డెంగీ పంజా!
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రభావం వీధుల్లో భారీగా పేరుకుపోయిన చెత్త విజృంభిస్తున్న దోమలు
ముసురుతున్న వ్యాధులు
సాక్షి, సిటీబ్యూరో: పారిశుద్ధ్య కార్మికులు ఆరు రోజులుగా సమ్మెలో ఉండడంతో నగరంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. దీనికి తోడు వీధుల్లోని రహదారులపై మురుగు నీరు నిల్వ ఉంటోంది. దీంతో దోమలు వ్యాప్తి చెంది... బస్తీల్లో డెంగీ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీవల కాటేదాన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ బస్తీకి చెందిన ఐదుగురు వ్యక్తులు డెంగీ బారిన పడినట్టు వైద్యులు తేల్చారు. తాజాగా కంచనపల్లికి చెందిన ఉప్పలయ్య(45), శివంపేటకు చెందిన రఘువీర్(28)కు డెంగీ సోకినట్టు తేలింది. ఇలా వారం రోజుల్లోనే ఎనిమిది మంది డెంగీ భారిన పడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
నిర్మూలన చర్యలేవీ?
వర్షాల వల్ల నివాసాల మధ్య మురుగు నీరు నిల్వ ఉండటంతో మలేరియా, డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. ఫాగింగ్ చేయక పోవడంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు రాత్రి వేళల్లో విద్యుత్ కోత విధిస్తుండడంతో ఇళ్లలో ఫ్యాన్లు తిరగడం లేదు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మూసీ పరీవాహక ప్రాంతాలైన కూకట్‌పల్లి, లోయర్ ట్యాంక్ బండ్, అంబర్‌పేట్, సుల్తాన్‌బజార్, ముసారంబాగ్, మలక్‌పేట్, కొత్తపేట్, నాగోలు, ఉప్పల్, రామంతాపూర్, గోల్నాక, ఉస్మానియా క్యాంపస్ ప్రాంతాలతో పాటు సిటీ శివారుల్లోనూ దోమల బెడద ఎక్కువగా ఉంది. మరోవైపు కలుషిత నీరు, ఆహారం వల్ల డయేరియా కేసులూ పెరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని ఆస్పత్రులకు రోగుల తాకిడి అధికమవుతోంది.