారం వేతనాల్లో కోత విధించడంపై కార్మికులు మండిపడుతున్నారు. వేతనాల్లో కోతలపై వివరణ కోసం సంబంధిత అడిషనల్ కమిషనర్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. పనిచేసిన వారికి వేతనాలివ్వాలని సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సంబంధిత అడిషనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. (క్లిక్: 111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?) బయోమెట్రిక్ ఓ చీటింగ్ బయోమెట్రిక్‌లో లోపాలున్నాయని అధికారులు అబద్ధాలు చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. అంతా చీటింగ్ నడుస్తుందని అనుమానంగా ఉంది. మూడు రోజులో, నాలుగు రోజులో మెషిన్ పని చేయకుంటే.. ఆలస్యమైతే అన్ని రోజులకు మాత్రమే వేతనాల్లో కోత విధించాలి. కానీ, వేలకు వేలు ఎలా? పూర్తిస్థాయిలో విచారణ జరిపి మా జీతం మొత్తం తిరిగి ఇచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – చెన్నమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు చర్యలు తీసుకుంటాం.. బయోమెట్రిక్ మెషిన్లలో లోపాల కారణంగా జీతాల్లో కోత పడింది. విధులకు హాజరైనప్పటికీ వేతనాలందని వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటాం. – కె.వి. శివప్రసాద్ మలక్‌పేట్ సర్కిల్ ఏఎంహెచ్ఓ -
పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ పలకరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు నియోజకవర్గాల్లో మరో రెండేళ్లలో మురుగు అవస్థలు తీరనున్నాయి. మూసీకి ఉత్తరం వైపున మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ పనులకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. జలమండలి పరిధిలో జోన్– 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టు పూర్తితో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి మురుగు తిప్పలు తప్పనున్నాయి. సుమారు రూ.297 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 129.32 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ నిర్మాణాన్ని జలమండలి చేపడుతోంది. పాతనగరంలో ఉన్న గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీవరేజీ వ్యవస్థను ఆధునికీకరించడానికి ఈ ప్రాజెక్టును జలమండలి చేపట్టింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను షా కన్సల్టెన్సీ (ముంబై) రూపొందించింది. ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. ► జోన్– 3 మురుగు నీటిపారుదల వ్యవస్థలో తొమ్మిది పరీవాహక ప్రాంతాలు ఉంటాయి. మొత్తం 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఎన్ 1 నుంచి ఎన్ 7 వరకు, ఎన్ 11, ఎన్ 31 పరీవాహక ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 355.78 కిలోమీటర్ల పొడవైన సీవరేజ్ నెట్వర్క్ ఉంది. ►ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.297 కోట్లు. ►నెట్వర్క్ మొత్తం పొడవు: 129.32 కి.మీ. ► ఆర్సీసీ ట్రంక్ సీవర్స్ పైప్లైన్లు: 400–1200 ఎంఎం డయా: 36.14 కి.మీ. ►ఎస్‌డబ్ల్యూజీ నెట్వర్క్ 200–300ఎంఎం డయా: 93.18 కి.మీ. ►మురుగు ప్రవాహం అంచనా: 2036 నాటికి: 127.42 ఎంఎల్డీ. ► 2051 నాటికి : 153.81 ఎంఎల్డీ. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌజ్, సెవెన్ టూంబ్స్, జూబ్లీహిల్స్ (కొంత భాగం), మెహిదీపట్నం, నానల్‌నగర్, ఆసిఫ్ నగర్, విజయ్‌నగర్ కాలనీ, ఎన్ఎండీసీ కాలనీ, మాసబ్ ట్యాంక్, రెడ్ హిల్స్, లక్డీకాపూల్, బజార్‌ఘాట్, నాంపల్లి, మల్లేపల్లి, బేగంబజార్. ప్రయోజనాలు: సీవరేజీ వ్యవస్థ పరిధి పెరుగుతుంది. ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల నుంచి 100 శాతం మురుగునీటి సేకరణ జరుగుతుంది. నాలాల్లోకి, మూసీ నదిలోకి నేరుగా మురుగునీటి ప్రవాహం ఉండదు. మెరుగైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సివరేజ్ పనులను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ మేం జీతాలు పెంచాం.. మోదీ ధరలు పెంచారు బహదూర్‌పురా: పాతబస్తీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మీరాలం ట్యాంక్ వద్ద జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులను పలకరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని సూచించారు. దీంతో వారు తమ జీతాలు పెంచాల్సిందిగా ఆయనను కోరారు. స్పందించిన కేటీఆర్.. రాష్ట్రం వచ్చేనాటికి రూ.8 వేలున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్ని సీఎం కేసీఆర్ దఫదఫాలుగా రూ.17 వేలకు పెంచారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని వారు చెప్పగా, అందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే కారణమన్నారు. మేం జీతాలు పెంచుతూ ఉంటే.. మోదీ ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సివరేజీ పనులకు శ్రీకారం గోల్కొండ: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కార్వాన్ నియోజకవర్గం టోలిచౌకిలో రూ. 297 కోట్లతో చేపట్టిన సివరేజీ ప్రాజెక్టు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సివరేజ్ లైన్ పనులు పూర్తయితే ఎన్నో బస్తీలకు వరద ముంపు తప్పుతుందన్నారు. షేక్‌పేట్‌లో రూ. 333 కోట్లతో అత్యంత పొడవైన ఫ్లై ఓవర్‌ను నిర్మించినట్లు చెప్పారు. సెవన్ టూంబ్స్ చౌరస్తా నుంచి గోల్కొండ వరకు రోప్‌వే కోసం ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తాము ప్రతిపాదించిన పనులకు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొ న్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ఎంఎన్ ప్రభాకర్, కార్పొరేటర్లు మహ్మద్ నసీరుద్దీన్, రాషెఫ్ ఫరాజుద్దీన్, టీఆర్ఎశ్ కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జి టి.జీవన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బంది కలగొద్దు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి హెచ్చరించారు. జాతర ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలసి శనివారం ఏడుపాయల్లోని హరిత హోటల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి రాని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌పై మండిపడ్డారు. వీఐపీ పార్కింగ్ విషయంలో కూడా ఈఓ సార శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 1వ తేదీ నుంచి జరిగే ఈ జాతర రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతర అని, సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారన్నారు. ఈనెల 26లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర కోసం సింగూరు నుంచి రెండు విడతలుగా 0.45 టీఎంసీ నీరు ఘనపురం ప్రాజెక్టుకు విడుదల చేస్తామన్నారు. అవసరమైనన్ని మరుగుదొడ్లు, తాగు నీటి కులాయిలు నిర్మించాలన్నారు. 650 మంది పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని డీపీఓ తరుణ్‌కు సూచించారు. 140 బస్సులతోపాటు, పార్కింగ్ నుంచి జాతర వరకు 3 బస్సులు నిరంతరంగా తిరిగేలా ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. 1200 మంది పోలీసుల సేవలు అందిస్తున్నామని డీఎస్సీ సైదులు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఐదు ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, కోవిడ్ వ్యాక్సిన్లు కూడా ఇస్తామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. మొత్తం మీద ఏడుపాయల జాతర కీర్తి ఎల్లలు దాటేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓలు సాయిరాం, వెంకట్ ఉపేందర్, డీఎస్పీ సైదులు, ఎంపీపీ చందన ప్రశాంత్‌రెడ్డి, ఈఓ సార శ్రీనివాస్‌తో పాటు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా?
సాక్షి, మధిర: సాధారణంగా అందరూ స్నానానికి ఉపయోగించే సబ్బు ధర రూ.20 మొదలు రూ.60వరకు ఉంటుంది. కానీ మధిర మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం రూ.96 విలువైన సబ్బులను పంపిణీ చేశారు. ఇదేమిటి, ఇంత ఖరీదైన సబ్బును కార్మికులకు ఇచ్చారా అని ఆశ్చర్యపోతున్నారా! అయితే, సబ్బు విలువైనదేమీ కాదు సాధారణమైనదే. కానీ మధిర మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు కలిసి సబ్బు ధరను అమాంతం పెంచేశారు. కారణమేమిటో పెద్దగా ఆలోచించాల్సిన పనేమీ లేదు కదా?! ‘గణతంత్ర’ వేడుకల్లో పంపిణీ ఈనెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె డబ్బాలు, శానిటైజర్లతో పాటు దుస్తులు అందజేయాలని నిర్ణయించారు. ఈమేరకు కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, కమిషనర్ అంబటి రమాదేవి చేతుల మీదుగా వీటిని ఇచ్చేశారు. ఇక వీటి కొనుగోలుకు సంబంధించి బిల్లులను కౌన్సిల్ సమావేశంలో సభ్యులతో ఆమోదించుకుంటేనే చెక్కులు జారీ చేయడం సాధ్యమవుతుంది. చదవండి: కరీంనగర్లో కారు బీభత్సం.. నలుగురు మహిళలు మృతి ఇందుకోసం 31వ తేదీన మధిర మున్సిపల్ సాధారణ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సంబంధించి ఎజెండాలో కొన్ని అంశాలను పొందుపర్చి అధి కార, ప్రతిపక్ష కౌన్సిలర్లకు కాపీలను శనివారం అందజేశారు. ఇక ఈ కాపీలను చూడగానే సభ్యుల కళ్లు బైర్లు కమ్మాయి. ఎందుకంటారా... కార్మికులకు అందజేసిన 675 సబ్బుల కోసం రూ.96చొప్పున మొత్తం రూ.64,800 ఖర్చు చేసినట్లుగా లెక్కల్లో చూపించారు. చదవండి: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు కౌన్సిల్ ఎజెండా కాపీలో సబ్బుల ధర వివరాలు... ఇదేం సబ్బు? ఒక్కో సబ్బును రూ.96 చొప్పున వెచ్చించి కొనుగోలు చేసినట్లు బిల్లు ఉండడంతో సభ్యులు ఇవేం సబ్బులు అంటూ 26వ తేదీన వాట్సప్ గ్రూప్‌ల్లో షేర్ చేసిన ఫొటోలను వెనక్కి వెళ్లి మరీ ఆసక్తిగా పరిశీలించారు. తీరా చూస్తే ఆ ఫొటోలో 100గ్రాముల సంతూర్ సబ్బు కనిపించింది. ఇదే బరువు కలిగిన సబ్బు పంపిణీ చేసి ఉంటే మార్కెట్లో ఒక్కో సబ్బు ఎమ్మార్పీ రూ.33 ఉండగా హోల్‌సేల్‌గా రూ.29.50కు వస్తుంది. ఒకవేళ 125 గ్రాముల బరువు కలిగిన సబ్బు అయితే ఆఫర్ ప్యాక్‌లో నాలుగింటితో పాటు మరో సబ్బు ఉచితంగా వస్తుంది. ఈ ప్యాక్ ఎమ్మార్పీ రూ.190 ఉండగా హోల్‌సేల్‌గా రూ.173కు ఇస్తామని స్థానిక వ్యాపారుల్లో ఎవరిని అడిగినా చెబుతారు. అంటే ఒక సబ్బు ఖరీదు రూ.35లోపు ఉంటుంది. కానీ మధిర మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు మాత్రం కౌన్సిల్ ఎజెండాలో జత చేసి బిల్లులను రూ.96గా చూపించడం గమనార్హం. కార్మికుల పేరిట దోపిడీ కరోనా విలయతాండవం చేస్తున్న వేళ కుటుంబ సభ్యులకు ఆపద ఉంటుందని తెలిసినా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి మరీ పని చేస్తున్నారు. కరోనా మొదటి దశ నుంచి వైరస్ సోకిన వారి ఇళ్ల వద్ద, కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం మొదలు అన్ని పనుల్లో వీరే కీలకంగా నిలుస్తున్నారు. అలాంటిది అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా కార్మికులకు ఇచ్చిన సబ్బులకు కూడా అసలు కంటే ఎక్కువ బిల్లులను మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సిద్ధం చేయడం విమర్శలకు తావిస్తోంది. అయితే, ఈనెల 31న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని కౌన్సిలర్లు ప్రశ్నిస్తారా, లేక బిల్లులను ఆమోదిస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఒక్కో సబ్బుకు రూ.96గా బిల్లులు సిద్ధం చేయడంతో పాటు శానిటైజర్లు, కొబ్బరినూనె ధరలను కూడా ఎక్కువగానే చూపినట్లు తెలుస్తుండగా, అజెండా కాపీలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవిని సంప్రదించేందుకు ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
వైఎస్ జగన్ ప్రభుత్వంలో చిరుద్యోగులకు ఆర్థిక భరోసా.. పూర్తి వివరాలు
సాక్షి, అమరావతి: అరకొర వేతనాలను సైతం సకాలంలో ఇవ్వకుండా చిరుద్యోగుల జీవితాలతో గత సర్కారు చెలగాటమాడింది. ప్రతిపక్ష నేతగా ఉండగా పాదయాత్ర సమయంలో వారి వెతలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2019 జూన్ 10వ తేదీన నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలోనే వారి వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రోజంతా వివిధ డ్యూటీలను నిర్వహించే హోంగార్డుల నుంచి బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్, సహాయకులతో పాటు పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, డ్వాక్రా గ్రామ సమాఖ్య సహాయకుల వరకు వివిధ రంగాల్లోని లక్ష మందికి పైగా చిరుద్యోగులకు వేతనాలను పెంచి ముఖ్యమంత్రి జగన్ ఊరట కల్పించారు. గత సర్కారు హయాంలో వేతనాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచిన తరువాత వేతనాలు ఇలా ఉన్నాయి.