బుడమేరు వరదకు సర్వం పోయి గుల్లయిపోయిన కుటుంబాలు
15 రోజులైనా మారని వరద బాధితుల బతుకులు
ప్రచారార్భాటమే తప్ప పైసా సాయం చేయని ప్రభుత్వం
ప్రభుత్వ యంత్రాంగం మాయం
ఇళ్లను కడుగుతామన్న ఫైరింజన్లూ అదృశ్యం
బాధితులే ఇళ్లలో బురద తొలగించుకుంటున్న వైనం
బురద తొలగించడానికే ఇంటికి రూ.10 వేలు ఖర్చు
పాడైపోయిన విలువైన సామాగ్రితో నిండిన వీధులు
డాబాలపైనే బతుకీడుస్తున్న బాధితులు
పేరుకున్న చెత్త, మురుగుతో ప్రబలుతున్న వ్యాధులు
వలంటీర్లు, సచివాలయ సిబ్బందే బతికించారని వెల్లడి
ఎమ్మెల్యేలు ఏమైపోయారంటూ ఆగ్రహం
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్
సాక్షి, అమరావతి : బుడమేరు వరద బాధితుల్లో ఎవరిని కదిపినా ఒకటే వేదన. 15 రోజులైనా వరద కష్టాలు వీడలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షకు పైగా కుటుంబాలకు మానని గాయాన్ని మిగిల్చింది. బతుకులను దుర్భరంగా మార్చింది. గత నెల 31న అర్ధరాత్రి విరుచుకుపడ్డ వరదకు సర్వస్వం కోల్పోయి విలపిస్తున్న విజయవాడ శాంతినగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, వాంబేకాలనీ, డాబాకోట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్, సింగ్‌నగర్ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
ఈమె పేరు లావణ్య. ఆమె భర్త నర్సింహారావు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. ఆమె ప్రస్తుతం రెండు నెలల బిడ్డకు తల్లి.వీరంతా సింగ్ నగర్ శాంతినగర్‌లో రూ.5 వేలకు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గత నెల 31 అర్ధరాత్రి హఠాత్తుగా వచ్చిన వరద ఇంటిని ముంచేసింది. సామాన్లు తీసుకునే సమయం కూడా లేదు.చంటిబిడ్డను తీసుకొనిఅందరూ డాబా పైకి పరిగెత్తారు. కేవలం ఓ బరఖాని పైకప్పుగా మార్చుకుని దాని కిందే మూడు రోజులు బతికారు.
వీరి అవస్థ చూసి బాలింతరాలికి పక్కింటి వారు ఆశ్రయమిచ్చారు. సహాయక చర్యలకు వచ్చిన హెలికాప్టర్ గాలికి బరఖా చిరిగిపోవడంతో వారం రోజులు వానలోనే గడిపారు. సరైన తిండి, నిద్ర లేవు. వరద తగ్గాక కిందకొచ్చి చూస్తే ఇల్లంతా బురద. ఏ వస్తువూ మిగల్లేదు. మిషన్ కుడితే గానీ ఇల్లు గడవదు. ఇప్పుడదీ పాడైంది. సెప్టిక్ ట్యాంకు నిండా బురద చేరడంతో కనీసం కాలకృత్యాలకూ నరకం చూడాల్సి వస్తోందని ఆ కుటుంబం విలపిస్తోంది.
జీవిత కాలం కష్టం.. చెత్త కుప్పల పాలు
ఏళ్ల తరబడి పేద ప్రజల రెక్కల కష్టం.. ఇదిగో.. ఇలా వరద పాలై రోడ్డు పక్కకు చేరింది. బుడమేరు వరదకు ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయాయి. కాస్త పనికొచ్చే వస్తువులను పాత సామాన్ల వాళ్లు తృణమో పణమో ఇచ్చి పట్టుకెళ్తున్నారు. అందుకూ పనికిరాని వస్తువులను బాధితులు రోడ్లపై పడేస్తున్నారు. దీంతో విజయవాడలోని వరద ప్రాంతాల్లో రోడ్ల పక్కన పాడైన ఇంటి సామాగ్రి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది.
వాటిని ప్రభుత్వ సిబ్బంది దాదాపు 400 ట్రాక్టర్లలో పైపులరోడ్డు వద్దకు తరలిస్తున్నారు. గుంటూరు, గన్నవరం, ఏలూరు, రాజమండ్రి నుంచి కూడా వరదల్లో మునిగి పనికిరాని సామగ్రిని విజయవాడ పైపులరోడ్డుకు తరలిస్తున్నవారు. అక్కడి నుంచి మేజర్ డంపింగ్ యార్డ్ అయిన ఎక్సెల్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. – సాక్షి, అమరావతి
డాబాలపైనే జీవనం
అర్ధరాత్రి వేళ విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద దాదాపు 60 మంది ప్రాణాలను మింగేసింది. మరునాడే సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారార్భాటం మొదలెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో సాయమంటూ ఊదరగొట్టారు. చేసింది శూన్యం. లక్షలాది మంది నిరాశ్రయుల్లో ఒక్కరికీ ఒక్క రూపాయి తక్షణ సాయం ఇవ్వకుండా తప్పించుకు తిరిగారు. 10 రోజులయ్యాక వరదను జయించేశామని ప్రకటించేసుకుని వెళ్లిపోయారు.
ప్రభుత్వ యంత్రాంగమూ మాయమైంది. ఇప్పుడక్కడ మిగిలింది బురద, బాధితులే. బాధితుల పరిస్థితిలో మార్పు లేదు. అక్కడక్కడా పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం కనిపిస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ విలువైన సామాగ్రి మొత్తం నీటిపాలైంది. అనేక ఇళ్లు నివాసానికి పనికిరాకుండా పోయాయి. బురద కడుగుతామన్న ఫైరింజన్లు కూడా అదృశ్యమైపోయాయి.
ఇంట్లో పేరుకున్న బురదను ప్రజలే తొలగించుకుంటున్నారు. ఇందుకు ఇంటికి రూ.5 వేలు నుంచి రూ.10 వేలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురద తొలగకపోవడంతో ఇప్పటికీ డాబాలపైనే ప్లాస్టిక్ సంచుల గుడారాల కిందే జీవిస్తున్నారు.
ఈ సమయంలో ఓటీపీలా?
వరద నష్టం అంచనాల్లోనూ ఓటీపీ అడగడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో సెల్ ఫోన్లే పోతే ఓటీపీలు ఎలా వస్తాయని అంటున్నారు. భవిష్యత్తుపై బెంగతో దాతలు, స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు లాటరీ పద్ధతిలో కొన్ని ఇళ్లను దత్తత తీసుకుంటామని చెబుతున్నాయి.
ఇక అన్నీ పాత సామాన్లే
వరదకు ఇంట్లో గిన్నెల నుంచి విలువైన టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు, మంచాలు, కుర్చీలు.. ఇలా అన్ని వస్తువులూపనికిరాకుండా పోయింది. పుస్తకాలు, దుస్తులను వీధుల్లో ఆరబెట్టుకొంటున్నారు. పనికి రావనుకున్న టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఇతర సామాగ్రిని రోడ్ల పక్కన పడేశారు. వాటిని కేజీల లెక్కన అమ్ముకుంటున్నారు. దీంతో పాత సామాన్లు కొనే వారు గతంలో కేజీకి రూ.20 ఇస్తే ఇప్పుడు రూ.10 కే అడుగుతున్నారు.
పుస్తకాలన్నీ పాడవడంతో పిల్లలు స్కూళ్లకు వెళ్లడంలేదు. వీధుల్లో పేరుకున్న చెత్త, మురుగు, దుర్గంధంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అనేక మంది జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఇంత కష్టంలో తాముంటే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఏమైపోయారని బాధితులు మండిపడుతున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బందే తమను బతికించారని చెబుతున్నారు.
ఓట్లేయించుకున్న వారేరి?
ఇంట్లో సామాన్లన్నీ పాడైపోయాయి. కట్టు బట్టలు మినహా ఏమీ మిగల్లేదు. ఏ ఒక్కరూ సాయం చేయలేదు. కనీసం తిండి కూడా పెట్టలేదు. రోడ్డు వరకూ వరదలోనే వెళ్లి తెచ్చుకున్నాం. ప్రభుత్వం ముందుగానే హెచ్చరించి ఉంటే ఎక్కడికైనా వెళ్లిపోయేవాళ్లం. మా ఏరియా వలంటీర్, సచివాలయ సిబ్బంది తప్ప మా బాగోగులు చూసేందుకు ఎవరూ రాలేదు. ఓట్లేయించుకున్న ఎమ్మెల్యే, కార్పొరేటర్ కన్నెత్తి చూడలేదు. – పావని, శాంతినగర్
స్కూలుకి వెళ్లడంలేదు
ప్రైవేటు స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. వరదకు మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. పక్కింటి వాళ్లు ఆశ్రయం ఇచ్చారు. పుస్తకాలన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు వాటిని ఆరబెట్టుకుంటున్నా. స్కూలుకు వెళ్లడంలేదు. – ప్రణవి, వాంబేకాలనీ
ఆరోగ్యం పాడైంది
ఇల్లు మొత్తం మునిగిపోవడంతో డాబాపైకి వచ్చేశాం. బరఖా కిందే ఉంటున్నా. నా ఆరోగ్యం పాడైంది. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాను. నా కుమారుడికి ఇటీవలే పోలియో వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఇలా అయ్యింది. ఎలా బతకాలో ఏమీ అర్ధం కావడం లేదు. – నాగమణి, శాంతి నగర్
ఏదీ మిగల్లేదు
ఇంట్లో వాషింగ్ మెషిన్లు, కూలర్లు, మోటర్, టీవీ.. ఇలా ఏదీ మిగల్లేదు. రూ.2 లక్షల వరకూ నష్టం వచ్చింది. మూడు రోజులు వరద నీటిలోనే ఉన్నాం. ప్రభుత్వం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు. అతికష్టం మీద వరద నుంచి బయటపడి బంధువుల ఇంటికి వెళ్లిపోయాం. తిరిగొచ్చి చూస్తే ఇల్లంతా బురద. సామానంతా పాడైపోయింది.– దివ్యభారతి, పాయకాపురం
Comments
Please login to add a commentAdd a comment