వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికుల దుస్థితి
ఇతర ప్రాంతాల నుంచి 6,800 మంది కార్మికులను తెచ్చిన ప్రభుత్వం
వసతి ఇవ్వకపోవడంతో రోడ్ల పక్కనే నివాసం
రోజూ 18 గంటలు పని.. చెప్పుల్లేవు.. కనీస పరికరాలూ లేవు
దెబ్బతింటున్న కార్మికుల ఆరోగ్యం.. 40 మందికి అనారోగ్యం పాలు
పటమట (విజయవాడ తూర్పు): ఊరు కాని ఊరు.. రోజూ 18 గంటలు పారిశుద్ధ్య పని.. ఉండటానికి సరైన వసతి లేదు.. రోడ్ల పక్కనే జీవనం.. అన్నం పెట్టే వారు లేరు.. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే భోజనంతోనే కడుపు నింపుకోవడం.. ఇదీ విజయవాడలో వరద అనంతర పారిశుద్ధ్య పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇతర జిల్లాల నుంచి తెప్పించిన కార్మికుల దుస్థితి. మహిళా కార్మికులకు కూడ సరైన వసతి, సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో గంటల తరబడి మురుగు, చెత్తా చెదారంలో పనిచేస్తున్నా కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటోంది.
ఇప్పటికే 40 మందికి పైగా కార్మికులు అనారోగ్యం బారిన పడ్డారు. అయినా అధికారులు వారి సంరక్షణ గురించి ఆలోచించడమే లేదు. బుడమేరు వరదకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 7 డివిజన్లు, సెంట్రల్ డివిజన్‌లోని 13, పశ్చిమ నియోజకవర్గంలోని 12 డివిజన్లు మునిగిపోయాయి. ఆ ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు, వీధుల్లో పేరుకుపోయిన వందల టన్నుల వ్యర్థాలను తొలగించటానికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి 6,800 మంది పారిశుద్ధ్య కార్మికులను పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ తీసుకొచ్చింది. వీరంతా తొమ్మిది రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వారితో రోజూ 18 గంటలు పని చేయిస్తున్నారు. వీరికి సరైన వసతి కల్పించలేదు. దీంతో వారంతా రోడ్ల వెంబడి, షాపుల వద్ద గూడు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఓవైపు వర్షం, మరోవైపు చలిలో కనీస నిద్ర కూడా లేక కార్మికులు తల్లడిల్లుతున్నారు. మురుగులో పని చేసే వీరికి చెప్పులు, చెత్త ఎత్తే కనీస పరికరాలు కూడా ఇవ్వడంలేదు. సరైన ఆహారాన్ని అందించడం లేదు. ఇదేమని అడిగితే సూపర్‌వైజర్లు కసురుకుంటున్నారు. దీంతో స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న ఆహార శిబిరాల వద్ద ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన 40 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్యం చేయించకుండానే అధికారులు వారిని స్వస్థలాలకు పంపించారు.
మమ్మల్ని పట్టించుకోవటం లేదు
రేయింబవళ్లు పనిచేస్తున్నాం. ఇళ్ల నుంచి వచ్చే చెత్తనంతా ట్రాక్టర్లు, లారీల్లో ఎత్తుతున్నాం. బురద నీరు శరీరమంతా పడుతుంది. దురదలు వస్తున్నాయి. కాళ్లు పాశాయి. మా సమస్యలను చెప్పుకుందామంటే అధికారులు వినే పరిస్థితి లేదు. ఎంతసేపైనా పని చేయాలని ఆదేశిస్తున్నారే కానీ మా సమస్యలను పట్టించుకోవటంలేదు. మా ఆరోగ్యం, కుటుంబాల గురించి కూడా పట్టించుకోవాలి.
– శేఖర్, ఆదోని మున్సిపాలిటీ కార్మికుడు
Comments
Please login to add a commentAdd a comment