పారిశుద్ధ్యం.. ప్రైవేట్‌ పరం | Sanitation workers Going To Contractors Hand In PSR Nellore | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం.. ప్రైవేట్‌ పరం

Published Mon, Jul 16 2018 1:00 PM | Last Updated on Mon, Jul 16 2018 1:00 PM

Sanitation workers Going To Contractors Hand In PSR Nellore - Sakshi

పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తున్న దృశ్యం

ప్రజారోగ్యంలో కీలకమైన పారిశుద్ధ్యం విభాగాన్ని ప్రైవేట్‌ పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 279 గెజిట్‌ ఆర్డర్‌ జారీ చేసిన నేపథ్యంలో అమలుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే నగరాన్ని మూడు ప్యాకేజీలుగా విభజించి ప్రణాళిక రూపొందించారు. మరి కొద్ది రోజుల్లో ప్రయోగాత్మకంగా ఒక ప్యాకేజీని అమలు చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పారిశుద్ధ్య కార్మిక సొసైటీ అధ్యక్షులతో కార్పొరేషన్‌ కమిషనర్‌ చర్చలు జరుపుతున్నారు. ఎప్పటికైనా పర్మినెంట్‌ అవుతాం.. తాము పడుతున్న కష్టాలు తీరుతాయి.. అనే ఆశతో 15 ఏళ్లకు పైగా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో కార్మికులను ప్రైవేట్‌ పరం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై కార్మికులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరితో కార్మికుల భవిష్యత్‌ను పణంగా పెట్టడానికే సిద్ధపడుతోంది.   

నెల్లూరు సిటీ: నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 877 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. 77 సొసైటీల కింద కార్మికులు ఉన్నారు. కార్పొరేషన్‌లోని 54 డివిజన్లను  20 శానిటరీ డివిజన్లుగా విభజించి పనులు చేస్తున్నారు. మూడున్నర ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికులను సొసైటీల కింద కాకుండా ఓ ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ కింద పనిచేసేలా ప్రభుత్వం 279 జీఓను విడుదల చేసి నిర్ణయం తీసుకుంది. అయితే ప్రైవేట్‌ వ్యక్తులు జీతాలు సరిగా ఇవ్వకపోవడం, పని ఒత్తిడి పెంచి ఇబ్బందులు పెడతారని, భరోసా ఉండదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మికుల కుటుంబ భద్రతను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా జీఓ అమలు చేసేందుకు ముందడుగులు వేస్తుంది. ఈ క్రమంలో గతేడాది గుంటూరుకు చెందిన కాంట్రాక్టర్‌ బొమ్మిడి రామకృష్ణకు మూడు ప్యాకేజీల కింద మూడేళ్ల పాటు నెల్లూరు కార్పొరేషన్‌ పారిశుద్ధ్య పనులను అప్పగించారు. మూడేళ్ల పాటు రూ.61.15 కోట్లు కార్మికులకు చెల్లించేలా మూడు ప్యాకేజీలను దక్కించుకున్నారు. అదనంగా 6.80 శాతం ఎక్స్‌స్‌ వేసి టెండర్‌ దక్కించుకోవడం వెనుక అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారని విమర్శలు ఉన్నాయి.

సొసైటీ అధ్యక్షులతో చర్చలు
సొసైటీల కింద పనిచేస్తున్న కార్మికుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కమిషనర్‌ అలీంబాషా సొసైటీ అధ్యక్షులతో వారం రోజులుగా విడతల వారీగా సమావేశాలు జరిపారు. కార్మికులకు 279 జీఓ కారణంగా వచ్చే లాభాలను వివరించాలని చెప్పినట్లు తెలుస్తుంది. జీఓ అమలు కావడం కచ్చితమని అందరూ సహకరించాలని కోరారు. అయితే సొసైటీ అధ్యక్షులు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, పోరాటం ఉధృతం చేస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం.

ఒక ప్యాకేజీ అమలుకు రంగం
కాంట్రాక్టర్‌ మొత్తం మూడు ప్యాకేజీలు దక్కించుకున్నారు. ఒక ప్యాకేజీని ముందుగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో 10 రోజుల్లో కొన్ని ప్రాంతాలను సెలక్ట్‌ చేసుకున్నారు. ఒక మైక్రో ప్యాకెట్‌ కింద 350 మంది కార్మికులు పనిచేయాల్సి ఉంది. ఇలా 1వ డివిజన్‌ నుంచి 10వ డివిజన్‌ వరకు ఉన్న ఇళ్లను 109 మైక్రో ప్యాకెట్‌లుగా విజించారు. ఈ డివి జన్లను కార్పొరేషన్‌ అధికారులు పర్యవేక్షించనున్నారు. కాంట్రాక్టర్‌ దక్కించుకున్న 11వ డివిజన్‌ నుంచి 24వ డివిజన్‌ వరకు 128 మైక్రో ప్యాకెట్లుగా, 25వ డివిజన్‌ నుంచి 38వ డివిజన్‌ వరకు 126 మక్రో ప్యాకెట్లుగా, 39వ డివిజన్‌ నుంచి 54వ డివిజన్‌ వరకు 113 మైక్రో ప్యాకెట్లుగా విభజించారు. ఇలా కొన్ని ప్రాంతాలను సెలెక్ట్‌ చేసుకుని మరో 10 రోజుల్లో అమలు చేయనున్నారు.   

ఉద్యమం ఉధృతం చేస్తాం   
279 జీఓ అమలు చేస్తే కార్మికులను కాంట్రాక్టర్‌ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కార్మికులకు ఉద్యోగ భరోసా కూడా ఉండదు. మేయర్‌ అజీజ్‌ గతంలో జీఓను అమలు చేయమని హామీ ఇచ్చారు. అమలు చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం.        – కత్తి శ్రీనివాసులు, మున్సిపల్‌ వర్కర్స్,అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement