అడుగడుగునా అడ్డగింత | Sanitation workers Strike From 21 Days PSR Nellore | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అడ్డగింత

Published Tue, Sep 4 2018 12:32 PM | Last Updated on Tue, Sep 4 2018 12:32 PM

Sanitation workers Strike From 21 Days PSR Nellore - Sakshi

కార్పొరేషన్‌ బయట ఆందోళన చేస్తున్న కార్మికులు

నెల్లూరు సిటీ: ఓ వైపు సొసైటీ కార్మికులు 279 జీఓకు వ్యతిరేకంగా సమ్మె చేస్తుంటే.. మరో వైపు కార్పొరేషన్‌ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో పారిశుద్ధ్య పనులను చేయించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సమ్మె చేస్తున్న కార్మికులు అడుగడుగునా ప్రైవేటు కార్మికులను అడ్డుకుంటున్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నగర పాలక సంస్థ పరిధిలోని 877 మంది పారిశుద్ధ్య కార్మికులు గత నెల 14వ తేదీ నుంచి సమ్మె బాటపట్టిన విషయం తెలిసిందే. 21 రోజుల పాటు కార్మికులు సమ్మె చేస్తున్నా పాలకవర్గం, అధికారులు స్పందించిన పరిస్థితి లేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మెను ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ప్రైవేటు కాంట్రాక్టర్‌ల ఆధ్వర్యంలో కొంతమంది చేత పారిశుద్ధ్య పనులు చేయిస్తుండగా సమ్మె చేస్తున్న కార్మికులు వారిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. నగరంలోని వీఆర్సీ సెంటర్, బాలాజీనగర్, సంతపేట ప్రాంతాల్లో కార్మికులు పనులను అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బలగాలతో సమ్మె కార్మికులను నియంత్రించారు. ఈ క్రమంలో పోలీసులు, సమ్మె చేస్తున్న కార్మికులు మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.

కాంట్రాక్టర్‌ను తరుముకున్నసమ్మె కార్మికులు
తాము సమ్మె చేస్తుంటే, పరిష్కరించాల్సిన అధికారులు కాంట్రాక్టర్‌ల ద్వారా ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించడంపై సమ్మె కార్మికులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద మహిళా కాంట్రాక్టర్‌ మున్నా ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా వందలాది మంది సమ్మె చేస్తున్న కార్మికులు అక్కడికిచేరుకుని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. కార్మికులు కాంట్రాక్టర్‌ను అక్కడి నుంచి తరిమారు. సమాచారం అందుకున్న పోలీసులు, కార్పొరేషన్‌ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అనంతరం కాంట్రాక్టర్‌ మున్నా పోలీస్‌స్టేషన్‌లో కార్మికులు తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కార్పొరేషన్‌ను ముట్టడి
కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి ప్రైవేటు వ్యక్తులను పనులకు విభజిస్తున్నారనే సమాచారం అందుకున్న సమ్మె చేస్తున్న కార్మికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ప్రైవేటు కార్మికులను సమ్మె చేస్తున్న  కార్మికులు అడ్డుకున్నారు. దీంతో రెండు గంటలకు పైగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్పొరేషన్‌ బయట సమ్మె కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్యాలయం నుంచి ప్రైవేటు కార్మికులను బయటకు పోనీయకుండా చుట్టముట్టారు. పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement