జీఓ నంబర్‌ 279 అమలు చేయాల్సిందే | Sanitation workers Against On GO No 279 PSR Nellore | Sakshi
Sakshi News home page

అడ్డుకుంటామంటున్న కార్మికులు

Published Sat, Sep 15 2018 1:12 PM | Last Updated on Sat, Sep 15 2018 1:12 PM

Sanitation workers Against On GO No 279 PSR Nellore - Sakshi

పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకువచ్చిన జీఓ నంబరు 279ని అమలు చేసేందుకే ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. జీఓ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వ పెద్దలు తెగేసి చెబుతున్నారు. అదే స్థాయిలో దీనిని కార్మికులు, కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు ఇప్పటికే 32 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమ్మెను ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.  అయితే పాలకులు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా అక్టోబరు 1వ తేదీ నుంచి దశల వారీగా అమలు చేసేందుకు ప్రణాళికతో ముందుకు పోతున్నారు. మున్సిపాలిటీల్లో కార్మికులు సైతం సమ్మెబాట పట్టనుండడంతో పోరు తీవ్రమవుతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జీఓ నంబరు 279ని అమలు చేయడానికే ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో తీసుకువచ్చిన ఈ జీఓను పారిశుద్ధ్య కార్మికులు, కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. దీంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అమలు చేసిన తర్వాత చివరిగా జిల్లాలో అమలు చేస్తామని అధికార పార్టీకి చెందిన మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ మొదలుకొని మంత్రుల వరకు అందరూ గతంలో సమ్మె సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మేయర్‌తో సహా అందరూ హామీని విస్మరించి జీఓ అమలుకు ముందస్తు అనుమతులు ఇచ్చారు. ఈక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థలో మొదలైన పారిశుద్ధ్య కార్మికుల సమ్మె శుక్రవారానికి 32వ రోజుకు చేరింది. వచ్చే నెల మొదటి వారం నుంచి దశల వారీగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో సమ్మెకు కార్మికులు సిద్ధమవుతున్నారు.

మాట తప్పి.. మొదట నెల్లూరులోనేఅమలు
జీఓ నంబరు 279 అమలు విషయలో పాలకులు, అధికార పార్టీ నేతలు గతంలో చెప్పిన మాట తప్పి.. మొదట నెల్లూరులోనే అమలుకు శ్రీకారం చుట్టారు. మేయర్‌ అజీజ్‌ ముందస్తు అనుమతులు ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మె చేయాలని నిర్ణయించారు. గత నెల 14వ తేదీ నుంచి నగరంలో సమ్మె ప్రారంభమైంది. ఏడాదిన్నర క్రితం పారిశుద్ధ్య కార్మికులు 26 రోజుల పాటు సమ్మె చేశారు. అయితే ఆ సమయంలో మేయర్‌ అజీజ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ అనురాధ కార్మిక సంఘాలతో సమావేశమై సమ్మె విరమింప చేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో 279 జీఓ అమలు చేసిన తర్వాత నెల్లూరులో చివరిగా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా మేయర్‌ అజీజ్‌  జీఓ అమలుకు ముందస్తు అనుమతులు ఇవ్వడంతో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మేయర్‌ అజీజ్‌ పలుమార్లు కార్మిక సంఘాలతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. మేయర్‌ ఇచ్చిన ముందస్తు అనుమతులను వెనక్కు తీసుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేయగా, మేయర్‌ మాత్రం ససేమీరా అంటున్నారు. రాష్ట్రంలో కార్మిక సంఘాలకు ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం ప్రకటిస్తుందో దాని ప్రకారం నడుచుకుంటామనడంతో కార్మికులు సైతం సమ్మె కొనసాగించడానికే నిర్ణయం తీసుకున్నారు.

మంత్రి నారాయణ ఆగ్రహం
టెండర్‌ పూర్తయి నెలలు గడుస్తున్నా 279 జీఓను అమలు చేయలేకపోవడంపై శానిటరీ విభాగ అధి కారులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశా రు. నగరంలోని మెడికల్‌ కళాశాలలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రువారం శానిటరీ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మంత్రి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కార్మికులను ఒప్పించలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓ గురించి కార్మికులకు ప్రత్యేక క్లాస్‌లు తీసుకుని చెప్పాలని గతంలో సూచనలు ఇచ్చానన్నారు. అయినా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు డివిజన్‌లలో పూర్తిస్థాయిలో కార్మికులను మోటివేట్‌ చేయడంలో వైఫల్యం చెందారన్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని శానిటరీ ఇన్‌స్పెక్టర్లను ఇతర కార్పొరేషన్‌లకు బదిలీ చేస్తానని హెచ్చరించారు. అనంతరం డీఎంఎకు మంత్రి నారాయణ ఫోన్‌ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

కమిషనర్‌ హడావుడి సమావేశం
మంత్రి నారాయణ శానిటరీ అధికారులకు క్లాస్‌ తీసుకున్న గంట వ్యవధిలో కమిషనర్‌ అలీంబాషా కార్పొరేషన్‌ కార్యాలయంలో హడావుడిగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. జీఓ అమలు చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై సమీక్షించారు. పారిశుద్ధ్య పనులు వేగవంతంగా పూర్తిచేసి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అవసరమైతే కార్మికులతో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సమావేశం ఏర్పాటు చేసి 279 జీఓపై వివరంగా చెప్పాలని సూచించారు.

అమలు చేసేందుకు ప్రయత్నాలు
కార్పొరేషన్‌ పరిధిలోని 11వ డివిజన్‌ నుంచి 24వ డివిజన్‌ వరకు ఒక ప్యాకేజీని అమలు చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఇంటింటికి ట్యాగ్‌లు తగిలించారు. కార్మికులు సమ్మె బాట పట్టడంతో ప్రస్తుతం నిలిచింది. ఒక మైక్రో ప్యాకెట్‌ కింద 350 మంది కార్మికులు పనిచేయాల్సి ఉంది. ఇలా 1వ డివిజన్‌ నుంచి 10వ డివిజన్‌ వరకు ఉన్న ఇళ్లను 109 మైక్రో ప్యాకెట్‌లుగా విజించారు. ఈ డివిజన్లను కార్పొరేషన్‌ రెగ్యులర్‌ శానిటరీ కార్మికులు పనులు చేస్తారు. కాంట్రాక్టర్‌ దక్కించుకున్న 11వ డివిజన్‌ నుంచి 24వ డివిజన్‌ వరకు 128 మైక్రో ప్యాకెట్లుగా, 25వ డివిజన్‌ నుంచి 38వ డివిజన్‌ వరకు 126 మక్రో ప్యాకెట్లుగా, 39వ డివిజన్‌ నుంచి 54వ డివిజన్‌ వరకు 113 మైక్రో ప్యాకెట్లుగా విభజించారు.  

సొసైటీ నుంచిప్రైవేట్‌ వ్యక్తి చేతిలోకి..
నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 877 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. 77 సొసైటీల కింద కార్మికులు ఉన్నారు. కార్పొరేషన్‌లోని 54 డివిజన్లను 20 శానిటరీ డివిజన్లుగా విభజించి పనులు చేస్తున్నారు. మూడున్నర ఏళ్ల కిందట పారిశుద్ధ్య కార్మికులను సొసైటీల కింద కాకుండా ఓ ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ కింద పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ప్రైవేట్‌ వ్యక్తులు జీతాలు సరిగా ఇవ్వకపోవడం, పనిఒత్తిడి పెంచి ఇబ్బందులు పెడుతారని, భరోసా ఉండదని కార్మికులు దశల వారీగా ఆందోళనలు చేశారు. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా జీఓ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.  గతేడాది గుంటూరుకు చెందిన కాంట్రాక్టర్‌ బొమ్మిడి రామకృష్ణకు మూడు ప్యాకేజీల కింద మూడేళ్ల పాటు నెల్లూరు కార్పొరేషన్‌ పారిశుద్ధ్య పనులను అప్పగించారు. ఇందుకు రూ. 61.15 కోట్లు కార్మికులకు చెల్లించేలా మూడు ప్యాకేజీలను దక్కించుకున్నారు. అదనంగా 6.80 శాతం ఎక్స్‌స్‌తో టెండర్‌ దక్కించుకోవడం వెనుక అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement