కార్మికులపై ఎస్మాస్త్రం! | Workers on the esma | Sakshi
Sakshi News home page

కార్మికులపై ఎస్మాస్త్రం!

Published Tue, Jul 14 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

కార్మికులపై ఎస్మాస్త్రం!

కార్మికులపై ఎస్మాస్త్రం!

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం
 

 హైదరాబాద్: డిమాండ్ల పరిష్కారం కోసం ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులపై ఎస్మా (అత్యవసర సేవల నిర్వహణ చట్టం)ను ప్రయోగించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంస్థల్లోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో మంత్రులు నాయిని, మహేందర్‌రెడ్డి, తలసాని, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. సమ్మె విరమించాలని, వేతనాలు పెంచేందుకు తాము సిద్ధమని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా... వారు వెనక్కి తగ్గకపోవడంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రంలోగా వారు సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగించడానికి వెనుకాడవద్దని ఆయన అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. 

కార్మిక సంఘాల ధోరణికి తలొగ్గేదే లేదని, తనతో వారికేం పోటీ అని సీఎం మండిపడినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ల పరిష్కారంపై తాను నేరుగా మాట్లాడడం కుదరదని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. అనంతరం సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్ కార్మికులు మొండిగా వ్యవహరిస్తే మంగళవారం సైన్యం, పోలీసులు, ఇతర ఉద్యోగులను ఉపయోగించుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొంత మంది కార్మిక సంఘాల నాయకుల ఉచ్చులో పడి కార్మికులు సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం భావిస్తున్నది. సోమవారం సాయంత్రం వరకు విధుల్లో చేరాలని ప్రభుత్వం కార్మికులను కోరింది. లేనిపక్షంలో మంగళవారం నుంచి ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. సమ్మె విరమించకపోతే కొత్తవారిని నియమించేందుకు పరిశీలన జరుపుతోంది..’’ అని అందులో పేర్కొంది. ఇక సమ్మె చేస్తున్న కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జీతాలివ్వబోమని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ హెచ్చరించారు. సమ్మె చేస్తున్నవారిలో కొందరిని తొలగిస్తే మిగతా వారందరూ విధుల్లో చేరుతారని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
 
రాతపూర్వక హామీ ఇస్తేనే.. సమ్మె విరమణపై స్పష్టం చేసిన కార్మిక నేతలు

 
హైదరాబాద్: ‘ప్రజాస్వామ్యంలో కార్మిక సంఘాలకు అడిగే హక్కు ఉండకూడదా, పోరాటం చేసే హక్కు ఉండకూడదా, సమ్మెను అణచేస్తారా, ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది. తెలంగాణ అర్థమిదేనా..’ అంటూ మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మిక నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎంను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని, తప్పుడు మార్గంలో వెళితే ఆయన్ను పారిశుద్ధ్య కార్మికులు గంగలో కలుపుతారని హెచ్చరించారు. వేతనాల పెంపుపై రాతపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు. సీఎంవో ప్రకటన వెలువడిన వెంటనే.. మున్సిపల్ కార్మిక జేఏసీ నేతలు హైదరాబాద్‌లో సమావేశమై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘మేమూ చూస్తాం.. మీరెంత మందిని తీసుకొస్తారో. హైదరాబాద్ నగరాన్ని ఊడ్చాలంటే సుమారు 30 వేల మంది కావాలి. రాష్ట్రం అంతటా కలిపి 50 వేల మంది అవసరం. మా కార్మికులు తిరగబడితే తట్టుకునే పరిస్థితి ఉండదు..’’ అని బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఏమైనా అరాచకాలు జరుగుతున్నాయా, హత్యలు జరుగుతున్నాయా? మిలటరీని ఎందుకు తీసుకొస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

‘‘మున్సిపల్ కార్మికులు మా అమ్మలు, అక్కలు అన్నావు. ఇప్పుడు మిలటరీ వాళ్లతో పనిచేయిస్తానంటున్నావు. అమ్మలక్కలను చంపేయడమే నీ పనా’’ హెచ్‌ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి రెబ్బా రామారావు ఆగ్రహించారు. ఇక సోమవారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటిని మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా తోపులాటలో కొందరు కార్మికులకు గాయాలయ్యాయి. కాగా.. మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టడంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ప్రజలు దుర్గంధపూరితమైన వాతావరణంలో జీవిస్తున్నారంటూ రమ్యకుమారి అనే న్యాయవాది మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement