మిగిలింది బురదే! | Door to door enumeration teams for damage assessment | Sakshi
Sakshi News home page

మిగిలింది బురదే!

Published Wed, Sep 11 2024 4:56 AM | Last Updated on Wed, Sep 11 2024 4:56 AM

Door to door enumeration teams for damage assessment

వరద నష్టాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతం అవుతున్న బాధితులు  

నష్టం అంచనాకు ఇంటింటికీ ఎన్యుమరేషన్‌ బృందాలు 

అన్నీ నీటిపాలయ్యాయని ముంపు ప్రాంతాల ప్రజల ఆవేదన

లక్షలాది చిన్న కుటుంబాలకు కనీసంగా రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర నష్టం 

మధ్యతరగతి కుటుంబాల్లో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు.. 

ఓ మాదిరి కుటుంబాల్లో నష్టం రూ.10 లక్షలకుపైగానే 

నష్టం లెక్కింపు నేటితో పూర్తి కావాలని సర్కార్‌ ఆదేశం

‘వరద నీళ్లు పోయాక వచ్చి చూస్తే మోకాటి లోతు బురద పేరుకుపోయి ఉంది.. ఇంట్లో, బయట కంపు కొడుతోంది.. కట్టుబట్టలతో మిగిలిపోయాం..  దాతలిచ్చింది తిని బతుకుతున్నాం.. మీరు (ఎన్యూమరేషన్‌ బృందం) ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం.. ఇదిగో చూడండి మా కష్టం, నష్టం.. అక్కడ బురదలో కూరుకుపోయి ఉన్నది పరుపు.. దాని కింద మంచం ఉంది.. ఇంకా దాని కింద పిల్లల పుస్తకాలున్నాయి.. 

ఆ పక్కనున్న బీరువాలో మా అందరి దుస్తులున్నాయి.. సర్టిఫికెట్లు కూడా అందులోనే పెట్టాం.. పది రోజులుగా నీళ్లలో నాని నాని అవన్నీ పేలికలుగా మారాయి.. అదిగో అది ఫ్రిజ్‌.. తీద్దామంటే డోర్‌ తెరుచుకోవడం లేదు.. ఇక్కడ కిచెన్‌లో ఏది ఏ వస్తువో తెలియడం లేదు. ఇదంతా కల అయితే బావుండనిపిస్తోంది’ అని నష్టం వివరాల నమోదు కోసం వచ్చిన బృందంఎదుట ఓ ఇల్లాలు కన్నీటి పర్యంతమైంది.


సాక్షి, అమరావతి/పటమట/సాక్షి ప్రతినిధి, విజయవాడ:  ఒక్కో కుటుంబానిది ఒక్కో దీన గాథ. ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. విజయవాడలో బుడమేరు వరద మిగిల్చిన విషాదం మాటలకందడం లేదని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కళ్లెదుటే పలు వస్తువులు నీట కొట్టుకుపోతుంటే అచేతనంగా చూస్తూ ఉండి పోయామని వాపోతున్నారు. కట్టు బట్టలతో బయట పడ్డామని, కంటి మీద కునుకు కరువైందని చెబుతున్నారు. వరద తమకు ఎంత నష్టాన్ని, కష్టాన్ని మిగిలి్చందో ఎన్యుమరేషన్‌ బృందాల ఎదుట కన్నీటి పర్యంతమై వివరిస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వరద ముంపులో చిక్కుకున్న ప్రతి పేద కుటుంబం చితికిపోయింది. వారికి కన్నీరు తప్ప మిగిలిందంటూ ఏమీ లేదు. రోజువారీ పనులు చేసుకునే వారి ఇళ్లలో జరిగిన నష్టాన్ని చూస్తుంటే పగ వాడికైనా ఇంతటి కష్టం రాకూడదనిపిస్తుంది. ఇళ్లు మునిగి పోవడంతో వరద తగ్గే వరకు బంధువుల ఇళ్లలో, అక్కడక్కడా తల దాచుకున్న కుటుంబాల వారు.. ఇప్పుడు ఉంటున్న ఇంటికి వచ్చి చూసుకుని భోరున విలపిస్తున్నారు. 

ఇంట్లోని బట్టలు, మంచం, టీవీ, ఫ్రిజ్, వంట సామాన్లు, పుస్తకాలు, ఇతరత్రా పరికరాలన్నీ పనికి రాకుండా పోవడం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే కుటుంబాలు కనీసం రూ.50 వేలకుపైగా నష్టపోయాయి. పది రోజులుగా పని లేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక, పిల్లలను ఎలా చదివించాలో.. మళ్లీ ఇంటిని ఎలా గట్టెక్కించాలో తెలియక ఆ ఇంటి యజమానులు పడే బాధ వర్ణణాతీతం.  

ఇంటింటికీ ప్రత్యేక బృందం 
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి (ఎన్యుమరేషన్‌) ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల బృందాలు వలంటీర్ల సహాయంతో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. ప్రభుత్వం రూపొందించి ఇచ్చిన ప్రత్యేక యాప్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లల్లో దెబ్బతిన్న ఎల్రక్టానిక్, మోటార్, ఇతర సాధారణ వస్తువుల గురించి నమోదు చేస్తున్నాయి. 

ఈ సందర్భంగా బాధితులు పది రోజులు పడిన కష్టం, వారికి జరిగిన నష్టం గురించి వివరిస్తున్నారు. ఏ ఇంటికి వెళ్లినా పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని చోట్ల ఇళ్ల వద్ద కనీసం నిలబడి మాట్లాడే అవకాశం కూడా లేదు. ఒక అంతస్తు ఉండే ఇళ్లలో ఉంటున్న ఒక్కో కుటుంబానికి కనీసంగా రూ.50 వేలు, గరిష్టంగా లక్షన్నరపైనే నష్టం కనిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబాలకైతే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకైతే రూ.10 లక్షల నుంచి అంతకు మించి నష్టం కనిపిస్తోంది. 

వరద ప్రభావిత ప్రాంతాలు 37 
»  నగరంలోని 20 కిలోమీటర్ల మేర 37 ప్రాంతాలను మూడు సర్కిళ్లుగా విభజించి అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలుగా మ్యాపింగ్‌ చేశారు. 
» 32 డివిజన్లలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, వైద్య శాఖల నుంచి ఒక్కొక్కరుగా బృందం ఏర్పాటు చేశారు. అయితే రెవెన్యూ–మున్సిపల్‌–విద్యుత్‌ శాఖల మధ్య సమన్వయ లోపంతో అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సర్వే జరగటం లేదు.
» 1,487 మంది వార్డు వలంటీర్లు, వార్డు సచివాలయాల సిబ్బంది, ఏఎస్పీ క్యాడర్‌ పోలీస్‌ అధికారి, గ్రూప్‌–1 కేడర్‌ అధికారి, ఓ సీనియర్‌ ఐఏఏస్‌ అధికారి ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ సాగుతోంది.  వాణిజ్య నష్టాన్ని అంచనా వేయటానికి ఏర్పాటైన 200 బృందాలు ఇప్పటి వరకు ఆ పనే ప్రారంభించలేదు.

నేడు కేంద్ర బృందం పర్యటన 
ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగిన వరద తీవ్రత, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధ, గురువారాల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందం ఇప్పటికే విజయవాడకు చేరుకుంది. బుధవారం రెండు బృందాలుగా ఏర్పడి ఒక బృందం ఎనీ్టఆర్, కృష్ణా జిల్లాల్లో.. మరో బృందం గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనుంది. 

కాగా, వరద ప్రభావిత జిల్లాల్లో ఇళ్లకు జరిగిన నష్టం లెక్కింపు బుధవారం సాయంత్రానికి పూర్తి కావాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి ఆయన వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యవసాయం, దాని అధారిత రంగాల నష్టం లెక్కింపు కూడా ఈ నెల 14వ తేదీకి పూర్తి కావాలని సూచించారు.

రూ.వేల కోట్లలో నష్టం..
ప్రభుత్వ శాఖలకు జరిగిన నష్టం రూ.6,800 కోట్లని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే దీనికి నాలుగైదు రెట్ల నష్టం సాధారణ ప్రజలకు జరిగినట్లు ఎన్యుమరేషన్‌ బృందాల ద్వారా స్పష్టమవుతోంది. విజయవాడ నగరం, రూరల్‌ ప్రాంతాల్లో 2.32 లక్షల ఇళ్లు మునిగి పోవడంతో నష్టం అపారంగా ఉంది. ఆ ఇళ్లల్లోని ఫరీ్నచర్, ఎల్రక్టానిక్, మోటార్‌ వాహనాలు, ఇతర వస్తువుల నష్టం భారీగా కనిపిస్తోంది. 

బయట పార్క్‌ చేసిన వాహనాలే సుమారు రెండు లక్షల వరకు ఉంటాయని అంచనా. అందులో లక్షన్నర ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. 30 వేలకుపైగా కార్లు, పది వేల వరకు ఆటోలున్నాయి. మిగిలినవి లారీలు, బస్సులు, ఇతర వాహనాలు ఉన్నాయి. వాటిలో సగానికిపైనే మరమ్మతులకు సైతం పనికిరాని విధంగా పాడైపోయాయి. ఇలా ఇళ్లకు జరిగిన నష్టమే ఊహకు అందని విధంగా ఉంది. ఇవిగాక 5 లక్షల ఎకరాలకుపైగా పంటలు దెబ్బ తిన్నాయి. ఆ నష్టం వ్యవసాయ రంగాన్ని కుదిపేసేలా ఉంది.


భోజనం కోసం ఎదురు చూపు 
మా వీధిలోకి ఏడు అడుగులకుపైగా వరద నీళ్లు వచ్చాయి. కట్టుబట్టలతో నా ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి స్నేహితుడి మేడపైకి ఎక్కేశాం. నీళ్లు తగ్గుముఖం పట్టాయని ఇంటికి వచ్చి చూస్తే సర్వం నీళ్లలో నానిపోయాయి. మంచం, ఫ్రిజ్‌ పనికొచ్చే పరిస్థితి లేదు. పిల్లలు కట్టుకోవడానికి గుడ్డ పేలిక కూడా మిగల్లేదు. రాడ్‌ బెండింగ్‌ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే నాకు మళ్లీ జీవితాన్ని ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. మావీధి అంతా మురుగు వాసన వస్తోంది. గతిలేక అలానే ఉంటున్నాం.  – ఏలియా, వరద బాధితుడు, ఏవీఎస్‌ రోడ్డు, ప్రకాశ్‌నగర్‌ 

రూ.1.50 లక్షలు నష్టపోయాం 
మా జీవితం చిన్నది. జీవనోపాధి కోసం నూజివీడు నుంచి ఆరు నెలల కిందట ఇక్క­డికి వచ్చి అద్దె ఇంటిలో కాలం వెళ్లదీస్తున్నాం. వరద దెబ్బకు జీవితం చిన్నాభిన్నం అయ్యింది. నా భర్త కాలేశ్వరరావు మార్కెట్‌లో చెప్పులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్టాక్‌ అంతా ఇంటిలోనే పెట్టారు. అంతా నీటి పాలైంది. మంచం, పురుపు దుర్వాసన రావడంతో బయట పడేశాం. ఫ్రిజ్, టీవీ, బియ్యం, దుస్తులు, పిల్లల పుస్తకా­లతో సహా ఏమీ మిగల్లేదు. మరో వైపు స్టాకు అంతా దెబ్బతింది. రూ.1.50 లక్షల వరకు నష్టపోయాం.   – సుమలత, వరద బాధితురాలు, పాయకాపురం

»  32 డివిజన్ల పరిధిలోని మూడు సర్కిళ్లలో  లక్షన్నరకు పైగా ఇళ్లకు నష్టం 
»  ఒక్కో డివిజన్‌కు ఒక ఐఏఎస్‌ అధికారి ఇన్‌చార్జ్‌ 
»  32 డివిజన్ల పరిధిలో 1,700 సర్వే బృందాల ఏర్పాటు 
»  ఒక్కో బృందం ద్వారా 50–100 ఇళ్లు సర్వే 
»  ప్రతి బృందంలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, వైద్య సిబ్బంది 
»  వీరికి తోడుగా సచివాలయ కార్యదర్శి, ఆ ప్రాంత వలంటీర్‌  
»  ప్రత్యేక యాప్‌లో మాత్రమే వివరాలు నమోదు 
»  వాణిజ్య నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement