విజయవాడలో ముంపు ప్రాంతాల్లో 310 ఫర్నిచర్, 45 ప్లైవుడ్ పరిశ్రమలకు తీవ్ర నష్టం
సాక్షి, అమరావతి: విజయవాడ వరదల్లో తడిసి ముద్దయిన ఫర్నిచర్ పరిశ్రమకు కోలుకోలేని నష్టం ఏర్పడింది. దాదాపు 15రోజులపాటు ప్లైవుడ్, ఇతర ఫర్నిచర్ సామగ్రి నీటిలో నానిపోయి రూ.కోట్ల నష్టం మిగిలి్చంది. ఉత్పత్తి అయిన ఫర్నిచర్ అమ్మకానికి పనికిరాకుండా తయారైంది. సామగ్రి సైతం ఫర్నిచర్ తయారీకి పనికిరాకుండా పోయింది. దీంతో ఫర్నిచర్ పరిశ్రమలు, వర్క్‌షాప్‌ల రోజువారీ పనులు ఇప్పటికీ మొదలయ్యేలా లేవు.
ముంపుబారిన 310కి పైగా వర్క్‌షాపులు
విజయవాడ నగరంలో వరద ముంపునకు గురైన అజిత్‌సింగ్‌నగర్, రాజరాజేశ్వరీపేట, అంబాపురం, రాజీవ్ నగర్, వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, పైపుల రోడ్డు, కండ్రిక తదితర ప్రాంతాల్లో 310పైగా ఫర్నిచర్ తయారు చేసే వర్క్‌షాప్‌లు ఉన్నాయి. వాటితోపాటు భవానీపురం, అజిత్‌సింగ్ నగర్ ప్రాంతాల్లో 45కు పైగా ప్లైవుడ్ పరిశ్రమలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా ప్రత్యేక గోదాములు కూడా ఉన్నాయి.
వాటన్నింటిలోను వరద నీరు చేరి రోజుల తరబడి ఉండిపోవడంతో ప్లెవుడ్ చెక్కలతోపాటు వాటితో తయారు చేసిన వస్తువులు సైతం నానిపోయి ఉబ్బిపోయాయి. ముడిసరుకు, తయారీ సామగ్రి వరద నీటిలో దెబ్బతిని వాటి యజమానులు నష్టపోయారు.
ఫర్నిచర్ షాపులు, వర్క్‌షాపుల్లోని బీరువాలు, సోఫా సెట్లు, ఇనుప సామగ్రి, యంత్రాలు, పనిముట్లు దెబ్బతినడంతో ఒక్కో యజమానికి కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. ఒక్క ప్లైవుడ్ ఫర్నిచర్, వర్క్‌షాపులు, పరిశ్రమలకు వచ్చిన నష్టమే మొత్తంగా కనీసం రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. ఫర్నిచర్ షాపులు, పరిశ్రమలపై ఆధారపడిన జీవిస్తున్న సుమారు 12 వేల మంది ఉపా«ధికి సైతం పెద్ద దెబ్బ తగిలింది.
ఇనుముకు తుప్పు
విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్‌కు వరద తీవ్ర నష్టం తెచ్చింది. 60 ఎకరాల్లో విస్తరించిన ఐరన్ యార్డ్‌లో 430కి పైగా హోల్‌సెల్ ఐరన్ వ్యాపార దుకాణాలు ఉన్నాయి. ఈ యార్డ్‌లో రోజుకు రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఐరన్ హోల్‌సేల్ షాపులతోపాటు రిటైల్ షాపులు, శానిటరీ, పైపులు, ప్లైవుడ్, ఎలక్ట్రికల్స్, హార్ట్‌వేర్, ఆగ్రో, కెమికల్, నిత్యావసర వస్తువుల షాపులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
వరద నీరు ముంచెత్తడంతో అవన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. రోజుల తరబడి నీటిలో నానిపోయిన ఐరన్ నిల్వలు తుప్పుపట్టి రంగు మారడంతో వ్యాపారులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. రంగు మారిన ఐరన్ సామగ్రిని తుక్కుకు అమ్ముకోవాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు. వరద సమయంలో 15 రోజులపాటు వ్యాపారం చేసే అవకాశం లేకపోగా, ఇప్పుడు పాడైన ఐరన్, ఇతర సామగ్రిని అయినకాడికి అమ్ముకోవాల్సి రావడంతో నష్టాల్లో మునిగిపోతామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment